పక్క దేశాలతోను పేచీలొస్తాయి
సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవరించకపోతే రాష్ట్రాల మధ్యే కాదు.. భవిష్యత్తులో దేశాల మధ్య కూడా కొత్తగా నీటి తగాదాలు వస్తాయనే విషయూన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్రం నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ నీటి చట్టాలకు విరుద్ధంగా ట్రిబ్యునల్ తీర్పు ఉందని, అది అమల్లోకి వస్తే దేశంలోనే అనేక రాష్ట్రాల మధ్య నీటి పోరాటాలు తప్పవనే విషయాన్ని స్పష్టం చేయనుంది. కృష్ణా నది నీటి పంపకాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇటీవల తన తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పులో మన రాష్ర్ట ప్రయోజనాలను దెబ్బతీసే, రాష్ట్రానికి నష్టం కలిగించే అనేక అంశాలున్నారుు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పు అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష ప్రతినిధి బృందం ఈ నెల 20వ తేదీన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలవనుంది. ఈ సందర్భంగా ప్రధానికి అందజేసే వినతిపత్రంలో చేర్చాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు కొనసాగిస్తోంది.
అన్నిచోట్లా 75% డిపెండబిలిటీయే ఆధారం
దేశంలో ప్రవ హిస్తున్న గంగ, బ్రహ్మపుత్ర, తీస్తా, కోసి, భాక్రా వంటి నదులు ఇతర దేశాలతోనూ ముడిపడి ఉన్నాయి. ఈ నదుల నీటిపై మనతో పాటు సరిహద్దు దే శాలైన చైనా, బంగ్లాదేశ్, నేపాల్‌లకు చెందిన ప్రజలు కూడా ఆధారపడి ఉన్నారు. ఈ నదుల్లో ఉన్న నీటి లభ్యతను అంచనా వేయడానికి 75 శాతం డిపెండబిలిటీ (4 ఏళ్ల కాలంలో 3 ఏళ్లలో లభించే నీటి శాతం) పద్ధతినే అవలంభించారు. ఈ మేరకే ఆయా దేశాలకు నీటి పంపిణీ జరిగింది. అలాగే దేశంలోని ప్రధాన ప్రాజెక్టులైన భాక్రానంగల్ (పంజాబ్), గాంధీ సాగర్ (బీహార్), సర్దార్ సరోవర్ (గుజరాత్), హీరాకుడ్ (ఒడిశా), ఉజ్జయినీ (మధ్యప్రదేశ్) డ్యామ్‌లు, కోయనా రిజర్వాయర్ (మహారాష్ట్ర) వంటి వాటితో పాటు మన రాష్ట్రంలోని తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు కూడా 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగానే చేపట్టిన ప్రాజెక్టులనే విషయం వినతిపత్రంలో గుర్తు చేస్తున్నారు.
అంతర్జాతీయ నీటి చట్టాలతో పాటు, జాతీయ నీటి చట్టాలు కూడా 75 శాతం పద్ధతినే పాటిస్తున్నాయని, గతంలో నర్మద ట్రిబ్యునల్ కూడా ఇదే పద్ధతిని పరిగణనలోకి తీసుకుందని పేర్కొననున్నారు. ఒక వేళ 65 శాతం డిపెండబిలిటీ (3 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాల్లో వచ్చే నీటి శాతం) పద్ధతిని తెరపైకి తీసుకువస్తే పక్క దేశాలూ 65 శాతాన్నే డిమాండ్ చేసే ప్రమాదాన్ని, దేశంలోని అనేక రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు పుట్టుకు వచ్చే అవకాశాన్నీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే రాష్ర్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితి, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నీటి కేటాయింపుల్లో జరిగిన లోపాలను సవరించాలని అఖిలపక్షం కోరనుంది. ఇప్పటికే కృష్ణా నదిని ఆధారంగా చేసుకుని హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టామని తెలుపుతూ వీటి నిర్మాణానికి భారీగా నిధులు వ్యయం చేసిన విషయాన్ని ప్రధానికి వివరించనుంది.
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రెండురోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. శుక్రవారం ఇండియాటుడే అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సీఎం నేతృత్వంలో అఖిలపక్షం ప్రధానికి వినతిపత్రం సమర్పించనుంది. శుక్రవారం రాత్రికి గానీ శనివారం ఉదయం గానీ సీఎం హైదరాబాద్ చేరుకుంటారు.