ఏజెంట్లు x రవాణాశాఖ
సాక్షి, నెల్లూరు : రవాణాశాఖలో వేళ్లూనుకుని పోయిన అవినీతి గుట్టు ఏజెంట్లు, ఆ శాఖ అధికారులు, సిబ్బంది మధ్య వివాదంతో రట్టవుతోంది. దీంతో రవాణాశాఖలో అవినీతి అనుపానులు ఏజెంట్లు బయట పెట్టడంతో ఆ శాఖ అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు.
ఇన్నాళ్లు తాము పెంచి పోషించిన ఏజెంట్లు తమపైనే తిరుగుబాటు చేయడంతో ఇక వారి ఆధిపత్యానికి కళ్లెం వేసేందుకు సిద్ధమయ్యారు. ‘రవాణా శాఖలో సేవలన్నీ పారదర్శకమే. ప్రతి పని ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవచ్చు. ఏ పనికైనా హెల్ప్ డెస్క్‌ను సంప్రదించండి’- అని అధికారులు కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేసినా.. ఏ పనైనా ఏజెంట్లు లేకుండా జరిగే ప్రసక్తే
లేదనేది నిర్వివాదాంశం.
ప్రజలు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పనిలేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు, యూజర్ చార్జీలు మినహా అదనంగా ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నా.. ఇక్కడ జరుగుతున్న తంతుకు పొంతన లేదు. ఇక్కడ జరిగే అవినీతి బహిరంగమే అయినప్పటికీ అంతా రహస్యమే అన్నట్లుగా ఉంటుంది. ఏజెంట్లను అడ్డం పెట్టుకుని ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. పేరుకు మాత్రం అంతా పారదర్శకం అని చెప్పుకునే ఆ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులదే (ఏజెంట్లదే) పెత్తనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏజెంట్ లేనిదే కార్యాలయంలో చిన్న పని కూడా జరగని పరిస్థితి.
ఇదంతా నిత్యం జరిగే తంతే అయినప్పటికీ కొద్ది రోజులుగా ఏజెంట్లకు, అధికారులకు మధ్య పొసగడం లేదు. దీంతో నిత్యం అక్కడ గొడవలే. పది రోజులు క్రితం అక్తర్ అనే ఏజెంట్ కార్యాలయంలో చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. అక్తర్ మద్యం సేవించి కార్యాలయంలోకి వచ్చి అధికారులను బహిరంగంగా నిలదీయడం..ఆ తర్వాత పరిణామాలతో ఆ శాఖ అవినీతి గుట్టు వీధిన పడింది. అయితే కొందరు ఏజెంట్లు ఇతడ్ని విలన్‌గా చిత్రీకరించడమే కాకుండా ఆ తంతును చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా కెమెరా మెన్‌లపై కూడా విరుచుకుపడ్డారు. ఏజెంట్ అక్తర్‌పై కార్యాలయ సిబ్బంది 5వ నగర పోలీసుస్టేషన్‌లో, నగర డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఏజెంట్లు వర్సెస్ సిబ్బంది
ఈ వివాదం ఇంతటితో ఆగడం లేదు. తాజాగా బుధవారం ఓ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) వాహనాన్ని ఏజెంట్లు అడ్డుకునే వరకు వెళ్లింది. ఏజెంట్లను కార్యాలయంలోకి అనుమతించకపోవడంపై మండిపడ్డారు. మీ గుట్టంతా మా చేతుల్లో ఉందంటూ అధికారులు, సిబ్బందిని బ్లాక్ మెయిల్ చేసే వరకు వచ్చింది.
నిన్నటి వరకు తమ వద్ద చేతులు కట్టుకుని ఎంతో వినయత ప్రదర్శించే ఏజెంట్లు ఏకులా వచ్చి మేకులా తయారయ్యారని అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల వ్యవస్థను చాలా ఏళ్ల క్రితం రద్దు చేశారు. అయితే అనధికారికంగా ఏజెంట్ల వ్యవస్థ నడుస్తూనే ఉంది. చాప కింద నీరులా గుట్టుగా సాగిపోయే తమ అవినీతి కార్యకలాపాలు రట్టవుతుండటంతో ఏజెంట్లను కార్యాలయంలోకి అనుమతించ కూడదని అధికారులు గట్టి నిర్ణయం తీసుకున్నారు.
కార్యాలయ ఏఓ ఒకరు తాను నిర్వహించాల్సిన విధులను పక్కన పెట్టి ప్రవేశ గేట్ వద్ద కాపలా కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరిణామాలు ఏ పరిస్థితికి దారితీస్తాయోనని ఏజెంట్లు ఆందోళన చెందుతున్నారు. పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూనే అధికారుల అవినీతి అనుపానులను బయటపెడతామంటూ వారిని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఏజెంట్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధికారులు ఏ మాత్రం పట్టుబిగిస్తారో వేచిచూడాల్సిందే.
స్వచ్ఛందంగా వచ్చి
పని చేయించుకోండి
ఆర్టీఏ కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే వినియోగదారులు ఏజెంట్లను ఆశ్రయించకుండా హెల్ప్‌డెస్క్ ద్వారా పనులు చేయించుకోవాలని కార్యాలయ ఏఓ కరీమ్ తెలిపారు. అనధికారిక వ్యక్తులనెవరిని కార్యాలయం లోపలికి రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.