Narlapur reservoir
-
నేడే ‘పాలమూరు’ ఎత్తిపోత.. ప్రాజెక్టు విశేషాలివే..
ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్ నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వెంటనే నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడికి చేరుకున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత కొల్లాపూర్ పట్టణ శివారులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. – సాక్షి, హైదరాబాద్ 8 రోజులు.. 2 టీఎంసీలు శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 6.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్ పనులు పాక్షికంగానే పూర్తయ్యాయి. నార్లాపూర్ వద్ద 145 మెగావాట్ల భారీ సామర్థ్యంతో 8 బాహుబలి పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, 3 పంపుల పనులు మాత్రమే చేపట్టారు. అందులో ఒక పంపు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటి ఎత్తిపోతను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒక పంపు ద్వారా 8 రోజుల పాటు నీళ్లను ఎత్తిపోసి 2 టీఎంసీలను రిజర్వాయర్‌లో నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో స్టేజీ లిఫ్టులో భాగంగా నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోసే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా ఐదు స్టేజీల్లో నీళ్లను ఎత్తిపోసి మొత్తం 67.52 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఆరు రిజర్వాయర్లలో వేయాల్సి ఉండగా, ఆ మేరకు పనులు పూర్తి కాలేదు. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, సొరంగాల పనులు 80 శాతం పూర్తయ్యాయని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,200 కోట్లు కాగా గత మార్చి నాటికి రూ.23,684 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రెండో విడత ప్రాజెక్టు చేపడితేనే సాగునీరు... ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 రిజర్వాయర్లలో కొంతమేరకు నీళ్లను నింపి పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. (చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ప్రభుత్వం అనధికారికంగా విరమించుకుంది). అయితే రిజర్వాయర్ల నుంచి నీళ్లను తాగు, సాగునీటి అవసరాలకు తరలించేందుకు అవసరమైన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పనులను ఇంకా ప్రారంభించలేదు. పర్యావరణ అనుమతులు లభించిన తర్వాత ఈ పనులను రెండో విడతలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ప్రాజెక్టును ప్రారంభించినా తక్షణ ప్రయోజనాలు ఉండవు. రెండో విడత పనులు పూర్తైన తర్వాతే ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కలశాల్లో గ్రామాలకు కృష్ణా జలాలు సాక్షి, నాగర్‌కర్నూల్: సీఎం కేసీఆర్ శనివారం నార్లాపూర్ జలాశయం వద్ద కృష్ణా జలాల్లోకి పూలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత పాలమూరులోని అన్ని గ్రామ పంచాయతీలకు కృష్ణా జలాలను కలశాల్లో పంపిణీ చేయన్నారు. ఈ ప్రక్రియలో ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు పాలుపంచుకోనున్నారు. కృష్ణా జలాలతో పాలమూరు వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని దేవతామూర్తులకు అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 4 గంటల పాటు కేసీఆర్ పర్యటన కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం బస్సులో బయలుదేరతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తేజ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. 3 గంటలకు నార్లాపూర్ పంపుహౌస్‌కు చేరుకుని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు స్టేజ్–1లోని మొదటి మోటారును ప్రారంభిస్తారు. 3.50 గంటలకు అక్కడి నుంచి కొల్లాపూర్‌కు బయలుదేరుతారు. 4.30 గంటలకు సింగోటం చౌరస్తాలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.30 గంటలకు సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. ‘పాలమూరు–రంగారెడ్డి’ విశిష్టతలెన్నో.. ► ఆయకట్టు:12.30 లక్షల ఎకరాలు ► జల వనరు: శ్రీశైలం జలాశయం ► ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 1.50 టీఎంసీలు ► లిఫ్టుల స్టేజ్‌లు: 5 ► రిజర్వాయర్ల సంఖ్య: 6 ► నీటినిల్వ సామర్థ్యం: 67.52 టీఎంసీలు ► పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు ► నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు: 672 మీటర్లు ► సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు ► ప్రధాన కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు ► తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు ► పరిశ్రమలకు కేటాయింపులు : 3 టీఎంసీలు ► సాగునీటికి కేటాయింపులు : 79.00 టీఎంసీలు ►నాలుగు పంప్‌హౌసుల్లో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన మొత్తం 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఇందులో 3 పంపులను అత్యవసర సమయాల్లో స్టాండ్‌బైగా వినియోగించనున్నారు. ► మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ తయారు చేయడం విశేషం ►ఏదుల పంప్‌హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ ►అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు. ►145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్ల వినియోగం -
వట్టెం టు డిండి!
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో చేపట్టిన డిండి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలనే అంశం ఖరారైంది. డిండికి నీటిని తీసుకునే ప్రాంతాలపై గడిచిన మూడేళ్లుగా సుదీర్ఘ అధ్యయనం చేసిన ప్రభుత్వం తుదకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకే మొగ్గు చూపింది. నార్లాపూర్, ఏదుల ద్వారా నీటిని తరలిస్తే అధిక వ్యయాలతో పాటు, టన్నెల్ మార్గాల నిర్మాణం ఆలస్యం అవుతుందన్న అంచనాతో వట్టెం నుంచి తరలింపుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కేవలం రూ.230 కోట్లతో ఈ ప్రణాళిక పట్టాలెక్కనుంది. సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోస్తూ.. 30 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ 30 టీఎంసీల నీటిని మొదట పాలమూరు–రంగారెడ్డిలో భాగంగా ఉండే నార్లాపూర్ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇక్కడి నుంచి నీటిని తీసుకుంటే ఇప్పటికే వృధ్ధిలోకి వచ్చిన కల్వకుర్తి ఆయకట్టు దెబ్బతింటుండటం, భూసేకరణ సమస్యలతో పాటు, అటవీ ప్రాంతాల నుంచి అలైన్మెంట్ ఉండటంతో దీన్ని పక్కనపెట్టారు. ఈ మార్గం ద్వారా నీటిని తీసుకునేందుకు రూ.3,908 కోట్ల వరకు వ్యయం అవుతోంది. దీంతో దీన్ని పక్కనపెట్టి పాలమూరులో రెండో రిజర్వాయర్ అయిన ఏదుల నుంచి తరలించే అంశంపై అధ్యయనం చేశారు. ఈ మార్గం ద్వారా తరలింపులో 18 కిలోమీటర్ల టన్నెల్ మార్గం అవసరం అవుతోంది. ఇది పూర్తి చేయాలంటే కనీసంగా రెండేళ్లకు పైగా సమయం పడుతోంది. అదీగాక దీనికి వ్యయం రూ.1,298 కోట్ల మేర ఉంటోంది. టన్నెల్ మార్గాలు వద్దనుకుంటే... అటవీ ప్రదేశం గుండా నీటి తరలింపు ఉండటంతో ఈ ప్రతిపాదనను సైతం పక్కనపెట్టారు. కొత్తగా పాలమూరులో మూడో రిజర్వాయర్‌గా ఉన్న వట్టెం నుంచి నీటిని తరలించే మార్గాలపై అధ్యయనం చేసి, ఓపెన్ కాల్వల ద్వారా నీటి తరలింపునకు అవకాశం ఉండటంతో దీనికి మొగ్గు చూపారు. వట్టెం నుంచి నీటిని తీసుకుంటూ పోతిరెడ్డిపల్లి మండలంలోని ఊరచెరువు మార్గం ద్వారా తాడూరు మండలం బలాన్‌పల్లి గ్రామంలోని చెన్నకేశవులు చెరువు, ఇదే మండల పరిధిలోని గోవిందయ్యపల్లి గ్రామ పెద్దచెరువు ద్వారా 16 కిలోమీటర్ల మేర నీటిని తరలించి డిండి వాగులో కలుపుతారు. ఈ వాగులో చేరిన నీరు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర బ్యారేజీకి తరలించేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దీనికి కేవలం రూ. 230 కోట్ల వ్యయం కానుంది. ఇక్కడి నుంచి నీటిని గ్రావిటీ మార్గాన శింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ వరకు తరలించనున్నారు. గొట్టిముక్కలలో మిగిలిన 355 ఎకరాల భూసేకరణ ఎగువన వట్టెం నుంచి నీటిని తరలించే ప్రక్రియ ఆల స్యమైనా డిండి ద్వారా దేవరకొండ నియోజకవర్గంలో తొలి సాగు ఫలాలు ఈ వానాకాలంలోనే అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గొట్టిముక్కల రిజర్వాయర్ పనులను 95 శాతం పూర్తి చేశారు. 1.83 టీఎంసీల సామర్ధ్యంతో 3.75 కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 30 మీటర్ల మేర మాత్రమే కట్ట నిర్మాణం మిగిలి ఉంది. 5 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తయింది. దీనికి సొంతంగానే 474 చదరపు కిలోమీటర్ల మేర పరీవాహకం ఉండటంతో ఈ పరీవాహకం నుంచి వచ్చే నీటితో ఇందులో ఒక టీఎంసీకి పైగా నీటిని నింపే అవకాశం ఉంది. దీనికింద నిర్ణయించిన 28 వేల ఎకరాల్లో సగం ఆయకట్టుకు అంటే 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. 355 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 87 ఎకరాలు అవార్డు కాగా, దీనికై రూ.16 కోట్లు అవసరం ఉంది. ఇందులో ఇటీవలే రూ.10.50 కోట్లు సీఎం సూచనల మేరకు విడుదల చేసినా, వీటి చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. ఇక ఆర్అండ్ఆర్ కింద 112 కుటుంబాలను తరలించేందుకు రూ.12 కోట్లు అవసరం ఉంటుంది. ఇందులో రూ.4.50 కోట్లు విడుదల కాగా, వీటి చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ జూన్ నాటికి పూర్తి చేస్తే ఖరీఫ్‌లో కనీసంగా 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇక సింగరాజుపల్లి రిజర్వాయర్‌ను 0.81 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తుండగా, కట్టపొడవు 3 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో ఇంకా 200 మీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తయితే దీనిలోనూ 0.50 టీఎంసీ నీటిని నింపే అవకాశం ఉంటుంది. దీనికింద ఇప్పటికే కుడి, ఎడమ తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, స్థానిక పరీవాహకం నుంచే వచ్చే నీటితో దీనికింద ఉన్న 13 వేల ఎకరాల్లో కనీసంగా 5 నుంచి 6 వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. ఇక్కడ పెండింగ్ బిల్లులు, మరో 71 ఎకరాల భూసేకరణకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం ఆదేశాలతో ఈ ఖరీఫ్‌లోనే దీనికింద ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు మొదలయ్యాయి. -
డిండి మళ్లీ మొదటికి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే అలైన్మెంట్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. దీంతో నీటిని పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని తాజాగా నిర్ణయించారు. ప్రాజెక్టుల్లో అటవీ సమస్యల కారణంగా కేంద్ర సంస్థల అనుమతులు రావడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఏదుల నుంచి శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీల నీటిని తీసుకునేందుకు తుది ప్రతిపాదన సిద్ధం చేశారు. ఏదుల నుంచే ముందుకు.. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా 4.5 లక్షల ఎకరాలకు పాలమూరులో భాగంగా ఉన్న రిజర్వాయర్ల నుంచి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పాలమూరులో భాగంగా ఉన్న ఏదుల నుంచే తీసు కోవాలని తొలుత భావించినా, దాన్ని నార్లాపూర్‌కు మార్చారు. అయితే నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉండటం, దీనికి పాలమూరు జిల్లా నేతలు అభ్యంతరాలు చెప్పడం తో మళ్లీ సర్వే చేయించారు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రణాళికకు ఓకే చెబుతూనే రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్ మెయిన్ తగ్గించాలని, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని తేల్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరంతో పాటు కాల్వలను, సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను అధికారులు పరిశీలించగా 5వ కిలోమీటర్ నుంచి 20వ కిలోమీటర్ వరకు ఉన్న అలైన్మెంట్, రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని వెల్లడైంది. దీం తో మళ్లీ రీసర్వే చేయించారు. ఇందులో ఏదుల నుంచే నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏదు ల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానల్, 2.5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 16 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీటిని డిండిలో భాగంగా ఉన్న ప్రతిపాదిత ఉల్పర రిజర్వాయర్‌కు చేరేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనకు రూ. 1,200 కోట్ల అంచనా వేశారు. ఏదుల నుంచి డిండి అలైన్మెంట్ ఖరారు కానందున, ఆలోపు దిగువన ఉన్న సింగరాజు పల్లి (0.8 టీఎంసీలు), గొట్టిముక్కల (1.8), చింతపల్లి (0.99), కిష్టరాంపల్లి (5.68), శివన్నగూడం (11.96 టీఎంసీల) రిజర్వాయర్లు.. వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులకు ఇప్పటికే ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ఆరంభించిన విషయం తెలిసిందే. -
‘నార్లాపూర్’ కొత్త అంచనా రూ.1,182 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్‌లో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కొత్త అంచనాలు సిద్ధమయ్యాయి. రిజర్వాయర్‌లో మట్టికొరతను ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీడ్యామ్ తరహాలో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, దాని నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలకు ప్రాజెక్టు అధికారులు రూ.1,182కోట్లతో సిద్ధం చేశారు. గత అంచనాలతో పోలిస్తే రూ.290 కోట్ల మేర వ్యయం పెరగనుండగా, దీన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. 6.64 కిలోమీటర్ల మేర మట్టికట్ట.. నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 6.64 కిలోమీటర్ల మేర మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. ఈ పనిని మూడు రీచ్‌లుగా విడగొట్టగా, రీచ్–2లో మట్టి సమస్య నెలకొంది. ఇక్కడ ఏకంగా 75 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, 2.26 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి అవసరం పడనుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి లభ్యత ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తెప్పించాలని భావించగా, ఖర్చు తడిసి మోపెడవుతోంది. రీచ్–2లో ఏర్పడిన మట్టికొరత సమస్యను అధిగమించడానికి రాక్‌ఫిల్ డ్యామ్ విధానంలో పనులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు అధికారులు తెహ్రీడ్యామ్ పరిశీలించిన ఇంజనీర్లు నార్లాపూర్‌లో ఈ విధానం ఫలితానిస్తుందని అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే దీనిపై ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో దీనికయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేశారు. రూ.1,182కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సీనరేజీ చార్జీలు, కరెంట్ లైన్లు, రోడ్ల నిర్మాణం, గత అంచనాల సవరణల కారణంగా తొలి అంచనాతో పోలిస్తే రూ.290 కోట్లు మేర పెరుగుతుందని లెక్కగట్టారు. ఇప్పటికే ‘తెహ్రీ’ఈడీ సందర్శన ఇక నార్లాపూర్‌లో ప్రతిపాదిస్తున్న రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అవసరమైన డిజైన్, ఇతర సాంకేతిక అంశాలపై సహకారం అందించేందుకు తెహ్రీ హైడ్రో పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ వైష్ణోయ్ ఈ మేరకు అధికారులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆయన ఒకమారు రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టును సందర్శించారు. తెహ్రీ డ్యామ్ నిర్మాణ సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లను వివరించి, వాటిని అధిగమించేందుకు జరిపిన అధ్యయనాలను, డిజైన్ రూపకల్పనలో తీసుకున్న జాగ్రత్తలను అధికారులతో పంచుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై 9, 10 స్థాయిలో భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా రాక్‌ఫిల్ డ్యామ్ డిజైన్ చేసినట్లు, అదే తరహాలో ఇక్కడా నిర్మాణాలకు సహకరిస్తామని హామీనిచ్చారు. ఆయన సూచనల నేపథ్యంలోనే ప్రభుత్వం రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల పరిధిలో పూర్తిగా కొత్తదే అయినా దానివైపే మొగ్గుచూపింది. -
‘నార్లాపూర్’ నిరీక్షణ!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలి రిజర్వాయర్ పనులపై సందిగ్ధత వీడటంలేదు. పనులు మొదలు పెట్టి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా నార్లాపూర్(అంజనగిరి) రిజర్వాయర్‌లో మట్టికొరతను ఎదుర్కొనే వ్యూహాలను అమలు చేయడంలేదు. రిజర్వాయర్ పరిధిలో నెలకొన్న భారీ మట్టి అవసరాలను ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీడ్యామ్ తరహాలో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాలని ఇప్పటికే ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపినా, ఉన్నతస్థాయిలో ఈ నిర్మాణంపై నిర్ణయం వెలువడకపోవడంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. రాక్‌ఫిల్ డ్యామ్ పరిష్కారం పాలమూరు ప్రాజెక్టులో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు ఐదు రిజర్వాయర్లను ప్రతిపాదించారు. తొలి రిజర్వాయర్ నార్లాపూర్ పనులను రూ.765 కోట్లతో రెండున్నరేళ్ల కిందటే ప్రారంభించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 6.64 కిలోమీటర్ల మేర మట్టి కట్ట నిర్మించాల్సి ఉంటుంది. రీచ్–1, 3లో పనులు వేగంగా జరుగుతుండగా, రీచ్–2లో మట్టి సమస్య ఏర్పడింది. ఇక్కడ ఏకంగా 75 మీటర్ల ఎత్తులో కట్టనిర్మాణం చేయాల్సి ఉండగా, 2.26 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి అవసరాలున్నాయి. కానీ, రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి లభ్యత నెలకొనడంతో సమస్య మొదలైంది. మరింత మట్టికై లోతుకు తవ్వితే పలుగురాయి ఎక్కువగా వస్తోంది. ఇతర ప్రాంతం నుంచి మట్టిని తెప్పించాలని భావించగా, ఖర్చు తడిసి మోపెడవుతోంది. రీచ్–2లో ఏర్పడిన మట్టికొరత సమస్యను అధిగమించడానికి రాక్‌ఫిల్ డ్యామ్ విధానంలో పనులు నిర్వహించాలని అప్పటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. తెహ్రీడ్యామ్లో అమలు చేసినందున దాన్ని పరిశీలించాలని సూచిం చారు. దీంతో తెహ్రీడ్యామ్ పరిశీలించిన ఇంజనీర్లు నార్లాపూర్‌లో ఈ విధానం ఫలితానిస్తుందని అంచనాకు వచ్చి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనలపై ఇటీవల ప్రాజెక్టు సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ తరహా విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినా పురోగతి లేదు. భూసేకరణ నిధులకూ పడిగాపులే.. పాలమూరు ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ నిధులకు నిరీక్షణ తప్పడం లేదు. సేకరణకు తక్షణంగా తొలి ప్రాధాన్యంగా రూ.45 కోట్లు, రెండో ప్రాధాన్యతాక్రమంలో మరో రూ.42 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నా ఇంతవరకు అధికారులు నిర్ణయం చేయలేదు. ఈ ప్రభావం మొత్తం పనులపై పడుతోంది. -
వడివడిగా సాగుతున్న ప్రాజెక్టు పనులు
నాగర్‌కర్నూల్ : ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో సాగునీటి కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మొత్తం ఆరు రిజర్వాయర్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఇప్పటికే పనులు సైతం మొదలు పెట్టారు. కాగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో మూడు రిజర్వాయర్లను నిర్మించి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు 8లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టు పనులను చేపట్టారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద 8.51 టీఎంసీలు, ఏదుల (వనపర్తి జిల్లా) వద్ద 6.55 టీఎంసీలు, వట్టెం వద్ద 16.75 టీఎంసీలు, మహబూబ్‌నగర్ జిల్లా కరివెన వద్ద 17.34 టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణం చేపడతున్నారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో మొత్తం 10,406.83 ఎకరాలను సేకరించాల్సి వచ్చింది. అయితే ఇందులో ఇప్పటి వరకు 6967.23ఎకరాలు అంటే 69శాతం భూమిని రైతుల నుంచి సేకరించింది. పరిహారం విషయంలో గందగోళమే.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణకు సంబంధించి ఆది నుంచి గందరగోళమే నెలకొంది. గతంలో ఇక్కడ ఉన్న ఓ అధికారి పరిహారం విషయంలో రైతులను తప్పుదోవ పట్టించిన ఆరోపణలు ఉన్నాయి. రైతులకు సంబంధించి వారికి ఉన్న భూముల రకాలను బట్టి గతంలో ఎకరానికి రూ.5.50 లక్షలు, రూ.4.50 లక్షలు, రూ.3.50లక్షలు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. రైతుల నుంచి భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 123 జీఓతో పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కొంతమంది రైతులు తమకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించాలని కోర్టును ఆశ్రయించడంతో ఇటీవల ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులను ఒప్పించి భూములను సేకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఇప్పటివరకు రెండుమూడు చోట్ల తప్ప ఎక్కడా గ్రామసభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రైతుల నుంచి 120 యాక్ట్ ద్వారా భూములను సేకరిస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారు ఒప్పుకున్న రేటుకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 123జీఓ ద్వారా ఇప్పటి వరకు 5,369.27 ఎకరాలు సేకరిస్తే 120 యాక్ట్ ద్వారా 1,597.96 ఎకరాలు సేకరించారు. ఇంకా 3,439,6 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే గ్రామసభలు నిర్వహించి రైతుల అంగీకారం మేరకు పరిహారం ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్న కరివెన రిజర్వాయర్ పరిధిలో 3,210.26 ఎకరాల భూమి సేకరించాల్సిన ఉండగా.. దాదాపు పూర్తయింది. ఈ రిజర్వాయర్‌కు అనుసంధానంగా తీయాల్సిన కాల్వలకు సంబంధించిన భూమి నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో సేకరించాల్సి ఉంది. చట్టప్రకారమే భూసేకరణ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ చట్ట ప్రకారమే చేస్తున్నాం. కోర్టు ఆదేశాల మేరకు గ్రామ సభలు కూడా నిర్వహించి రైతుల అంగీకారం మేరకు పరిహారం నిర్ణయించి భూములను తీసుకుంటున్నాం. – శ్రీనివాసులు, ఆర్డీఓ వివిధ రిజర్వాయర్ల కింద సేకరించాల్సిన భూమి (ఎకరాల్లో)... నార్లాపూర్ రిజర్వాయర్ నీటి సామర్థ్యం ( టీఎంసీలు )- 8.51, సేకరించాల్సిన భూమి(ఎకరాల్లో)- 3,125.3, 120 యాక్ట్ ద్వారా సేకరించింది- 137.79, 123జీఓ ద్వారా సేకరించింది- 2,553.99, ఇంకా సేకరించాల్సింది- 433.52 ఏదుల రిజర్వాయర్ నీటి సామర్థ్యం ( టీఎంసీలు )- 6.55, సేకరించాల్సిన భూమి- 1,900.6, 120 యాక్ట్ ద్వారా సేకరించింది- 493.07, 123జీఓ ద్వారా సేకరించింది- 959.97, ఇంకా సేకరించాల్సింది- 447.56 వట్టెం రిజర్వాయర్ నీటి సామర్థ్యం ( టీఎంసీలు )- 16.75, సేకరించాల్సిన భూమి- 2,170.67, 120 యాక్ట్ ద్వారా సేకరించింది- 431.36, 123జీఓ ద్వారా సేకరించింది- 792.17, ఇంకా సేకరించాల్సింది- 947.14 -
‘పాలమూరు’లో సమూల మార్పులు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌లో సమూల మార్పులు జరుగుతున్నాయి. నిర్ణీత ఆయకట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ముంపు ప్రాంతాలను గణనీయంగా తగ్గిస్తూ నూతన ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో అలైన్మెంట్, లెవల్, నాణ్యతను ప్రస్తుతం సర్వే చేస్తున్న అధికారులు ఈ మేరకు రిజర్వాయర్ల సామర్థ్యంలో చిన్నపాటి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ముంపు ఎక్కువగా ఉన్నచోట సామర్ధ్యం తగ్గిస్తూ... వీలైనచోట్ల పెంచుతూ డిజైన్‌కు తుదిరూపమిస్తున్నారు. అన్ని రిజర్వాయర్ల పరిధిలోనూ సర్వే పనులు పూర్తయ్యాకే టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. ముంపు తగ్గేలా మార్పులు పాలమూరు ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం నుంచి వరద ఉండే 60 రోజుల్లో 70 టీఎంసీల నీటిని తీసుకొని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు నీటిని తరలించి మహబూబ్‌నగర్‌లో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో 2.70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించిన విషయం విదితమే. దీనికోసం మొత్తంగా ఆరు రిజర్వాయర్లు, 5 లిఫ్టులు ప్రతిపాదించారు. వీటికింద సుమారు 22 వేల ఎకరాల మేర ముంపు ఉంటుందని నిర్ధారించారు. రిజర్వాయర్ల నిర్మాణానికి 9,488 కోట్లు అవసరమని తేల్చగా, 13,158 ఎకరాల భూసేకరణకు రూ.2,565 కోట్లు వ్యయాన్ని లెక్కకట్టారు. మొత్తంగా రూ.35,200 కోట్లతో చేపట్టేందుకు సిద్ధమెంది. ప్రస్తుతం రిజర్వాయర్ల పరిధిలో అత్యాధునిక లేజర్ స్కానర్ సాంకేతిక విధానాన్ని ఉపయోగించుకుంటూ సర్వే చేస్తున్నారు. సర్వేలో భాగంగానే పలుమార్పులకు అధికారులు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ముంపు ప్రాంతాలను తగ్గించేలా ఈ మార్పులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కర్వేన నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలుగా నిర్ధారించగా ప్రస్తుతం దాన్ని 19 టీఎంసీలకే పరిమితం చేశారు. దీనిద్వారా నాలుగైదు తండాలకు ముంపు తగ్గనుంది. ఇక లక్ష్మిదేవుని పల్లి సామర్థ్యాన్ని సైతం 10 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు తగ్గించారు. దీని ద్వారా 4 పెద్ద గ్రామాలు ముంపు బారినుంచి బయట పడతాయి. నాలుగు గ్రామాల పరిధిలోనే సుమారు 14 తండాలు, 2 వేల వరకు జనాభా ఉందని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక నిర్మాణానికి అంత అనువుగా లేని లోకిరేవు ప్రాంతాన్ని మార్చి దానికి సమీపంలోని ఉద్దండాపూర్‌లో అంతే కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. ఇక నార్లాపూర్ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 8.8 టీఎంసీల నుంచి 8.5 టీఎంసీలకు తగ్గించేందుకు నిర్ణయించగా, ఏదుల రిజర్వాయర్‌ను 4.3 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీల సామర్ధ్యాన్ని పెంచనున్నారు. సర్వే పూర్తయిన అనంతరం వీటన్నింటిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇండోర్‌కు ప్రభుత్వ బృందం కాగా, పాలమూరు ప్రాజెక్టులో కాల్వల నిర్మాణానికి బదులు భారీ పైప్లైన్లను ఏర్పాటు చేసేందుకు యోచనలు చేస్తున్న ప్రభుత్వం, ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, చీఫ్ ఇంజనీర్లు ఖగేందర్, పురుషోత్తమరాజులు శనివారం నుంచి ఇండోర్‌లో పర్యటించి పైప్‌లైన్ నిర్మాణాలను పరిశీలించనున్నారు.