సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పాత వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణాబోర్డు తేల్చిచెప్పాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే వరకు ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ కేటాయించిన కృష్ణా జలాల్లో 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. చిన్న నీటివనరుల విభాగంలో వినియోగించిన జలాలు, ప్రకాశం డెల్టాకు మళ్లించే గోదావరి జలాలను పంపిణీ నుంచి మినహాయించినట్టు పునరుద్ఘాటించింది.
ఈ మేరకు ఈ నెల 2న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణాబోర్డు సంయుక్తంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేశాయి. కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ పాత పద్ధతిలోనే వినియోగించుకోవడానికి మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ.. ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరిగింది. కృష్ణా జలాల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది.
అర్ధ భాగం డిమాండ్ అసంబద్ధమే..
కృష్ణా జలాల పంపిణీకి 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్.. 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంపిణీ చేస్తూ 1976 మే 27న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందనే అంశాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణాబోర్డు గుర్తుచేశాయి. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చిందని, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించిందని పేర్కొన్నాయి.
ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించుకున్న నీటిని పరిగణనలోకి తీసుకుని.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను తాత్కాలిక ప్రాతిపదికన పంపిణీ చేసుకోవడానికి అంగీకరిస్తూ 2015 జూన్ 18–19న కేంద్ర జల్ శక్తిశాఖ సమక్షంలో రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయనే అంశాన్ని ఎత్తిచూపాయి. ఆ తర్వాత 2016–17లోనూ అదే పద్ధతిలో నీటిని పంపిణీ చేసుకున్నాయి. ఆ తర్వాత చిన్న వనరుల విభాగం, మళ్లించిన గోదావరి జలాలను మినహాయించి.. మిగతా నీటిలో ఏపీ 66 శాతం, తెలంగాణ 33 శాతం చొప్పున పంచుకుంటున్నాయనే అంశాన్ని పేర్కొంది.
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని.. ఆ ట్రిబ్యునల్ అవార్డు వస్తేనే నీటి లెక్కలు తేలతాయని అఫిడవిట్‌లో కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు స్పష్టం చేశాయి. అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. స్పష్టం చేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీకి నీటిని పునఃపంపిణీ చేసే సమయంలో బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల జోలికి వెళ్లలేదని గుర్తుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment