శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/ విజయపురి సౌత్: చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో ప్రవహించే 5 నదులూ ఒకేసారి సముద్రంలో కలుస్తున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఈ నదుల జలాలు కడలి వైపు పరుగులు తీస్తున్నాయి. ఐదు నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండి, మిగులు జలాలు ఒకేసారి సముద్రంలో కలవడం చరిత్రలో ఇదే తొలి సారి.
శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.22 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3.33 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు, నెల్లూరు బ్యారేజ్ నుంచి 35 వేల క్యూసెక్కుల పెన్నా జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 18,702 క్యూసెక్కుల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట నుంచి 20 వేల క్యూసెక్కుల నాగావళి జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
కృష్ణా , ఉప నదులు తుంగభద్ర, వేదవతి, భీమా, హంద్రీలు ఉరకలు వేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,47,018 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 10 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1013, కల్వకుర్తి ద్వారా 800 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,014 క్యూసెక్కులు, స్పిల్ వే 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 వెరసి 4,38,184 క్యూసెక్కును దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.3 అడుగుల్లో 211.47 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లోకి 3,94,058 క్యూసెక్కులు చేరుతున్నాయి.
ఇక్కడి నుంచి కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 12,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 3,81,358 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 588.1 అడగుల్లో 306.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతలలో 4,18,247 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 3,42,136 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతలలో 168.5 అడగుల్లో 36.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,23,813 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 10,153 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,22,660 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
► బేసిన్‌లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరిలోనూ వరద ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 3,39,015 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 5,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,33,915 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
► పెన్నాలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్ర సరిహద్దులోని అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకు పెన్నాపై ఉన్న ప్రాజెక్టులనీన నిండిపోవడంతో వాటి గేట్లను ఎత్తేసి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. నెల్లూరు బ్యారేజ్‌లోకి 38 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 3 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 35 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
► ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. గొట్టా బ్యారేజ్‌లోకి వంశధార నుంచి 20,675 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,973 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 18,702 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 20,600 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 20 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment