water for irrigation
-
వట్టెం టు డిండి!
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో చేపట్టిన డిండి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలనే అంశం ఖరారైంది. డిండికి నీటిని తీసుకునే ప్రాంతాలపై గడిచిన మూడేళ్లుగా సుదీర్ఘ అధ్యయనం చేసిన ప్రభుత్వం తుదకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకే మొగ్గు చూపింది. నార్లాపూర్, ఏదుల ద్వారా నీటిని తరలిస్తే అధిక వ్యయాలతో పాటు, టన్నెల్ మార్గాల నిర్మాణం ఆలస్యం అవుతుందన్న అంచనాతో వట్టెం నుంచి తరలింపుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కేవలం రూ.230 కోట్లతో ఈ ప్రణాళిక పట్టాలెక్కనుంది. సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోస్తూ.. 30 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ 30 టీఎంసీల నీటిని మొదట పాలమూరు–రంగారెడ్డిలో భాగంగా ఉండే నార్లాపూర్ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇక్కడి నుంచి నీటిని తీసుకుంటే ఇప్పటికే వృధ్ధిలోకి వచ్చిన కల్వకుర్తి ఆయకట్టు దెబ్బతింటుండటం, భూసేకరణ సమస్యలతో పాటు, అటవీ ప్రాంతాల నుంచి అలైన్మెంట్ ఉండటంతో దీన్ని పక్కనపెట్టారు. ఈ మార్గం ద్వారా నీటిని తీసుకునేందుకు రూ.3,908 కోట్ల వరకు వ్యయం అవుతోంది. దీంతో దీన్ని పక్కనపెట్టి పాలమూరులో రెండో రిజర్వాయర్ అయిన ఏదుల నుంచి తరలించే అంశంపై అధ్యయనం చేశారు. ఈ మార్గం ద్వారా తరలింపులో 18 కిలోమీటర్ల టన్నెల్ మార్గం అవసరం అవుతోంది. ఇది పూర్తి చేయాలంటే కనీసంగా రెండేళ్లకు పైగా సమయం పడుతోంది. అదీగాక దీనికి వ్యయం రూ.1,298 కోట్ల మేర ఉంటోంది. టన్నెల్ మార్గాలు వద్దనుకుంటే... అటవీ ప్రదేశం గుండా నీటి తరలింపు ఉండటంతో ఈ ప్రతిపాదనను సైతం పక్కనపెట్టారు. కొత్తగా పాలమూరులో మూడో రిజర్వాయర్‌గా ఉన్న వట్టెం నుంచి నీటిని తరలించే మార్గాలపై అధ్యయనం చేసి, ఓపెన్ కాల్వల ద్వారా నీటి తరలింపునకు అవకాశం ఉండటంతో దీనికి మొగ్గు చూపారు. వట్టెం నుంచి నీటిని తీసుకుంటూ పోతిరెడ్డిపల్లి మండలంలోని ఊరచెరువు మార్గం ద్వారా తాడూరు మండలం బలాన్‌పల్లి గ్రామంలోని చెన్నకేశవులు చెరువు, ఇదే మండల పరిధిలోని గోవిందయ్యపల్లి గ్రామ పెద్దచెరువు ద్వారా 16 కిలోమీటర్ల మేర నీటిని తరలించి డిండి వాగులో కలుపుతారు. ఈ వాగులో చేరిన నీరు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర బ్యారేజీకి తరలించేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దీనికి కేవలం రూ. 230 కోట్ల వ్యయం కానుంది. ఇక్కడి నుంచి నీటిని గ్రావిటీ మార్గాన శింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ వరకు తరలించనున్నారు. గొట్టిముక్కలలో మిగిలిన 355 ఎకరాల భూసేకరణ ఎగువన వట్టెం నుంచి నీటిని తరలించే ప్రక్రియ ఆల స్యమైనా డిండి ద్వారా దేవరకొండ నియోజకవర్గంలో తొలి సాగు ఫలాలు ఈ వానాకాలంలోనే అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గొట్టిముక్కల రిజర్వాయర్ పనులను 95 శాతం పూర్తి చేశారు. 1.83 టీఎంసీల సామర్ధ్యంతో 3.75 కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 30 మీటర్ల మేర మాత్రమే కట్ట నిర్మాణం మిగిలి ఉంది. 5 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తయింది. దీనికి సొంతంగానే 474 చదరపు కిలోమీటర్ల మేర పరీవాహకం ఉండటంతో ఈ పరీవాహకం నుంచి వచ్చే నీటితో ఇందులో ఒక టీఎంసీకి పైగా నీటిని నింపే అవకాశం ఉంది. దీనికింద నిర్ణయించిన 28 వేల ఎకరాల్లో సగం ఆయకట్టుకు అంటే 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. 355 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 87 ఎకరాలు అవార్డు కాగా, దీనికై రూ.16 కోట్లు అవసరం ఉంది. ఇందులో ఇటీవలే రూ.10.50 కోట్లు సీఎం సూచనల మేరకు విడుదల చేసినా, వీటి చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. ఇక ఆర్అండ్ఆర్ కింద 112 కుటుంబాలను తరలించేందుకు రూ.12 కోట్లు అవసరం ఉంటుంది. ఇందులో రూ.4.50 కోట్లు విడుదల కాగా, వీటి చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ జూన్ నాటికి పూర్తి చేస్తే ఖరీఫ్‌లో కనీసంగా 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇక సింగరాజుపల్లి రిజర్వాయర్‌ను 0.81 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తుండగా, కట్టపొడవు 3 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో ఇంకా 200 మీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తయితే దీనిలోనూ 0.50 టీఎంసీ నీటిని నింపే అవకాశం ఉంటుంది. దీనికింద ఇప్పటికే కుడి, ఎడమ తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, స్థానిక పరీవాహకం నుంచే వచ్చే నీటితో దీనికింద ఉన్న 13 వేల ఎకరాల్లో కనీసంగా 5 నుంచి 6 వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. ఇక్కడ పెండింగ్ బిల్లులు, మరో 71 ఎకరాల భూసేకరణకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం ఆదేశాలతో ఈ ఖరీఫ్‌లోనే దీనికింద ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు మొదలయ్యాయి. -
మక్కకు మహర్దశ!
సాగునీటి లభ్యత అంతంతమాత్రంగా ఉన్న సిద్దిపేట ప్రాంత రైతులంతా మక్కసాగుకే మొగ్గుచూపుతారు. అయినప్పటికీ ప్రకృతి ప్రకోపానికి ప్రతిసారీ అన్నదాతలంతా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటుపోట్లను తట్టుకుని నిలిచే మక్క రకాన్ని కనుక్కుంటే తమకష్టాలన్నీ తీరుతాయని రైతులంతా ఆశపడ్డారు. వారి ఆశలను నిజం చేస్తూ టీఆర్ఎస్ సర్కార్ సిద్దిపేటలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సిద్ధమైంది. అందులో భాగంగా సిద్దిపేట సమీపంలోని తోర్నాల వద్ద ఏర్పాటు చేయనున్న పరిశోధనా కేంద్రానికి గురువారం శంకుస్థాపన చేసేందుకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు తరలిరానున్నారు. సిద్దిపేట జోన్: మక్కకు మహర్దశ పట్టనుంది. వాటిపై అధ్యయనం చేసేందుకు పాలకులు శ్రీకారం చుడుతున్నారు. సీడ్ ఆఫ్ బౌల్‌గా తె లంగాణను మార్చనున్నామన్న హామీని నెరవేర్చేం దుకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం మెతుకు సీమలో ముచ్చటగా తెలంగాణ వ్యాప్తంగా మూడో పరి శోధన కేంద్రానికి వ్యవసాయ శాఖ అంకురార్పణ చేసిం ది. గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా తోర్నాల శివారులో మొక్కజొన్న పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లాగా మారిన మెదక్ జిల్లాలో భూ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట డివిజన్లోని 13 మండలాలతో పాటు మెదక్, సంగారెడ్డిలోని కొన్ని మం డలాల రైతులు మక్క పంటను సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో 1.02 లక్షల హెక్టార్ల మక్క సాధారణ విస్తీర్ణం ఉండగా గత ఖరీఫ్‌లో 1.25 లక్షల హెక్టార్లకు పెరిగింది. సుమారు 90 వేల మంది మక్కరైతులు జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట సాగు చేస్తున్నట్లు సమాచారం. మేలుర కం వంగడాల ఆవిష్కరణకు సమీపంలోని హైదరాబాద్ జిల్లా రాజేంద్రనగర్ పరిశోధన కేంద్రంపై ఆధారపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న క్రమంలో మెదక్ జిల్లాలో పరిశోధన కేంద్రాల ఏర్పాటుపై గత నెలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. అందులో భాగంగానే సిద్దిపేట మండలం తోర్నాల శివారులో మక్క పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా చర్యలు చేపట్టి స్థలాన్ని సేకరించింది. గురువారం పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేయనుంది. ఇది పూర్తయితే మెదక్ జిల్లాలోని 25 మండలాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల రైతులకు లబ్ధిచేకూరనుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హైబ్రీడ్, స్వీట్ కాన్, పాప్కాన్లతో పాటు కొత్త వంగడాల రూపకల్పన జరుగనుంది. నేడు మంత్రిచే శంకుస్థాపన సిద్దిపేట మండలం తోర్నాల శివారులో రూ. 2 కోట్లతో నిర్మించనున్న మొక్కజొన్న పరిశోధన కేంద్రానికి గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 28 ఎకరాల స్థలంలో అత్యాధునిక వసతులతో కూడిన పరిశోధన కేంద్ర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి భూమి పూజ చేయనున్నారు. -
చెరువులు, కుంటల ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరు!
మైనర్ ఇరిగేషన్‌పై మంత్రి హరీష్‌రావు సమీక్ష హైదరాబాద్: చెరువులు, కుంటల ద్వారా వచ్చే ఏడాది కల్లా 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్దరిస్తామని చెప్పారు. చిన్న తరహా నీటి వనరులపై మంత్రి సోమవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో అధికారుల సమీక్ష సమావేశంలో నీటి పారుదల శాఖ ప్రభత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, ముఖ్య కార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్, ఇంజనీర్లు పాల్గొన్నారు. రాష్ర్టంలో ఉన్న 36 వేల చెరువుల ద్వారా వచ్చే ఏడాదిలో 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. -
సాగుకు...ఊతం
ఆటుపోటుల మధ్య ఈమారు ప్రారంభమవుతున్న ఖరీఫ్‌లో సాగుకు నీరందించే లక్ష్యంతో జిల్లాలోని ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ దిశగా అయిదింటి పనులను త్వరితంగా చేపడుతున్నారు. వీటిలో మూడు కొత్తవి ఉన్నాయి. మొత్తం 2.97వేల ఎకరాలకు నీరందించి పంటలకు ప్రాణం పోయాలని భావిస్తున్నారు. అనుకున్నట్లు అన్నీ జరిగితే అన్నదాతలకు ఊరటిచ్చినట్లే. సాగుకు భరోసా దక్కినట్లే. గద్వాల : జిల్లాలో జలయజ్ఞం ద్వారా నిర్మితమైన కొత్త ఎత్తిపోతల పథకాల నుంచి ఈ ఖ రీఫ్లో ఆయకట్టు భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో నీటిపారుదల శాఖ అధికారులు పనులను వేగవంతం చేశారు. మూడు కొత్త ప్రాజెక్టుల నుంచి 1.73లక్షల ఎకరాల ఆ యకట్టుకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. కొత్త ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే సాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టు ద్వారా 1.07లక్షల ఎకరాలకు, ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా 30-40వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో అన్ని పాత, కొత్త ప్రాజెక్టుల పరిధిలో కనీసం 3లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పరిధిలో సాగునీటి విడుదలకు అవసరమైన ఫీల్డ్‌చానల్స్, డిస్ట్రిబ్యూటరీల పనులను వేగవంతం చేశారు. జలయజ్ఞం పథకం ద్వారా నిర్మితమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో గతేడాది మాదిరిగానే ఈ ఖరీఫ్‌లోనూ కేవలం 13వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించేందుకు అవకాశం ఉంది. ప్రాధాన్యతతో పనులు జిల్లాలోని మూడు భారీ ఎత్తిపోతల పథకాలను 2012 సెప్టెంబర్ నెలల్లో 14,15,16 తేదీలలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాటలో భాగంగా ప్రారంభోత్సవాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగునీటిని అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేయలేకపోవడం వల్ల సాగునీటిని ఆయకట్టుకు విడుదల చేయలేకపోయారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజ్-1, స్టేజ్-2 పంపుల నుంచి నీటిని రిజర్వాయర్లకు అందించి గత రెండేళ్లుగా చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వేసవిలోనూ తాగునీటి సమస్య రాకుండా చాలా చెరువులకు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ ఆగస్టు మొదటి వారం నాటికి నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో డిస్ట్రిబ్యూటరీలను ప్రాధాన్యతతో పూర్తిచేసి క నీసం 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. భీమా ప్రాజెక్టు పరిధిలోనూ స్టేజ్-1, స్టేజ్-2లలో అవసరమైన పనులను పూర్తిచేసి 90వేల నుంచి లక్ష ఎకరాల వరకు సాగునీటిని అందించాలన్న లక్ష్యాన్ని నిర్ణయించారు. ఆగస్టు మొదటి వారం వరకు పనులను యుద్ధ ప్రాతిపదికన కొన సాగిస్తూ వీలైనంత వరకు ఫీల్డ్చానల్స్ను కూడా పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా పనులు చేస్తున్నారు. కోయిల్‌సాగర్ పరిధిలో పాత ఆయకట్టు 12వేల ఎకరాలతో పాటు కొత్తగా 8వేల ఎకరాలు మొత్తం 20వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీటిని అందించాలని నిర్ణయించారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో ఐఏబీ ద్వారా నిర్ణయం తీసుకొని 1.07లక్షల ఎకరాలకు, ఆర్డీఎస్ పరిధిలో 30వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మూడు కొత్త ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్ నాటికి సాగునీటిని అందించేలా అవసరమైన పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఐఏబీలో ఏయే ప్రాజెక్టు పరిధిలో ఎన్నివేల ఎకరాలకు నీటిని ఇవ్వాలన్న అంశంపై నిర్ణయం తీసుకొని నీటిని విడుదల చేస్తామని ఆయన వివరించారు.