ముంపు ముప్పు!
పాలమూరు ఎత్తిపోతల పథకం.. జిల్లా ప్రజలను ఆశల పల్లకీ ఎక్కించిన బృహత్తర కార్యక్రమం. తడారిన నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని, పచ్చదనం పరుచుకుంటుందని అంతా ఆశపడినా.. అది కొందరికి శాపంగా మారబోతోంది. ఈ పథకం కార్యరూపంలోకి వస్తున్న కొద్దీ భయాందోళనలూ పెరుగుతున్నాయి.
ఎన్నో గ్రామాలను, అనేక ఎకరాల వ్యవసాయ పొలాలను ఈ ఎత్తిపోతల మింగేయనుందనే వాస్తవాన్ని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగే మేలు ఎన్నటికో గానీ.. ఇప్పుడు జరిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచనలో పడ్డారు. మూడు జిల్లాలకు తాగునీరు, పది లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మొదలయ్యే ఈ పథకానికి సంబంధించి ఏర్పాటు చేయనున్న రిజర్వాయర్లకు స్థల పరిశీలనను అధికారులు ఇటీవలే పూర్తి చేశారు. పనులు వేగం పుంజుకుంటుంటే.. ఉన్న కాస్త భూమి చేజారుతుందేమోనని రైతులు మదనపడుతున్నారు.
గండేడ్: పాలమూరు ఎత్తిపోతల ద్వారా ప్రజలకు తాగు, సాగునీరు పుష్కలంగా అందుతుంది.. దీంతో అభివృద్ధి సాధించవచ్చని కలలుగన్న ప్రజలు నేడు దానివల్ల ఎన్నో గ్రామాలు, వ్యవసాయ పొలాలు ముంపునకు గురవుతున్నాయనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మేలు ఎప్పుడు జరుగుతుందో కానీ రిజర్వాయరు ఏర్పాటుతో నష్టం మాత్రం ఖాయంగా కనిపిస్తుండడంతో ఆయా గ్రామాల్లోని ప్రజల గుండెల్లో ప్రస్తుతం గుబులు పుడుతోంది.
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మూడు జిల్లాలకు తాగునీరు, 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా రిజర్వాయర్ల ఏర్పాటుకు కావాల్సిన స్థల పరిశీలనకు ఇప్పటికే ప్రాథమికస్థాయి సర్వేను ప్రభుత్వం పూర్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు లేని జిల్లాకు ఎత్తిపోతల ద్వారా తాగునీరు అందించాలన్న విషయాన్ని మరింత శ్రద్ధతో వేగంగా పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన సర్వేపనులు పూర్తయి ప్రభుత్వానికి నివేదిక కూడా అందించారు. గండేడ్ మండలంలో 8 గ్రామాలు, 12వేల ఎకరాలకుపైగా వ్యవసాయపొలాలు ముంపునకు గురవుతున్నాయని నివేదికలో తేల్చారు.
ఇక రిజర్వాయర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఇక్కడి ప్రాంత ప్రజల, రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. వందల ఏళ్ల నుంచి నివసిస్తున్న గ్రామాలు, ఏళ్ళ తరబడి సాగు చేసుకుంటున్న పొలాలు, రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలు నీట మునుగుతాయనే వార్తలు వినగానే ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానివల్ల గ్రామాలు ముంపునకు గురి కాకుండా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
గండేడ్‌లో ముంపునకు గురయ్యే గ్రామాలు..
పాలమూరు ఎత్తిపోతల మొదటి రిజర్వాయరు 70టీఎంసీలతో కోయిల్‌కొండ మండలంలో ఏర్పాటు చేయగా రెండో రిజర్వాయరును 45టీఎంసీలతో గండేడ్ మండలం పెదవార్వాల్ సమీపంలో, మూడో రిజర్వాయర్‌ను లక్ష్మీదేవిపల్లి దగ్గర ఏర్పాటు చేసేం దుకు ఇటీవల ఇంజనీర్లు సర్వే చేశారు. పెద్దవార్వల్ సమీపంలో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే అధిక గ్రామా లు ముంపునకు గురవుతున్నాయి. మండల పరిధిలోని పెద్దవార్వాల్, రుసుంపల్లి, గాధిర్యాల్ శివారులు, సాలార్‌నగర్, సాల్వీడ్, ఘణాపూర్‌తండ, చెల్లాపూర్‌తండా, మరిన్ని తండాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నదని తేల్చారు. ఐతే గండేడ్ మండలంలోని మహమ్మదాబాద్ మల్కచెర్వు దగ్గర రిజర్వాయర్ ఏర్పాటుచేస్తే గ్రామాలు ముంపునకు గురికాకుండా కేవలం అటవీ ప్రాంతం మాత్రమే ఎక్కువగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నది. దీన్ని అధికారులు పరిశీలనలోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.