brijeshkumar tribunal judgement
-
అప్పటివరకు పాత వాటాలే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పాత వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణాబోర్డు తేల్చిచెప్పాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే వరకు ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ కేటాయించిన కృష్ణా జలాల్లో 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. చిన్న నీటివనరుల విభాగంలో వినియోగించిన జలాలు, ప్రకాశం డెల్టాకు మళ్లించే గోదావరి జలాలను పంపిణీ నుంచి మినహాయించినట్టు పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఈ నెల 2న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణాబోర్డు సంయుక్తంగా దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశాయి. కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ పాత పద్ధతిలోనే వినియోగించుకోవడానికి మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ.. ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరిగింది. కృష్ణా జలాల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది. అర్ధ భాగం డిమాండ్ అసంబద్ధమే.. కృష్ణా జలాల పంపిణీకి 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్.. 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంపిణీ చేస్తూ 1976 మే 27న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందనే అంశాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణాబోర్డు గుర్తుచేశాయి. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చిందని, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించిందని పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించుకున్న నీటిని పరిగణనలోకి తీసుకుని.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను తాత్కాలిక ప్రాతిపదికన పంపిణీ చేసుకోవడానికి అంగీకరిస్తూ 2015 జూన్ 18–19న కేంద్ర జల్ శక్తిశాఖ సమక్షంలో రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయనే అంశాన్ని ఎత్తిచూపాయి. ఆ తర్వాత 2016–17లోనూ అదే పద్ధతిలో నీటిని పంపిణీ చేసుకున్నాయి. ఆ తర్వాత చిన్న వనరుల విభాగం, మళ్లించిన గోదావరి జలాలను మినహాయించి.. మిగతా నీటిలో ఏపీ 66 శాతం, తెలంగాణ 33 శాతం చొప్పున పంచుకుంటున్నాయనే అంశాన్ని పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని.. ఆ ట్రిబ్యునల్ అవార్డు వస్తేనే నీటి లెక్కలు తేలతాయని అఫిడవిట్లో కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు స్పష్టం చేశాయి. అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. స్పష్టం చేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీకి నీటిని పునఃపంపిణీ చేసే సమయంలో బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల జోలికి వెళ్లలేదని గుర్తుచేస్తున్నారు. -
కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ సర్కారు పదే పదే తొండాట ఆడుతోంది. పరిష్కారమైన అంశాన్ని, అవాస్తవాలను వల్లె వేస్తూ వివాదాన్ని రాజేస్తోందని నీటి పారదుల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీలు (34 శాతం) కేటాయిస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు ఒప్పందం చేసింది. ఆనాటి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అమర్జీత్సింగ్ సమక్షంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను మళ్లీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో సర్వ సభ్య సమావేశంలో చర్చించి తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం చెప్పింది. అయితే, తాత్కాలిక సర్దుబాటు ఒప్పందానికి అంగీకరించిన తెలంగాణ ఆ తర్వాత ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో కృష్ణా జలాల్లో సగ భాగం కావాలంటూ వివాదాన్ని రాజేస్తోంది. బుధవారం జరిగిన కృష్ణా బోర్డు 17వ సర్వ సభ్య సమావేశంలోనూ అదే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీవి విచారిస్తున్న క్రమంలో మార్చి 24న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీలో తమ పరిధి పరిమితమని చెప్పింది. నిర్దిష్టంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేసింది. ఇప్పటికే నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని సంకేతాలిచ్చింది. అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఉద్ఘాటించింది. తద్వారా నీటి లభ్యత 75 శాతం ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను మినహాయించి, 65 శాతం లభ్యత ఆధారంగా తాము అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపైనే విచారిస్తామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పేర్కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
పునఃపంపిణీ కుదరదు.. తేల్చిచెప్పిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పునఃపంపిణీ చేయడం కుదరదని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2) తేల్చి చెప్పింది. నిర్దిష్టమైన కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుపై మాత్రమే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ జారీ చేసిన జీవో రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్(ఐఏ)పై విచారణను వచ్చే నెల 13, 14న మరోసారి చేపడతామని పేర్కొంది. ఈ ఐఏపై ట్రిబ్యునల్ శుక్రవారం విచారణ జరిపింది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956 సెక్షన్–3, 5ల ప్రకారం ఇప్పటికే నీటిని పంపిణీ చేశామని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాల కేటాయింపులో తమ పరిధి పరిమితంగా ఉందని గుర్తు చేసింది. నిర్దిష్టంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని సంకేతాలిచ్చింది. తెలంగాణ సగం వాటా కోరడం చట్టవిరుద్ధం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షిస్తే న్యాయ ఉల్లంఘనకు పాల్పడినట్లే. అందుకే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కూడా ఆ తీర్పు జోలికి వెళ్లలేదని న్యాయ, సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో సగ భాగం కావాలని తెలంగాణ కోరడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యధాతథంగా కొనసాగుతాయని, అదనంగా కేటాయించిన 194 టీఎంసీలపైనే విచారణ చేస్తుందని వివరిస్తున్నారు. 194 టీఎంసీల కేటాయింపుపైనే విచారణ కృష్ణా జలాల పంపిణీకి 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంపిణీ చేస్తూ 1976 మే 27న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. కృష్ణా జలాల పునఃపంపిణీకి 2004 ఏప్రిల్ 2న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న ప్రాథమిక నివేదిక, 2013 నవంబర్ 29న తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. ఈ నివేదికలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో వాటిని కేంద్రం అమల్లోకి తేలేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు 811 టీఎంసీలను యధాతథంగా కొనసాగించింది. అదనంగా 65 శాతం లభ్యత ఆధారంగా 194 టీఎంసీలను కేటాయించింది. అంటే మొత్తం 1,005 టీఎంసీలను కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 1,005 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంచే బాధ్యతను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. యధాతథంగా కొనసాగిస్తున్న 811 టీఎంసీలు పోను, ఇప్పుడు 194 టీఎంసీల పైనే విచారణ జరుపుతోంది. -
పక్క దేశాలతోను పేచీలొస్తాయి
సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవరించకపోతే రాష్ట్రాల మధ్యే కాదు.. భవిష్యత్తులో దేశాల మధ్య కూడా కొత్తగా నీటి తగాదాలు వస్తాయనే విషయూన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్రం నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ నీటి చట్టాలకు విరుద్ధంగా ట్రిబ్యునల్ తీర్పు ఉందని, అది అమల్లోకి వస్తే దేశంలోనే అనేక రాష్ట్రాల మధ్య నీటి పోరాటాలు తప్పవనే విషయాన్ని స్పష్టం చేయనుంది. కృష్ణా నది నీటి పంపకాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇటీవల తన తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పులో మన రాష్ర్ట ప్రయోజనాలను దెబ్బతీసే, రాష్ట్రానికి నష్టం కలిగించే అనేక అంశాలున్నారుు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పు అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష ప్రతినిధి బృందం ఈ నెల 20వ తేదీన ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలవనుంది. ఈ సందర్భంగా ప్రధానికి అందజేసే వినతిపత్రంలో చేర్చాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు కొనసాగిస్తోంది. అన్నిచోట్లా 75% డిపెండబిలిటీయే ఆధారం దేశంలో ప్రవ హిస్తున్న గంగ, బ్రహ్మపుత్ర, తీస్తా, కోసి, భాక్రా వంటి నదులు ఇతర దేశాలతోనూ ముడిపడి ఉన్నాయి. ఈ నదుల నీటిపై మనతో పాటు సరిహద్దు దే శాలైన చైనా, బంగ్లాదేశ్, నేపాల్‌లకు చెందిన ప్రజలు కూడా ఆధారపడి ఉన్నారు. ఈ నదుల్లో ఉన్న నీటి లభ్యతను అంచనా వేయడానికి 75 శాతం డిపెండబిలిటీ (4 ఏళ్ల కాలంలో 3 ఏళ్లలో లభించే నీటి శాతం) పద్ధతినే అవలంభించారు. ఈ మేరకే ఆయా దేశాలకు నీటి పంపిణీ జరిగింది. అలాగే దేశంలోని ప్రధాన ప్రాజెక్టులైన భాక్రానంగల్ (పంజాబ్), గాంధీ సాగర్ (బీహార్), సర్దార్ సరోవర్ (గుజరాత్), హీరాకుడ్ (ఒడిశా), ఉజ్జయినీ (మధ్యప్రదేశ్) డ్యామ్‌లు, కోయనా రిజర్వాయర్ (మహారాష్ట్ర) వంటి వాటితో పాటు మన రాష్ట్రంలోని తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు కూడా 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగానే చేపట్టిన ప్రాజెక్టులనే విషయం వినతిపత్రంలో గుర్తు చేస్తున్నారు. అంతర్జాతీయ నీటి చట్టాలతో పాటు, జాతీయ నీటి చట్టాలు కూడా 75 శాతం పద్ధతినే పాటిస్తున్నాయని, గతంలో నర్మద ట్రిబ్యునల్ కూడా ఇదే పద్ధతిని పరిగణనలోకి తీసుకుందని పేర్కొననున్నారు. ఒక వేళ 65 శాతం డిపెండబిలిటీ (3 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాల్లో వచ్చే నీటి శాతం) పద్ధతిని తెరపైకి తీసుకువస్తే పక్క దేశాలూ 65 శాతాన్నే డిమాండ్ చేసే ప్రమాదాన్ని, దేశంలోని అనేక రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు పుట్టుకు వచ్చే అవకాశాన్నీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే రాష్ర్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితి, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నీటి కేటాయింపుల్లో జరిగిన లోపాలను సవరించాలని అఖిలపక్షం కోరనుంది. ఇప్పటికే కృష్ణా నదిని ఆధారంగా చేసుకుని హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టామని తెలుపుతూ వీటి నిర్మాణానికి భారీగా నిధులు వ్యయం చేసిన విషయాన్ని ప్రధానికి వివరించనుంది. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రెండురోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. శుక్రవారం ఇండియాటుడే అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సీఎం నేతృత్వంలో అఖిలపక్షం ప్రధానికి వినతిపత్రం సమర్పించనుంది. శుక్రవారం రాత్రికి గానీ శనివారం ఉదయం గానీ సీఎం హైదరాబాద్ చేరుకుంటారు.