సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాజకీయ ఎత్తుగడలకు ప్రచార వ్యూహాన్ని జోడించిన తెలంగాణ రాష్ట్ర సమితి సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపింది. సాధారణ ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల క్రితం జిల్లాలో టీఆర్‌ఎస్‌ది నామమాత్ర బలమే. మహబూబ్‌నగర్ ఎంపీగా అధినేత కేసీఆర్ స్వయంగా ప్రాతినిధ్యం వహించినా పార్టీ ఎన్నడూ జిల్లాలో ఆశించిన రీతిలో రాణించిన దాఖలా లేదు.
రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెరుపు వేగంతో ఎన్నికల వ్యూహం సిద్దం చేశారు. పార్టీకి బలమైన అభ్యర్థులు వున్న చోట అవకాశం ఇవ్వడంతో పాటు, మిగిలిన చోట్ల ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. కల్వకుర్తి మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు మొదటి లేదా రెండో స్థానంలో నిలవడం పార్టీ పోటీ ఇచ్చిన తీరుకు అద్దం పడుతోంది.
ఇతర పార్టీల్లో టికెట్ల కోసం లాబీయింగ్, పొత్తుల పేరిట చర్చలు సాగుతున్న సమయంలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. కేసీఆర్ మూడు విడతలుగా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించి 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిన చోట స్వల్ప మెజారిటీతో సీట్లను కోల్పోడంపై పార్టీ విశ్లేషించుకుంటోంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు సాధించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
ఎవరికి వారే యమునా తీరే
చివరి నిముషం వరకు టికెట్లు ఖరారు కాకపోవడం, పార్టీ నేతల నడుమ విభేదాలు, సమన్వయలోపం వెరసి కాంగ్రెస్ విజయకాశాలు దెబ్బతిన్నట్లు ఫలితాల సరళి వెల్లడించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సూచించిన వారికి టికెట్లు దక్కక పోవడం కూడా ఫలితాలను ప్రభావితం చేసింది.
టికెట్ దక్కని నేతలను బుజ్జగించే వారే లేకపోవడంతో షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మినహా ఆ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేకపోవడం, అభ్యర్థులు ఎవరికి వారుగా ప్రచారం చేసుకోవడం విజయావకాశాలను దెబ్బతీసింది. నామినేషన్ల వేళ జిల్లా రాజకీయాల్లో అడుగు పెట్టిన నంది ఎల్లయ్య నాగర్‌కర్నూలు ఎంపీ సీటును ఎగరేసుకు పోవడం సంచలనం సృష్టించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మాజీ మంత్రి డీకే అరుణ రాజకీయ అనుభవాన్ని జోడించి గెలుపు బాటన పయనించారు.
కుదరని పొత్తులతో నష్టం
తెలుగుదేశం, బీజేపీల నడుమ ఎన్నికల అవగాహన కుదిరినా సీట్ల పంపకంలో తేడాలు ఆ పార్టీ అభ్యర్థుల విజయకాశాలను దెబ్బతీశాయి. కొడంగల్, నారాయణపేటలో టీడీపీ గెలుపొందగా, కల్వకుర్తిలో మాత్రమే బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మిగతా అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వనపర్తి, గద్వాలలో కూటమి అభ్యర్థులు నామమాత్రంగా ఓట్లు సంపాదించారు.
తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్న వ్యతిరేకత ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుని కొంత మేర లబ్దిపొందింది. బీజేపీ మాత్రం బలమైన చోట సీట్లు దక్కించుకోలేక సాధారణ ఎన్నికల్లో చతికిల పడింది. పార్టీ మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి క్రాస్ ఓటింగ్‌పై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఓటరు మాత్రం టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపినట్లు తేలింది.
ఇలా ‘గుబాళింపు’
Published Sat, May 17 2014 3:35 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement