సాగుకు...ఊతం
ఆటుపోటుల మధ్య ఈమారు ప్రారంభమవుతున్న ఖరీఫ్‌లో సాగుకు నీరందించే లక్ష్యంతో జిల్లాలోని ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ దిశగా అయిదింటి పనులను త్వరితంగా చేపడుతున్నారు. వీటిలో మూడు కొత్తవి ఉన్నాయి. మొత్తం 2.97వేల ఎకరాలకు నీరందించి పంటలకు ప్రాణం పోయాలని భావిస్తున్నారు. అనుకున్నట్లు అన్నీ జరిగితే అన్నదాతలకు ఊరటిచ్చినట్లే. సాగుకు భరోసా దక్కినట్లే.
గద్వాల : జిల్లాలో జలయజ్ఞం ద్వారా నిర్మితమైన కొత్త ఎత్తిపోతల పథకాల నుంచి ఈ ఖ రీఫ్‌లో ఆయకట్టు భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో నీటిపారుదల శాఖ అధికారులు పనులను వేగవంతం చేశారు. మూడు కొత్త ప్రాజెక్టుల నుంచి 1.73లక్షల ఎకరాల ఆ యకట్టుకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు.
కొత్త ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే సాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టు ద్వారా 1.07లక్షల ఎకరాలకు, ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా 30-40వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో అన్ని పాత, కొత్త ప్రాజెక్టుల పరిధిలో కనీసం 3లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పరిధిలో సాగునీటి విడుదలకు అవసరమైన ఫీల్డ్‌చానల్స్, డిస్ట్రిబ్యూటరీల పనులను వేగవంతం చేశారు. జలయజ్ఞం పథకం ద్వారా నిర్మితమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో గతేడాది మాదిరిగానే ఈ ఖరీఫ్‌లోనూ కేవలం 13వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించేందుకు అవకాశం ఉంది.
ప్రాధాన్యతతో పనులు
జిల్లాలోని మూడు భారీ ఎత్తిపోతల పథకాలను 2012 సెప్టెంబర్ నెలల్లో 14,15,16 తేదీలలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాటలో భాగంగా ప్రారంభోత్సవాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగునీటిని అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేయలేకపోవడం వల్ల సాగునీటిని ఆయకట్టుకు విడుదల చేయలేకపోయారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజ్-1, స్టేజ్-2 పంపుల నుంచి నీటిని రిజర్వాయర్లకు అందించి గత రెండేళ్లుగా చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుత వేసవిలోనూ తాగునీటి సమస్య రాకుండా చాలా చెరువులకు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ ఆగస్టు మొదటి వారం నాటికి నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో డిస్ట్రిబ్యూటరీలను ప్రాధాన్యతతో పూర్తిచేసి క నీసం 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. భీమా ప్రాజెక్టు పరిధిలోనూ స్టేజ్-1, స్టేజ్-2లలో అవసరమైన పనులను పూర్తిచేసి 90వేల నుంచి లక్ష ఎకరాల వరకు సాగునీటిని అందించాలన్న లక్ష్యాన్ని నిర్ణయించారు. ఆగస్టు మొదటి వారం వరకు పనులను యుద్ధ ప్రాతిపదికన కొన సాగిస్తూ వీలైనంత వరకు ఫీల్డ్‌చానల్స్‌ను కూడా పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా పనులు చేస్తున్నారు. కోయిల్‌సాగర్ పరిధిలో పాత ఆయకట్టు 12వేల ఎకరాలతో పాటు కొత్తగా 8వేల ఎకరాలు మొత్తం 20వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీటిని అందించాలని నిర్ణయించారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో ఐఏబీ ద్వారా నిర్ణయం తీసుకొని 1.07లక్షల ఎకరాలకు, ఆర్డీఎస్ పరిధిలో 30వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషయమై జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మూడు కొత్త ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్ నాటికి సాగునీటిని అందించేలా అవసరమైన పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఐఏబీలో ఏయే ప్రాజెక్టు పరిధిలో ఎన్నివేల ఎకరాలకు నీటిని ఇవ్వాలన్న అంశంపై నిర్ణయం తీసుకొని నీటిని విడుదల చేస్తామని ఆయన వివరించారు.