chanaka
-
జూలైలో ‘చనాకా–కొరాటా’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగా నదిపై నిర్మించిన తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు చనాకా–కొరాటా బ్యారేజీ, ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ వచ్చే నెల తొలివారంలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తికావడంతో ఈ ఏడాది నుంచి బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని భావిస్తోంది. గ్రావిటీ కాల్వ ద్వారా 48 వేల ఎకరాలు, ఎత్తిపోతల ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 80 కి.మీ.ల పొడవునా కాల్వ ఉండగా 49వ కి.మీ. వద్ద ఐదు పంపులతో నీటిని ఎత్తిపోయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో థాంసీ, జైనథ్, ఆదిలాబాద్ మండలాల్లోని 14 గ్రామాలకు తాగు, సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. దీంతోపాటు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని కేలాపూర్ తహసీల్ పరిధిలో 9 గ్రామాలకు సాగునీరు అందించనున్నారు. డిస్ట్రిబ్యూటరీ మెయిన్స్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు ఇప్పట్లో సాగునీరు అందించే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య 1975లో ఒప్పందం జరగ్గా మళ్లీ 2016లో ఇరు రాష్ట్రాలు కొత్త ఒప్పందాన్ని చేసుకున్నాయి. 28న ఇంటర్‌స్టేట్ బోర్డు సమావేశం.. చనాకా–కొరాటా ప్రాజెక్టు బ్యారేజీలో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నెల 28న మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కూడిన ఇంటర్‌స్టేట్ బోర్డు సమావేశమై చర్చించనుంది. నీటి నిల్వ, వినియోగంపై చర్చించి ఓ అంగీకారానికి రానుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు చివరి దశలో ఉన్నాయి. టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ ఇప్పటికే అనుమతి జారీ చేయగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి రావాల్సి ఉంది. -
చనాకా–కొరటకు వన్యప్రాణి సంరక్షణ అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ నదిపై మహారాష్ట్ర, తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా చేపట్టిన చనాకా–కొరట బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని వన్యప్రాణి సంరక్షణ బోర్డు స్టాండింగ్ కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో భాగంగా గతనెల 24న ప్రాజెక్టుపై పర్యావరణ శాఖమంత్రి ఆధ్వర్యంలోని స్టాండింగ్ కమిటీ ఈ ప్రాజెక్టు అనుమతులపై చర్చించింది. 0.80 టీఎంసీ సామర్థ్యంతో రూ.368 కోట్లతో బ్యారేజీ చేపట్టారు. 13,500 ఎకరాల ఆయకట్టు తెలంగాణలో, మరో 3 వేల ఎకరాల ఆయకట్టు మహారాష్ట్రలో దీనిద్వారా సాగు జరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం మహారాష్ట్రలోని తాపేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉంది. దీనికి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో 213.48 హెక్టార్ల అటవేతర (నాన్ ఫారెస్ట్) భూమి అవసరం కానుండగా, మరో 5 వేల హెక్టార్ల అటవేతర భూమి రెండు రాష్ట్రాల్లోని బ్యారేజీ నిర్మాణం, ముంపు ప్రాంతంలోకి వస్తుంది. దీని పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వం కమిటీకి పంపగా, అటవీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు జర గడం లేదని, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ అనుమతులు జారీచేసింది. అయితే సంరక్షణ కేంద్రానికి చుట్టు పక్కల పెద్ద శబ్దాలొచ్చే యంత్రాలను వాడరాదని, కెనాల్ పనుల నిమిత్తం ఉండే కార్మికుల క్యాంపులు సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉండాలని, అటవీ శాఖకు కెనాల్ నీటిని పూర్తి ఉచితంగా అందించాలని షరతులు విధించింది. చదవండి: Sitarama project: ముంపు సంగతేంటి...? -
ఛనాఖా-కొరట బ్యారేజీకి ఆమోదం
* రూ.368 కోట్లు విడుదల చేస్తూ ఫైల్‌పై సీఎం సంతకం * నేడు అధికారికంగా ఉత్తర్వులు * పెనుగంగ దిగువన 1.5 టీఎంసీల సామర్ధ్యంతో బ్యారేజీ నిర్మాణం సాక్షి, హైదరాబాద్: దిగువ పెనుగంగ ప్రాజెక్టుల్లో భాగంగా మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఉమ్మడిగా చేపడుతున్న ‘ఛనాఖా- కొరట’ బ్యారేజీ పనుల ప్రారంభానికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. గోదావరి ఉపనది పెన్‌గంగపై నిర్మిస్తున్న ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.368 కోట్లు విడుదల చేసే ఫైల్‌పై ఆదివారం ఆయన సంతకం చేశారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు సోమవారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. పెనుగంగ నదిలో మొత్తంగా 42 టీఎంసీల మేర నీటిని వాడుకునే హక్కును ఇరు రాష్ట్రాలు కలిగి ఉండగా, అందులో 12 శాతం వాటా (5.12 టీఎంసీలు) రాష్ట్రానికి దక్కాల్సి ఉంది. ఈ నీటితో ఆదిలాబాద్ జిల్లాలోని ధాంప్సీ, జైనధ్, బేలా మండలాల పరిధిలోని 47,500 ఎకరాలకు సాగునిరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిని వాడుకునే క్రమంలో ప్రధాన డ్యామ్‌ను మహారాష్ట్ర నిర్మించాల్సి ఉండగా, దీనికి రూ.14 వేల కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ధారించారు. డ్యామ్‌లో భాగంగా ఉండే ఎడమ కాల్వకు 11.19 కిలో మీటర్ల తర్వాత నుంచి తెలంగాణ కాల్వ మొదలవుతుంది. దీని ద్వారానే నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వాలి. అయితే డ్యామ్ నిర్మాణంతో పాటు, ప్రధాన పనులు, కాల్వల తవ్వకానికి అటవీ, పర్యావరణ అనుమతులు లభించినా, హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్‌కు సంబంధించి కేంద్ర జల సంఘం అనుమతులు రావాల్సి ఉంది. ఇవన్నీ లభించి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు చాలా గడువు పడుతున్న దృష్ట్యా మహారాష్ట్ర దిగువ పెనుగంగలో తనకు వాడుకునే అవకాశం ఉన్న 9 టీఎంసీల నీటిని బ్యారేజీల ద్వారా తరలించి వాడుకోవాలని నిర్ణయించింది. బ్యారేజీల నిర్మాణం చేపట్టాలంటే తెలంగాణ భూ భాగంలోని ఒడ్డును మహారాష్ట్ర వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఒడ్డును వాడుకునే క్రమంలో ఇరు రాష్ట్రాలు 2013లో ఉమ్మడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం మహారాష్ట్ర వాడుకునే మొత్తం 9 టీఎంసీల నీటిలో 12 శాతం (1.5 టీఎంసీలు) రాష్ట్రానికి ఇవ్వాలి. కాగా, ఈ పనులను వచ్చే జనవరిలో ఆరంభించి రెండేళ్ల కాల పరిమితిలో పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జోగు రామన్న హర్షం: బ్యారేజీ నిర్మాణ పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వడంపై ఆదిలాబాద్ జిల్లా మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, బోధ్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 50 వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని, బీడు భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. రైతులు, ప్రజల దశాబ్ధాల కలను తెలంగాణ ప్రభుత్వం 17 నెలల కాలంలోనే సాకారం చేస్తూ తన చిత్తశుధ్ధిని చాటిందన్నారు.