కృష్ణాతీరంలో కోతి గుండు (జీరోపాయింట్) వద్ద పూర్తయిన హెడ్ రెగ్యులేటరీ నిర్మాణ పనులు
ప్రపంచంలోనే భారీ పంపులతో..
ప్రపంచంలో మరెక్కడా లేనంత భారీ పంపులతో నిర్మించిన ‘పాలమూరు’ ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు స్వరాష్ట్రంలో మోక్షం లభించడం చరిత్రాత్మకం. దశాబ్దాల కల సాకారమవుతున్న ఈ సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజు. ప్రాజెక్టును ప్రారంభించిన మరునాడు (సెపె్టంబర్ 17 న) ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పల్లెపల్లెనా ఊరేగింపులతో సంబురంగా జరుపుకోవాలి.
– సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 16న మధ్యాహ్నం ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తొలుత బటన్ నొక్కి నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్ వద్దనున్న బాహుబలి పంపులను కేసీఆర్ ఆన్ చేస్తారు.
పంపుల నుంచి కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌కు చేరుతాయి. సీఎం కేసీఆర్ వెంటనే రిజర్వాయర్ వద్దకు చేరుకుని.. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బుధవా రం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ భేటీలో సీఎం చెప్పి న అంశాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో తాగు, సాగునీటికి నోచుకోక ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలను అనుభవించాయి. పాలమూరులో గంజి కేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి పాలకులది. ఎటుచూసినా వలసలే కనిపించేవి. జిల్లా ప్రజల బాధలను చూసిన గోరటి వెంకన్న వంటి పాలమూరు కవులు ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే.. పాలమూరులోనా’ అంటూ పాటలు కూడా రాశారు.
బంగారు తెలంగాణ సంపూర్ణమవుతుంది
పాలమూరులో నాటి పాలకులు మొదలుపెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశాం. పాలమూరు జిల్లా పచ్చబడింది. వలసలు ఆగిపోయాయి. ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్ప అభివృద్ధి అవుతుందో ఊహించుకోవచ్చు. తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. సమ్మిళిత, సమగ్ర వ్యవసాయ రంగాభివృద్ధిని సాధిస్తుంది. రైతుల లోగిళ్లు బంగారు పంటలతో తులతూగుతాయి. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుంది.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా..
ప్రాజెక్టుపై స్వయానా పాలమూరు జిల్లా నేతలే వందల కేసులు పెట్టడం దురదృష్టకరం. వారు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు వెళ్లింది. పర్యావరణ అనుమతులు రావడంతో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆ దిశగా కృషి చేసిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు హమీద్‌ఖాన్, రమణారెడ్డిల కృషిని అభినందిస్తున్నాం.
కృష్ణా జలాలతో మొక్కులు తీర్చుకోవాలి
మనందరి కృషికి దైవ కృప తోడు కావడంతోనే ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చాయి. ఉద్యమ కాలంలో కృష్ణా నదిలో నాణేలు వేసి నీటి కోసం మొక్కాం. కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుళ్ల పాదాలు కడుగుతామన్నాం. మనందరం ఆ మొక్కులను తీర్చుకోవాల్సి ఉంది. రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు తమతో తెచ్చుకున్న కలశాలతో కృష్ణా జలాలను తీసుకెళ్లి దేవుళ్ల పాదాలకు అభిõÙకం చేయాలి. కొబ్బరికాయలు కొట్టి, పూలుచల్లాలి. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
భారీగా బహిరంగ సభ
‘పాలమూరు’ ప్రాజెక్టును ప్రారంభించుకునే చరిత్రాత్మక వేళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, గ్రామస్తులు ఈ సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం, బహిరంగసభ నిర్వహణ, ప్రజలకు రవాణా, భోజన ఏర్పాట్లపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
ఒక్కోటీ 12 కిలోల బోల్టులు
ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా 145 మెగావాట్ల భారీ సింగిల్ పంపులను ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నట్టు అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. వాటికి బిగించే ఒక్కో బోల్టు బరువే 12 కిలోలు ఉంటుందని, దాని రూటర్ 80 టన్నులు ఉంటుందని తెలిపారు. 240 టన్నుల బరువుండే దాదాపు 34 పంపులను వినియోగిస్తున్నామని.. ఇంకా ఎన్నో నమ్మశక్యం గాని సాంకేతిక అంశాలున్నాయని వివరించారు. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో ‘పాలమూరు’ పనులను పూర్తి చేయాలని, కాల్వల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్దతులనే అవలంబించాలని సూచించారు. అచ్చంపేట, ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో కాల్వల పనులను మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కలసి పర్యవేక్షించాలని కోరారు. తర్వాత ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుతో, తాగునీటి తరలింపు చర్యలపై మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డితోనూ సీఎం సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment