వడివడిగా!
సాక్షి, మహబూబ్‌నగర్ : కరువు, వలసలకు చిరునామాగా మారిన మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయినిగా మారిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం మంత్రి లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డిలు కరివెన రిజర్వాయర్ పనులకు భూమిపూజ చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో 39 మండలాలోని 718 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించనున్నారు. ఈ రెండు జిల్లాల పరిధిలోనే దాదాపు 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు.
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాలతోపాటు రాజధాని హైదరాబాద్ నగరానికి ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పాలమూరు ప్రజల కన్నీటి కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రెండేళ్లలో సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు పనులు జెట్‌స్పీడ్ వేగంతో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే కొన్ని రిజర్వాయర్ల పరిధిలో భూసేకరణ పూర్తి చేసుకోవడంతో పనులను మంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఆశలన్నీ ఈ ప్రాజెక్టుపైనే...
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రాజెక్టు పనులు చకచకగా జరుగుతున్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మూడు కొత్త జిల్లాలు ఏర్పడటంతో అవశేష మహబూబ్‌నగర్ జిల్లాకు నీటి సదుపాయం లేకుండా పోయింది. కేవలం మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాలలో మాత్రం కొంతమేర సాగునీటి సదుపాయం ఉంది. రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు, మక్తల్, నర్వ మండలాలకు సాగునీరు అందనుంది.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వల్ల దేవరకద్రలోని 10వేల హెక్టాలకు సాగునీరు అందనుంది. జిల్లాలోని నారాయణపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్రలోని సగం మండలాలకు సాగునీటి సౌకర్యమే లేదు. వీటన్నింటికీ ఆశలు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీదనే. దీంతో ప్రభుత్వం కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నింటినీ అధిగమిస్తూ వడివడిగా అడుగులు వేస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం వద్ద ఎన్ని కొర్రీలు విధిస్తున్నా... వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చాకచక్యంగా అధిగమిస్తోంది. తద్వారా ప్రాజెక్టు పనులు త్వరతగతిన పూర్తి చేసి కరువు నేలపై సిరులు పండించేందుకు కృషిచేస్తోంది.
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఎమ్మెల్యే ఆల
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కరివెన రిజర్వాయర్ అతిపెద్దది కావడం... పైగా దీన్ని పూర్తి చేస్తే దాదాపు 1.90లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందివచ్చు. అంతేకాదు దాదాపు 19.15 టీఎంసీల స్టోరేజీ నీరు నిల్వ ఉంచనుండడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో కరివెన రిజర్వాయర్ పనులను చకచక పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కింద భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంలో సఫలీకృతమయ్యారు. అలాగే పనులను కూడా దగ్గరుండి కాంట్రాక్టర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేశారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును ఒక రూపు తీసుకొచ్చి ప్రజలకు ఫలాలు అందజేయాలని యోచిస్తున్నారు.