శ్రీరాంసాగర్‌ 41 గేట్లు ఎత్తివేత | Flood released by lifting 41 SRSP gates: Sri Ramsagar | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్‌ 41 గేట్లు ఎత్తివేత

Published Tue, Sep 3 2024 2:38 AM | Last Updated on Tue, Sep 3 2024 2:38 AM

Flood released by lifting 41 SRSP gates: Sri Ramsagar

పోటెత్తిన ఎగువ గోదావరి 

కడెం, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద ఉధృతి 

ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం బరాజ్‌లకు నీటి విడుదల 

కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కడెం వాగుతోపాటు ఎగువన గోదావరికి వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు 1,95,767 క్యూసెక్కుల వరద రాగా, నీటినిల్వ 71.85 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ఎగువ నుంచి ఉధృతంగా వరద వస్తుండడంతో ఉదయం 10:30 గంటలకు 8 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెరుగుతున్న కొద్దీ క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తుతూ వెళ్లారు. రాత్రి పదిగంటలకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా, ప్రాజెక్టులో 72.9 టీఎంసీలను నిల్వ చేస్తూ మొత్తం 41 గేట్లు ఎత్తి 2.65లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 

కడెం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా, 49,763 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 5.41 టీఎంసీల నిల్వలు కొనసాగిస్తూ 18 గేట్లు ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు.  
శ్రీరాంసాగర్‌ నుంచి విడుదలవుతున్న వరదకు కడెం జలాలు తోడుకావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి 2,92,815 క్యూసెక్కులు పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 15.02 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2,64,787 క్యూసెక్కు ల నీటిని గేట్ల ద్వారా కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లకు వరద ఉధృతి భారీగా పెరిగింది. సుందిళ్ల బరాజ్‌కు 3.68లక్షలు, అన్నారం బరాజ్‌కు 6.61లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కు 6.79లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచి్చంది వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సమ్మక్కసాగర్‌కు 4.45 లక్షలు, సీతమ్మసాగర్‌కు 3.13లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు విడుదల చేస్తున్నారు.  

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువకు వెళుతోంది. సోమవారం రాత్రి 12. గంటల సమాయానికి 12.010 మీటర్లకు చేరింది. తెల్లవారే సరికి మరింత వరద పెరగనుంది. కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక 12.210 మీటర్లు, డేంజర్‌ లెవల్‌ 13.460 మీటర్లు వరకు నమోదు అయితే లోతట్టు గ్రామాలు జలమయమవుతాయి.1986లో కాళేశ్వరం వద్ద 15.75 మీటర్ల ఎత్తు, 2022 జూలై 14న 16.72మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదైంది.  

సింగూరు, నిజాంసాగర్‌కు జలకళ 
గోదావరి ఉపనది మంజీరలోనూ వరద ఉధృతి మరింతగా పెరగడంతో సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంలు కాగా, ప్రస్తుతం 23,942 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వలు19.22 టీఎంసీలకు చేరాయి. 

నిజాంసాగర్‌ నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా 48,800 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.16 టీఎంసీలకు చేరాయి. వరద ఇలానే కొనసాగితే మరో ఐదు రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండే అవకాశముంది. 

మిడ్‌మానేరుకు గ్రావిటీ ద్వారా ఎస్సారెస్పీ జలాలు  
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని మిడ్‌మానేరులోకి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తి పోయాల్సిన అవసరం లేకుండా పోయింది. రెండు పంప్‌హౌస్‌లలో పంపింగ్‌ బంద్‌ చేసి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ద్వారా 7000 క్యూసెక్కుల నీటిని గ్రావిటీతో మిడ్‌మానేరు జలాశయా నికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి అనంతగిరి జలాశయానికి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీళ్లను ఐదు దశల్లో పంపింగ్‌ చేస్తున్నారు.  

ఎగువన శాంతించిన కృష్ణమ్మ... దిగువన ఉగ్రరూపం 
జూరాల 40 గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, సాగర్‌ 26 గేట్ల ద్వారా నీటి విడుదల  
పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణమ్మ శాంతించింది. మూడు రోజులుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు తోడు కావడంతో దిగువన కృష్ణానది ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బరాజ్‌కు వస్తున్న 11,27,30 క్యూసెక్కుల వరదను వచ్చింది వచ్చినట్టు గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోని ఆల్మట్టి జలాశయానికి 70 వేలు, నారాయణపూర్‌ జలాశయానికి 30 వేల క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది.

దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు సైతం 3.21లక్షల క్యూసెక్కులకు వరద తగ్గిపోగా, 40 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని 10 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 5.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 5.43 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న ప్రకాశం బరాజ్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం నాటికి ప్రకాశం బరాజ్‌కు వరద ఉధృతి తగ్గే అవకాశముంది.  

అలుగుపారుతున్న డిండి ప్రాజెక్టు 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు పరవళ్లు తొక్కుతుండడంతో నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిండి సోమవారం అలుగు పోసింది. వర్షాధారంపైనే ఆధారపడిన ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి (36 అడుగులు) చేరుకుంది. హైదరాబాద్‌ – శ్రీశైలం రహదారి మధ్యలో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగుపారుతున్న అందాలను తిలకించేందుకు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు.  

మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత 
మూసీనదికి వరద పోటెత్తడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యంగల మూసీ రిజర్వాయర్‌లో 3.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement