థానే: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేశంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలలో వజ్రేశ్వరి దేవి ఆలయం ఒకటి. నవరాత్రులలో ఈ అమ్మవారిని దర్శించుకుంటే సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు.
వజ్రేశ్వరి దేవి ఆలయం మహారాష్ట్రలోని వజ్రేశ్వరిలో ఉంది. ఈ నగరం ముంబైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని చిమాజీ అప్పా పేష్వా నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారని చరిత్రకారులు అంటుంటారు. పిడుగుపాటు నుండి మాతా వజ్రేశ్వరి దేవి ప్రత్యక్షమై పలువురు రాక్షసులను అంతం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో వజ్రేశ్వరి దేవితో పాటు రేణుకా మాత, కాళికా మాత, మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి.
వజ్రేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ఒక వేడి నీటి చెరువు ఉంది. దీనిలో స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయని స్థానికులు చెబుతుంటారు. నవరాత్రులలో ఇక్కడికి వచ్చే భక్తులు ఈ చెరువులో స్నానం చేసి, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ సౌందర్యం నవరాత్రులలో మరింత శోభాయమానంగా మారుతుంది. వజ్రేశ్వరిదేవి ఆలయానికి చేరుకోవాలంటే 52 మెట్లు ఎక్కాలి. నవరాత్రుల సమయంలో ఈ మెట్లను వేల రకాల పూలు, దీపాలతో అందంగా అలంకరిస్తారు.
నవరాత్రులలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సాయంత్రం హారతి సమయంలో ప్రాంగణం అత్యంత రద్దీగా మారుతుంది. వజ్రేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముందుగా ముంబైకి చేరుకుని, అక్కడి నుంచి టాక్సీ సాయంతో ఆలయానికి రావచ్చు. మహారాష్ట్రలోని థానే నగరం నుండి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు
Comments
Please login to add a commentAdd a comment