* రూ.368 కోట్లు విడుదల చేస్తూ ఫైల్‌పై సీఎం సంతకం
* నేడు అధికారికంగా ఉత్తర్వులు
* పెనుగంగ దిగువన 1.5 టీఎంసీల సామర్ధ్యంతో బ్యారేజీ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: దిగువ పెనుగంగ ప్రాజెక్టుల్లో భాగంగా మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఉమ్మడిగా చేపడుతున్న ‘ఛనాఖా- కొరట’ బ్యారేజీ పనుల ప్రారంభానికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. గోదావరి ఉపనది పెన్‌గంగపై నిర్మిస్తున్న ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.368 కోట్లు విడుదల చేసే ఫైల్‌పై ఆదివారం ఆయన సంతకం చేశారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు సోమవారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. పెనుగంగ నదిలో మొత్తంగా 42 టీఎంసీల మేర నీటిని వాడుకునే హక్కును ఇరు రాష్ట్రాలు కలిగి ఉండగా, అందులో 12 శాతం వాటా (5.12 టీఎంసీలు) రాష్ట్రానికి దక్కాల్సి ఉంది. ఈ నీటితో ఆదిలాబాద్ జిల్లాలోని ధాంప్సీ, జైనధ్, బేలా మండలాల పరిధిలోని 47,500 ఎకరాలకు సాగునిరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిని వాడుకునే క్రమంలో ప్రధాన డ్యామ్‌ను మహారాష్ట్ర నిర్మించాల్సి ఉండగా, దీనికి రూ.14 వేల కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ధారించారు.
డ్యామ్‌లో భాగంగా ఉండే ఎడమ కాల్వకు 11.19 కిలో మీటర్ల తర్వాత నుంచి తెలంగాణ కాల్వ మొదలవుతుంది. దీని ద్వారానే నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వాలి. అయితే డ్యామ్ నిర్మాణంతో పాటు, ప్రధాన పనులు, కాల్వల తవ్వకానికి అటవీ, పర్యావరణ అనుమతులు లభించినా, హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్‌కు సంబంధించి కేంద్ర జల సంఘం అనుమతులు రావాల్సి ఉంది. ఇవన్నీ లభించి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు చాలా గడువు పడుతున్న దృష్ట్యా మహారాష్ట్ర దిగువ పెనుగంగలో తనకు వాడుకునే అవకాశం ఉన్న 9 టీఎంసీల నీటిని బ్యారేజీల ద్వారా తరలించి వాడుకోవాలని నిర్ణయించింది. బ్యారేజీల నిర్మాణం చేపట్టాలంటే తెలంగాణ భూ భాగంలోని ఒడ్డును మహారాష్ట్ర వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఒడ్డును వాడుకునే క్రమంలో ఇరు రాష్ట్రాలు 2013లో ఉమ్మడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం మహారాష్ట్ర వాడుకునే మొత్తం 9 టీఎంసీల నీటిలో 12 శాతం (1.5 టీఎంసీలు) రాష్ట్రానికి ఇవ్వాలి. కాగా, ఈ పనులను వచ్చే జనవరిలో ఆరంభించి రెండేళ్ల కాల పరిమితిలో పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
జోగు రామన్న హర్షం: బ్యారేజీ నిర్మాణ పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వడంపై ఆదిలాబాద్ జిల్లా మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, బోధ్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 50 వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని, బీడు భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. రైతులు, ప్రజల దశాబ్ధాల కలను తెలంగాణ ప్రభుత్వం 17 నెలల కాలంలోనే సాకారం చేస్తూ తన చిత్తశుధ్ధిని చాటిందన్నారు.