సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్‌మెంట్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. దీంతో నీటిని పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని తాజాగా నిర్ణయించారు. ప్రాజెక్టుల్లో అటవీ సమస్యల కారణంగా కేంద్ర సంస్థల అనుమతులు రావడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఏదుల నుంచి శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీల నీటిని తీసుకునేందుకు తుది ప్రతిపాదన సిద్ధం చేశారు.
ఏదుల నుంచే ముందుకు..
డిండి ఎత్తిపోతల పథకం ద్వారా 4.5 లక్షల ఎకరాలకు పాలమూరులో భాగంగా ఉన్న రిజర్వాయర్‌ల నుంచి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పాలమూరులో భాగంగా ఉన్న ఏదుల నుంచే తీసు కోవాలని తొలుత భావించినా, దాన్ని నార్లాపూర్‌కు మార్చారు. అయితే నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్‌మెంట్‌తో కల్వకుర్తి ప్రాజెక్టు ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉండటం, దీనికి పాలమూరు జిల్లా నేతలు అభ్యంతరాలు చెప్పడం తో మళ్లీ సర్వే చేయించారు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రణాళికకు ఓకే చెబుతూనే రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్ మెయిన్ తగ్గించాలని, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని తేల్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరంతో పాటు కాల్వలను, సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంది.
ఈ ప్రతిపాదనను అధికారులు పరిశీలించగా 5వ కిలోమీటర్ నుంచి 20వ కిలోమీటర్ వరకు ఉన్న అలైన్‌మెంట్, రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని వెల్లడైంది. దీం తో మళ్లీ రీసర్వే చేయించారు. ఇందులో ఏదుల నుంచే నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏదు ల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానల్, 2.5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 16 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీటిని డిండిలో భాగంగా ఉన్న ప్రతిపాదిత ఉల్పర రిజర్వాయర్‌కు చేరేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనకు రూ. 1,200 కోట్ల అంచనా వేశారు. ఏదుల నుంచి డిండి అలైన్‌మెంట్ ఖరారు కానందున, ఆలోపు దిగువన ఉన్న సింగరాజు పల్లి (0.8 టీఎంసీలు), గొట్టిముక్కల (1.8), చింతపల్లి (0.99), కిష్టరాంపల్లి (5.68), శివన్నగూడం (11.96 టీఎంసీల) రిజర్వాయర్లు.. వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులకు ఇప్పటికే ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ఆరంభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment