బ్రిజేశ్ చేతిలో భవితవ్యం | Justice Brajesh kumar reserves judgement on krishna water dispute | Sakshi
Sakshi News home page

బ్రిజేశ్ చేతిలో భవితవ్యం

Published Sat, Aug 31 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM

బ్రిజేశ్ చేతిలో భవితవ్యం

బ్రిజేశ్ చేతిలో భవితవ్యం

 కృష్ణా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్‌లో వాదనలు పూర్తి  
 తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ బ్రజేశ్‌కుమార్

 
 సాక్షి, న్యూఢిల్లీ:  కృష్ణా నది నీటి కేటాయింపులపై జస్టిస్ బ్రజేశ్‌కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ముందు సుదీర్ఘంగా సాగిన వాదనలు శుక్రవారం ముగిసాయి. వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వ్ చేస్తున్నామని జస్టిస్ బ్రజేశ్‌కుమార్ ప్రకటించారు. మూడు రాష్ట్రాలకు సమాచారమిచ్చి తీర్పును వెల్లడిస్తామని చెప్పారు. దీంతో ట్రిబ్యునల్ గతంలో వెలువరించిన తీర్పుతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని... ప్రస్తుత తీర్పుతోనైనా సరిదిద్దుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
 
 మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. ఇప్పటివరకు మూడు రాష్ట్రాలతో ముడిపడిన నీటి కేటాయింపుల వివాదం, భవిష్యత్తులో నాలుగు రాష్ట్రాలకు విస్తరిస్తే తలెత్తే పరిణామాలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత ట్రిబ్యునల్ తీర్పులోనూ న్యాయం జరగకుంటే రాష్ట్రానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు. జస్టిస్ బ్రజేష్‌కుమార్ సారథిగా, జస్టిస్ దిలీప్‌కుమార్ సేఠ్, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా ఉన్న ఈ ట్రిబ్యునల్ కాలపరిమితి సెప్టెంబర్ ఆఖరుకల్లా పూర్తికానుంది.
 
 అందువల్ల ఆలోగానే తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. కానిపక్షంలో ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగింపునకు చైర్మన్ అనుమతి కోరాల్సి ఉంటుంది. ఈ నెల 26న మొదలైన తుది విడత విచారణ షెడ్యూలు ప్రకారం చివరి రోజైన శుక్రవారమే ఒక కొలిక్కిరావడం గమనార్హం. శుక్రవారం తొలుత మన రాష్ట్రం కృష్ణా నీటి కేటాయింపులకు సంబంధించి తుది వాదనను వినిపించింది. ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రతిపాదనలతో పాటు ఇతర అంశాలను పొందుపరిచిన నోట్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించింది. అనంతరం కర్ణాటక, మహారాష్ట్రలు ఎప్పటిమాదిరిగానే రాష్ట్రానికొచ్చే జలాలకు గండికొట్టే యత్నాలను కొనసాగిస్తూ వాదనలు విన్పించాయి. దిగువ రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నీటిని కూడా హరించే ఎత్తుగడతో వితండవాదాన్ని వినిపించాయి.
 
 ఎగువ రాష్ట్రాల వాదనలను తిప్పికొట్టిన రాష్ట్రం
 జస్టిస్ బ్రజే శ్‌కుమార్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని ఆలస్యంగా రావడంతో ఉదయం 11 గంటలకు మొదలవ్వాల్సిన విచారణలో 20 నిమిషాల జాప్యం జరిగింది. తొలుత రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి తుది వాదనను వినిపించారు. రెండురోజుల క్రితం కర్ణాటక ట్రిబ్యునల్‌కు అందించిన నోట్‌లోని అంశాలను ఆయన తప్పుపట్టారు. జలాల వినియోగంపై కర్ణాటక సూచించిన పద్ధతి సరైంది కాదన్నారు. ట్రిబ్యునల్ ఎదుట కర్ణాటక వెలిబుచ్చుతున్న ఆందోళనలకు ఎలాంటి ప్రాతిపదిక లేదని, ఇవేవీ అధ్యయనాల ఆధారితమైనవి కాదని చెప్పారు.
 
 మహారాష్ట్ర వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, చేస్తున్న వాదన ల్లో కూడా పస లేదన్నారు. జలాల పంపిణీ, వాడకం పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటైనా సరే తమకు అన్యాయం జరుగుతుందని, ఎగువ రాష్ట్రాలు రెండైతే కిందనున్నది తామొక్కరమేనని తెలిపారు. అందువల్ల బోర్డుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలన్నారు. దిగువ రాష్ట్రం హక్కుల పరిరక్షణ బాధ్యత నుంచి ఎగువ రాష్ట్రాలు తప్పించుకోజాలవన్నారు. నీటి వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రతిపాదనలతోపాటు కొన్ని ఇతర అంశాలనూ సూచిస్తూ నాలుగు పేజీల నోట్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించారు.
 
 మళ్లీ ఎగువ రాష్ట్రాల వితండవాదం..
 విచారణ పూర్తికావొస్తున్న తరుణంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతీసే లక్ష్యంతోనే ఎగువరాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వ్యవహరించాయి. గతంలో అనేక సందర్భాల్లో వినిపించిన వితండవాదాన్నే చివరిరోజునా ఆ రెండు రాష్ట్రాలు కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ వాదన పూర్తయ్యాక కర్ణాటక తరఫున ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ వాదిస్తూ, జస్టిస్ బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోని పట్టికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికస్థాయిలో నీటి లభ్యత ఉన్న మూడు సంవత్సరాల వివరాలను ప్రస్తావించారు. నీటి లభ్యత భిన్నంగా ఉంటున్నందున కింది రాష్ట్రానికి ఏప్రాతిపదికన నీరు విడుదల చేయాలని ప్రశ్నించారు. కింది రాష్ట్రం నీటిని వాడుకునేవరకూ తమను అదనపు కేటాయింపుల జోలికి వెళ్లొద్దంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఆయన వాదనను జస్టిస్ బ్రజేశ్‌కుమార్, జస్టిస్ దిలీప్‌కుమార్ సేఠ్ తోసిపుచ్చారు.
 
  మీరు ఆందోళన చెందుతున్నట్టుగా సమస్యలేవీ రాబోవని, తాము ప్రతిపాదించిన పరిష్కారంలో సమస్యను జటిలం చేసే అంశాలేవీ లేవని, అయినా మరోసారి పరిశీలించి అవసరమనుకుంటే మార్గదర్శకాలను సైతం ఇస్తామని చెప్పారు. చివరగా మహారాష్ట్ర సీనియర్ న్యాయవాది అంద్యార్జున వాదిస్తూ.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తమ వాటా జలాలను వినియోగించుకునేవరకూ తాము అదనపు జలాల జోలికి వెళ్లరాదనడం సరికాదన్నారు. అదనపు జలాల వినియోగానికి ‘‘నీటి వినియోగం’’ ఎంత మాత్రం ప్రాతిపదిక కారాదని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి సాగిన ట్రిబ్యునల్ విచారణ ఆఖరికి పూర్తికావడంతో మూడు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, న్యాయవాదులు ఊపిరి పీల్చుకున్నారు.
 
 నోట్‌లోని ముఖ్యాంశాలు..
 75 శాతం నీటిలభ్యత ఆధారంగా మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా నది నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు క్యారీఓవర్ కింద 150 టీఎంసీలను కేటాయించింది. ఇంతకుమించి ఏ రాష్ట్రమూ నీటిని వాడకూడదు. ఆ తర్వాత..65 శాతం డిపెండబులిటీ ఆధారంగా బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గుర్తించిన 448 టీఎంసీల (ఆంధ్రప్రదేశ్ 190, మహారాష్ట్ర 81, కర్ణాటక 177 టీఎంసీల చొప్పున) మిగులు జలాలను దామాషాకు లోబడి మూడు రాష్ట్రాలూ వినియోగించుకోవాలి. కర్ణాటక 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు వాడటంతో పాటు 190 టీఎంసీల క్యారీ ఓవర్‌ను నిల్వ చేసుకున్న తర్వాతే మహారాష్ట్ర తమ వాస్తవ కేటాయింపులైన 585 టీఎంసీల పరిధిని దాటి అదనపు కోటా అయిన 81 టీఎంసీలను వాడుకోవాలి. అదనపు కోటా వాడుకునేటప్పుడూ 81 టీఎంసీలకే పరిమితం కావాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు వాడటంతోపాటు 150 టీఎంసీల క్యారీ ఓవర్‌ను నిల్వచేసుకున్నాకే కర్ణాటక తమ వాస్తవ కేటాయింపులైన 734 టీఎంసీల పరిధిని దాటి 177 టీఎంసీలను వాడుకోవాలి. అదనపు కోటా వాడకంలో 177కే పరిమితం కావాలి.
 
 ఈ ప్రతిపాదనతో పాటు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 2130 టీఎంసీల జలాలను వాడుకున్న తర్వాత 65 శాతం లభ్యత ఆధారంగా బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అదనంగా కేటాయించిన నీటిని వాడుకోవడంపైనా రాష్ట్రం ప్రత్యామ్నాయ ప్రతిపాదన నోట్‌లో పేర్కొంది. నీటి వాడకం నిర్వచనంలో ‘వాడకం’ అంటే వినియోగించిన జలాలు లేదా మళ్లించిన జలాలతోపాటు ఒక జల సంవత్సరంలో ఏ రాష్ట్రమైనా నిల్వ చేసుకున్న మొత్తం నీరు అని మార్చాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ క్యారీ ఓవర్ నిల్వలను వినియోగించిన జలాలుగా పరిగణించరాదని తెలిపింది. తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మళ్లించిన నీటినీ వినియోగ జలాలుగానే లెక్కించాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement