నేడే ‘పాలమూరు’ ఎత్తిపోత.. ప్రాజెక్టు విశేషాలివే.. | Bahubali motors and other specialities for Palamuru-Rangareddy lift irrigation | Sakshi
Sakshi News home page

నేడే ‘పాలమూరు’ ఎత్తిపోత: మహా బాహుబలి మోటార్లు.. కాళేశ్వరం రికార్డు బద్ధలు

Sep 16 2023 9:35 AM | Updated on Sep 16 2023 10:51 AM

Bahubali motors And Other Specialities Palamuru rangareddy Lift Irrigation - Sakshi

ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోత­ల పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్‌ కాల్వ ద్వారా నార్లాపూర్‌ ఇన్‌టేక్‌ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్‌ నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వెంటనే నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకు­ని అక్కడికి చేరుకున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత కొల్లాపూర్‌ పట్టణ శివారులో జరిగే బహిరంగ సభలో ముఖ్య­మంత్రి ప్రసంగిస్తారు. 
– సాక్షి, హైదరాబాద్‌

8 రోజులు.. 2 టీఎంసీలు
శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది.

ఇందులో భాగంగా 6.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన నార్లాపూర్‌ రిజర్వాయర్‌ పనులు పాక్షికంగానే పూర్తయ్యాయి. నార్లాపూర్‌ వద్ద 145 మెగావాట్ల భారీ సామర్థ్యంతో 8 బాహుబలి పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, 3 పంపుల పనులు మాత్రమే చేపట్టారు. అందులో ఒక పంపు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటి ఎత్తిపోతను కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఒక పంపు ద్వారా 8 రోజుల పాటు నీళ్లను ఎత్తిపోసి 2 టీఎంసీలను రిజర్వాయర్‌లో నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రెండో స్టేజీ లిఫ్టులో భాగంగా నార్లాపూర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోసే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా ఐదు స్టేజీల్లో నీళ్లను ఎత్తిపోసి మొత్తం 67.52 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఆరు రిజర్వాయర్లలో వేయాల్సి ఉండగా, ఆ మేరకు పనులు పూర్తి కాలేదు. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, సొరంగాల పనులు 80 శాతం పూర్తయ్యాయని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,200 కోట్లు కాగా గత మార్చి నాటికి రూ.23,684 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి.

రెండో విడత ప్రాజెక్టు చేపడితేనే సాగునీరు...
ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 రిజర్వాయర్లలో కొంతమేరకు నీళ్లను నింపి పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. (చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులను ప్రభుత్వం అనధికారికంగా విరమించుకుంది). అయితే రిజర్వాయర్ల నుంచి నీళ్లను తాగు, సాగునీటి అవసరాలకు తరలించేందుకు అవసరమైన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పనులను ఇంకా ప్రారంభించలేదు. పర్యావరణ అనుమ­తులు లభించిన తర్వాత ఈ పనులను రెండో విడతలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ప్రాజెక్టును ప్రారంభించినా తక్షణ ప్రయోజనాలు ఉండవు. రెండో విడత పనులు పూర్తైన తర్వాతే ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందనుంది.

కలశాల్లో గ్రామాలకు కృష్ణా జలాలు
సాక్షి, నాగర్‌కర్నూల్‌: సీఎం కేసీఆర్‌ శనివారం నార్లాపూర్‌ జలాశయం వద్ద కృష్ణా జలాల్లోకి పూలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత పాలమూరులోని అన్ని గ్రామ పంచాయతీలకు కృష్ణా జలాలను కలశాల్లో పంపిణీ చేయన్నారు. ఈ ప్రక్రియలో ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు పాలుపంచుకోనున్నారు. కృష్ణా జలాలతో పాలమూరు వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని దేవతామూర్తులకు అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

4 గంటల పాటు కేసీఆర్‌ పర్యటన
కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి ఉదయం బస్సులో బయ­లు­దేరతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్‌క­ర్నూల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని తేజ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. 3 గంటలకు నార్లాపూర్‌ పంపుహౌస్‌కు చేరుకుని పాల­మూ­రు–రంగారెడ్డి ప్రాజెక్టు స్టేజ్‌–1లోని మొదటి మోటారును ప్రారంభిస్తారు. 3.50 గంటలకు అక్కడి నుంచి కొల్లాపూర్‌కు బయలుదేరుతారు. 4.30 గంటలకు సింగోటం చౌరస్తాలోని బహిరంగ సభ ప్రాంగణా­నికి చేరుకుంటారు. 5.30 గంటలకు సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరిగి వెళతారు.

‘పాలమూరు–రంగారెడ్డి’ విశిష్టతలెన్నో..
► ఆయకట్టు:12.30 లక్షల ఎకరాలు
►  జల వనరు: శ్రీశైలం జలాశయం 
►  ప్రతిరోజూ లిఫ్ట్‌ చేసే జలాలు: 1.50 టీఎంసీలు 
►  లిఫ్టుల స్టేజ్‌లు: 5
► రిజర్వాయర్ల సంఖ్య: 6
►  నీటినిల్వ సామర్థ్యం: 67.52 టీఎంసీలు
►  పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు
► నీటిని లిఫ్ట్‌ చేసే గరిష్ట ఎత్తు: 672 మీటర్లు
►  సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు
►  ప్రధాన కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు
►  తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు
►    పరిశ్రమలకు కేటాయింపులు : 3 టీఎంసీలు
►    సాగునీటికి కేటాయింపులు : 79.00 టీఎంసీలు


►నాలుగు పంప్‌హౌసుల్లో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన మొత్తం 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఇందులో  3 పంపులను అత్యవసర సమయాల్లో స్టాండ్‌బైగా వినియోగించనున్నారు. 

► మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ తయారు చేయడం విశేషం

►ఏదుల పంప్‌హౌస్‌ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్‌ పూల్‌

►అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు.

►145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్ల వినియోగం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement