సాక్షి, అమరావతి: కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ సర్కారు పదే పదే తొండాట ఆడుతోంది. పరిష్కారమైన అంశాన్ని, అవాస్తవాలను వల్లె వేస్తూ వివాదాన్ని రాజేస్తోందని నీటి పారదుల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీలు (34 శాతం) కేటాయిస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు ఒప్పందం చేసింది.
ఆనాటి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అమర్జీత్‌సింగ్ సమక్షంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను మళ్లీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది.
ఈ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో సర్వ సభ్య సమావేశంలో చర్చించి తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం చెప్పింది. అయితే, తాత్కాలిక సర్దుబాటు ఒప్పందానికి అంగీకరించిన తెలంగాణ ఆ తర్వాత ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో కృష్ణా జలాల్లో సగ భాగం కావాలంటూ వివాదాన్ని రాజేస్తోంది. బుధవారం జరిగిన కృష్ణా బోర్డు 17వ సర్వ సభ్య సమావేశంలోనూ అదే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీవి విచారిస్తున్న క్రమంలో మార్చి 24న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీలో తమ పరిధి పరిమితమని చెప్పింది. నిర్దిష్టంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేసింది. ఇప్పటికే నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని సంకేతాలిచ్చింది.
అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఉద్ఘాటించింది. తద్వారా నీటి లభ్యత 75 శాతం ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను మినహాయించి, 65 శాతం లభ్యత ఆధారంగా తాము అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపైనే విచారిస్తామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పేర్కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment