రాష్ట్ర విభజన నేపథ్యంలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను మన్ననూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ 17 విడుదల చేసింది. దీంతో ఇన్నాళ్లూ కర్నూలు ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా ఇకపై ప్రత్యేక ఐటీడీఏగా ఆవిర్భవించనుంది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు మహబూబ్‌నగర్ ఐటీడీఏలో అంతర్భాగం కానున్నాయి. సంస్థకు పూర్తి స్వరూపం ఏర్పడితే తప్ప స్థానిక చెంచులు సమగ్రాభివృద్ధి సాధించే పరిస్థితి కనిపించడం లేదు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మన్ననూరు కేంద్రంగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఏర్పాటు చేయాలంటూ జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో కూడిన నూతన ఐటీడీఏను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీఓ 17 విడుదల చేసింది. ప్రస్తుతం జిల్లాలో లంబాడాలు, ఎరుకలులు, ఇతర గిరిజనులకు సంబంధించి మాడా (మాడిఫైడ్ ఏరియా డెవలప్‌మెంట్ అప్రోచ్) మాత్రమే పనిచేస్తోంది. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో 12,982 మంది చెంచులుండటంతో నూతన ఐటీడీఏ మన్ననూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు.
పీటీజీ (అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు) ప్రాజెక్టు అధికారి నూతన ఐటీడీఏకు ఎక్స్‌అఫీషియో పీఓగా వ్యవహరిస్తారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన గిరిజన సంక్షేమాధికారులు ఎక్స్ అఫీషియో ఏపీఓలుగా వ్యవహరిస్తారు. అయితే జిల్లాలో మాడా, పీటీజీకి పీఓ లేకపోవడంతో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఐటీడీఏకు కూడా సోషల్ వెల్ఫేర్ డీడీ ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. నల్లగొండ జిల్లాలోనూ గిరిజన సంక్షేమ శాఖకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడం గమనార్హం.
సిబ్బంది బదిలీపై రావాల్సిందే!
కొత్తగా ఏర్పాటయ్యే ఐటీడీఏ పరిధిలోకి జిల్లాలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తో పాటు 11 పీహెచ్‌సీలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 44 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 11 ఆశ్రమ పాఠశాలలు చేరనున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన విభాగం మాడాకు బదిలీ కాగా, తాజా ఉత్తర్వులతో ఈ విభాగం ఐటీడీఏ అంతర్భాగం కానున్నది.
అయితే నూతన ఐటీడీఏ ఏర్పడినా కార్యాలయం ఏర్పాటు, సిబ్బంది నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా సున్నిపెంటలో ఐటీడీఏ కార్యాలయముండగా, నూతన ఐటీడీఏ కార్యాలయాన్ని మన్ననూరు మాడా ప్రాజెక్టు అధికారి కార్యాలయం లేదా క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సున్నిపెంట ఐటీడీఏ నుంచి సిబ్బందిని బదిలీ చేయాలంటూ త్వరలో లేఖ రాస్తామని మాడా ఇన్‌చార్జి పీఓ ‘సాక్షి’కి వెల్లడించారు.
తొలి సమావేశంలోనే కోరాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీడీఏ మొదటి జనరల్ బాడీ సమావేశంలోనే మన్ననూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరాం. చెంచు జనాభాలో 70శాతం మంది ఈ జిల్లాలోనే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చెంచుల తలరాత మారుతుందని ఆశిస్తున్నాం.
- శంకరయ్య, ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మెంబర్
నేటికీ అభివృద్ధికి దూరంగా..
25 ఏళ్ల క్రితం చెంచుల కోసం ఐటీడీఏ ఏర్పాటు చేసినా ఎక్కడో దూరంగా పొరుగు జిల్లాలో ఉండటంతో పెద్దగా ఉపయోగపడింది లేదు. అభివృద్ధికి దూరంగా చెంచులు నేటికీ జీవనం వెళ్లదీస్తున్నారు. మన్ననూరు ఐటీడీఓతో అభివృద్ధి చెందుతామనే ఆశ కనిపిస్తోంది.
- శ్రీనివాసులు, చెంచు సేవా సంఘం
ఐటీడీఏకు పచ్చజెండా
Published Sat, Dec 6 2014 1:51 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement