సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల వినియోగంపై వేడి మొదలైంది. ఎగువ నుంచి దిగువ శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వస్తుండటం, ప్రాజెక్టు నిండేందుకు మరో 100 టీఎం సీలే అవసరం ఉండటంతో ఆ నీటిపై తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించాయి. వీలైనంత ఎక్కువ నీరు పొందేలా పావులు కదుపుతున్నాయి. తమకు 21.5 టీఎంసీల మేర కావాలని కృష్ణా బోర్డుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విన్నవించగా.. వచ్చే 4 నెలల కాలానికి 115 టీఎంసీలు అవసరమని తెలంగాణ వివరించింది. అయితే ప్రస్తుతానికి 2 నెలల అవసరాల ఇండెంట్ మాత్రమే ఇవ్వాలని బోర్డు సూచించడంతో ఆ వివరాలు పంపే పనిలో తెలంగాణ నిమగ్నమైంది.
సాగర్ సాగుకు 65 టీఎంసీలు
శ్రీశైలానికి ఇప్పటికే 88 టీఎంసీల కొత్త నీరు చేరడంతో ఆ నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలు దృష్టి పెట్టాయి. ఏపీ ఇప్పటికే తన అవసరాలకు సంబంధించి కృష్ణా బోర్డుకు ఇండెంట్ సమర్పించింది. పోతిరెడ్డిపాడు కింద 9 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ కింద 7.4 టీఎంసీలు, హంద్రీనీవాకు 5 టీఎంసీల చొప్పున తక్షణం కేటాయించాలని కోరింది. ఇండెంట్ సమర్పించిందే తడవుగా హంద్రీ–నీవా కింద 1,248 క్యూసెక్కుల నీటిని బుధవారం నుంచి తరలిస్తోంది. తెలంగాణ కూడా కల్వకుర్తి, సాగర్ కింద తాగు, సాగు నీటి అవసరాల వివరాలు తెప్పించుకుంది. కల్వకుర్తి కింద 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించినందున దానికి 33 టీఎంసీలు, తాగునీటికి 7 టీఎంసీలు కలిపి 40 టీఎంసీలు కావాలని అధికారులు నివేదించారు. నాగార్జునసాగర్ కింద సాగునీటి అవసరాలకు 50 టీఎంసీలు, ఏఎంఆర్పీ కింద సాగుకు 15 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి మరో 10 కలిపి 75 టీఎంసీలు కోరారు. కానీ ఆగస్టు అవసరాల వరకే పంపాలని బోర్డు సూచించడంతో ఆ మేరకు లెక్కలు కుదించి గురువారం తెలంగాణ లేఖ రాసే అవకాశం ఉంది. లేఖలు అందగానే బోర్డు సమావేశం ఏర్పాటు చేసి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనుంది.
రోజుకు 22 టీఎంసీలు
శ్రీశైలం ప్రాజెక్టు ఈసారి పూర్తి జలకళను సంతరించుకుంటోంది. 215.81 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో గతేడాది ఈ సమయానికి 19.41 టీఎంసీలే నిల్వ ఉండగా ప్రస్తుతం 117.2 టీఎంసీల నీరు ఉంది. ఈ వారంలో సగటున రోజుకు 12 టీఎంసీలకుపైగా నీరొచ్చింది. ప్రస్తుతం 2.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. అంటే రోజుకు సగటున 22 టీఎంసీలు. ఎగువ ఆల్మట్టి నుంచి 1.45 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 1.52 లక్షల క్యూసెక్కుల మేర స్థిరంగా ప్రవాహం వస్తుండటం.. దీనికి తుంగభధ్ర నుంచి 56 వేల క్యూసెక్కుల నీరు తోడవడంతో మరో ఏడెనిమిది రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. అదే జరిగితే గతేడాదికి భిన్నంగా అక్టోబర్‌కు బదులు జూలై చివర్లోనే నాగార్జునసాగర్‌కు నీటి విడుదలయ్యే అవకాశం ఉంది. సాగర్ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 133.37 టీఎంసీల నిల్వలున్నాయి.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు (టీఎంసీల్లో), ప్రవాహాలు (క్యూసెక్కుల్లో)
ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో గతేడాది ఇదేరోజు నిల్వ
ఆల్మట్టి 129.72 113.56 1,45,000 1,45,696 98.67
నారాయణపూర్ 37.64 32.61 1,44,796 1,52,765 32.95
తుంగభద్ర 100.86 93.54 66,363 56,625 31.27
జూరాల 9.66 8.73 1,80,000 1,94,986 6.70
శ్రీశైలం 215.81 117.2 2,46,164 6,338 19.41
సాగర్ 312.05 133.37 0 460 117.21
Comments
Please login to add a commentAdd a comment