సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది. వ్యవసాయ సీజన్‌లో వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ రైతులను దోపిడీ చేస్తున్నారు. కొందరు వ్యాపారులు ఎరువులను దాచి కృత్రిమ కొరత సృష్టించి అధికధరలకు విక్రయిస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు శనివారం కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
మొత్తం 9 దుకాణాలను తనిఖీ చేయగా సంగం, బుచ్చిరెడ్డిపాళెంలోని దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.42 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేశారు. భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనేందుకు స్వాధీనం చేసుకున్న ఎరువులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పెన్నాడెల్టా కింద మాత్రమే లేట్ ఖరీప్‌లో భాగంగా రైతులు వరిసాగు చేస్తున్నారు. దీంతో ఇక్కడ కొంత మేర మాత్రమే ఎరువులకు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎరువుల దుకాణాలలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందంటే, ఇక సీజన్‌లో అవి ఏ స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా లెసైన్స్‌డ్ విత్తన దుకాణాలు 350 వరకూ ఉండగా, అనధికార విత్తన దుకాణాలు సైతం చాలా ఉన్నాయి. ఇక లెసైన్స్‌డ్ ఎరువుల దుకాణాలు 600 వరకూ ఉన్నాయి. అనధికార ఎరువుల దుకాణాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది సీజన్‌లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. స్టాకు రిజిస్టర్‌కు గోదాముల్లో ఉన్న నిల్వలకు పొంతన లేకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని విత్తన షాపుల్లోనూ సీజన్‌లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు నకిలీ విత్తనాలతో పాటు నకిలీ పురుగుమందుల వ్యాపారం సైతం జిల్లాలో జోరుగా సాగుతున్నట్లు సమాచారం. వీరి అక్రమ వ్యాపారాలకు కొందరు అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎరువుల విక్రయాల్లో అక్రమాలు
Published Mon, Jun 23 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM
Advertisement
Advertisement