సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేసే ప్రక్రియపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 మంగళవారం నుంచి మూడురోజులు ఢిల్లీలోని కార్యాలయంలో విచారణ నిర్వహించనుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సాక్షుల విచారణను పూర్తి చేసింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ తరఫున సాక్షులను విచారిస్తుంది. ఈ విచారణ అనంతరం ట్రిబ్యునల్ తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కృష్ణానదిలో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా ఉన్న 2,060 టీఎంసీలు, పునరుత్పత్తి ద్వారా 70 టీఎంసీలు.. వెరసి 2,130 టీఎంసీల్లో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–1 పంపిణీ చేసింది.
ఈ అవార్డు గడువు ముగియడంతో కృష్ణానది జలాలను పునఃపంపిణీ చేయాలని నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోరడంతో అంతర్‌రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 మేరకు 2004 ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ–2 ఏర్పాటు చేశారు. మూడు రాష్ట్రాల వాదనలను విన్న కేడబ్ల్యూడీటీ–2.. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపులను కొనసాగిస్తూనే.. 75 శాతం, 65 శాతం లభ్యత మధ్య ఉన్న 448 టీఎంసీల్లో మహారాష్ట్రకు 81, కర్ణాటకకు 177, ఉమ్మడి ఏపీకి 190 టీఎంసీలను కేటాయిస్తూ 2010 డిసెంబర్ 30న తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పి) దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కూడా కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసింది. వీటిపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా.. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేసే బాధ్యతను కేడబ్ల్యూడీటీ–2కి అప్పగిస్తూ, దాని కాలపరిధిని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడంపై కేడబ్ల్యూడీటీ–2.. 2014 నుంచి విచారణ నిర్వహిస్తోంది.
నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్ విచారణ
Published Wed, Mar 17 2021 4:56 AM | Last Updated on Wed, Mar 17 2021 4:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment