గతమే సీమ కరవుకు మూలం | Past is the only Reason for Rayalaseema drought | Sakshi
Sakshi News home page

గతమే సీమ కరవుకు మూలం

Published Thu, Oct 3 2013 12:45 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

గతమే సీమ కరవుకు మూలం - Sakshi

గతమే సీమ కరవుకు మూలం

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ఎడారవుతుందని, నీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని, నీటి యుద్ధాలు వస్తాయని ప్రజలను భయాందోళనకు గురిచేసే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల్లోని నిజమెం త? రాష్ట్రంలోని 40 నదీ బేసిన్లలో రెండు మాత్రమే పెద్దవి. అవి గోదావరి, కృష్ణాలు. మూడవ స్థానం పెన్నది. గోదావరి బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబం ధించి తెలంగాణ, కోస్తాంధ్ర సహజ హక్కులు పొంది ఉన్నాయి.  రాయలసీమకు సంబంధం లేదు. కాని రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు కృష్ణానదితో సంబంధం ఉంది. కనుక ఆ మూడు ప్రాంతాలకు కృష్ణ నీరు అందాలి. కృష్ణలో నీటి లభ్యత తక్కువ, అవసరాలు ఎక్కవ. గోదావరి అలాకాదు. కృష్ణా, గోదా వరి జలాలను పంచే బాధ్యతను 1976లో బచావత్ ట్రిబ్యునల్ స్వీకరించింది.
 
  కృష్ణ విషయంలో ట్రిబ్యునల్ చాలా కసరత్తు జరిపింది. గోదావరి నీటి పంపకం ఆయా రాష్ట్రాల అంగీకారంతో జరిగి పని సులువైంది. సమస్య కృష్ణా జలాల తోనే. బచావత్ ట్రిబ్యునల్ మొత్తం నికరజలాలను 2,060 టీఎంసీలుగా అంచనావేసి మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, మన రాష్ట్రానికి 800 టీఎం సీలు కేటాయించింది. 70 టీఎంసీల రిటర్న్ ఫ్లోస్ పునరుత్పత్తి జలాలు కూడా వీటికి తోడు లభిస్తాయని లెక్కలు కట్టి మహారాష్ట్రకు 25, కర్ణాటకకు 34, మనకు 11 టీఎంసీలు పంచింది. ఈ రకంగా మన రాష్ట్రానికి లభించిన నికరజలాలు 811 టీఎంసీలు. కనుక ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నా, రెండు, మూడు రాష్ట్రాలుగా విడిపోయినా పంచుకోవలసిన నికర జలాలు అవే.
 
 బచావత్ ట్రిబ్యునల్ తరువాత ప్రభుత్వం ప్రాజెక్టు కేటాయింపుల్లో స్వల్ప మార్పులు చేయడంతో మూడు కొత్త ప్రాజెక్టులు కూడా నికరజలాలను అనుభ వించే అర్హత సాధించాయి. అవి - భీమా (తెలంగాణ), పులిచింతల (కోస్తాం ధ్ర) శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్‌ఆర్‌బీసీ) - (రాయలసీమ). తాజాగా ప్రభు త్వం ఇచ్చిన సమాచారం మేరకు కోస్తాంధ్రకు 367.34, రాయలసీమకు 144.70, తెలంగాణకు 298.96 టీఎంసీల వంతున నికర జలాలు లభిస్తాయి. రాష్ట్రం ఎలా ఉన్నా ఈ నికరజలాల కేటాయింపులు మారవు. మిగులు జలాలు మనకు 227.50 టీఎంసీలు లభించగలవని ప్రభుత్వం లెక్కలుగట్టి రాయల సీమలోని మూడు ప్రాజెక్టులకు, తెలుగుగంగకు 29, గాలేరు-నగరికి 38, హంద్రీ-నీవాకు 40 టీఎంసీలు, వెరసి 107 టీఎంసీలు కేటాయించింది. కోస్తాంధ్రకు చెందిన వెలిగొండ ప్రాజెక్టుకు 43.50 టీఎంసీలు, తెలంగాణకు చెందిన మూడు ప్రాజెక్టులు, నెట్టెంపాడుకు 22, కల్వకుర్తికి 25, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ)కి 30, వెరసి 77 టీఎంసీలు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి నిర్మాణం చేపట్టిన ఈ ఏడు ప్రాజెక్టులకు ఎలాంటి నికరజలాల కేటాయింపులు లేకపోవడంతో కేంద్ర జలసంఘం వీటిని గుర్తించ లేదు.
 
  ఫలితంగా వాటిని రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే పూర్తి చేస్తోంది. కొత్తగా బచావత్ స్థానంలో ఏర్పడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిలుగు జలా లను మూడు ప్రాంతాల మధ్య పంపకానికి పెట్టింది. మిగులు జలాల మొత్తాన్ని 448 టీఎంసీలుగా అంచనా వేసింది. ఈ విధంగా మొత్తం మనకు లభించిన కృష్ణా జలాలు 1001 (811+190) టీఎంసీలు. అయితే మిగులు జలాల కేటా యింపు విషయంలో తుది తీర్పు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించలేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రాథమిక తీర్పులో చేసిన మిగులుజలాల కేటాయింపునకు వ్యతిరేకంగా మనం సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తాం. అంతిమ తీర్పును ట్రిబ్యు నల్ ప్రకటించకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదీ కృష్ణ పరిస్థితి. 
 
 తెలంగాణ విడిపోతే ముఖ్యంగా సీమ ప్రాంతం ఎడారి అవుతుందని ముఖ్య మంత్రి సహా అందరూ వాపోతున్నారు. దీనర్థం ఏమిటంటే సమైక్య ఆంధ్రప్ర దేశ్‌లో రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, తెలంగాణ విడిపోతే కరవుతో ఎడారి అవుతుంది. అసలు రాయలసీమ కరవు ప్రాంతంగా లేనిదెప్పుడు? సెప్టెంబర్ 89 డిసెంబర్ 91 - ‘కదలిక’ ప్రత్యేక సంచిక ‘తరతరాల రాయల సీమ’ను ఒక్కసారి చూడండి. దాదాపు అన్ని వ్యాసాలు కరవు గురించి ఏకరువు పెట్టినవే. 
 
 ఇది 1953 ముందు సమస్య. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రతినిధులు కుదుర్చుకున్న శ్రీభాగ్ ఒప్పందంలో నీటి పారుదల విషయం ఏం రాసి ఉందో గమనించండి. ‘రాయలసీమ, నెల్లూరు జిల్లాలు కోస్తా ప్రాంతాలతో పాటు శీఘ్రతరంగా వ్యవసాయక, ఆర్థిక విషయా లలో అభివృద్ధి చెందడానికి గాను పదేళ్లు గాని, లేదా పరిస్థితులను బట్టి, దానికి మించిగాని నీటి పారుదల సౌకర్యాలు వాటికి కల్పించాలి. ఈ సదుపాయం ప్రముఖంగా తుంగభద్ర, కృష్ణ, పెన్నా నదుల నుండి పదేళ్లపాటు ఈ ప్రాంతాల అవసరాలకు సంబంధించి పెద్ద ప్రాజెక్టులలో సహాయకారిగా ఉండాలి. ఎప్పుడు నీటి జలాల పంపిణీ సమస్య ఉత్పన్నమైనా, పైన పేర్కొన్న ప్రాంతాల అవసరాలు తీరిన తరువాతనే నిర్ణయం జరగాలి. అది ఈ రోజు నుండే (డిసెం బర్ 1937) అమలులోకి రావాలి’.
 
ఆంధ్రప్రదేశ్ 1 నవంబర్ 1956న అవతరించింది. అంటే 53 నుంచి 56 వరకు ఈ శ్రీభాగ్ ఒప్పందం చెలామణిలో ఉందని ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయిందని భావించాలి. ప్రణాళికా సంఘం, ఖోస్లా కమిటీ సిఫార్సులను అనుసరించి కృష్ణా-పెన్నా స్థానంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు అనుమతి ఇవ్వడంతో రాయలసీమకు తుంగభద్ర నీరు మాత్రమే ప్రధానంగా దక్కి, కృష్ణా నీరు అంతంతమాత్రంగానే లభ్యమవుతోంది. ఇప్పటి పరిస్థితి ఏమిటంటే రాయలసీమకు నికరజలాలు 144.70 టీఎంసీలు మాత్రమే. ఇక మిగులు జలాలు అధికారికంగా ఇప్పటి వరకు ఏమీలేవు. 
 
ఈ నీరు సరిపోదు, మాకు ఎక్కువ నీరు మిగులు జలాల రూపంలో కావాలని రాయలసీమ డిమాండ్ చేస్తోంది. ఎవరిస్తారన్నదే ప్రశ్న. ఇది రాష్ట్ర విభజనతో కూడిన సమస్య కానే కాదు.  కృష్ణ నీళ్లు 300 టీఎంసీల వరకు కావాలని సీమ డిమాండ్ చేస్తోంది. ఈ కోరిక తీర్చడం ఎలా సాధ్యం? మహారాష్ట్ర, కర్ణాటకలు తమ వాటాలు తగ్గించు కోవు. ఒకసారి వాటా నిర్ధారించాక తెలంగాణ, కోస్తాంధ్రలు కూడా ఒప్పుకోవు. తాగునీటి కోసమంటే, కొంత నీటిని వదులుకుంటాయేమోగాని ఇతరత్రా కాదు. 57 ఏళ్ల సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కసరత్తు చేపట్టినట్టు లేదు. కాకపోతే ఇతర మార్గాల ద్వారాను అంటే దౌర్జన్యంగా ఇతర ప్రాంతాల నీటిని తరలించడం, మిగులుజలాల పేరిట నికరజలాలను తరలిం చడం వంటి వికృత చేష్టలను పరోక్షంగా ప్రోత్సహిస్తూ రావడం ఇప్పటి దాకా జరిగింది. తెలంగాణ విడిపోతే ఈ అనధికార చర్యలు సాగవు. 
 
రాయలసీమకు అధికారికంగా లభించే 144.70 టీఎంసీల నికరజలాలతో పాటు భవిష్యత్తులో కొత్త ట్రిబ్యునల్ కేటాయించే 25 టీఎంసీల మిగులు జలాలతో ఎలా నెట్టుకురావడం అనే ప్రశ్న రావడం సహజం. మనమేకాదు, దేశంలో అనేక రాష్ట్రాలు తమిళనాడు, రాజస్థాన్ వంటివి నీటి ఎద్దడితో సతమతమవుతున్నాయన్న సత్యాన్ని సీమవాసులు గ్రహించడం మొదటిపని. రెండవది తెలంగాణను, కోస్తాంధ్రను ‘సాటి తెలుగువాడి’కి కొంత నీటిని త్యాగం చేయమని అర్థించడం. అయితే ఇది అంత తేలిక కాదు. వలసలు పోతున్న పాలమూరు జిల్లా, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా కనీస అవసరాలు తీర్చకుండా తెలంగాణ తనకు వచ్చిన స్వల్ప వాటా (68.5 శాతం పరీవాహక ప్రాంతమున్న తెలంగాణకు లభించింది నికర జలాల్లో 34 శాతం మాత్రమే)లో సీమ కోసం కొంత వదులుకుంటుందా అన్నది అనుమానమే. 
 
కోస్తాంధ్ర విషయానికి వస్తే తనకు లభించిన వాటిలో కొంత భీమాకు, పులిచింతలకు వదులుకున్నామన్న వాదనతో మరికొంత సీమకు ఇవ్వడానికి అంగీకరించకపోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోతే సీమ ఎడారి అవు తుందని చెప్పడం అవాస్తవం. రాయలసీమ కృష్ణా బేసిన్‌లో 18 శాతం పరీ వాహక ప్రాంతం కలిగి ఉంది. నికర జలాలు అటూ ఇటుగా అంతే శాతం సీమకు దక్కాయి. మిగులుజలాలు అదనం. ఈ నేపథ్యంలో రాయలసీమకు ఎలా న్యాయం జరుగుతుందో ఆలోచించాలి. చెప్పొచ్చేదేమంటే రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్రకు రావలసిన చట్టబద్ధమైన నీటి వాటాలను బచావత్ ట్రిబ్యునల్ ఇదివరకే నిర్ణయించింది. మిగులు జలాలను బ్రిజేష్ కమిటీ నిర్ణయిస్తున్నది. వీటిని ప్రాజెక్టులకు, ప్రాంతాలకు సక్రమంగా అందించడానికి కంట్రోల్ బోర్డులు ఏర్పాటవుతాయి.
 
ఇక గోదావరి విషయాని వస్తే బచావత్ ట్రిబ్యునల్ మనకు ఇచ్చిన నీటిని అంచనా వేస్తే మన రాష్ట్రానికి లభించే నికరజలాలు 1480 టీఎంసీలు. అందులో 900 తెలంగాణకు, 580 కోస్తాంధ్రకు, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులను జరు పుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తెలంగాణలో, కోస్తాంధ్రలో గోదావరి జల వినియోగార్థమైన అనేక ప్రాజెక్టులను చేపట్టింది. అవి వివిధ దశలలో ఉన్నాయి. తలనొప్పిగా మారిన పోలవరం సమస్య పస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. అయితే నీటి లభ్యత సమస్య పోలవరానికి లేదు. ముంపు ‘సమస్య తేలితే, ‘పోలవరం’ నిర్మాణానికి సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపుతుంది. కనుక ‘తెలంగాణ’ ఏర్పడితే సీమాంధ్ర ఎడారి అవడం పచ్చి అబద్ధం. సీమ ఎడారిగా మారడానికి కారణాలు వేరు. అది ప్రత్యేక రాష్ట్రంతో ముడిపడ్డ అంశం కాదు. కోస్తాంధ్ర ప్రాంతం చేస్తున్న వాదన పూర్తిగా అర్ధరహితం. తెలంగాణకు అడ్డుపడే దుర్మార్గపు యోచనతో చేస్తున్నదే.
-- ఆర్ విద్యాసాగర్, సీఈ (రిటైర్డ్)
సెంట్రల్ వాటర్ కమిషన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement