వచ్చే ఖరీఫ్‌కు ‘పాలమూరు’ | CM KCR Says By Kharif Season Palamuru Lift Irrigation Will Be Started | Sakshi
Sakshi News home page

వచ్చే ఖరీఫ్‌కు ‘పాలమూరు’

Published Sat, Aug 24 2019 1:31 AM | Last Updated on Sat, Aug 24 2019 4:58 AM

CM KCR Says By Kharif Season Palamuru Lift Irrigation Will Be Started - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి పాక్షికంగా అందుబాటులోకి తెచ్చేలా నిర్మాణ పనులు సాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కనిష్టంగా ఒక టీఎంసీ నీటిని తరలించేలా పంప్‌హౌస్, టన్నెల్, కాల్వల పనులు పూర్తి చేయాలని సూచించారు. దీని ద్వారా వచ్చే ఏడాది ఖరీఫ్‌లోనే 7 లక్షల ఎకరాలకు నీరందించాలని స్పష్టం చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పై నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ రమేశ్, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. ప్రాజెక్టుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) ద్వారా అందనున్న రుణాలు, వాటి వినియోగం, వచ్చే ఏడాది ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు, దానికి తగ్గట్లు నిర్మాణ పనులు తదితర అంశాలపై ఆయన చర్చించారు.  

మొత్తం 12.3 లక్షల ఎకరాలకు.. 
ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. ఇందుకు 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తీసుకోవాలని నిర్ణయించగా, ఇందులో 30 టీఎంసీలు డిండికి కేటాయించగా, 90 టీఎంసీలు పాలమూరు–రంగారెడ్డికి కేటాయించారు. ఈ మొత్తం ఆయకట్టులో వచ్చే ఏడాది ఖరీఫ్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 8 మండలాల పరిధిలో 1.03 లక్షలు, నారాయణపేట 9 మండలాల పరిధిలో 1.6 లక్షలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 13 మండలాల పరిధిలో 2.35 లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 3.6 లక్షల ఎకరాల ఆయకట్టులో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. ఈ ఆయకట్టుకు నీరందిచేలా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని వరద ఉండే 60 రోజుల్లో తీసుకునేలా నిర్మాణ పనులు చేయాలని సూచించారు. ప్రాజెక్టులోని ప్రధానమైన నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్ధండాపూర్‌ పంప్‌హౌస్‌లలో 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లను అమర్చాల్సి ఉండగా, ఇందులో తొలిదశలో 4 చొప్పున మోటార్లను వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి సిద్ధం చేయాలని, 2021 మార్చి–ఏప్రిల్‌ నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. 

నిధుల కొరత లేకుండా చూస్తా.. 
ప్రాజెక్టుకు సంబంధించి సివిల్‌ పనులు మాత్రం పూర్తిగా చేయాలని తెలిపినట్లుగా సమాచారం. నిర్మాణ పనుల పూర్తికి సంబంధించిన టైమ్‌ షెడ్యూల్‌ను సైతం ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఇక వీటికి అనుగుణంగా జంట టన్నెల్‌ నిర్మాణాలు ఉన్న చోట కనీసం ఒక టన్నెల్‌ నిర్మాణ పనులైనా పూర్తి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణాల పూర్తికి వీలుగా పీఎఫ్‌సీ ద్వారా రూ.10 వేల కోట్ల రుణాల ఒప్పంద ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రుణాలను వినియోగిస్తూ పంప్‌హౌస్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని, మిగతా వాటికి ప్రభుత్వపరంగా నిధుల కొరత లేకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే వారం పాలమూరు ప్రాజెక్టు పరిధిలో పర్యటిస్తానని చెప్పినట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. నార్లాపూర్‌లో రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం చేయాలన్న గత ప్రతిపాదనను పక్కన పెట్టారని, ఇక్కడి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని సైతం 8.5 టీఎంసీల నుంచి 6.5 టీఎంసీలకు తగ్గిస్తూ నిర్ణయించినట్లు సమాచారం. 

కాళేశ్వరం మాదిరి వేగంగా..: సీఎం కేసీఆర్‌ 
కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మిగతా సగానికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వాలని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే రేయింబవళ్లు, మూడు షిఫ్టుల్లో పనిచేసి ప్రాజెక్టు పూర్తి చేసి.. వచ్చే వర్షాకాలంలో సాగునీరు అందించాలని ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంపు హౌస్‌లు, కాల్వల పనులు సమాంతరంగా చేపట్టాలని చెప్పారు. సీనియర్‌ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర పర్యటన జరిపి, పనుల్లో వేగం పెంచాలని సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement