ప్రాజెక్టుల నియంత్రణ నోటిఫికేషన్ సరికాదు: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ జారీ చేయడం విభజన చట్టానికి విరుద్ధమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బోర్డు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలొగ్గే కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నియంత్రణపై లేని అధికారాలను ప్రయోగిస్తోందని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి తుమ్మల మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు కేటాయించిన నీళ్లను వాడుకోలేకపోవడం వల్లే తెలంగాణ జిల్లాలు కరువుతో అల్లాడుతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన కేటాయింపుల మేరకే ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నామన్నారు. తెలంగాణ అభిప్రాయానికి భిన్నంగా కృష్ణా బోర్డుకు లేని అధికారాన్ని జోడించి.. సున్నితమైన అంశాన్ని మరింత జటిలం చేసుకోవద్దని ఆంధ్రప్రదేశ్కు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీ ప్రభుత్వం, ఆ ప్రాంత ప్రజలు నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కృష్ణా బోర్డు నోటిఫికేషన్ విషయమై సోమవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరుల శాఖమంత్రిని కలసి వాస్తవాలు వివరిస్తామన్నారు.
అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరా: పొంగులేటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కర్నూలులో దీక్ష చేపట్టినందు వల్లే తాను ఆ పార్టీని వీడానని, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తపన చూసి టీఆర్ఎస్లో చేరానని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. తాను కాంట్రాక్టర్గా పనిచేసి సంపాదించిన సొమ్ముకు నిజాయితీగా పన్ను కట్టానని... ఏ పనీ చేయకుండా కాంగ్రెస్ నాయకులు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మధిర నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కోరితేనే సీఎం కేసీఆర్ అక్కడికి వస్తానని చెప్పారని... కేసీఆర్పై భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ విమర్శల్లో ఎంత విశ్వసనీయత ఉందో ముందు తెలుసుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు.
కృష్ణాబోర్డు నిర్ణయం చట్ట వ్యతిరేకం
Published Mon, Jun 6 2016 3:58 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM
Advertisement
Advertisement