సచివాలయం అప్పగింతపై మంత్రివర్గ ఉపసంఘం
- దాని నివేదికను బట్టి నిర్ణయం
- కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహారాల పరిశీలనకు మరో సంఘం
- పలు సంస్థలకు భారీగా భూకేటాయింపులు
- మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉపసంఘం ఇచ్చిన నివేదికను బట్టి భవనాల అప్పగింతపై నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వ్యవహారాలపై చర్చించేందుకు మరో ఉపసంఘాన్ని నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు వెల్లడించారు.
► హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలను అప్పగించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంపై చర్చ. ఏపీ సచివాలయ తరలింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, దీంతోపాటు పునర్విభజన చట్టం ప్రకారం అప్పగింత వల్ల చట్టప్రకారం ఎదురయ్యే సమస్యలను పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలి. కమిటీ సభ్యులు, దాని గడువుపై త్వరలో జీఓ జారీ చేయాలని నిర్ణయం.
► కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహారాలను చర్చిం చేందుకు మరో ఉపసంఘం ఏర్పాటు.
► మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకుని 2005-2010 విధానం ప్రకారం ఏర్పాటైన 62 టెక్స్‌టైల్ పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ యూనిట్‌కు 0.75 పైసల నుంచి రూపాయికి పెంపు. 2010-15 విధానం ప్రకారం ఏర్పడిన 32 స్పిన్నింగ్ మిల్లులు బాగా నష్టాల్లో ఉండడంతో 0.75 పైసలున్న విద్యుత్ సబ్సిడీ రెండు రూపాయలకు పెంపు.
► పశుగ్రాస అభివృద్ధి విధానం 2016-2020కి రూపకల్పన. రాష్ట్రంలోని గొర్రెల పెంపకందారులు, ఉత్పత్తిదారుల కోసం ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ మిత్ర ఫెడరేషన్’ ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక చేయూత. రైతు ఉత్పత్తిదారుల సంస్థల, గొర్రెల పెంపకందార్లకు బ్యాంకు రుణాలిచ్చేందుకు వంద జీవాలు ఒక యూనిట్‌గా రెండు లక్షలకు మించకుండా 50 శాతం సబ్సిడీ, మిగిలిన సొమ్ముకు పావలా వడ్డీతో రుణం మంజూరు.
► ఉడా (విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ), తుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలో భూసమీకరణ పథకం నిబంధనలు-2016 రూపకల్పన, అమలుకు ఆమోదం.
► మరో నాలుగు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్, ఆర్ ఎస్ ట్రస్ట్ (వెల్‌టెక్), వరల్డ్ పీస్ యూనివర్సిటీ (మహారాష్ట్ర అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్), గ్రేట్ లేక్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం.
► విజయవాడలో భవానీ ఐల్యాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) ఏర్పాటుకు ఆమోదం.
► విశాఖ జిల్లా మాకవారిపాలెం మండలం రామన్నపాలెంలో వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఫ్రిజీరియో కన్జర్వా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 115 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఏపీఐఐసీకి అనుమతి. ఈ భూముల్లో రెండు దశల్లో రూ.160 కోట్లతో కాంప్లెక్స్ నిర్మాణం.
► వివిధ శాఖల్లో కొత్తగా 500 పోస్టుల మంజూరు, పదోన్నతికి అంగీకారం. దీంతో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 21.70 కోట్ల భారం పడుతుంది.
► సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా పాటించాలని కేంద్రం నిర్ణయించడంపై హర్షం.
భారీ భూకేటాయింపులు
పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎప్పటి మాదిరిగానే భారీగా భూకేటాయింపులు చేసేందుకు మంత్రివర్గ ఆమోదించింది.
► విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో 78 ఎకరాలను ఎకరం 8 లక్షల చొప్పున ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి కేటాయింపు. ► ఏపీఐఐసీకి ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కోసం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలోఎకరాకు రూ. 18 లక్షల చొప్పున చెల్లించేలా 129.99 ఎకరాల భూమి కేటాయింపు.
► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలోని ఆముదాలపాడులో ఏపీజెన్‌కోకు చెందేలా దామోదర సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించిన అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం 4.96 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ. 10.25 లక్షలు, ముతుకూరు మండలంలోని పిడతపోలూరులో ధర్మల్ స్టేషన్‌కు అప్రోచ్ రోడ్ కోసం 3.29 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం రూ.10.25 లక్షలకు, ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం గ్రామంలో అప్రోచ్ రోడ్ కోసం 1.12 ఎకరాల భూమిని ఎకరం రూ. 10.25 లక్షలు, నేలటూరు గ్రామంలో 13.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం రూ. 9.75 లక్షలకు కేటాయింపు.
► సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ వారికి సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు గుంటూరు నగరంలో 400 చ.గ స్థలం లక్ష రూపాయలకు కేటాయింపు.
► చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పేందుకు 69.03 ఎకరాలు (67.40 ఎకరాల డీకేటీ భూమి, 1.63 ఎకరాల ప్రభుత్వ భూమి) ఎకరం రూ. 5 లక్షల చొప్పున చెల్లించేలా జీఓ నెం. 155 (19-4-2016) మేర కేటాయించేందుకు ఆమోదం.
► చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం శ్రీనివాసపురం, చిందేపల్లి, పంగూరు గ్రామాల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఏర్పాటుకు 255.09 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ నిర్ణయం.
► అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రంలో తాడిపత్రి మున్సిపాలిటీకి సమగ్ర మంచినీటి సరఫరా మెరుగుదల పథకానికి 23 ఎకరాల భూమిని మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ. 3.50 లక్షల చొప్పున కేటాయింపు.
► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో రోజుకు మూడు వేల టన్నుల సామర్థ్యంతో చక్కెర శుద్ధి కర్మాగారం స్థాపన కోసం నెక్కంటి మెగా ఫుడ్ పార్క్‌కు 52.22 ఎకరాలు కేటాయింపు.