krishna tribunal
-
‘బ్రిజేష్’కు 5 డీపీఆర్‌లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా 555 టీఎంసీలను కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్– 2కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అందులో 238 టీఎంసీల నీటి అవసరాలు కలి గిన ఐదు ప్రాజెక్టుల డీపీఆర్‌లను మంగళ వారం ట్రిబ్యునల్‌కు సమర్పించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం అదనపు విధి విధానాలు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)ను గతంలో జారీ చేసింది. దీని ఆధారంగా కృష్ణా జలాల పంపిణీ విధానంపై ట్రిబ్యునల్‌కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తమ వాదన లతో స్టేట్మెంట్ ఆఫ్ కేస్‌లను ఇప్పటికే దాఖలు చేశాయి. నవంబర్ 6 నుంచి 8 వరకు ట్రిబ్యునల్‌లో తదుపరి విచారణ జర గాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 53 టీఎంసీలు, నెట్టెంపాడు ప్రాజెక్టుకు 25.4 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు, ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు కలుపు కొని మొత్తం 238 టీఎంసీలను ఆయా ప్రాజెక్టులకు కేటాయించాలని కోరుతూ వాటి డీపీఆర్‌లను తాజాగా ట్రిబ్యునల్‌కు అందజేసింది. వీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎస్ఎల్బీసీ ప్రాజె క్టుకు మరో20 టీఎంసీలు, కొడంగల్– నారా యణపేట ఎత్తిపోతలకు 7టీఎంసీలతో పాటు ఇప్పటికే ఉన్న పాత ప్రాజెక్టుల అవ సరాలకు 299 టీఎంసీలు అవసరమని ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఇక భవిష్య త్లో నిర్మించనున్న జూరాల వరద కాల్వ, కోయి ల్కొండ ప్రాజెక్టు, జూరాల–శ్రీశైలం మధ్య లో కొత్త బరాజ్, భీమాపై మరో బరాజ్ అవసరాలు కలుపుకొని మొత్తం 555 టీఎంసీలను రాష్ట్రానికి కేటాయించాలని కోరింది. పాత ప్రాజెక్టులకు 299 టీఎంసీలు చిన్న నీటిపారుదలకు 89.15, నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు 105.7, భీమా ఎత్తి పోతలకు 20, జూరాలకు 17.8, తాగునీటి సరఫరాకు 5.7, పాకాల చెరువుకు 2.6, వైరా చెరువుకు 3.7, పాలేరు ప్రాజెక్టుకు 4 , డిండి ప్రాజెక్టుకు 3.5, కోయిల్‌సాగర్‌కు 3.9, ఆర్డీఎస్కు 15.9, మూసీకి 9.4, లంకసాగర్‌కు 1, కోటిపల్లివాగుకు 2, ఓకచెట్టి వాగుకు 1.9 టీఎంసీలు కలిపి మొత్తం 299 టీఎంసీలను ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల అవసరాలకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు తెలంగాణ కోరింది. -
జలవిద్యుత్ అవసరాలకే శ్రీశైలం
సాక్షి, హైదరాబాద్: జలవిద్యుత్ అవసరాలకే శ్రీశైలం జలాశయాన్ని నిర్మించారని తెలంగాణ రాష్ట్రం మరోసారి స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ ఏదైనా మార్పు చేసేవరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల విషయంలో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కు ఇటీవల ఏపీ సమర్పించిన స్టేట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)పై తెలంగాణ కౌంటర్ దాఖలు చేసింది. తెలంగాణ దాఖలు చేసిన ఎస్వోసీపై ఏపీ సోమవారం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేసింది. ఇరు రాష్ట్రాలు దాఖలు చేసిన కౌంటర్లపై పరస్పర రిజాయిండర్లు దాఖలు చేయడానికి 15 రోజుల సమయాన్ని కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించింది. తెలంగాణ ఎస్వోసీలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరగాలి ∙ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఇంకా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్‌లపై ఆధారపడి ఏపీలో నిర్మించిన ప్రాజెక్టులకు 520.7 టీఎంసీలు అవసరమని ఏపీ చేసిన వాదన చెల్లుబాటుకాదు. ∙కృష్ణా పరీవాహక ప్రాంతంలో 70 శాతం నీటి లభ్యతకు పశ్చిమ కనుమల్లో కురిసే వర్షాలే కారణం. ఉప నదులు/సబ్ బేసిన్ల వారీగా కాకుండా బేసిన్లో చివరన ఉన్న ప్రకాశం బరాజ్ వద్ద నీటి లభ్యతను మాత్రమే కృష్ణా ట్రిబ్యునల్–1 లెక్కించింది.ఉమ్మడి ఏపీని ఒక యూనిట్‌గా పరిగణించి గంపగుత్తగా 811 టీఎంసీల జలాలను కేటాయించింది. రాష్ట్రంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల అవసరాలను పరిశీలించకుండానే, రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల ఆధారంగా అప్పటికే ఉన్న ప్రాజెక్టుల కింద వినియోగాన్ని పరిరక్షించింది. ఆంధ్రలో బేసిన్ వెలుపలి ప్రాంతాలకు నీళ్లను తరలించేందుకు, కృష్ణా ప్రధాన పాయపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ నిర్ణయం దారితీసింది. ∙తెలంగాణలో కృష్ణా బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలను తీర్చడానికి చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను మాత్రమే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. బేసిన్ లోపలి ప్రాంతాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన తెలంగాణకు అనుకూలంగా ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. నీటి వాటాల కోసం సరిపడ నీటి లభ్యత లేని ఉప నదులపైనే తెలంగాణ ఆధారపడగా, ఏపీ మాత్రం కృష్ణా ప్రధాన పాయ ద్వారా భారీ లబ్ధిని పొందుతోంది. సమన్యాయ సిద్ధాంతాన్ని పాటించలేదు ∙కృష్ణా ట్రిబ్యునల్–1 సమన్యాయ సిద్ధాంతాన్ని అమలు చేయలేదు. 1971లో రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ఆధారంగా 751.2 టీఎంసీల (ఏపీ 114.9, మహారాష్ట్ర 386.7, కర్ణాటక 249.6 టీఎంసీలు) వినియోగాన్ని పరిరక్షించింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగాన్ని సమగ్రంగా పరీక్షించకుండానే ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు పరస్పర సమ్మతితో సమర్పించిన ప్రాజెక్టుల జాబితా ఆధారంగా మరో 942.16 టీఎంసీల (ఏపీ 634.26, మహారాష్ట్ర 52.95, కర్ణాటక 254.95 టీఎంసీలు) వినియోగాన్ని సంరక్షించింది. ప్రాజెక్టుల హైడ్రాలజీ, క్యాచ్మెంట్ ఏరియా, వర్షపాతం వంటి అంశాలను పరీక్షించకుండానే ఈ నిర్ణయాలను ట్రిబ్యునల్ తీసుకుంది. ఈ నీళ్లను బేసిన్ లోపలి ప్రాంతాల్లో వాడుతున్నారా? వెలుపలి ప్రాంతాల్లో వాడుతున్నారా? అనే అంశాన్ని సైతం పరీక్షించలేదు. ఎలాంటి శాస్త్రీయ విధానం గానీ సమన్యాయ సిద్ధాంతాన్ని గానీ ట్రిబ్యునల్ అవలంభించలేదు. 50: 50 నిష్పత్తిలో పంపిణీ చేయాలి » ప్రాజెక్టుల వారీగా కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపులు చేసిందని ఏపీ ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. ఏపీ పేర్కొన్నట్టు ప్రాంతాల వారీగా, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులేమీ జరగలేదు. గుంపగుత్తగానే కేటాయింపులు చేసింది. » ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలు జరగే వరకు ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే అంశం ఉత్పన్నం కాదు. » శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు 173.5 టీఎంసీలు అవసరం. » రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక పంపకాల కోసం 2015లో చేసుకున్న ఒప్పందం ఆ ఒక్క ఏడాది కోసమే. ఇప్పుడు 50: 50 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలి. కృష్ణా ట్రిబ్యునల్–1 నిర్ణయాలను పునః సమీక్షించరాదు: ఏపీ ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు కృష్ణా ట్రిబ్యునల్–1 చేసిన కేటాయింపులను పునఃసమీక్షించడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపులను పునః సమీక్షించడానికి ఆస్కారం లేదని చెప్పింది. -
అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేం
సాక్షి, న్యూఢిల్లీ: అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణా ట్రిబ్యునల్–2కు కొత్తగా నిర్దేశించిన విధి విధానాల (టీవోఆర్)ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ అక్టోబర్ 6న కృష్ణా ట్రిబ్యునల్–2కు కొత్తగా నిర్దేశించిన విధి విధానాలపై తదుపరి చర్యలు లేకుండా నిలుపుదల చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. జల వివాదాలపై నిర్ణయం తీసుకునే అధికారం జల వివాదాల ట్రిబ్యునల్‌కే ఉందని, ఏపీ ప్రభుత్వం పిటిషన్లో లేవనెత్తిన అంశాలు ఆర్టికల్ 262 పరిధిలోకి వస్తాయన్నారు. ఆర్టికల్ 32 కింద కాకుండా ఆర్టికల్ 131 ప్రకారం పిటిషన్ దాఖలు చేయాల్సిందని వైద్యనాథన్ పేర్కొన్నారు. పిటిషన్‌కు మెయింటైన్‌బిలిటీ లేదంటూ అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేమని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాథమిక అభ్యంతరాలను కౌంటర్ అఫిడవిట్లో పేర్కొనాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ న్యాయవాది మెరిట్స్‌లోకి వెళ్తున్నారని, ఆ అవసరం లేదని, ట్రిబ్యునల్ టీవోఆర్‌పై స్టే విధించాలని కోరారు. ఈ సమయంలో కేంద్రం తరఫు న్యాయవాది వారం రోజులు గడువు ఇస్తే అభిప్రాయం చెబుతామని ధర్మాసనాన్ని కోరారు. మెరిట్స్‌పై వాదించడానికి సిద్ధంగా ఉన్నామని, స్టే విధించొద్దని వైద్యనాథన్ కోరగా.. అయితే తాము కూడా మెరిట్స్‌పై వాదనకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ, కేంద్రం కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ కార్యకలాపాలు కొనసాగడం అనేది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ట్రిబ్యునల్ ఇప్పటికే దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ నెల 29న చేపడతామని ధర్మాసనం పేర్కొంది. -
కేంద్ర గెజిట్ ఆధారంగానే విచారించాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 6న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగానే ఇకపై కృష్ణా ట్రిబ్యునల్–2 విచారణ కొనసాగించాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 89లోని మార్గదర్శకాల ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలు జరిపేందుకు 2016 అక్టోబర్ నుంచి కృష్ణా ట్రిబ్యునల్–2 విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఇటీవల అదనపు మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇకపై పాత మార్గదర్శకాల (సెక్షన్ 89) ఆధారంగా విచారణను కొనసాగించడం సమంజసం కాదని తెలంగాణ పేర్కొంది. కాగా బుధవారం ఢిల్లీలో సమావేశమైన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఇరు పక్షాల వాదనలకు అవకాశం ఇచ్చింది. కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తక్షణమే విచారణను ప్రారంభించాలని తెలంగాణ తరçఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సూచించారు. కొత్త గెజిట్‌పై ఏపీ తమ స్టేట్మెంట్ను ట్రిబ్యునల్‌కు సమర్పించవచ్చని, విచారణను మాత్రం వాయిదా వేయరాదని కోరారు. అధ్యయనానంతరమే వాదనలు: ఏపీ గెజిట్ నోటిఫికేషన్‌కు ఉన్న చట్టబద్ధత, దాని ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు కొంత సమయం కేటాయించాలని, అధ్యయనం జరిపిన తర్వాతే తమ వాదనలు వినిపించగలమని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా చెప్పారు. అప్పటివరకు విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని కూడా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీలను తరలిస్తే, ప్రతిగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవచ్చని గోదావరి ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ఆ నీళ్లను సైతం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం మినిట్స్‌ను ఉటంకిస్తూ ఈ నీళ్ల కేటాయింపులను గోదావరి ట్రిబ్యునల్ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తదుపరి విచారణను నవంబర్ 22, 23వ తేదీలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్‌కు ఉన్న చట్టబద్ధత, దాని ప్రభావాలపై తెలంగాణకు నవంబర్ 15లోగా, ట్రిబ్యునల్‌కు నవంబర్ 20లోగా తమ స్పందనను సమర్పించాలని ఏపీని ఆదేశించింది. -
విచారించే పరిధి మాకు లేదు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ గత ఏడాది ఆగస్టు 18న తెలంగాణ రాష్ట్రం జారీ చేసిన జీవో 246ను సవాలు చేస్తూ ఏపీ వేసిన కేసు (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్)ను జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 కొట్టేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట జల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్–2 తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ జీవో అమలును నిలిపివేసి తమ రాష్ట్రానికి మధ్యంతర ఉపశమనం కల్పించాలంటూ ఏపీ వేసిన కేసును విచారించే పరిధి తమకు లేదని పేర్కొంది. చట్టానికి లోబడి ఉపశమనం కోసం మరో వేదికను ఆశ్రయించే స్వేచ్ఛను ఏపీకి కల్పించింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ తలపాత్ర, జస్టిస్ రామ్మోహన్‌రెడ్డితో కూడిన కృష్ణా ట్రిబ్యునల్–2 బుధవారం కీలక తీర్పు వెలువరించింది. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని, ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీకారం చుట్టారని తెలంగాణ చేసిన వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గతేడాది డిసెంబర్ 8న ఏపీ ఈ కేసును దాఖలు చేయగా, రెండు రాష్ట్రాలు దాదాపు 4 నెలల పాటు ట్రిబ్యునల్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈ జీవోతో ఏపీ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ చేసిన వాదనలతో తెలంగాణ విభేదించింది. పాలమూరు కొత్త ప్రాజెక్టే.. వేటిని కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి అన్న అంశంపై రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రూపొందించిన మార్గదర్శకాల ఆధారంగా పాలమూరుపై ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక–ఆర్థిక సాధికారతపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మదింపు జరగని ప్రాజెక్టులు, టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ ఆమోదించని ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణిస్తారు. ఇంటేక్ పాయింట్, ప్రాజెక్టు ప్రాంతం, కాల్వలు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఆయకట్టు ప్రాంతం, నిల్వ సామర్థ్యం, నీటి వినియోగం వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నా కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 టీఎంసీల వరద జలాలను జూరాల ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించారు. అయితే తెలంగాణ వచ్చాక ప్రతిపాదనలను సమూలంగా మార్చివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి 70 శాతం లభ్యత ఆధారంగా 90 టీఎంసీల నికర జలాలను తరలించేలా ప్రాజెక్టును ప్రతిపాదించిన నేపథ్యంలో దీనిని కొత్త ప్రాజెక్టుగా పరిగణిస్తున్నట్టు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. గతంలో కేటాయింపులు జరపని ప్రాజెక్టులు మా పరిధిలోకి రావు.. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89 అమలు బాధ్యతలను కృష్ణా ట్రిబ్యునల్–2 చేపట్టిన నేపథ్యంలో.. తెలంగాణ జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని ఏపీ ప్రభుత్వం చేసిన వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గతంలో కృష్ణా ట్రిబ్యునల్–1, కృష్ణా ట్రిబ్యునల్–2 లు గంపగుత్తగా కేటాయింపులు జరిపిన ప్రాజెక్టులకు మళ్లీ నిర్దిష్ట కేటాయింపులు జరిపే అధికారాన్ని మాత్రమే రాష్ట్ర పునర్వీభజన చట్టంలోని సెక్షన్ 89 కింద తమకు కేటాయించారని తెలిపింది. గతంలో ఏ ట్రిబ్యునల్ కూడా కేటాయింపులు జరపని ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు తమ పరిధిలోకి రావని పేర్కొంది. పునఃకేటాయింపులూ మా పరిధిలోనిది కాదు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునః కేటాయింపులు జరిపే అంశం తమ పరిధిలో లేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కేవలం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపడమే తమ బాధ్యత అని పునరుద్ఘాటించింది. కాగా సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్‌కు పరిమిత అధికారాలే ఉన్నాయని, ఏపీకి మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని తెలంగాణ వాదించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 11 ప్రకారం జల వివాదాల విషయంలో సుప్రీం కోర్టుకు ఉన్న న్యాయ అధికారాలన్నీ ట్రిబ్యునల్‌కు ఉంటాయని 1993లో కావేరి ట్రిబ్యునల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ఏపీ గుర్తు చేసింది. ఈ మేరకు అధికారాలను వినియోగించి మధ్యంతర ఉపశమనం కల్పించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. అయితే తమకు అప్పగించిన బాధ్యతలకు లోబడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర పునర్వీభజన చట్టం 2014 వచ్చిన తర్వాత చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి వంటి కొత్త ప్రాజెక్టులు సెక్షన్ 89 కింద తమ పరిధిలోకి రావని కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చి చెప్పింది. ఇలావుండగా గతంలో గంపగుత్తగా కేటాయింపులు పొందిన ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు సెక్షన్ 89 కింద నిర్దిష్ట కేటాయింపులు జరిపే అంశం ఇంకా ట్రిబ్యునల్‌లో విచారణ దశలోనే ఉంది. నిర్ణయం వచ్చే సరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
ట్రిబ్యునల్‌కి పరిధి లేదు!
సాక్షి, హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా సమ కేటాయింపులు జరిపే అధికారం తమకు లేదని కృష్ణా ట్రిబ్యునల్–2 చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ మరోసారి స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన తెలంగాణకు కేవలం 299 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించడం..బేసిన్ ప్రమాణాల ప్రకారం ఏమాత్రం సమంజసమని తెలంగాణ రాష్ట్రం వాదించగా.. ఆయన పై విధంగా స్పందించారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తాము జారీ చేసిన జీవోను సమీక్షించే అధికారంసైతం కృష్ణా ట్రిబ్యునల్–2కి ఉండదని, అపెక్స్ కౌన్సిల్ పరిధిలోకి ఈ అంశం వస్తుందని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్‌లాక్యూటరీ అప్లికేషన్(ఐఏ)ను తోసిపుచ్చాలని కోరింది. బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 గురువారం ఢిల్లీలో ఏపీ దాఖలు చేసిన ఐఏపై విచారణ నిర్వహించగా, తెలంగాణ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ ఈ మేరకు వాదనలు వినిపించారు. కేటాయించింది నికర జలాలే బచావత్ ట్రిబ్యునల్(కృష్ణా ట్రిబ్యునల్–1) ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని వివరించింది. ఆ నీళ్లను ఏ ప్రాజెక్టులకైనా కేటాయించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పిస్తూ గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని తెలంగాణ గుర్తు చేసింది. దీని ఆధారంగానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయింపులు చేసుకున్నామని స్పష్టం చేసింది. మైనర్ ఇరిగేషన్లో తెలంగాణకు కేటాయించిన 89 టీఎంసీల్లో వాడుకోని 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించినట్టు వివరించింది. పోలవరం ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున, నాగార్జునసాగర్ ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన 80 టీఎంసీల కోటా నుంచి మరో 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయించినట్టు తెలిపింది. ప్రాజెక్టుకు నికర జలాలనే కేటాయించినట్టు వాదనలు వినిపించింది. గోదావరికి కృష్ణా జలాల మళ్లింపునకు ప్రతిఫలంగా వచ్చిన 80 టీఎంసీల నుంచి 30 టీఎంసీలను 2013లో ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్ఎల్బీసీ)కి కేటాయించిందని గుర్తు చేసింది. ఎస్ఎల్బీసీకి ప్రాజెక్టుకు కేటాయించిన 30 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు తిరిగి కేటాయించినట్టు వెల్లడించింది. ఏ ప్రాజెక్టుకూ కేటాయించని జలాలను బేసిన్ లోపలి ప్రాజెక్టులకు కేటాయించాల్సి ఉంటుందని, అందుకే పాలమూరు–రంగారెడ్డికి కేటాయించినట్టు తెలిపింది. నికర జలాలనే కేటాయించినందున ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చాలని సూచించింది. తెలంగాణ వాదనలు గురువారంతో ముగియగా, శుక్రవారం ఏపీ వాదనలు వినిపించనుంది. -
వరద జలాలతో అనుమతి రాదనే నికర జలాలతోనే
సాక్షి, హైదరాబాద్: వరద జలాలపై ప్రతిపాదిస్తే ప్రాజెక్టుకు అనుమతి రాదనే, నికర జలాలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్టు తెలంగాణ గుర్తు చేసింది. పాత ప్రతిపాదన(జూరాల)కు కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టుకు మధ్య నీటిని ఎత్తిపోసే ప్రదేశం ఒకటే మారిందని, డిజైన్‌లో ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేసింది. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కృష్ణా జల వివాదాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ, ఏపీ వాదనలు వినిపించాయి. 2015లో జీవోనెం 105 ప్రకారం పాలమూరు–రంగారెడ్డిని వరద నీటితో చేపట్టిన ప్రాజెక్టుగా, 2022లో జీవోనెం.216 ప్రకారం నికర జలాలతో చేపట్టినట్లు చూపారని తెలంగాణను ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ ప్రశ్నించారు. అంతకు ముందు జూరాల నుంచి, ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి చేపట్టడాన్ని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ తరపు న్యాయవాది స్పందిస్తూ వరద నీటితో అనుమతులు రావనే నికర జలాలు కేటాయింపుతో చేపట్టినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కరించే బాధ్యతను అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగిస్తే అందుకు విరుద్ధంగా ట్రిబ్యునల్‌లో కేసు వేసిందని గుర్తుచేశారు. ఆ అధికారం అపెక్స్‌కు లేదంటూ ఏపీ వాదనలు నీటి పంపకాలు చేసే బాధ్యత అపెక్స్ కౌన్సిల్‌కు లేదని, ఒక్క. ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని ఏపీ వాదించింది. ఉమ్మడి ఏపీలోనే 2013 లోనే పాలమూరు ప్రాజెక్టును ప్రతిపాదించారని, తెలంగాణ ఏర్పడ్డాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని తెలంగాణ గుర్తు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ గంపగుత్తగా ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించిందని, ఇందులో ఏపీ 300 టీఎంసీలను బేసిన్ అవతలికి తరలిస్తోందని, బేసిన్ పారామీటర్ ప్రకారం 811 టీఎంసీల్లో 70 శాతం నీటిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనిపై ట్రిబ్యునల్ చైర్మన్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–89 ప్రకారం ప్రకారం కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచే అధికారం లేదని గుర్తు చేశారు. మరోవైపు ఏపీ వేసిన అఫిడవిట్‌పై తెలంగాణ వాదనలు వినిపించడానికి వీలుగా ట్రిబ్యునల్ విచారణను జూలై 12కు వాయిదా వేశారు. జూలై 12, 13, 14వ తేదీల్లో తెలంగాణ ఏపీ వేసిన అఫిడవిట్‌పై వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు. -
పునఃపంపిణీ కుదరదు.. తేల్చిచెప్పిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పునఃపంపిణీ చేయడం కుదరదని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2) తేల్చి చెప్పింది. నిర్దిష్టమైన కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుపై మాత్రమే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తెలంగాణ జారీ చేసిన జీవో రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్(ఐఏ)పై విచారణను వచ్చే నెల 13, 14న మరోసారి చేపడతామని పేర్కొంది. ఈ ఐఏపై ట్రిబ్యునల్ శుక్రవారం విచారణ జరిపింది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఎస్‌ఆర్‌డబ్ల్యూఏ)–1956 సెక్షన్–3, 5ల ప్రకారం ఇప్పటికే నీటిని పంపిణీ చేశామని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాల కేటాయింపులో తమ పరిధి పరిమితంగా ఉందని గుర్తు చేసింది. నిర్దిష్టంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని సంకేతాలిచ్చింది. తెలంగాణ సగం వాటా కోరడం చట్టవిరుద్ధం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షిస్తే న్యాయ ఉల్లంఘనకు పాల్పడినట్లే. అందుకే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కూడా ఆ తీర్పు జోలికి వెళ్లలేదని న్యాయ, సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో సగ భాగం కావాలని తెలంగాణ కోరడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యధాతథంగా కొనసాగుతాయని, అదనంగా కేటాయించిన 194 టీఎంసీలపైనే విచారణ చేస్తుందని వివరిస్తున్నారు. 194 టీఎంసీల కేటాయింపుపైనే విచారణ కృష్ణా జలాల పంపిణీకి 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంపిణీ చేస్తూ 1976 మే 27న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. కృష్ణా జలాల పునఃపంపిణీకి 2004 ఏప్రిల్ 2న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న ప్రాథమిక నివేదిక, 2013 నవంబర్ 29న తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. ఈ నివేదికలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో వాటిని కేంద్రం అమల్లోకి తేలేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు 811 టీఎంసీలను యధాతథంగా కొనసాగించింది. అదనంగా 65 శాతం లభ్యత ఆధారంగా 194 టీఎంసీలను కేటాయించింది. అంటే మొత్తం 1,005 టీఎంసీలను కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 1,005 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంచే బాధ్యతను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం అప్పగించింది. యధాతథంగా కొనసాగిస్తున్న 811 టీఎంసీలు పోను, ఇప్పుడు 194 టీఎంసీల పైనే విచారణ జరుపుతోంది. -
ఇక నీటి కేటాయింపుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులను జరపమని, ప్రాజెక్టుల వారీగా ఇప్పటికే నిర్దిష్ట కేటాయింపులు జరగని పక్షంలో ఆ మేరకు కేటాయింపులు మాత్రమే చేస్తామని బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 మరోసారి స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ) 1956లోని సెక్షన్ –3, 5 కింద కృష్ణా జలాల కేటాయింపులను ట్రిబ్యునల్ ఇప్పటికే ముగించిందని తెలిపింది. ఏపీ పున ర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపేందుకు పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయని ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్‌కుమార్ వెల్లడించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు జరుపుతూ 2022లో తెలంగాణ జారీ చేసిన జీవో నెం.246ను సవాలు చేస్తూ ఏపీ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్‌పై శుక్రవారం ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్–2 విచారణ నిర్వహించింది. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలు, కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల తరలింపులకు బదులుగా మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి పథకానికి తెలంగాణ కేటాయించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదనలు వినిపించగా, నీటి కేటాయింపులపై నిర్ణయాధికారం తమకు లేదని బ్రిజేష్ కుమార్ ఆయన వాదనలను తోసిపుచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌కు నిర్ణయాధికారం లేదని, కేవలం మధ్యవర్తి పాత్రపోషించాల్సి ఉంటుందని పున ర్విభజన చట్టంలోని సెక్షన్ 89ను ఉటంకిస్తూ ఏపీ న్యాయవాది పేర్కొనగా, అపెక్స్ కౌన్సిల్ విషయాన్ని ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయవచ్చు అని బ్రిజేష్ తెలిపారు. ప్రాజెక్టుల వారీ గా కేటాయింపులు జరపనిపక్షంలో ఆపరేషనల్ ప్రొ టోకాల్స్‌పై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదంటూ తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న చేతన్ పండిత్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏపీ ఆరోపణను తోసిపుచ్చిన తెలంగాణ న్యాయవాది మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ 89.15 టీఎంసీలను వినియోగిస్తున్నట్టు జీవోలో పేర్కొందని, వాస్తవానికి 175 టీఎంసీలను వాడుతోందని ఏపీ న్యాయవాది పేర్కొన్నారు. అయితే, 44టీఎంసీలను మాత్రమే మైనర్ ఇరిగేషన్ ద్వారా వాడుతున్నామని, మిగిలిన 45టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పునః కేటాయింపులు జరిపినట్టు తెలంగాణ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. కేఆర్ఎంబీ, కృష్ణా బోర్డుకు ఈ ప్రాజెక్టు డీపీఆర్‌లను తె లంగాణ సమర్పించలేదని ఏపీ చేసిన ఆరోపణను తెలంగాణ న్యాయవాది తోసిపుచ్చారు. ఇప్పటికే డీపీఆర్‌ను సమర్పించామని, పరిశీలన దశలో ఉందని అన్నారు. కాగా, పాలమూరు ఎత్తిపోతల పనులను కొనసాగిం చేందుకు ఇటీవల సుప్రీం కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. ప్రాజెక్టు తాజా పురోగతిపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. -
70 లేఖలు రాసినా స్పందన లేదు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని పలు అంశాల అమలు కోరుతూ 70కి పైగా లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలేదంటూ కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ లేఖలపై ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. గతంలో రాసిన 70 లేఖల జాబితాతో పాటు ఆ లేఖల్లోని ముఖ్యాంశాలను తాజాగా రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ నెల 24న కృష్ణా బోర్డు నిర్వహించనున్న రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో బోర్డు అధికారులను ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా తెలంగాణ ఈ లేఖను రాయడం విశేషం. వివరాలివీ... ► రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(8ఏ) ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పుతో పాటు అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలు తప్పనిసరి అని గుర్తు చేశారు. 20% జలాలను తాగునీటికి వినియోగించాలని కృష్ణా ట్రిబ్యునల్–1 పేర్కొనగా, నీటి లెక్కల్లో దీన్ని కృష్ణా బోర్డు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలంగాణ తప్పుబట్టింది. ► వాడుకోని వాటా జలాలను తెలంగాణ మరుసటి జల సంవత్సరానికి బదలాయింపు(క్యారీ ఓవర్) చేస్తుండగా, ఈ జలాలను మరుసటి ఏడాది తెలంగాణ వాటా జలాల కింద లెక్కించవద్దని చేస్తున్న విజ్ఞప్తులను కృష్ణా బోర్డు పట్టించుకోవడం లేదు. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని స్కీం–ఏ కేటాయింపుల కింద ‘క్యారీ ఓవర్’జలాలను మరుసటి సంవత్సరం వాడుకోవచ్చు. ► ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో జరిపిన కృష్ణా జలాల తాత్కాలిక కేటాయింపులను తెలంగాణ రాష్ట్రం ఇకపై ఏ మాత్రం అంగీకరించ దు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70శాతం హ క్కులున్నప్పటికీ 50:50 నిష్పత్తిలో తాత్కాలిక కే టాయింపులు జరపాలని ఎన్నో లేఖలు రాశాం. ► శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు విధివిధానాల(రూల్‌కర్వ్)రూపకల్పనలో సీడబ్ల్యూసీ వినియోగించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేఆర్ఎంబీ, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. శ్రీశైలం జలాశయంలో వాటాదారుడిగా రూల్‌కర్వ్ పరిశీలనల కోసం ఈ సమాచారం మాకు అవసరం. చెన్నై వాటర్ సప్లై ఒప్పందాల ప్రకారం..కేవలం 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో గల కాల్వ ద్వారా 15 టీఎంసీలను మాత్రమే తరలించడానికి హెడ్‌వర్క్స్ నిర్మించాలి, ఈ నిబంధన అమలుకు కేంద్రం తనిఖీలు జరపాల్సి ఉంది. ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారం కూడా కావాలి. ఈ నిబంధన మేరకు రూల్‌కర్వ్‌ను సవరించాలి. ► గోదావరి ట్రిబ్యునల్ ఒప్పందంతో పాటు పోల వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతు లప్రకారం.. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టా సిస్టం వాటాలో 80 టీఎంసీలను తగ్గించాలి. దీనికి విరుద్ధంగా సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌కర్వ్‌లో నాగార్జునసాగర్నుంచి కృష్ణా డెల్టా సిస్టంకు జరిపిన కేటాయింపులను తొలగించాలి. ► బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు తగ్గట్టుగా శ్రీశైలంలో 76:24 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలు విద్యుదుత్పత్తి చేసుకునేందుకు వీలుకల్పించేలా రూల్‌కర్వ్‌ను సవరించాలి. తెలంగాణ పరిధిలోని బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు 160 టీఎంసీలను కేటాయించడంతో పాటు శ్రీశైలం నుంచి బేసిన్ వెలుపలి అవసరాలకు ఏపీ చేస్తున్న తరలింపులను 34 టీఎంసీలకు పరిమితం చేసేలా రూల్‌కర్వ్‌ను సవరించాలి. ► పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్తో అనుసంధానమై ఉన్న అన్ని కాల్వలకు రియల్ టైం డేటా అక్విసైషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి నీటి తరలింపులను కచ్చితంగా లెక్కించాలి. శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ జరపాలి. ఇదీ చదవండి: అదేమో గానీ.. పార్టీని మాత్రం ఎవరూ కాపాడలేరు -
‘కృష్ణా’లో మా వాటా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను ఖరారు చేసే అంశాన్ని తక్షణమే కృష్ణా ట్రిబ్యునల్–2కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 (3) (4) కింద జల వివాదాలను నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్‌కు అప్పగించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకు న్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. ఈ విషయంలో విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంతో సహా ఏ అథారిటీకి అధికారం లేదంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956లోని సెక్షన్–3 కింద 2014 జూలై 14న ఏపీపై చేసిన ఫిర్యాదును దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంచడం.. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా హక్కులను తెలంగాణకు నిరాకరించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 574.6 టీఎంసీలు కేటాయించాలి కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తూ 2015లో తీసుకున్న తాత్కాలిక నిర్ణయం ఆధారంగానే ఇప్పటికీ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రా లకు కేటాయింపులు చేయడంపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్లో సాగు విస్తీర్ణం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి 574.6 టీఎంసీలను కేటాయించాలని కోరినా బోర్డు పట్టించుకోవడం లేదంది. ఈ అంశం తమ పరిధిలో లేదని, ట్రిబ్యునల్ మాత్రమే సమీక్షించగలదని బోర్డు పేర్కొందని వెల్లడించింది. ట్రిబ్యునల్‌కు అప్పగించండి: సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ఫిర్యాదును ట్రిబ్యునల్‌కు అప్పగించాలని 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేసును ఉపసం హరించుకున్నామని తెలంగాణ తెలిపింది. న్యాయ సల హా మేరకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలా లేదా కృష్ణా ట్రిబ్యునల్–2కు బాధ్యత అప్పగించాలా అనే అం శంపై నిర్ణయిస్తామని అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిందని గుర్తు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 రద్దు కానందున తెలంగాణ ఫిర్యాదును దీనికే అప్పగించడం సముచితమని అభిప్రాయపడింది. కృష్ణా జలాల్లో తమ చట్ట బద్ధ హక్కులనే కోరామని.. ఇతర రాష్ట్రాల హక్కులు, ప్ర యోజనాలకు భంగం కలుగుతుందని భావించొద్దని స్ప ష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి పరిమితులుండటంతోనే ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టం కింద ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాలు జరుపుతూ కృష్ణా ట్రిబ్యునల్–2 జారీ చేసిన మధ్యంతర నివేదికలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, కర్ణాటక, మహారాష్ట్రల ప్రయోజనాలకు ఈ కేసుతో నష్టం ఉండదని అభిప్రాయపడింది. -
నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్ విచారణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేసే ప్రక్రియపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 మంగళవారం నుంచి మూడురోజులు ఢిల్లీలోని కార్యాలయంలో విచారణ నిర్వహించనుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సాక్షుల విచారణను పూర్తి చేసింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ తరఫున సాక్షులను విచారిస్తుంది. ఈ విచారణ అనంతరం ట్రిబ్యునల్ తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కృష్ణానదిలో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా ఉన్న 2,060 టీఎంసీలు, పునరుత్పత్తి ద్వారా 70 టీఎంసీలు.. వెరసి 2,130 టీఎంసీల్లో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–1 పంపిణీ చేసింది. ఈ అవార్డు గడువు ముగియడంతో కృష్ణానది జలాలను పునఃపంపిణీ చేయాలని నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోరడంతో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 మేరకు 2004 ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ–2 ఏర్పాటు చేశారు. మూడు రాష్ట్రాల వాదనలను విన్న కేడబ్ల్యూడీటీ–2.. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపులను కొనసాగిస్తూనే.. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య ఉన్న 448 టీఎంసీల్లో మహారాష్ట్రకు 81, కర్ణాటకకు 177, ఉమ్మడి ఏపీకి 190 టీఎంసీలను కేటాయిస్తూ 2010 డిసెంబర్ 30న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పి) దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసింది. వీటిపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా.. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేసే బాధ్యతను కేడబ్ల్యూడీటీ–2కి అప్పగిస్తూ, దాని కాలపరిధిని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడంపై కేడబ్ల్యూడీటీ–2.. 2014 నుంచి విచారణ నిర్వహిస్తోంది. -
మినిట్స్ వచ్చేదాకా... వేచిచూద్దాం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతూ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్–3 కింద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణపై ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంబించనుంది. మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు అధికారికంగా మినిట్స్ రూపంలో వెలువడ్డాక... దానిలో కేంద్రం ఇచ్చే హామీల ఆధారంగానే పిటిషన్ ఉపసంహరించుకోవాలనే యోచనలో ఉంది. సెక్షన్–3 కింద దాఖలు చేసుకున్న పిటిషన్‌ను రాష్ట్రం ఉపసంహరించుకుంటే తెలంగాణ వినతిని కొత్త ట్రిబ్యునల్‌కు లేక ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్‌కు రిఫర్ చేస్తామని స్పష్టమైన హామీ పొందాకే ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అవసరాలపై వాదనలు వినిపించే అవకాశం రాలేదు. పరవాహకం, ఆయకట్టు ఆధారంగా చూసినా రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాల్సి ఉంది. ఈ దృష్ట్యా కృష్ణా జలాల్లో న్యాయం జరిగేలా కొత్త ట్రిబ్యునల్‌తో పునః విచారణ చేయించండని రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే సెక్షన్–3ను ప్రస్తావిస్తూ కేంద్రాన్ని కోరింది. దీనిపై ఏడాదిలోగా నిర్ణయం చేయాల్సి ఉన్నా కేంద్రం ఇంతవరకూ స్పందించలేదు. ఏడాది వేచిచూశాక ఈ అంశంపై తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదే విషయాన్ని అపెక్స్ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన షెకావత్ సెక్షన్–3పై సుప్రీంలో పిటిషన్ ఉన్నందున... ట్రిబ్యునల్‌కు రిఫర్ చేసే అంశం న్యాయ పరిధిలోకి వస్తుందని, తెలంగాణ పిటిషన్ ఉపసంహరించుకుంటే న్యాయ సలహా మేరకు కొత్త ట్రిబ్యునల్ లేదా ప్రస్తుత ట్రిబ్యునల్‌తో విచారణ చేయించేలా నిర్ణయం చేస్తామని హామీ ఇచ్చారు. అపెక్స్ భేటీ అనంతరం మీడియా సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. బుధవారమే కేసు విత్‌డ్రా చేసుకుంటానని తెలంగాణ సీఎం చెప్పారంటూ షెకావత్ ప్రకటించారు. ఈ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకుంటుందా? అన్న దానిపై అందరి దృష్టి పడింది. అయితే దీనిపై అధికారవర్గాలను కదిలించగా అపెక్స్‌లో కేంద్రం ఇచ్చిన హామీ అధికారికంగా మినిట్స్ రూపంలో రాష్ట్రానికి అందాల్సి ఉందని, అందులో విస్పష్టమైన హామీ ఉంటే పిటిషన్ ఉపసంహరణకు అభ్యంతరమేమీ లేదని తేల్చిచెప్పారు. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గోదావరి ట్రిబ్యునల్‌పై మౌనమే? ఇక, గోదావరి నదీ జల వివాదాల పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఇరురాష్ట్రాల నుంచి వినతులు వస్తే ఏడాదిలోపు నిర్ణయం చేస్తామని కేంద్రమంత్రి షెకావత్ వెల్లడించారు. అయితే గోదావరిలో నీటి వినియోగం, వాటాలకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ అంటోంది. నికర జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందని, ఆ వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని చెబుతోంది. నికర జలాల వాటా 65 శాతం ఉండగా అదే నిష్పత్తిలో వరద జలాలను వినియోగించుకుంటామని అంటోంది. ఈ లెక్కన ఏడాదిలో గోదావరిలో సగటున 3 వేల టీఎంసీల వరద ఉన్నా తెలంగాణకు 1900 టీఎంసీల మేర వరద జలాలపై హక్కు ఉంటుందని చెబుతోంది. గోదావరిలో నీటి వాటాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికే స్పష్టంగా చెప్పినందున కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుతూ ఎలాంటి లేఖలు రాయబోమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా బోర్డుల పరిధిని నోటిఫై చేస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కృష్ణా (కేఆర్ఎంబీ), గోదావరి (జీఆర్ఎంబీ) నదీ జలాల యాజమాన్య బోర్డులు బుధవారం సమావేశమై వర్కింగ్ మాన్యువల్‌పై చర్చించాయి. -
‘పాలమూరు’పై కర్ణాటక పేచీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై కర్ణాటక పేచీకి దిగుతోంది. కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు ఇప్పటికే ఫిర్యాదు చేసిన కర్ణాటక, తాజాగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం చెన్నైలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్లో దీనిపై చర్చించాలని డిమాండ్ చేసింది. కర్ణాటక ఫిర్యాదు పై స్పందించిన హోంశాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల కౌన్సిల్ సెక్రటేరియట్ దీనిపై చర్చించేందుకు అనుమతిస్తూనే, దీనిపై వివరణ కోరింది. మిగులును చూపించి చర్చకు.. ‘కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–2 నవంబర్ 29, 2013న ఇచ్చిన తుది ఉత్తర్వుల ప్రకారం మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఇవ్వలేదు. సముద్రంలోకి వృథాగా వెళ్లే మిగులు జలాలను దిగువ రాష్ట్రంగా వాడుకునే హక్కును ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. అదే సమయంలో ఎగువ రాష్ట్రా లైన కర్ణాటక, మహారాష్ట్రకు మిగులు జలాలు వాడుకునే హక్కులు ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం సైతం ఎగువ రాష్ట్రమైనందున దానికి సైతం మిగులు జలాలు వాడుకునే హక్కు లేదు’అని కర్ణాటక తెలిపింది. ఈ దృష్ట్యా మిగులు జలాలపై ఆధారపడి పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టరాదని కేంద్రానికి తెలిపింది. -
కృష్ణా బేసిన్లో అప్పుడే నీటి పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: వేసవికి ముందే కృష్ణాబేసిన్‌లో నీటి పంచాయితీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ ఏడాది కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల కంటే దిగువకు వెళ్లి నీటిని తోడుకునే యత్నాలు ప్రారంభమైనట్లు కనబడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతుండటం, తాగు, సాగు నీటి అవసరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రతిపాదనలు బోర్డు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూర్చేలా బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సాగు, తాగు అవసరాలకు గాను 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరింది. ఇందుకు అవసరమైతే కనీస నీటి మట్టాలకు వెళ్లాలని సూచన చేసింది. దీన్ని కృష్ణాబోర్డు పరిగణనలోకి తీసుకుంటే ఇక్కట్లు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అడుగంటుతున్న జలాలతో .. బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నిల్వలు ఊహించని రీతిలో పడిపోయాయి. ఇక్కడ 885 అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 835.50 అడుగుల మట్టంలో 55.67 టీఎంసీల మేర నిల్వలున్నాయి. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 863.70 అడుగుల మట్టంలో 117.77 టీఎంసీల మేర నిల్వలు ఉండగా, ఈ ఏడాది సగానికి పైగా నిల్వలు తగ్గిపోయాయి.శ్రీశైలం కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా, ప్రస్తుతం కనీస మట్టాలకు ఎగువన లభ్యత కేవలం 2 టీఎంసీలకు మించి లేదు. ఇక నాగార్జున సాగర్‌లో 590 అడుగులకు గానూ 537.70 అడుగుల్లో 183.57 టీఎంసీలుండగా, ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 55 టీఎంసీల మేర నిల్వ ఉంది. ప్రస్తుతం సాగర్ కింద మే నెల చివరి వారం వరకు 48 టీఎంసీల మేర నీటి అవసరాలున్నాయి. మరో 13 టీఎంసీల నీటిని తెలంగాణ అవసరాల కోసం రిజర్వ్ చేసి పెట్టారు. ఈ నేపథ్యంలో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీరు ఇరు రాష్ట్రాల అవసరాలను తీర్చేలా లేదు. ఈ సమయంలో తమ రాష్ట్రంలో 58.6 శాతం లోటు వర్షపాతం ఉందని, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 4.54లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి, మిర్చి పంటలకు నీరివ్వడంతో పాటు, తాగునీటి అవసరాల దృష్ట్యా సాగర్ కుడి కాల్వ కింద 5 టీఎంసీలు తక్షణం కేటాయించాలని ఏపీ కోరింది.. తమకు ఇదివరకే 33.40 టీఎంసీల నీటిని బోర్డు కేటాయించగా, అందులో 22.32 టీఎంసీల నీటినే వినియోగించుకున్నామని, మరో 11.18 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉందని, ఇందులోంచే తమకు 5 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు బోర్డుకు బుధవారం లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన కోరినంత మేర నీటి నిల్వలు లేనట్టయితే దిగువకు వెళ్లయినా నీటిని కేటాయించాలని అందులో కోరారు. దీనిపై తెలంగాణ వివరణ తీసుకున్న అనంతరం బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. ఒక్కసారి కనీస నీటి మట్టాలకు దిగువ నుంచి నీటిని తోడటం మొదలు పెడితే జులై, ఆగస్టు నెలల్లో ఇరు రాష్ట్రాల తాగునీటికి కటకట తప్పదని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి. -
సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా ట్రిబ్యునల్ నదీపరివాహం గల నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని సుప్రీంకోర్టులో ఇటీవల ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. నాలుగు రాష్ట్రాలు కాకుండా తెలుగు రాష్ట్రాల వాదనలు సరిపోతాయన్న ట్రిబ్యునల్ తీర్పును న్యాయస్థానం సమర్థించింది. గతంలో ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. కోర్టు నిర్ణయంతో కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు యధావిధిగా కొనసాగనున్నాయి. -
‘కృష్ణా’ పంపిణీపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంచే అంశంపై కృష్ణా ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ మార్చి 23కు వాయిదా పడింది. పునర్వ్యవస్థీకరణ చ ట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి రా ష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను 2 కొత్త రాష్ట్రాల మధ్య పంచాలని ఇటీవల కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వెలువ రించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలు తమ అభిప్రా యాలు, అభ్యంతరాలు, వివరణల ను స మర్పించాలని ఆదేశించింది. అయితే 2 రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన రాకపో వడంతో మార్చి 20లోపు వాటిని దాఖలు చేయాలంటూ ట్రిబ్యునల్ ఆదేశించింది. -
మళ్లీ ట్రిబ్యునల్‌కే!
♦ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అఫిడవిట్ దాఖలు చేయనున్న రాష్ట్రం ♦ ఈ నెల 23 నుంచి ట్రిబ్యునల్ సమావేశాలు ♦ ఆలోగా అఫిడవిట్ వేసేందుకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ట్రిబ్యునల్‌నే ఆశ్రయించనుంది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యా యాన్ని వివరిస్తూనే.. వాటిని సవరించాల్సిన ఆవశ్యకతను అఫిడవిట్ రూపంలో తెలిపే అవ కాశం ఉంది. ఈనెల 23 నుంచి ట్రిబ్యునల్ సమా వేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్ దాఖలు చేసే అవకాశాలు న్నట్లు నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్రాన్ని 2014లోనే ఆశ్రయించినా.. నీటి కేటాయింపుల్లో తమకు జరిగిన అన్యాయా న్ని సవరించాలంటూ రాష్ట్రం 2014లో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం చేసిన అభ్యర్థనపై సెక్షన్ 3 ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉన్నా అలా చేయలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బీ)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. అయితే తెలంగాణ అవసరాలను, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని విచార ణ చేయాలని కేంద్రం స్పష్టంగా సూచించనం దున రాష్ట్రానికి ట్రిబ్యునల్ న్యాయం చేయలేదు. దీంతో రాష్ట్రం 2015లోనే సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని అప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో కోర్టు జతపరిచింది. దీనిపై విచారణ జరుగుతుండగానే బ్రిజేశ్ ట్రిబ్యునల్.. నదీ జలాల కేటాయింపులను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ గతేడాది అక్టోబర్ 19న తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించిన తెలంగాణ ఎస్ఎల్పీ దాఖలు చేసింది. తాజాగా న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఇక ప్రధాన పిటిషన్ల విచారణపైనే తెలంగాణ ఆశలు పెట్టుకుంది. ఇక అఫిడవిట్ ఇవ్వాల్సిందే.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తన తీర్పు సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని తెలంగాణ, ఏపీలకు సూచించింది. అయితే సుప్రీంలో వేసిన ఎస్ఎల్పీని దృష్టిలో ఉంచుకొని అఫిడవిట్ దాఖలుకు గడువు కోరగా... అందుకు ట్రిబ్యునల్ ఇప్పటిదాకా సమ్మతిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఎస్ఎల్పీని కొట్టి వేసినందున కచ్చితంగా అఫిడవిట్ సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
సచివాలయం అప్పగింతపై మంత్రివర్గ ఉపసంఘం
- దాని నివేదికను బట్టి నిర్ణయం - కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహారాల పరిశీలనకు మరో సంఘం - పలు సంస్థలకు భారీగా భూకేటాయింపులు - మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉపసంఘం ఇచ్చిన నివేదికను బట్టి భవనాల అప్పగింతపై నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వ్యవహారాలపై చర్చించేందుకు మరో ఉపసంఘాన్ని నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు వెల్లడించారు. ► హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలను అప్పగించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంపై చర్చ. ఏపీ సచివాలయ తరలింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, దీంతోపాటు పునర్విభజన చట్టం ప్రకారం అప్పగింత వల్ల చట్టప్రకారం ఎదురయ్యే సమస్యలను పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలి. కమిటీ సభ్యులు, దాని గడువుపై త్వరలో జీఓ జారీ చేయాలని నిర్ణయం. ► కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహారాలను చర్చిం చేందుకు మరో ఉపసంఘం ఏర్పాటు. ► మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకుని 2005-2010 విధానం ప్రకారం ఏర్పాటైన 62 టెక్స్టైల్ పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ యూనిట్‌కు 0.75 పైసల నుంచి రూపాయికి పెంపు. 2010-15 విధానం ప్రకారం ఏర్పడిన 32 స్పిన్నింగ్ మిల్లులు బాగా నష్టాల్లో ఉండడంతో 0.75 పైసలున్న విద్యుత్ సబ్సిడీ రెండు రూపాయలకు పెంపు. ► పశుగ్రాస అభివృద్ధి విధానం 2016-2020కి రూపకల్పన. రాష్ట్రంలోని గొర్రెల పెంపకందారులు, ఉత్పత్తిదారుల కోసం ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ మిత్ర ఫెడరేషన్’ ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక చేయూత. రైతు ఉత్పత్తిదారుల సంస్థల, గొర్రెల పెంపకందార్లకు బ్యాంకు రుణాలిచ్చేందుకు వంద జీవాలు ఒక యూనిట్‌గా రెండు లక్షలకు మించకుండా 50 శాతం సబ్సిడీ, మిగిలిన సొమ్ముకు పావలా వడ్డీతో రుణం మంజూరు. ► ఉడా (విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో భూసమీకరణ పథకం నిబంధనలు-2016 రూపకల్పన, అమలుకు ఆమోదం. ► మరో నాలుగు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్, ఆర్ ఎస్ ట్రస్ట్ (వెల్‌టెక్), వరల్డ్ పీస్ యూనివర్సిటీ (మహారాష్ట్ర అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్), గ్రేట్ లేక్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం. ► విజయవాడలో భవానీ ఐల్యాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) ఏర్పాటుకు ఆమోదం. ► విశాఖ జిల్లా మాకవారిపాలెం మండలం రామన్నపాలెంలో వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఫ్రిజీరియో కన్జర్వా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 115 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఏపీఐఐసీకి అనుమతి. ఈ భూముల్లో రెండు దశల్లో రూ.160 కోట్లతో కాంప్లెక్స్ నిర్మాణం. ► వివిధ శాఖల్లో కొత్తగా 500 పోస్టుల మంజూరు, పదోన్నతికి అంగీకారం. దీంతో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 21.70 కోట్ల భారం పడుతుంది. ► సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా పాటించాలని కేంద్రం నిర్ణయించడంపై హర్షం. భారీ భూకేటాయింపులు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎప్పటి మాదిరిగానే భారీగా భూకేటాయింపులు చేసేందుకు మంత్రివర్గ ఆమోదించింది. ► విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో 78 ఎకరాలను ఎకరం 8 లక్షల చొప్పున ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి కేటాయింపు. ► ఏపీఐఐసీకి ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కోసం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలోఎకరాకు రూ. 18 లక్షల చొప్పున చెల్లించేలా 129.99 ఎకరాల భూమి కేటాయింపు. ► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలోని ఆముదాలపాడులో ఏపీజెన్కోకు చెందేలా దామోదర సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించిన అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం 4.96 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ. 10.25 లక్షలు, ముతుకూరు మండలంలోని పిడతపోలూరులో ధర్మల్ స్టేషన్‌కు అప్రోచ్ రోడ్ కోసం 3.29 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం రూ.10.25 లక్షలకు, ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం గ్రామంలో అప్రోచ్ రోడ్ కోసం 1.12 ఎకరాల భూమిని ఎకరం రూ. 10.25 లక్షలు, నేలటూరు గ్రామంలో 13.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం రూ. 9.75 లక్షలకు కేటాయింపు. ► సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ వారికి సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు గుంటూరు నగరంలో 400 చ.గ స్థలం లక్ష రూపాయలకు కేటాయింపు. ► చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పేందుకు 69.03 ఎకరాలు (67.40 ఎకరాల డీకేటీ భూమి, 1.63 ఎకరాల ప్రభుత్వ భూమి) ఎకరం రూ. 5 లక్షల చొప్పున చెల్లించేలా జీఓ నెం. 155 (19-4-2016) మేర కేటాయించేందుకు ఆమోదం. ► చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం శ్రీనివాసపురం, చిందేపల్లి, పంగూరు గ్రామాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటుకు 255.09 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ నిర్ణయం. ► అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రంలో తాడిపత్రి మున్సిపాలిటీకి సమగ్ర మంచినీటి సరఫరా మెరుగుదల పథకానికి 23 ఎకరాల భూమిని మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ. 3.50 లక్షల చొప్పున కేటాయింపు. ► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో రోజుకు మూడు వేల టన్నుల సామర్థ్యంతో చక్కెర శుద్ధి కర్మాగారం స్థాపన కోసం నెక్కంటి మెగా ఫుడ్ పార్క్‌కు 52.22 ఎకరాలు కేటాయింపు. -
పదేపదే కోరుతున్నా డీపీఆర్‌లు ఇవ్వరేం?
-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై కృష్ణా బోర్డు ఆగ్రహం -ఆర్డీఎస్, పాలమూరు, డిండి డీపీఆర్‌లు తక్షణమే ఇవ్వాలని ఆదేశం -దీనిపై ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి లేఖలు -ఒక్కో డీపీఆర్‌కు సంబంధించి నాలుగేసి కాపీలు ఇవ్వాలని సూచన -కృష్ణా బేసిన్లో 47 చోట్ల టెలిమెట్రీ విధానం అమలుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది వరద జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను పదేపదే కోరుతున్నా ఇరు రాష్ట్రాలు సమర్పించకపోవడంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజోలిబండ మళ్లింపు పథకానికి (ఆర్డీఎస్) సంబంధించి ఏపీ.., పాలమూ రు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు ఎందుకు సమర్పించడంలేదని ప్రశ్నించింది. తక్షణమే వాటిని సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అపెక్స్ భేటీ నిర్వహించాలన్నా, కేంద్ర జలవనరులశాఖ, కేంద్ర జల సంఘానికి తాము వివరణ ఇవ్వాలన్నా డీపీఆర్‌లే ప్రధానమని తెలిపింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ శనివారం ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. కృష్ణా జలాల వినియోగంపై పర్యవేక్షణకు ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వివరాలు తమ వద్ద ఉండాలని.. అందుకే డీపీఆర్‌లను కోరుతున్నామన్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు నీటి వినియోగంపై పరస్పర ఫిర్యాదులు చేశాయని, ఇందులో వాస్తవాలు తేల్చాలంటే ఒక్కో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను నాలుగేసి కాపీల చొప్పున సమర్పించాలని సూచించారు. 47 చోట్ల టెలిమెట్రీ విధానం... కృష్ణా నదీ జలాల వినియోగం, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో తేడా రాకుండా నాగార్జున సాగర్, శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద టె లిమెట్రీ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైన బోర్డు...వాటిని ఎక్కడెక్కడ అమర్చాలన్న దానిపై స్పష్టతకు వచ్చింది. మొత్తంగా 47 చోట్ల టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇరు రాష్ట్రాలకు పంపింది. జూరాలపై భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఆఫ్ టేక్, జూరాల ఎడమ, కుడి కాల్వలు, తుంగభద్రపై ఆర్డీఎస్, కేసీ కెనాల్, పోతిరెడ్డిపాడు, గురు రాఘవేంద్ర ఆఫ్ టేక్, శ్రీశైలం వద్ద ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, హంద్రీనీవా, ముచుమర్రి, వెలిగొండ, ఎస్ఆర్బీసీ, గాలేరు-నగరి, బంకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలిగోడు, సోమశిల, కండలేరు, పూండిల వద్ద, సాగర్‌లో ఎన్‌ఎస్‌ఎల్‌సీ, ఏఎంఆర్పీ, ఎన్ఎస్ఆర్సీ, పులిచింతల స్లూయిజ్, పవర్‌హౌస్, మూసీ, పాలేరు, మున్నేరు నదీ ప్రాంతాలు, వెంకటాపురం పంపింగ్ స్టేషన్, గుంటూరు చానల్, ప్రకాశం బ్యారేజీ వద్ద 5 చోట్ల పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తే ఈ ఏడాది నుంచే నీటి ప్రవాహ లెక్కలను పక్కగా తేలుస్తామని, దీని ఆధారంగా వినియోగం, పంపకాలపై నిర్దిష్ట అంచనాకు వస్తామని తెలిపింది. పోతిరెడ్డిపాడు వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు.. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం వాటాకు మించి ఎక్కువగా కృష్ణా జలాలను తరలించుకుపోతోందని, దీనిపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) భాగంగా రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల పూర్తికి ఈ నెల 6న ఢిల్లీలో నాబార్డ్‌తో కేంద్రం కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి టి.హరీశ్‌రావు ఈ అంశాన్ని కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. నీటి వినియోగ లెక్కలపై టెలిమెట్రీ విధానం అమల్లోకి వచ్చే వరకు నీటి వినియోగం వాటాల మేరకే జరిగేలా చూడాలని కోరనున్నారు. -
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ఆగస్టు16కి వాయిదా
-
కృష్ణాబోర్డు నిర్ణయం చట్ట వ్యతిరేకం
ప్రాజెక్టుల నియంత్రణ నోటిఫికేషన్ సరికాదు: తుమ్మల సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ జారీ చేయడం విభజన చట్టానికి విరుద్ధమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బోర్డు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలొగ్గే కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నియంత్రణపై లేని అధికారాలను ప్రయోగిస్తోందని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి తుమ్మల మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు కేటాయించిన నీళ్లను వాడుకోలేకపోవడం వల్లే తెలంగాణ జిల్లాలు కరువుతో అల్లాడుతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన కేటాయింపుల మేరకే ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నామన్నారు. తెలంగాణ అభిప్రాయానికి భిన్నంగా కృష్ణా బోర్డుకు లేని అధికారాన్ని జోడించి.. సున్నితమైన అంశాన్ని మరింత జటిలం చేసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీ ప్రభుత్వం, ఆ ప్రాంత ప్రజలు నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కృష్ణా బోర్డు నోటిఫికేషన్ విషయమై సోమవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరుల శాఖమంత్రిని కలసి వాస్తవాలు వివరిస్తామన్నారు. అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరా: పొంగులేటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కర్నూలులో దీక్ష చేపట్టినందు వల్లే తాను ఆ పార్టీని వీడానని, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తపన చూసి టీఆర్ఎస్లో చేరానని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. తాను కాంట్రాక్టర్‌గా పనిచేసి సంపాదించిన సొమ్ముకు నిజాయితీగా పన్ను కట్టానని... ఏ పనీ చేయకుండా కాంగ్రెస్ నాయకులు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మధిర నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కోరితేనే సీఎం కేసీఆర్ అక్కడికి వస్తానని చెప్పారని... కేసీఆర్‌పై భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ విమర్శల్లో ఎంత విశ్వసనీయత ఉందో ముందు తెలుసుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు. -
మా వాటా మాకు దక్కాలి
కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వాదనలు సాక్షి, న్యూఢిల్లీ: ఇకనైనా తమ వాటా దక్కని పక్షంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రయోజనం లేదని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-2 ముందు కుండ బద్దలు కొట్టి చెప్పింది. గత పాలకులు చూపిన వివక్షతో కృష్ణా నదీ జలాల్లో సరైన వాటా పొందలేకపోయామని నివేదించింది. కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ జరుపుతున్న విచారణలో భాగంగా మూడో రోజు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ బుధవారం కూడా వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపకాలు జరగాలని పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89లో పేర్కొనలేదని అన్నారు. సెక్షన్ 89ను ఏపీ, తెలంగాణ మధ్య సమస్యగా చూడటం సరికాదన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని సెక్షన్ 89లో పేర్కొన్నారని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఎగువ రాష్ట్రాలు అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మించడంతోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని వివరించారు. ఎగువ రాష్ట్రాలు తాగు, సాగునీటి అవసరాలకే కాకుండా విద్యుదుత్పత్తి కోసం, ఇతర అవసరాల కోసమూ కృష్ణా జలాలను వినియోగిస్తున్న సంగతిని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలే శరణ్యమయ్యాయని, ఇప్పుడు నీటి వాటాలో కూడా అన్యాయం జరిగితే రాష్ట్రం ఎడారిగా మారుతుందన్నారు. ఎగువ రాష్ట్రా ల్లో పడిన వర్షాలే కింద ఉన్న తెలుగు రాష్ట్రాలకు దిక్కని గుర్తుచేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతలో ఏపీ భూభాగం 9 శాతమే అయినా కృష్ణా నీటిలో 22.4% పొందుతోంద ని, తెలంగాణ భూభాగం 12% ఉన్నా 6% నీళ్లు కూడా రావడం లేదన్నారు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు అతి తక్కువ సాగునీరు లభిస్తోందని తెలిపారు. వాదనలు కొనసాగించేందుకు సమయం కోరడంతో అందుకు అంగీకరించిన ట్రిబ్యునల్ తదుపరి విచారణను జూలై 8, 9, 14, 15 తేదీలకు వాయిదా వేసింది. -
ఏడాది తర్వాత మళ్లీ కృష్ణా ట్రిబ్యునల్ వాదనలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ వివాద పరిష్కారానికి ఏర్పాటైన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాదాపు ఏడాది తర్వాత మళ్లీ భేటీ కానుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర వాదనలూ విననుంది. ఈ విషయమై తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ట్రిబ్యునల్ అధికారులు సమాచారం పంపారు. గత ఏడాది మార్చి 30న ట్రిబ్యునల్ చివరిసారి సమావేశమైంది. తదనంతరం ట్రిబ్యునల్ సమావేశం జరిగే గదిలో షార్ట్‌సర్క్యూట్ కావడం, కీలక ఫైళ్లన్నీ దగ్ధం కావడంతో అప్పటి నుంచి సమావేశాలు ఎక్కడ జరపాలన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. దీనికి తోడు జూన్ 30న బోర్డులోని సభ్యుడు జస్టిస్ డీకే సేథ్ ట్రిబ్యునల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సభ్యుడిని నియమించారు. విచారణలో భాగస్వామిగా ఉన్న కర్ణాటకకు చెందిన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని సభ్యునిగా నియమించడంపై తెలంగాణ, ఏపీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని కొనసాగించేందుకే కేంద్రం మొగ్గు చూపింది. పునఃకేటాయింపులకు రాష్ట్రం పట్టు.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బి)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరపాలన్నది ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. నదీ జలాల వివాదానికి సంబంధించి మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు పునఃపంపకం చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరుతోంది. కృష్ణా జలాల వివాదాన్ని ఏపీ, తెలంగాణ మధ్య పంచాయితీగా చూడరాదని, కృష్ణా నది నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లోనూ నాలుగు రాష్ట్రాలు భాగస్వాములుగా అవుతాయనే విషయాన్ని మరోమారు ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది. -
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ఈ నెల 30 కి వాయిదా
ఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్ పై కేసు విచారణ ఈ నెల 30 వ తేదీకి వాయిదా పడింది. కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ లో ఖాళీగా ఉన్న సభ్యుల పోస్టులను భర్తీ చేయాలని గతంలో న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. ఆ విషయమై టిబ్యునల్ సభ్యునిగా జస్టిస్ రామ్మోహన్ రెడ్డిని నియమించనున్నట్టు కేంద్రం తరపు న్యాయవాది సుప్రీం కు తెలిపారు. సభ్య రాష్ట్రాలతో చర్చించి ఈ ప్రక్రియను వారం లోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.