
రెండు రాష్ట్రాల మధ్య న్యాయబద్ధమైన నీటి పంపిణీకి చర్యలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ హామీ
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ చేసిన విజ్ఞప్తులపై సానుకూల స్పందన
‘మేడిగడ్డ’పై నెలాఖరులోగా ఎన్డీఎస్‌ఏ నివేదిక అందజేస్తాం
ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల ప్రతిపాదనలు పరిశీలిస్తాం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ అనధికారికంగా నీళ్లను తరలించుకోవడాన్ని అడ్డుకోవడంతో పాటు ఏపీ, తెలంగాణ మధ్య న్యాయమైన రీతిలో నీటి పంపిణీ జరిగేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. మేడిగడ్డ బరాజ్‌పై నెలాఖరులోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదికను అందజేస్తామని తెలిపారు.
అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం అక్కడ సీఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో సమావేశమై చర్చలు జరిపారు.
కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకోవాలి: ఉత్తమ్
మేడిగడ్డ బరాజ్‌పై ఎన్డీఎస్‌ఏ ఆధ్వర్యంలో ఏడాది కాలంగా విచారణ సాగుతుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. బరాజ్ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలతో తుది నివేదికను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో ఏపీ శ్రీశైలం జలాశయం, నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా అదనపు నీళ్లను అక్రమంగా తరలిస్తోందని చెప్పారు.
సాగర్ కింద తెలంగాణలో సాగు చేస్తున్న ఆయకట్టు పంటలు, ప్రత్యేకించి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సాగు చేస్తున్న ఆయకట్టు పంటలను కాపాడేందుకు కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకతతో పాటు భవిష్యత్తు వివాదాల నివారణ కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలతో పాటు కృష్ణా నదిపై 35 చోట్ల టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
వీటితో నీటి వినియోగం సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలు కలుగుతుందని, వాటాలకు కట్టుబడి నీళ్లు తీసుకునేందుకు దోహదపడుతుందని సూచించారు. మంత్రి అభిప్రాయంతో కేంద్ర మంత్రి ఏకీభవించారు. ఏపీతో ఉన్న నీటి వివాదాల్లో జోక్యం చేసుకుని తెలంగాణ ఆందోళనలకు పరిష్కారం చూపాలంటూ మంత్రి చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సత్వర అనుమతులిస్తామని భరోసా ఇచ్చారు.
జీరో వడ్డీ, 50 ఏళ్ల గడువుతో రుణాలు.. కేంద్రం
సీతారామ, సీతమ్మసాగర్, పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులకు సత్వర అనుమతులతో పాటు నిధులను కేటాయించాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జీరో వడ్డీతో పాటు తిరిగి చెల్లింపులకు 50 ఏళ్ల గడువుతో రుణాలు అందించేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా దేబశ్రీ ముఖర్జీ హామీ ఇచ్చారు.
నెల రోజుల్లోగా సీతారామ ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన, పునరుద్ధరణతో పాటు గోదావరి–మూసీ అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర సహాయం అందించాలని కోరగా, ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలు చేస్తున్న డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) కింద శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు మరమ్మతుల నిర్వహణతో పాటు జలాశయాల్లో పూడిక తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో కేంద్రం రాష్ట్రానికి సూచించింది.
కాగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2లో జరుగుతున్న విచారణ సత్వరంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment