సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తున్నామని చెప్పేందుకు ఇటీవల కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్‌నగర్ పర్యటనకు వచ్చినట్లు భావించామని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కానీ, వీరి వైఖరి చూస్తుంటే పాలమూరుకు నిధులివ్వడం పక్కనబెట్టి ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు సృష్టించడమే ఉద్దేశంగా కనిపిస్తోందని మండిపడ్డారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని వెంకటాపూర్, మాచన్‌పల్లితండాలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్ హామీ నెరవేర్చేందుకు కేంద్రమంత్రి వచ్చారని అనుకున్నామని, ఒకరి ఇంట్లో టిఫిన్, మరొకరి ఇంట్లో భోజనం, స్టార్ హోటల్‌లో సేదతీరుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. పాలమూరుకు జాతీయ హోదాతోపాటు రూ.లక్ష కోట్ల నిధులు విడుదల చేసి బీజేపీ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. పొలాలకు సాగునీరు పారించాలని తాము చూస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం రక్తం పారించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment