సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు (మంగళవారం) మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.15 గంటలకు కొల్లాపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కొల్లాపూర్‌లోని అంబాబాయి(మహాలక్ష్మి) దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు సాంగ్లి జిల్లాలోని వటేగావ్ చేరుకుని మహారాష్ట్రలో పేరొందిన సామాజిక కార్యకర్త, రచయిత అన్నాభావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సాఠే నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా సాఠే కోడలు, మనవడితోపాటు వివిధ పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతారని పార్టీ నేతలు వెల్లడించారు. మధ్యాహ్నం 1.30కు ఇస్తాంపూర్‌లోని షేత్కారి సంఘటన్ నేత రఘునాథ్ దాదాపాటిల్ నివాసంలో కేసీఆర్ భోజనం చేస్తారు.
సాయంత్రం ఐదు గంటలకు కొల్లాపూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అన్నాభావు సాఠే మహారాష్ట్రలో పలు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సాఠే వర్దంతి కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment