కృష్ణా నదీ జలాల వివాదం ట్రిబ్యునల్ విచారించాల్సిన అంశాలను, ట్రిబ్యునల్ విచారణ పరిధి, విస్తృతిపై..
ఏపీ, తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశం
అఫిడవిట్ దాఖలుకు జనవరి 5 గడువు.. తదుపరి విచారణ 7న
ట్రిబ్యునల్ ఏపీ, తెలంగాణలకే పరిమితమన్న మహారాష్ట్ర, కర్ణాటక
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కృష్ణా నదీ జలాల వివాదం ట్రిబ్యునల్ విచారించాల్సిన అంశాలను, ట్రిబ్యునల్ విచారణ పరిధి, విస్తృతిపై ముసాయిదా విధివిధానాలను పేర్కొంటూ అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ కృష్ణా జలాలతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాలకు ఆదేశించారు. ఈ మేరకు జనవరి 5 వరకు గడువు ఇస్తూ.. తదుపరి విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేశారు. గురువారం నాటి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ భేటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు కాలపరిమితి పొడిగింపు పొందిన కృష్ణా ట్రిబ్యునల్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ ఇచ్చింది. గడువు ముగిసినా కేంద్రం అఫిడవిట్ సమర్పించలేదు. గురువారం ట్రిబ్యునల్ భేటీలో.. అఫిడవిట్ సమర్పించడానికి గడువు కా వాలని కేంద్రం తరఫు న్యాయవాది ఖాద్రీ కోరగా 3 వారాల గడువు ఇచ్చింది. తాము విచారించాల్సిన అంశాలను పేర్కొంటూ అఫిడవిట్లు సమర్పించాలని నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది. జనవరి 7న ట్రిబ్యునల్ విచారణ పరిధిని నిర్ధారించాకే తదుపరి విచారణకు అనుమతిస్తామని బ్రిజేశ్ స్పష్టం చేశారు. పొడిగించిన ట్రిబ్యునల్ ఏపీ, తెలంగాణలకే పరిమితమని మహారాష్ట్ర, కర్ణాటకలు పునరుద్ఘాటించాయి.