సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా రైతాంగం ఆశలను సర్కారు నీరుగార్చింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆది లోనే మోకాలడ్డింది. రాష్ట్ర విభజనను బూచీగా చూపి కరువు నేలల్లో సిరులు పండించాల్సిన కీలకమైన ప్రాజెక్టు పనులకు బ్రేక్ వేసింది. మహబూబ్‌నగర్ సహా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని పది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే బృహత్తర ప్రాజెక్టు పనుల సర్వేకు రెండు నెలల క్రితం నీటిపారుదలశాఖ రూ.6.91 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు వెలువడిన అనంతరం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. కొత్తగా సాగునీటిప్రాజెక్టులు చేపట్టకూడదని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడం ఈ పథకానికి శాపంగా పరిణమించింది. జూరాల ప్రాజెక్టు నుంచి సుమారు 70 శతకోటి ఘనపుటడుగుల(టీఎంసీల) జలాలను ఎత్తిపోతల ద్వారా ఈ మూడు జిల్లాల కు సరఫరా చేయాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ప్రభుత్వ నిర్వాకంతో ‘ఉత్తిపోతల’ పథకంగా మారడం జిల్లా రైతాంగాన్ని కలచివేస్తోంది.
కరువు నేలల్లో సిరులు...
తరచు తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో హరిత సిరులు పండించాలంటే జూరాల జలాలు వినియోగం తప్పనిసరని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీరింగ్ నిపుణులు, రాజకీయపక్షాలు ప్రభుత్వంపై కొంత కాలంగా వత్తిడి పెంచడంతో ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఏడాది క్రితం ‘ఇందిరమ్మబాట’లో భాగంగా జిల్లా పర్యటనకొచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనుల సర్వేకు నిధులు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గత ఆగస్టులో నిధులు కేటాయించారు. సర్వే పనులు పూర్తికాగానే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని రైతాంగం భావించింది. అయితే, తాజాగా రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కొత్తగా సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేయవద్దని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీంతో జూరాల ఎత్తిపోతలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు సీమాంధ్ర జిల్లాల రైతాంగం కూడా ఈ ప్రాజెక్టు పనులపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో తమ ప్రాంత రైతాంగానికి ఆన్యాయం జరుగుతుందని అక్కడి ప్రజాప్రతినిధులు అంటున్నారు.
ఈ మండలాలకు నిరాశేనా?
జిల్లా రైతాంగానికి సాగునీటి వసతులు అంతంతమాత్రమే. దీంతో వర్షాధార పంటలపైనే రైతులు ఆధారపడి అతికష్టం మీద మనుగడ సాగిస్తున్నారు. వరుణుడు కరుణించకపోతే కరువు రక్కసి కరాళ నృత్యంతో మాగాణి, మెట్ట భూములు బీళ్లువారడం ఏటా అనివార్యమవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి అంకురార్పణ చేసినప్పటికీ అది కాగితాలకే పరిమితం కావడం 17 మండలాల రైతులను నిరాశ పరుస్తోంది. ఆయా మండలాల పరిధిలోని దాదాపు 2.7లక్షల ఎకరాలకు సాగునీటి వసతి అందుబాటులోకి రాకుండా పోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించడానికి ప్రతిపాదించిన వాటిలో పెద్దేముల్, మర్పల్లి, తాండూరు, దోమ, గండేడ్, ధారూరు, యాలాల, బషీరాబాద్, పరిగి, కుల్కచర్ల, బంట్వారం, యాచారం, ఇబ్రహీంపట్నం, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, వికారాబాద్, పూడూరు మండలాలున్నాయి. ముఖ్యంగా తాగునీటికోసం అల్లాడుతున్న ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రజలకు ఉపయుక్తమని ఇంజినీరింగ్ నిపుణులు అంటున్నారు.
రెండు పంపింగ్ స్టేషన్లు ఇక్కడే..
పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రతిపాదనల్లో నాలుగు పంప్ స్టేషన్లకు గాను జిల్లాలో రెండు పంపు స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం గతంలో ప్రతిపాదించింది. ఇందులో రెండో పంపింగ్ స్టేషన్ గండేడ్ మండలం మహ్మదాబాద్ వద్ద, మూడో పంపింగ్ స్టేషన్ కుల్కచర్ల మండలం ఇప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయాల్సిందిగా ప్రాథమిక ప్రతిపాదనలో పేర్కొన్న విషయం విదితమే.
ఉత్తిపోతలేనా?
Published Sat, Oct 19 2013 1:01 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement
Advertisement