సాక్షి, హైదరాబాద్: తాము ‘ఇండియా’ వైపు కానీ లేదా ఎన్డీయే వైపు కానీ లేమని భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎవరి వైపూ లేమని, ఉండబోమని అన్నారు. అయితే తాము ఒంటరిగా మాత్రం లేమని, మిత్రులతో కలిసి ఉన్నామని చెప్పారు. మంగళవారం మహారాష్ట్రలో పర్యటించిన సీఎం కేసీఆర్ స్థానిక మీడియాతో, బహిరంగ సభలో మాట్లాడారు. ‘నయా ఇండియా ఏంటి? 50 సంవత్సరాలు వాళ్లు అధికారంలో ఉన్నా మార్పు రాలేదు. మార్పు జరగాల్సి ఉంది..’ అని అన్నారు. వివిధ స్థాయిల్లో తమ పార్టీకి సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఎన్నికల యుద్ధ గంట మ్రోగించామని, మహారాష్ట్రలో తమ పని ప్రారంభించామని చెప్పారు. 14.10 లక్షల మంది పదాధికారులు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు 50 శాతం పని పూర్తయిందని, మరో 15 నుంచి 20 రోజుల్లో గ్రామగ్రామాన పూర్తిస్థాయిలో పని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్ర లాంటి అద్భుతమైన రాష్ట్రం మరొకటి లేదని, అనేక వనరులున్నాయని కేసీఆర్ చెప్పారు. అయినా ఔరంగాబాద్ వంటి నగరంలో నీటి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. దళిత సమాజం ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు.
మాతంగి సమాజానికి సరైన ఆదరణ లేదు
వాటేగావ్‌లో అన్నాభావ్ సాఠే 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. మహారాష్ట్రలో అంటరాని కులంలో పుట్టి జీవితాన్ని వడపోసి కమ్యూనిస్టుగా, అంబేడ్కరిస్టుగా సమ సమాజ స్థాపనకు జీవితాంతం కృషి చేసిన అన్నాభావ్ సాఠేకు ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాతంగి సమాజం ముద్దుబిడ్డ, దేశం గర్వించదగిన దళిత ప్రజాకవికి దేశ పాలకులు సరైన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు.
తన రచనలు సాహిత్య రంగంలో చేసిన కృషితో పాటు అణగారిన వర్గాల కోసం అన్నాభావ్ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. లక్ష్య సాధనలో వెనకడుగు వేయకుండా జీవితాంతం ప్రజలతోనే ఉన్నారని కొనియాడారు. సాఠే త్యాగాలను మహరాష్ట్రతో పాటు కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని, ఆయన రచనలను అన్ని భారతీయ భాషల్లోకి అనువదించడం ద్వారా ఆయన విశ్వజనీన తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
అన్నాభావ్ సాఠే జన్మించిన మాతంగి సమాజం గొప్పదనాన్ని మహాకవి కాళిదాసు కీర్తించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. సాఠేకు భారతరత్న బిరుదు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తూ ఆయనకు స్వయంగా లేఖ రాస్తానని ప్రకటించారు. మాతంగి సమాజానికి మహారాష్ట్ర ప్రభుత్వం సరైన ఆదరణ, గుర్తింపు ఇవ్వడం లేదని, ఎమ్మెల్యేలుగా, ప్రజా ప్రతినిధులుగా చట్ట సభల్లో భాగస్వామ్యం కలి్పంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ మాతంగి సమాజానికి సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాగా అన్నాభావ్ సాఠే ప్రతిమను ఆయన కుటుంబ సభ్యులు కేసీఆర్‌కు బహూకరించారు. అన్నాభావ్ మనవడు సచిన్ భావ్ సాఠే, సచిన్ సాఠే తల్లి సావిత్రిభాయ్ సాఠే, మహారాష్ట్ర బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కె.వంశీధర్ రావు, హరిభావ్ రాథోడ్ , ఖదీర్ మౌలానా, భానుదాస్ ముర్కుటే, ఘన్ శ్యాం శేలార్, భగీరథ్ బాల్కే, బీజే దేశ్‌ముఖ్, శంకరన్న డోంగే, మాలిక్ కదం, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, యశ్‌పాల్ బీంగే తదితరులు పాల్గొన్నారు.
అంబాబాయికి ప్రత్యేక పూజలు....
కేసీఆర్ మంగళవారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్, తెలంగాణ, మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. కొల్లాపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేసీఆర్ నేరుగా మహాలక్ష్మి మాతా అంబాబాయి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాంగ్లి జిల్లా వాటేగావ్‌లో అన్నాభావ్ సాఠే విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచారు.
బహిరంగ సభ వేదికపై అన్నాభావ్ సాఠే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ, సాహు మహారాజ్, మహాత్మ జ్యోతిరావు పూలే తదితరుల చిత్రపటాలకు పుష్పాంజలి అరి్పంచారు. సభ అనంతరం ఇస్లాంపూర్‌లోని షేత్కారి సంఘటన్ నేత రఘునాథ్ దాదాపాటిల్ నివాసంలో పార్టీ నేతలతో కలసి భోజనం చేశారు. తర్వాత సాహు మహారాజ్ సమాధి వద్ద నివాళి అర్పించారు. రాత్రి ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment