చురుగ్గా సాగుతున్న ఏదుల రిజర్వాయర్ పనులు
నాగర్‌కర్నూల్ : ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో సాగునీటి కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మొత్తం ఆరు రిజర్వాయర్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఇప్పటికే పనులు సైతం మొదలు పెట్టారు. కాగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో మూడు రిజర్వాయర్లను నిర్మించి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు 8లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టు పనులను చేపట్టారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద 8.51 టీఎంసీలు, ఏదుల (వనపర్తి జిల్లా) వద్ద 6.55 టీఎంసీలు, వట్టెం వద్ద 16.75 టీఎంసీలు, మహబూబ్‌నగర్ జిల్లా కరివెన వద్ద 17.34 టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణం చేపడతున్నారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో మొత్తం 10,406.83 ఎకరాలను సేకరించాల్సి వచ్చింది. అయితే ఇందులో ఇప్పటి వరకు 6967.23ఎకరాలు అంటే 69శాతం భూమిని రైతుల నుంచి సేకరించింది.
పరిహారం విషయంలో గందగోళమే..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణకు సంబంధించి ఆది నుంచి గందరగోళమే నెలకొంది. గతంలో ఇక్కడ ఉన్న ఓ అధికారి పరిహారం విషయంలో రైతులను తప్పుదోవ పట్టించిన ఆరోపణలు ఉన్నాయి. రైతులకు సంబంధించి వారికి ఉన్న భూముల రకాలను బట్టి గతంలో ఎకరానికి రూ.5.50 లక్షలు, రూ.4.50 లక్షలు, రూ.3.50లక్షలు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. రైతుల నుంచి భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 123 జీఓతో పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కొంతమంది రైతులు తమకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించాలని కోర్టును ఆశ్రయించడంతో ఇటీవల ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులను ఒప్పించి భూములను సేకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఇప్పటివరకు రెండుమూడు చోట్ల తప్ప ఎక్కడా గ్రామసభలు నిర్వహించిన దాఖలాలు లేవు.
ప్రస్తుతం రైతుల నుంచి 120 యాక్ట్ ద్వారా భూములను సేకరిస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారు ఒప్పుకున్న రేటుకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 123జీఓ ద్వారా ఇప్పటి వరకు 5,369.27 ఎకరాలు సేకరిస్తే 120 యాక్ట్ ద్వారా 1,597.96 ఎకరాలు సేకరించారు. ఇంకా 3,439,6 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే గ్రామసభలు నిర్వహించి రైతుల అంగీకారం మేరకు పరిహారం ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్న కరివెన రిజర్వాయర్ పరిధిలో 3,210.26 ఎకరాల భూమి సేకరించాల్సిన ఉండగా.. దాదాపు పూర్తయింది. ఈ రిజర్వాయర్‌కు అనుసంధానంగా తీయాల్సిన కాల్వలకు సంబంధించిన భూమి నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో సేకరించాల్సి ఉంది.
చట్టప్రకారమే భూసేకరణ
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ చట్ట ప్రకారమే చేస్తున్నాం. కోర్టు ఆదేశాల మేరకు గ్రామ సభలు కూడా నిర్వహించి రైతుల అంగీకారం మేరకు పరిహారం నిర్ణయించి భూములను తీసుకుంటున్నాం.
– శ్రీనివాసులు, ఆర్డీఓ
వివిధ రిజర్వాయర్ల కింద సేకరించాల్సిన భూమి (ఎకరాల్లో)...
నార్లాపూర్ రిజర్వాయర్
నీటి సామర్థ్యం ( టీఎంసీలు )- 8.51, సేకరించాల్సిన భూమి(ఎకరాల్లో)- 3,125.3, 120 యాక్ట్ ద్వారా సేకరించింది- 137.79, 123జీఓ ద్వారా సేకరించింది- 2,553.99, ఇంకా సేకరించాల్సింది- 433.52
ఏదుల రిజర్వాయర్
నీటి సామర్థ్యం ( టీఎంసీలు )- 6.55, సేకరించాల్సిన భూమి- 1,900.6, 120 యాక్ట్ ద్వారా సేకరించింది- 493.07, 123జీఓ ద్వారా సేకరించింది- 959.97, ఇంకా సేకరించాల్సింది- 447.56
వట్టెం రిజర్వాయర్
నీటి సామర్థ్యం ( టీఎంసీలు )- 16.75, సేకరించాల్సిన భూమి- 2,170.67, 120 యాక్ట్ ద్వారా సేకరించింది- 431.36, 123జీఓ ద్వారా సేకరించింది- 792.17, ఇంకా సేకరించాల్సింది- 947.14
Comments
Please login to add a commentAdd a comment