విచారించే పరిధి మాకు లేదు  | Krishna Tribunal 2 Key Judgment On Palamuru Rangareddy Project | Sakshi
Sakshi News home page

విచారించే పరిధి మాకు లేదు 

Published Thu, Sep 21 2023 1:37 AM | Last Updated on Thu, Sep 21 2023 3:56 PM

Krishna Tribunal 2 Key Judgment On Palamuru Rangareddy Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ గత ఏడాది ఆగస్టు 18న తెలంగాణ రాష్ట్రం జారీ చేసిన జీవో 246ను సవాలు చేస్తూ ఏపీ వేసిన కేసు (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్‌)ను జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2 కొట్టేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట జల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్‌–2 తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ జీవో అమలును నిలిపివేసి తమ రాష్ట్రానికి మధ్యంతర ఉపశమనం కల్పించాలంటూ ఏపీ వేసిన కేసును విచారించే పరిధి తమకు లేదని పేర్కొంది.

చట్టానికి లోబడి ఉపశమనం కోసం మరో వేదికను ఆశ్రయించే స్వేచ్ఛను ఏపీకి కల్పించింది. ఈ మేరకు జస్టిస్‌ బ్రిజేష్ కుమార్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఎస్‌ తలపాత్ర, జస్టిస్‌ రామ్‌మోహన్‌రెడ్డితో కూడిన కృష్ణా ట్రిబ్యునల్‌–2 బుధవారం కీలక తీర్పు వెలువరించింది. మరోవైపు  పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని, ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీకారం చుట్టారని తెలంగాణ చేసిన వాదనలను ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. గతేడాది డిసెంబర్‌ 8న ఏపీ ఈ కేసును దాఖలు చేయగా, రెండు రాష్ట్రాలు దాదాపు 4 నెలల పాటు ట్రిబ్యునల్‌ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. ఈ జీవోతో ఏపీ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ చేసిన వాదనలతో తెలంగాణ విభేదించింది.  

పాలమూరు కొత్త ప్రాజెక్టే..     
వేటిని కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలి అన్న అంశంపై రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో రూపొందించిన మార్గదర్శకాల ఆధారంగా పాలమూరుపై ట్రిబ్యునల్‌ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక–ఆర్థిక సాధికారతపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మదింపు జరగని ప్రాజెక్టులు, టెక్నికల్‌ అడ్వైయిజరీ కమిటీ ఆమోదించని ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణిస్తారు. ఇంటేక్‌ పాయింట్, ప్రాజెక్టు ప్రాంతం, కాల్వలు, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్, ఆయకట్టు ప్రాంతం, నిల్వ సామర్థ్యం, నీటి వినియోగం వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నా కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తారు.

ఉమ్మడి రాష్ట్రంలో 70 టీఎంసీల వరద జలాలను జూరాల ప్రాజెక్టు ఫోర్‌షోర్‌ నుంచి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించారు. అయితే తెలంగాణ వచ్చాక ప్రతిపాదనలను సమూలంగా మార్చివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్‌షోర్‌ నుంచి 70 శాతం లభ్యత ఆధారంగా 90 టీఎంసీల నికర జలాలను తరలించేలా ప్రాజెక్టును ప్రతిపాదించిన నేపథ్యంలో దీనిని కొత్త ప్రాజెక్టుగా పరిగణిస్తున్నట్టు ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. 

గతంలో కేటాయింపులు జరపని ప్రాజెక్టులు మా పరిధిలోకి రావు.. 
రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 89 అమలు బాధ్యతలను కృష్ణా ట్రిబ్యునల్‌–2 చేపట్టిన నేపథ్యంలో.. తెలంగాణ జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని ఏపీ ప్రభుత్వం చేసిన వాదనలను ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. గతంలో కృష్ణా ట్రిబ్యునల్‌–1, కృష్ణా ట్రిబ్యునల్‌–2 లు గంపగుత్తగా కేటాయింపులు జరిపిన ప్రాజెక్టులకు మళ్లీ నిర్దిష్ట కేటాయింపులు జరిపే అధికారాన్ని మాత్రమే రాష్ట్ర పునర్వీభజన చట్టంలోని సెక్షన్‌ 89 కింద తమకు కేటాయించారని తెలిపింది. గతంలో ఏ ట్రిబ్యునల్‌ కూడా కేటాయింపులు జరపని ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు తమ పరిధిలోకి రావని పేర్కొంది.  

పునఃకేటాయింపులూ మా పరిధిలోనిది కాదు 
ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునః కేటాయింపులు జరిపే అంశం తమ పరిధిలో లేదని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. కేవలం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపడమే తమ బాధ్యత అని పునరుద్ఘాటించింది. కాగా సెక్షన్‌ 89 కింద ట్రిబ్యునల్‌కు పరిమిత అధికారాలే ఉన్నాయని, ఏపీకి మధ్యంతర ఉపశమనం కల్పించే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌కు మాత్రమే ఉందని తెలంగాణ వాదించింది.

అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్‌ 11 ప్రకారం జల వివాదాల విషయంలో సుప్రీం కోర్టుకు ఉన్న న్యాయ అధికారాలన్నీ ట్రిబ్యునల్‌కు ఉంటాయని 1993లో కావేరి ట్రిబ్యునల్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ఏపీ గుర్తు చేసింది. ఈ మేరకు అధికారాలను వినియోగించి మధ్యంతర ఉపశమనం కల్పించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. అయితే తమకు అప్పగించిన బాధ్యతలకు లోబడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది.

మరోవైపు రాష్ట్ర పునర్వీభజన చట్టం 2014 వచ్చిన తర్వాత చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి వంటి కొత్త ప్రాజెక్టులు సెక్షన్‌ 89 కింద తమ పరిధిలోకి రావని కృష్ణా ట్రిబ్యునల్‌–2 తేల్చి చెప్పింది. ఇలావుండగా గతంలో గంపగుత్తగా కేటాయింపులు పొందిన ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు సెక్షన్‌ 89 కింద నిర్దిష్ట కేటాయింపులు జరిపే అంశం ఇంకా ట్రిబ్యునల్‌లో విచారణ దశలోనే ఉంది. నిర్ణయం వచ్చే సరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement