నీటి పారుదల శాఖపై సమీక్షలోసీఎం రేవంత్‌రెడ్డి
70% కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉంది.. ఏపీలో 30 శాతమే ఉంది
దీని ప్రకారమే జలాల్లో తెలంగాణకు వాటా రావాలి
ఆ దిశగా కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపించాలని అధికారులకు సూచన
ట్రిబ్యునల్ నీటి పంపకాలు చేయనప్పుడు కృష్ణా బోర్డు నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: నది పరీవాహక ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు జరపాలని అంతర్జాతీయ నీటి సూత్రాలు స్పష్టం చేస్తున్నాయని.. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉంటే.. ఏపీలో 30 శాతమే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీని ప్రకారం కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1,005 టీఎంసీల వాటాలో 70 శాతం వాటా తెలంగాణకు దక్కేలా జస్టిస్ బ్రజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ శనివారం నీటి పారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే.. బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలను పరీవాహక రాష్ట్రాలు వినియోగించుకోవచ్చంటూ గతంలో జరిగిన ఒప్పందాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటక 35 టీఎంసీలను వాడుకుంటుండగా.. మిగతా 45 టీఎంసీలపై సంపూర్ణ హక్కు తెలంగాణకే ఉందని చెప్పారు. సాగర్ ఎగువన తెలంగాణలోని ప్రాజెక్టుల ద్వారా ఈ నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగొద్దు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటాలను సాధించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించాలన్నారు. ఈ వాదనలను బలపరిచే సాక్ష్యాలు, రికార్డులు, ఉత్తర్వులను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
త్వరలో ట్రిబ్యునల్‌లో వాదనలు..
కృష్ణా ట్రిబ్యునల్–2 ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభిప్రాయాలు, ఆధారాలను సేకరించిందని... త్వరలోనే ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అయితే కేంద్ర జలశక్తి శాఖకు ఇచి్చన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని సీఎం సూచించారు.
కృష్ణా బోర్డును ఎందుకు పట్టించుకోవాలి?
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీని కృష్ణా ట్రిబ్యునల్–2 పూర్తి చేయలేదని.. ఇక కృష్ణా బోర్డు నిర్ణయాలను తెలంగాణ ఎందుకు పట్టించుకోవాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే వరకు కృష్ణా బోర్డు జోక్యం ఉండకూడదంటూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు.
ఇక ఏపీ కోటాకు మించి నీటిని తరలించుకుపోతోందన్న అంశం ప్రస్తావనకురాగా.. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుతో దీనికి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, బానకచర్ల క్రాస్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కాల్వ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలుగోడు ప్రాజెక్టుల ద్వారా ఏపీ తరలిస్తున్న నీటి వివరాలను సేకరించి రికార్డు చేయాలని సీఎం సూచించినట్టు సమాచారం.
నీటి వాటాల్లో అన్యాయంపై నివేదిక తయారు చేయాలి
సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులను సాధించాలని.. మొత్తం ఆయకట్టుకు నీరందేలా పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న జీవోలు, తీర్పులతోపాటు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలు, మెమోలు, డీపీఆర్‌లు, నాటి నుంచి నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీ రజనీకాంత్‌రెడ్డి, ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖుష్ వోరా, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment