సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పునఃపంపిణీ చేయడం కుదరదని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2) తేల్చి చెప్పింది. నిర్దిష్టమైన కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుపై మాత్రమే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ జారీ చేసిన జీవో రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్(ఐఏ)పై విచారణను వచ్చే నెల 13, 14న మరోసారి చేపడతామని పేర్కొంది.
ఈ ఐఏపై ట్రిబ్యునల్ శుక్రవారం విచారణ జరిపింది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956 సెక్షన్–3, 5ల ప్రకారం ఇప్పటికే నీటిని పంపిణీ చేశామని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాల కేటాయింపులో తమ పరిధి పరిమితంగా ఉందని గుర్తు చేసింది. నిర్దిష్టంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని సంకేతాలిచ్చింది.
తెలంగాణ సగం వాటా కోరడం చట్టవిరుద్ధం
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షిస్తే న్యాయ ఉల్లంఘనకు పాల్పడినట్లే. అందుకే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కూడా ఆ తీర్పు జోలికి వెళ్లలేదని న్యాయ, సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో సగ భాగం కావాలని తెలంగాణ కోరడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యధాతథంగా కొనసాగుతాయని, అదనంగా కేటాయించిన 194 టీఎంసీలపైనే విచారణ చేస్తుందని వివరిస్తున్నారు.
194 టీఎంసీల కేటాయింపుపైనే విచారణ
కృష్ణా జలాల పంపిణీకి 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంపిణీ చేస్తూ 1976 మే 27న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది.
పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. కృష్ణా జలాల పునఃపంపిణీకి 2004 ఏప్రిల్ 2న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న ప్రాథమిక నివేదిక, 2013 నవంబర్ 29న తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. ఈ నివేదికలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో వాటిని కేంద్రం అమల్లోకి తేలేదు.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు 811 టీఎంసీలను యధాతథంగా కొనసాగించింది. అదనంగా 65 శాతం లభ్యత ఆధారంగా 194 టీఎంసీలను కేటాయించింది. అంటే మొత్తం 1,005 టీఎంసీలను కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 1,005 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంచే బాధ్యతను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. యధాతథంగా కొనసాగిస్తున్న 811 టీఎంసీలు పోను, ఇప్పుడు 194 టీఎంసీల పైనే విచారణ జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment