తెరపైకి వస్తున్న డిమాండ్
13 ఏళ్లుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి క్రమం తప్పకుండా సీజన్‌లో నీటి విడుదల
మిగులు జలాలను సది్వనియోగం చేసుకోవడంతోపాటు పంప్‌హౌస్ నిర్మిస్తే విద్యుదుత్పత్తి
22వేల క్యూసెక్కుల సామర్థ్యంతో వరదకాలువ నిర్మాణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మిగులు జలాలను సది్వనియోగం చేసుకునే లక్ష్యంతో వరద కాలువ నిర్మాణం చేపట్టారు. ఈ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరుకు నీటిని తరలిస్తారు. వరద కాలువ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు. 2010 నుంచి దీని ద్వారా మిడ్‌మానేరుకు నీటిని వదులుతున్నారు. గతంలో ఒక సీజన్‌లో అత్యధికంగా 56 వేల క్యూసెక్కుల నీటిని సైతం వదిలారు. ఈ కాలువ వద్ద పంప్‌హౌస్ నిర్మాణం చేస్తే 90 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటి ఆధారంగా 4 టర్బైన్‌లతో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించారు. ఈ కాకతీయ కాలువ సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. ఒక్కో టర్బైన్ నుంచి 2,200 క్యూసెక్కుల నీటి ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 4 టర్బైన్‌ల ద్వారా 8,800 క్యూసెక్కుల నీటితో 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అయితే 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే వరద కాలువ నుంచి సైతం విద్యుదుత్పత్తి చేసే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. 13 ఏళ్లుగా వరద కాలువ ద్వారా ప్రతి సంవత్సరం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో గరిష్టంగా వరద కాలువ ద్వారా ఒక సీజన్‌లో 56 టీఎంసీల నీటిని విడుదల చేసిన సందర్భంగా కూడా ఉంది.
ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా చేస్తున్న విద్యుదుత్పత్తికి మూడు రెట్లు ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది. కాకతీయ కాలువ టర్బైన్లతో పోలిస్తే వరద కాలువకు ఇలాంటి 10 టర్బైన్‌లు నిర్మించే అవకాశాలున్నాయి. శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుపోతుండడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. దీంతో గత పదేళ్లుగా 42 వరద గేట్లును ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. మరోవైపు వరద కాలువ ద్వారా కూడా నీటిని మిడ్‌మానేరుకు విడుదల చేస్తున్నారు.
ఎగువ మహారాష్ట్ర నుంచి ప్రతిఏటా భారీగా వరద నీరు వస్తోంది. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదకాలువ వద్ద పంప్‌హౌస్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్‌తో వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాంసాగర్ జలాశయంలోకి తరలించారు. కాగా 1,091 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న ఎస్సారెస్పీకి 1,075 అడుగుల మేర నీటిమట్టం చేరగానే వరద కాలువ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment