సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగా నదిపై నిర్మించిన తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు చనాకా–కొరాటా బ్యారేజీ, ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ వచ్చే నెల తొలివారంలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తికావడంతో ఈ ఏడాది నుంచి బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని భావిస్తోంది.
గ్రావిటీ కాల్వ ద్వారా 48 వేల ఎకరాలు, ఎత్తిపోతల ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 80 కి.మీ.ల పొడవునా కాల్వ ఉండగా 49వ కి.మీ. వద్ద ఐదు పంపులతో నీటిని ఎత్తిపోయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో థాంసీ, జైనథ్, ఆదిలాబాద్ మండలాల్లోని 14 గ్రామాలకు తాగు, సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. దీంతోపాటు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని కేలాపూర్ తహసీల్ పరిధిలో 9 గ్రామాలకు సాగునీరు అందించనున్నారు.
డిస్ట్రిబ్యూటరీ మెయిన్స్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు ఇప్పట్లో సాగునీరు అందించే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య 1975లో ఒప్పందం జరగ్గా మళ్లీ 2016లో ఇరు రాష్ట్రాలు కొత్త ఒప్పందాన్ని చేసుకున్నాయి.
28న ఇంటర్‌స్టేట్ బోర్డు సమావేశం..
చనాకా–కొరాటా ప్రాజెక్టు బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నెల 28న మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కూడిన ఇంటర్‌స్టేట్ బోర్డు సమావేశమై చర్చించనుంది. నీటి నిల్వ, వినియోగంపై చర్చించి ఓ అంగీకారానికి రానుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు చివరి దశలో ఉన్నాయి. టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ ఇప్పటికే అనుమతి జారీ చేయగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment