పదేపదే కోరుతున్నా డీపీఆర్‌లు ఇవ్వరేం? | telangana,andrapradesh why dont gave dpr's:krishna tribunal | Sakshi
Sakshi News home page

పదేపదే కోరుతున్నా డీపీఆర్‌లు ఇవ్వరేం?

Published Mon, Sep 5 2016 2:40 AM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM

పదేపదే కోరుతున్నా డీపీఆర్‌లు ఇవ్వరేం? - Sakshi

పదేపదే కోరుతున్నా డీపీఆర్‌లు ఇవ్వరేం?

-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై కృష్ణా బోర్డు ఆగ్రహం
-ఆర్డీఎస్, పాలమూరు, డిండి డీపీఆర్‌లు తక్షణమే ఇవ్వాలని ఆదేశం
-దీనిపై ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి లేఖలు
-ఒక్కో డీపీఆర్‌కు సంబంధించి నాలుగేసి కాపీలు ఇవ్వాలని సూచన
-కృష్ణా బేసిన్‌లో 47 చోట్ల టెలిమెట్రీ విధానం అమలుకు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది వరద జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను పదేపదే కోరుతున్నా ఇరు రాష్ట్రాలు సమర్పించకపోవడంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజోలిబండ మళ్లింపు పథకానికి (ఆర్డీఎస్) సంబంధించి ఏపీ.., పాలమూ రు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు ఎందుకు సమర్పించడంలేదని ప్రశ్నించింది. తక్షణమే వాటిని సమర్పించాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అపెక్స్ భేటీ నిర్వహించాలన్నా, కేంద్ర జలవనరులశాఖ, కేంద్ర జల సంఘానికి తాము వివరణ ఇవ్వాలన్నా డీపీఆర్‌లే ప్రధానమని తెలిపింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ శనివారం ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. కృష్ణా జలాల వినియోగంపై పర్యవేక్షణకు ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వివరాలు తమ వద్ద ఉండాలని.. అందుకే డీపీఆర్‌లను కోరుతున్నామన్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు నీటి వినియోగంపై పరస్పర ఫిర్యాదులు చేశాయని, ఇందులో వాస్తవాలు తేల్చాలంటే ఒక్కో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను నాలుగేసి కాపీల చొప్పున సమర్పించాలని సూచించారు.

47 చోట్ల టెలిమెట్రీ విధానం...
కృష్ణా నదీ జలాల వినియోగం, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో తేడా రాకుండా నాగార్జున సాగర్, శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద టె లిమెట్రీ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైన బోర్డు...వాటిని ఎక్కడెక్కడ అమర్చాలన్న దానిపై స్పష్టతకు వచ్చింది. మొత్తంగా 47 చోట్ల టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇరు రాష్ట్రాలకు పంపింది.

జూరాలపై భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఆఫ్ టేక్, జూరాల ఎడమ, కుడి కాల్వలు, తుంగభద్రపై ఆర్డీఎస్, కేసీ కెనాల్, పోతిరెడ్డిపాడు, గురు రాఘవేంద్ర ఆఫ్ టేక్, శ్రీశైలం వద్ద ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, హంద్రీనీవా, ముచుమర్రి, వెలిగొండ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి, బంకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలిగోడు, సోమశిల, కండలేరు, పూండిల వద్ద, సాగర్‌లో ఎన్‌ఎస్‌ఎల్‌సీ, ఏఎంఆర్‌పీ, ఎన్‌ఎస్‌ఆర్‌సీ, పులిచింతల స్లూయిజ్, పవర్‌హౌస్, మూసీ, పాలేరు, మున్నేరు నదీ ప్రాంతాలు, వెంకటాపురం పంపింగ్ స్టేషన్, గుంటూరు చానల్, ప్రకాశం బ్యారేజీ వద్ద 5 చోట్ల పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తే ఈ ఏడాది నుంచే నీటి ప్రవాహ లెక్కలను పక్కగా తేలుస్తామని, దీని ఆధారంగా వినియోగం, పంపకాలపై నిర్దిష్ట అంచనాకు వస్తామని తెలిపింది.

పోతిరెడ్డిపాడు వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు..
పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం వాటాకు మించి ఎక్కువగా కృష్ణా జలాలను తరలించుకుపోతోందని, దీనిపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) భాగంగా రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల పూర్తికి ఈ నెల 6న ఢిల్లీలో నాబార్డ్‌తో కేంద్రం కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి టి.హరీశ్‌రావు ఈ అంశాన్ని కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. నీటి వినియోగ లెక్కలపై టెలిమెట్రీ విధానం అమల్లోకి వచ్చే వరకు నీటి వినియోగం వాటాల మేరకే జరిగేలా చూడాలని కోరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement