ఏడాది తర్వాత మళ్లీ కృష్ణా ట్రిబ్యునల్ వాదనలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ వివాద పరిష్కారానికి ఏర్పాటైన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాదాపు ఏడాది తర్వాత మళ్లీ భేటీ కానుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర వాదనలూ విననుంది. ఈ విషయమై తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ట్రిబ్యునల్ అధికారులు సమాచారం పంపారు. గత ఏడాది మార్చి 30న ట్రిబ్యునల్ చివరిసారి సమావేశమైంది.
తదనంతరం ట్రిబ్యునల్ సమావేశం జరిగే గదిలో షార్ట్‌సర్క్యూట్ కావడం, కీలక ఫైళ్లన్నీ దగ్ధం కావడంతో అప్పటి నుంచి సమావేశాలు ఎక్కడ జరపాలన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. దీనికి తోడు జూన్ 30న బోర్డులోని సభ్యుడు జస్టిస్ డీకే సేథ్ ట్రిబ్యునల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సభ్యుడిని నియమించారు. విచారణలో భాగస్వామిగా ఉన్న కర్ణాటకకు చెందిన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని సభ్యునిగా నియమించడంపై తెలంగాణ, ఏపీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని కొనసాగించేందుకే కేంద్రం మొగ్గు చూపింది.
పునఃకేటాయింపులకు రాష్ట్రం పట్టు..
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బి)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరపాలన్నది ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. నదీ జలాల వివాదానికి సంబంధించి మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు పునఃపంపకం చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరుతోంది. కృష్ణా జలాల వివాదాన్ని ఏపీ, తెలంగాణ మధ్య పంచాయితీగా చూడరాదని, కృష్ణా నది నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లోనూ నాలుగు రాష్ట్రాలు భాగస్వాములుగా అవుతాయనే విషయాన్ని మరోమారు ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది.