సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అలైన్‌మెంట్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రాజెక్టులో తొలుత ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దానికన్నా ముందే ఉన్న ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచే రెండింటి ప్రతిపాదిత ఆయకట్టుకు నీరివ్వాలని, ఇందుకోసం రెండు ప్రధాన కాల్వలను నిర్మించాలని నిర్ణయించింది.
నాలుగైదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం దాదాపు 16 నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఆగస్టు నాటికల్లా ఉద్ధండాపూర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించడం గమనార్హం. అయితే ప్రాజెక్టులో తొలిదశ కింద తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ పనులను చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
సచివాలయంలో తొలి సంతకం దీనిపైనే..
శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోసి.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 12,44,940 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆయా జిల్లాలకు తాగునీరు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ‘పాలమూరు’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా అంజనాగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి పేర్లతో మొత్తం 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రతిపాదించారు.
తాజాగా ఇందులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈ రిజర్వాయర్ కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు ఐదో రిజర్వాయరైన ఉద్ధండాపూర్ ద్వారానే సాగునీరు సరఫరా చేయాలని నిర్ణయించింది. 16.03 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఉద్ధండాపూర్ రిజర్వాయర్ ద్వారా తొలుత 5,02,000 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. కేపీలక్ష్మీదేవిపల్లి ఆయకట్టును సైతం కలపడంతో ఇది 9,06,684 ఎకరాలకు చేరింది.
కుడి, ఎడమ కాల్వాల లే అవుట్ ఇదీ..
ఇటీవల ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.5,680 కోట్లతో ఉద్ధండాపూర్ కుడి ప్రధాన కాల్వ, ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు పరిపాలనపర అనుమతులు జారీ చేస్తూ గత నెల 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
కావాలనుకుంటే మళ్లీ నిర్మాణం!
పాత ప్రతిపాదనల ప్రకారం 2.8 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి 4.13 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు పనులు మొదలుపెట్టకపోవడంతో ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంది. భవిష్యత్తులో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు విస్తరించి అదనపు ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తే.. మళ్లీ కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ జలాశయంతో కలిపే ప్రాజెక్టుకు అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి.
కుడి ప్రధాన కాల్వ కింద 3,98,568 ఎకరాలకు..
ఉద్ధండాపూర్ కుడి ప్రధాన కాల్వ 105.5 కిలోమీటర్ల పొడవున ఆయకట్టుకు సాగునీరు అందించనుంది. 6,922 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ఈ కాల్వ ద్వారా 3,98,568 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.
► ఇందులో తొలి కుడి బ్రాంచి కాల్వ (ఆర్బీసీ1) ద్వారా 2,19,731 ఎకరాలకు.. రెండో కుడి బ్రాంచి కాల్వ (ఆర్బీసీ2) ద్వారా 1,00,792 ఎకరాలు, ప్రధాన కాల్వ ద్వారా నేరుగా 78,045 ఎకరాలకు నీరు అందుతుంది. ఈ కుడికాల్వకు అనుసంధానంగా ఫతేపూర్ కాల్వ ద్వారా మరో 6,410 ఎకరాలను సర్కారు ప్రతిపాదించింది.
► తాగునీటి అవసరాల కోసం చించోడ్‌లోని చౌట చెరువు, బ్రహ్మచెరువు, వీర్లపల్లెలోని అంతుకుంట, దామర్‌పల్లిలోని మల్లప్ప చెరువు, హైతాబాద్‌లోని పెద్ద చెరువు, మాచాన్‌పల్లిలోని నల్ల చెరువు, చందనవల్లిలోని పెద్ద చెరువు, తాడ్లపల్లిలోని నాగుల చెరువు, లింగారెడ్డి చెరువు, దారప్పల్లిలోని దార్పల్లి చెరువులను కుడి ప్రధాన కాల్వతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎడమ ప్రధాన కాల్వ కింద 5,01,706 ఎకరాలకు..
ఉద్ధండాపూర్ ఎడమ ప్రధాన కాల్వ 133.65 కిలోమీటర్ల పొడవునా సాగుతుంది. దీని సామర్థ్యం 3,790.8 క్యూసెక్కులు. ఈ కాల్వ కింద 5,01,706 ఎకరాల ఆయకట్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. తాగునీటి అవసరాలకు మల్కా చెరువు (కుసుమ సముద్రం), కొత్త చెరువు (ఇప్పాయిపల్లి), చైలమ్మ చెరువు (కుల్కచర్ల), ఖమ్మం చెరువు (ఖమ్మమాచారం), ఊర చెరువు (పాలెపల్లి), కొత్త చెరువు (బాచ్పల్లి), ఊర చెరువు (ఊట్పల్లి), సర్పాన్‌పల్లి ప్రాజెక్టు(సర్పాన్‌పల్లి), అలీపూర్ ట్యాంకు (అలీపూర్), పెద్ద చెరువు (పెద్దెముల్)లను ఎడమ ప్రధాన కాల్వ ద్వారా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధాన కాల్వలకు వ్యయం రూ.5,678 కోట్లు
కుడి/ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణానికి మొత్తం రూ.4,659 కోట్ల వ్యయం అవుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. వీటి నిర్మాణానికి 8,411 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంటుందని.. ఎకరాకు రూ.12లక్షల చొప్పున అంచనా వేసుకుంటే అదనంగా రూ.1,019.41 కోట్లు అవసరమని తేల్చింది. దీంతో మొత్తంగా ప్రధాన కాల్వల వ్యయం రూ.5,678 కోట్లు అవుతుందని అంచనా వేసింది. సాగునీటి శాఖ ప్రతిపాదనల ప్రకారం.. ఉద్ధండాపూర్ జలాశయం నుంచి ప్రధాన కాల్వ ప్రారంభమవుతుంది. 16.5 కిలోమీటర్ వద్ద ఎడమ, కుడి ప్రధాన కాల్వలుగా విడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment