వట్టెం టు డిండి! | Water From Vattem Reserviour To Dindi Project | Sakshi
Sakshi News home page

వట్టెం టు డిండి!

Published Sat, Feb 27 2021 4:21 AM | Last Updated on Sat, Feb 27 2021 5:35 AM

Water From Vattem Reserviour To Dindi Project - Sakshi

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో చేపట్టిన డిండి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలనే అంశం ఖరారైంది. డిండికి నీటిని తీసుకునే ప్రాంతాలపై గడిచిన మూడేళ్లుగా సుదీర్ఘ అధ్యయనం చేసిన ప్రభుత్వం తుదకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్‌ నుంచి నీటి తరలింపునకే మొగ్గు చూపింది. నార్లాపూర్, ఏదుల ద్వారా నీటిని తరలిస్తే అధిక వ్యయాలతో పాటు, టన్నెల్‌ మార్గాల నిర్మాణం ఆలస్యం అవుతుందన్న అంచనాతో వట్టెం నుంచి తరలింపుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కేవలం రూ.230 కోట్లతో ఈ ప్రణాళిక పట్టాలెక్కనుంది.     

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోస్తూ.. 30 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ 30 టీఎంసీల నీటిని మొదట పాలమూరు–రంగారెడ్డిలో భాగంగా ఉండే నార్లాపూర్‌ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇక్కడి నుంచి నీటిని తీసుకుంటే ఇప్పటికే వృధ్ధిలోకి వచ్చిన కల్వకుర్తి ఆయకట్టు దెబ్బతింటుండటం, భూసేకరణ సమస్యలతో పాటు, అటవీ ప్రాంతాల నుంచి అలైన్‌మెంట్‌ ఉండటంతో దీన్ని పక్కనపెట్టారు. ఈ మార్గం ద్వారా నీటిని తీసుకునేందుకు రూ.3,908 కోట్ల వరకు వ్యయం అవుతోంది.

దీంతో దీన్ని పక్కనపెట్టి పాలమూరులో రెండో రిజర్వాయర్‌ అయిన ఏదుల నుంచి తరలించే అంశంపై అధ్యయనం చేశారు. ఈ మార్గం ద్వారా తరలింపులో 18 కిలోమీటర్ల టన్నెల్‌ మార్గం అవసరం అవుతోంది. ఇది పూర్తి చేయాలంటే కనీసంగా రెండేళ్లకు పైగా సమయం పడుతోంది. అదీగాక దీనికి వ్యయం రూ.1,298 కోట్ల మేర ఉంటోంది. టన్నెల్‌ మార్గాలు వద్దనుకుంటే... అటవీ ప్రదేశం గుండా నీటి తరలింపు ఉండటంతో ఈ ప్రతిపాదనను సైతం పక్కనపెట్టారు. కొత్తగా పాలమూరులో మూడో రిజర్వాయర్‌గా ఉన్న వట్టెం నుంచి నీటిని తరలించే మార్గాలపై అధ్యయనం చేసి, ఓపెన్‌ కాల్వల ద్వారా నీటి తరలింపునకు అవకాశం ఉండటంతో దీనికి మొగ్గు చూపారు.

వట్టెం నుంచి నీటిని తీసుకుంటూ పోతిరెడ్డిపల్లి మండలంలోని ఊరచెరువు మార్గం ద్వారా తాడూరు మండలం బలాన్‌పల్లి గ్రామంలోని చెన్నకేశవులు చెరువు, ఇదే మండల పరిధిలోని గోవిందయ్యపల్లి గ్రామ పెద్దచెరువు ద్వారా 16 కిలోమీటర్ల మేర నీటిని తరలించి డిండి వాగులో కలుపుతారు. ఈ వాగులో చేరిన నీరు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర బ్యారేజీకి తరలించేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దీనికి కేవలం రూ. 230 కోట్ల వ్యయం కానుంది. ఇక్కడి నుంచి నీటిని గ్రావిటీ మార్గాన శింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్‌ వరకు తరలించనున్నారు.  

గొట్టిముక్కలలో మిగిలిన 355 ఎకరాల భూసేకరణ 
ఎగువన వట్టెం నుంచి నీటిని తరలించే ప్రక్రియ ఆల స్యమైనా డిండి ద్వారా దేవరకొండ నియోజకవర్గంలో తొలి సాగు ఫలాలు ఈ వానాకాలంలోనే అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గొట్టిముక్కల రిజర్వాయర్‌ పనులను 95 శాతం పూర్తి చేశారు. 1.83 టీఎంసీల సామర్ధ్యంతో 3.75 కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 30 మీటర్ల మేర మాత్రమే కట్ట నిర్మాణం మిగిలి ఉంది. 5 క్రస్ట్‌ గేట్ల ఏర్పాటు పూర్తయింది. దీనికి సొంతంగానే 474 చదరపు కిలోమీటర్ల మేర పరీవాహకం ఉండటంతో ఈ పరీవాహకం నుంచి వచ్చే నీటితో ఇందులో ఒక టీఎంసీకి పైగా నీటిని నింపే అవకాశం ఉంది. దీనికింద నిర్ణయించిన 28 వేల ఎకరాల్లో సగం ఆయకట్టుకు అంటే 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. 355 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

ఇందులో ఇప్పటికే 87 ఎకరాలు అవార్డు కాగా, దీనికై రూ.16 కోట్లు అవసరం ఉంది. ఇందులో ఇటీవలే రూ.10.50 కోట్లు సీఎం సూచనల మేరకు విడుదల చేసినా, వీటి చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. ఇక ఆర్‌అండ్‌ఆర్‌ కింద 112 కుటుంబాలను తరలించేందుకు రూ.12 కోట్లు అవసరం ఉంటుంది. ఇందులో రూ.4.50 కోట్లు విడుదల కాగా, వీటి చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ జూన్‌ నాటికి పూర్తి చేస్తే ఖరీఫ్‌లో కనీసంగా 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇక సింగరాజుపల్లి రిజర్వాయర్‌ను 0.81 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తుండగా, కట్టపొడవు 3 కిలోమీటర్ల మేర ఉంది.

ఇందులో ఇంకా 200 మీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తయితే దీనిలోనూ 0.50 టీఎంసీ నీటిని నింపే అవకాశం ఉంటుంది. దీనికింద ఇప్పటికే కుడి, ఎడమ తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, స్థానిక పరీవాహకం నుంచే వచ్చే నీటితో దీనికింద ఉన్న 13 వేల ఎకరాల్లో కనీసంగా 5 నుంచి 6 వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. ఇక్కడ పెండింగ్‌ బిల్లులు, మరో 71 ఎకరాల భూసేకరణకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం ఆదేశాలతో ఈ ఖరీఫ్‌లోనే దీనికింద ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు మొదలయ్యాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement