department officers
-
ఎరువుల విక్రయాల్లో అక్రమాలు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది. వ్యవసాయ సీజన్లో వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ రైతులను దోపిడీ చేస్తున్నారు. కొందరు వ్యాపారులు ఎరువులను దాచి కృత్రిమ కొరత సృష్టించి అధికధరలకు విక్రయిస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు శనివారం కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 9 దుకాణాలను తనిఖీ చేయగా సంగం, బుచ్చిరెడ్డిపాళెంలోని దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.42 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేశారు. భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనేందుకు స్వాధీనం చేసుకున్న ఎరువులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పెన్నాడెల్టా కింద మాత్రమే లేట్ ఖరీప్‌లో భాగంగా రైతులు వరిసాగు చేస్తున్నారు. దీంతో ఇక్కడ కొంత మేర మాత్రమే ఎరువులకు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎరువుల దుకాణాలలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందంటే, ఇక సీజన్లో అవి ఏ స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా లెసైన్స్డ్ విత్తన దుకాణాలు 350 వరకూ ఉండగా, అనధికార విత్తన దుకాణాలు సైతం చాలా ఉన్నాయి. ఇక లెసైన్స్డ్ ఎరువుల దుకాణాలు 600 వరకూ ఉన్నాయి. అనధికార ఎరువుల దుకాణాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది సీజన్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. స్టాకు రిజిస్టర్‌కు గోదాముల్లో ఉన్న నిల్వలకు పొంతన లేకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని విత్తన షాపుల్లోనూ సీజన్లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు నకిలీ విత్తనాలతో పాటు నకిలీ పురుగుమందుల వ్యాపారం సైతం జిల్లాలో జోరుగా సాగుతున్నట్లు సమాచారం. వీరి అక్రమ వ్యాపారాలకు కొందరు అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
సాగుకు...ఊతం
ఆటుపోటుల మధ్య ఈమారు ప్రారంభమవుతున్న ఖరీఫ్‌లో సాగుకు నీరందించే లక్ష్యంతో జిల్లాలోని ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ దిశగా అయిదింటి పనులను త్వరితంగా చేపడుతున్నారు. వీటిలో మూడు కొత్తవి ఉన్నాయి. మొత్తం 2.97వేల ఎకరాలకు నీరందించి పంటలకు ప్రాణం పోయాలని భావిస్తున్నారు. అనుకున్నట్లు అన్నీ జరిగితే అన్నదాతలకు ఊరటిచ్చినట్లే. సాగుకు భరోసా దక్కినట్లే. గద్వాల : జిల్లాలో జలయజ్ఞం ద్వారా నిర్మితమైన కొత్త ఎత్తిపోతల పథకాల నుంచి ఈ ఖ రీఫ్లో ఆయకట్టు భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో నీటిపారుదల శాఖ అధికారులు పనులను వేగవంతం చేశారు. మూడు కొత్త ప్రాజెక్టుల నుంచి 1.73లక్షల ఎకరాల ఆ యకట్టుకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. కొత్త ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే సాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టు ద్వారా 1.07లక్షల ఎకరాలకు, ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా 30-40వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో అన్ని పాత, కొత్త ప్రాజెక్టుల పరిధిలో కనీసం 3లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పరిధిలో సాగునీటి విడుదలకు అవసరమైన ఫీల్డ్‌చానల్స్, డిస్ట్రిబ్యూటరీల పనులను వేగవంతం చేశారు. జలయజ్ఞం పథకం ద్వారా నిర్మితమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో గతేడాది మాదిరిగానే ఈ ఖరీఫ్‌లోనూ కేవలం 13వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించేందుకు అవకాశం ఉంది. ప్రాధాన్యతతో పనులు జిల్లాలోని మూడు భారీ ఎత్తిపోతల పథకాలను 2012 సెప్టెంబర్ నెలల్లో 14,15,16 తేదీలలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాటలో భాగంగా ప్రారంభోత్సవాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగునీటిని అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేయలేకపోవడం వల్ల సాగునీటిని ఆయకట్టుకు విడుదల చేయలేకపోయారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజ్-1, స్టేజ్-2 పంపుల నుంచి నీటిని రిజర్వాయర్లకు అందించి గత రెండేళ్లుగా చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వేసవిలోనూ తాగునీటి సమస్య రాకుండా చాలా చెరువులకు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ ఆగస్టు మొదటి వారం నాటికి నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో డిస్ట్రిబ్యూటరీలను ప్రాధాన్యతతో పూర్తిచేసి క నీసం 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. భీమా ప్రాజెక్టు పరిధిలోనూ స్టేజ్-1, స్టేజ్-2లలో అవసరమైన పనులను పూర్తిచేసి 90వేల నుంచి లక్ష ఎకరాల వరకు సాగునీటిని అందించాలన్న లక్ష్యాన్ని నిర్ణయించారు. ఆగస్టు మొదటి వారం వరకు పనులను యుద్ధ ప్రాతిపదికన కొన సాగిస్తూ వీలైనంత వరకు ఫీల్డ్చానల్స్ను కూడా పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా పనులు చేస్తున్నారు. కోయిల్‌సాగర్ పరిధిలో పాత ఆయకట్టు 12వేల ఎకరాలతో పాటు కొత్తగా 8వేల ఎకరాలు మొత్తం 20వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీటిని అందించాలని నిర్ణయించారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో ఐఏబీ ద్వారా నిర్ణయం తీసుకొని 1.07లక్షల ఎకరాలకు, ఆర్డీఎస్ పరిధిలో 30వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మూడు కొత్త ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్ నాటికి సాగునీటిని అందించేలా అవసరమైన పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఐఏబీలో ఏయే ప్రాజెక్టు పరిధిలో ఎన్నివేల ఎకరాలకు నీటిని ఇవ్వాలన్న అంశంపై నిర్ణయం తీసుకొని నీటిని విడుదల చేస్తామని ఆయన వివరించారు. -
ఏజెంట్లు x రవాణాశాఖ
సాక్షి, నెల్లూరు : రవాణాశాఖలో వేళ్లూనుకుని పోయిన అవినీతి గుట్టు ఏజెంట్లు, ఆ శాఖ అధికారులు, సిబ్బంది మధ్య వివాదంతో రట్టవుతోంది. దీంతో రవాణాశాఖలో అవినీతి అనుపానులు ఏజెంట్లు బయట పెట్టడంతో ఆ శాఖ అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. ఇన్నాళ్లు తాము పెంచి పోషించిన ఏజెంట్లు తమపైనే తిరుగుబాటు చేయడంతో ఇక వారి ఆధిపత్యానికి కళ్లెం వేసేందుకు సిద్ధమయ్యారు. ‘రవాణా శాఖలో సేవలన్నీ పారదర్శకమే. ప్రతి పని ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. ఏ పనికైనా హెల్ప్ డెస్క్‌ను సంప్రదించండి’- అని అధికారులు కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేసినా.. ఏ పనైనా ఏజెంట్లు లేకుండా జరిగే ప్రసక్తే లేదనేది నిర్వివాదాంశం. ప్రజలు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పనిలేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు, యూజర్ చార్జీలు మినహా అదనంగా ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నా.. ఇక్కడ జరుగుతున్న తంతుకు పొంతన లేదు. ఇక్కడ జరిగే అవినీతి బహిరంగమే అయినప్పటికీ అంతా రహస్యమే అన్నట్లుగా ఉంటుంది. ఏజెంట్లను అడ్డం పెట్టుకుని ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. పేరుకు మాత్రం అంతా పారదర్శకం అని చెప్పుకునే ఆ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులదే (ఏజెంట్లదే) పెత్తనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏజెంట్ లేనిదే కార్యాలయంలో చిన్న పని కూడా జరగని పరిస్థితి. ఇదంతా నిత్యం జరిగే తంతే అయినప్పటికీ కొద్ది రోజులుగా ఏజెంట్లకు, అధికారులకు మధ్య పొసగడం లేదు. దీంతో నిత్యం అక్కడ గొడవలే. పది రోజులు క్రితం అక్తర్ అనే ఏజెంట్ కార్యాలయంలో చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. అక్తర్ మద్యం సేవించి కార్యాలయంలోకి వచ్చి అధికారులను బహిరంగంగా నిలదీయడం..ఆ తర్వాత పరిణామాలతో ఆ శాఖ అవినీతి గుట్టు వీధిన పడింది. అయితే కొందరు ఏజెంట్లు ఇతడ్ని విలన్‌గా చిత్రీకరించడమే కాకుండా ఆ తంతును చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా కెమెరా మెన్లపై కూడా విరుచుకుపడ్డారు. ఏజెంట్ అక్తర్‌పై కార్యాలయ సిబ్బంది 5వ నగర పోలీసుస్టేషన్లో, నగర డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏజెంట్లు వర్సెస్ సిబ్బంది ఈ వివాదం ఇంతటితో ఆగడం లేదు. తాజాగా బుధవారం ఓ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) వాహనాన్ని ఏజెంట్లు అడ్డుకునే వరకు వెళ్లింది. ఏజెంట్లను కార్యాలయంలోకి అనుమతించకపోవడంపై మండిపడ్డారు. మీ గుట్టంతా మా చేతుల్లో ఉందంటూ అధికారులు, సిబ్బందిని బ్లాక్ మెయిల్ చేసే వరకు వచ్చింది. నిన్నటి వరకు తమ వద్ద చేతులు కట్టుకుని ఎంతో వినయత ప్రదర్శించే ఏజెంట్లు ఏకులా వచ్చి మేకులా తయారయ్యారని అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల వ్యవస్థను చాలా ఏళ్ల క్రితం రద్దు చేశారు. అయితే అనధికారికంగా ఏజెంట్ల వ్యవస్థ నడుస్తూనే ఉంది. చాప కింద నీరులా గుట్టుగా సాగిపోయే తమ అవినీతి కార్యకలాపాలు రట్టవుతుండటంతో ఏజెంట్లను కార్యాలయంలోకి అనుమతించ కూడదని అధికారులు గట్టి నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయ ఏఓ ఒకరు తాను నిర్వహించాల్సిన విధులను పక్కన పెట్టి ప్రవేశ గేట్ వద్ద కాపలా కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరిణామాలు ఏ పరిస్థితికి దారితీస్తాయోనని ఏజెంట్లు ఆందోళన చెందుతున్నారు. పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూనే అధికారుల అవినీతి అనుపానులను బయటపెడతామంటూ వారిని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఏజెంట్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధికారులు ఏ మాత్రం పట్టుబిగిస్తారో వేచిచూడాల్సిందే. స్వచ్ఛందంగా వచ్చి పని చేయించుకోండి ఆర్టీఏ కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే వినియోగదారులు ఏజెంట్లను ఆశ్రయించకుండా హెల్ప్‌డెస్క్ ద్వారా పనులు చేయించుకోవాలని కార్యాలయ ఏఓ కరీమ్ తెలిపారు. అనధికారిక వ్యక్తులనెవరిని కార్యాలయం లోపలికి రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.