dindi project
-
శ్రీరాంసాగర్ 41 గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కడెం వాగుతోపాటు ఎగువన గోదావరికి వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు 1,95,767 క్యూసెక్కుల వరద రాగా, నీటినిల్వ 71.85 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ఎగువ నుంచి ఉధృతంగా వరద వస్తుండడంతో ఉదయం 10:30 గంటలకు 8 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెరుగుతున్న కొద్దీ క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తుతూ వెళ్లారు. రాత్రి పదిగంటలకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా, ప్రాజెక్టులో 72.9 టీఎంసీలను నిల్వ చేస్తూ మొత్తం 41 గేట్లు ఎత్తి 2.65లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ⇒ కడెం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా, 49,763 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 5.41 టీఎంసీల నిల్వలు కొనసాగిస్తూ 18 గేట్లు ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు. ⇒ శ్రీరాంసాగర్ నుంచి విడుదలవుతున్న వరదకు కడెం జలాలు తోడుకావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి 2,92,815 క్యూసెక్కులు పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 15.02 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2,64,787 క్యూసెక్కు ల నీటిని గేట్ల ద్వారా కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లకు వరద ఉధృతి భారీగా పెరిగింది. సుందిళ్ల బరాజ్‌కు 3.68లక్షలు, అన్నారం బరాజ్‌కు 6.61లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కు 6.79లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచి్చంది వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సమ్మక్కసాగర్‌కు 4.45 లక్షలు, సీతమ్మసాగర్కు 3.13లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు విడుదల చేస్తున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువకు వెళుతోంది. సోమవారం రాత్రి 12. గంటల సమాయానికి 12.010 మీటర్లకు చేరింది. తెల్లవారే సరికి మరింత వరద పెరగనుంది. కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక 12.210 మీటర్లు, డేంజర్ లెవల్ 13.460 మీటర్లు వరకు నమోదు అయితే లోతట్టు గ్రామాలు జలమయమవుతాయి.1986లో కాళేశ్వరం వద్ద 15.75 మీటర్ల ఎత్తు, 2022 జూలై 14న 16.72మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదైంది. సింగూరు, నిజాంసాగర్‌కు జలకళ గోదావరి ఉపనది మంజీరలోనూ వరద ఉధృతి మరింతగా పెరగడంతో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంలు కాగా, ప్రస్తుతం 23,942 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వలు19.22 టీఎంసీలకు చేరాయి. ⇒ నిజాంసాగర్ నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా 48,800 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.16 టీఎంసీలకు చేరాయి. వరద ఇలానే కొనసాగితే మరో ఐదు రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండే అవకాశముంది. మిడ్‌మానేరుకు గ్రావిటీ ద్వారా ఎస్సారెస్పీ జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని మిడ్‌మానేరులోకి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తి పోయాల్సిన అవసరం లేకుండా పోయింది. రెండు పంప్‌హౌస్‌లలో పంపింగ్ బంద్ చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 7000 క్యూసెక్కుల నీటిని గ్రావిటీతో మిడ్‌మానేరు జలాశయా నికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి అనంతగిరి జలాశయానికి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీళ్లను ఐదు దశల్లో పంపింగ్ చేస్తున్నారు. ఎగువన శాంతించిన కృష్ణమ్మ... దిగువన ఉగ్రరూపం ⇒ జూరాల 40 గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, సాగర్ 26 గేట్ల ద్వారా నీటి విడుదల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణమ్మ శాంతించింది. మూడు రోజులుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు తోడు కావడంతో దిగువన కృష్ణానది ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బరాజ్‌కు వస్తున్న 11,27,30 క్యూసెక్కుల వరదను వచ్చింది వచ్చినట్టు గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోని ఆల్మట్టి జలాశయానికి 70 వేలు, నారాయణపూర్ జలాశయానికి 30 వేల క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది.దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు సైతం 3.21లక్షల క్యూసెక్కులకు వరద తగ్గిపోగా, 40 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని 10 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 5.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 5.43 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న ప్రకాశం బరాజ్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం నాటికి ప్రకాశం బరాజ్‌కు వరద ఉధృతి తగ్గే అవకాశముంది. అలుగుపారుతున్న డిండి ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు పరవళ్లు తొక్కుతుండడంతో నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిండి సోమవారం అలుగు పోసింది. వర్షాధారంపైనే ఆధారపడిన ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి (36 అడుగులు) చేరుకుంది. హైదరాబాద్ – శ్రీశైలం రహదారి మధ్యలో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగుపారుతున్న అందాలను తిలకించేందుకు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత మూసీనదికి వరద పోటెత్తడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యంగల మూసీ రిజర్వాయర్‌లో 3.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ప్రసవం కోసం పడవ ప్రయాణం
చింతలమానెపల్లి(సిర్పూర్): దిందా వాసుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు..వరదతో ఉప్పొంగే వాగుపై వంతెన నిర్మించాలని పోరుబాట పట్టినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఓ నిండు గర్భిణిని అష్టకష్టాలు పడి ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం నవేగాం గ్రామానికి చెందిన లొకండే సాయిరాం భార్య పద్మ రెండో కాన్పు కోసం చింతలమానెపల్లి మండలం దిందా గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. నెలలు నిండటంతో వైద్యుల సూచన మేరకు శుక్రవారం కాగజ్‌నగర్‌లో శస్త్రచికిత్స చేయించాల్సి ఉంది. బుధవారమే ఆస్పత్రికి చేరుకోవాల్సి ఉన్నా దిందా వాగులో వరద అధికంగా ఉండటంతో వెళ్లలేదు. రెండ్రోజులుగా వరద తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నాటు పడవపై గర్భిణిని వరద దాటించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం ప్రాణహిత నది వద్ద నుంచి నాటు పడవను తీసుకువచ్చారు. వాగు దాటేందుకు పద్మ పత్తి చేల గుండా కాలినడకన వాగు వద్దకు చేరుకుంది. ఆ తర్వాత నాటు పడవ ద్వారా స్థానికులు వాగు దాటించారు. అనంతరం అవతలి ఒడ్డున ఏర్పాటు చేసిన 108 వాహనంలో కాగజ్‌నగర్‌కు తరలించారు. -
వట్టెం టు డిండి!
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో చేపట్టిన డిండి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలనే అంశం ఖరారైంది. డిండికి నీటిని తీసుకునే ప్రాంతాలపై గడిచిన మూడేళ్లుగా సుదీర్ఘ అధ్యయనం చేసిన ప్రభుత్వం తుదకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకే మొగ్గు చూపింది. నార్లాపూర్, ఏదుల ద్వారా నీటిని తరలిస్తే అధిక వ్యయాలతో పాటు, టన్నెల్ మార్గాల నిర్మాణం ఆలస్యం అవుతుందన్న అంచనాతో వట్టెం నుంచి తరలింపుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కేవలం రూ.230 కోట్లతో ఈ ప్రణాళిక పట్టాలెక్కనుంది. సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోస్తూ.. 30 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ 30 టీఎంసీల నీటిని మొదట పాలమూరు–రంగారెడ్డిలో భాగంగా ఉండే నార్లాపూర్ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇక్కడి నుంచి నీటిని తీసుకుంటే ఇప్పటికే వృధ్ధిలోకి వచ్చిన కల్వకుర్తి ఆయకట్టు దెబ్బతింటుండటం, భూసేకరణ సమస్యలతో పాటు, అటవీ ప్రాంతాల నుంచి అలైన్మెంట్ ఉండటంతో దీన్ని పక్కనపెట్టారు. ఈ మార్గం ద్వారా నీటిని తీసుకునేందుకు రూ.3,908 కోట్ల వరకు వ్యయం అవుతోంది. దీంతో దీన్ని పక్కనపెట్టి పాలమూరులో రెండో రిజర్వాయర్ అయిన ఏదుల నుంచి తరలించే అంశంపై అధ్యయనం చేశారు. ఈ మార్గం ద్వారా తరలింపులో 18 కిలోమీటర్ల టన్నెల్ మార్గం అవసరం అవుతోంది. ఇది పూర్తి చేయాలంటే కనీసంగా రెండేళ్లకు పైగా సమయం పడుతోంది. అదీగాక దీనికి వ్యయం రూ.1,298 కోట్ల మేర ఉంటోంది. టన్నెల్ మార్గాలు వద్దనుకుంటే... అటవీ ప్రదేశం గుండా నీటి తరలింపు ఉండటంతో ఈ ప్రతిపాదనను సైతం పక్కనపెట్టారు. కొత్తగా పాలమూరులో మూడో రిజర్వాయర్‌గా ఉన్న వట్టెం నుంచి నీటిని తరలించే మార్గాలపై అధ్యయనం చేసి, ఓపెన్ కాల్వల ద్వారా నీటి తరలింపునకు అవకాశం ఉండటంతో దీనికి మొగ్గు చూపారు. వట్టెం నుంచి నీటిని తీసుకుంటూ పోతిరెడ్డిపల్లి మండలంలోని ఊరచెరువు మార్గం ద్వారా తాడూరు మండలం బలాన్‌పల్లి గ్రామంలోని చెన్నకేశవులు చెరువు, ఇదే మండల పరిధిలోని గోవిందయ్యపల్లి గ్రామ పెద్దచెరువు ద్వారా 16 కిలోమీటర్ల మేర నీటిని తరలించి డిండి వాగులో కలుపుతారు. ఈ వాగులో చేరిన నీరు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర బ్యారేజీకి తరలించేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దీనికి కేవలం రూ. 230 కోట్ల వ్యయం కానుంది. ఇక్కడి నుంచి నీటిని గ్రావిటీ మార్గాన శింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ వరకు తరలించనున్నారు. గొట్టిముక్కలలో మిగిలిన 355 ఎకరాల భూసేకరణ ఎగువన వట్టెం నుంచి నీటిని తరలించే ప్రక్రియ ఆల స్యమైనా డిండి ద్వారా దేవరకొండ నియోజకవర్గంలో తొలి సాగు ఫలాలు ఈ వానాకాలంలోనే అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గొట్టిముక్కల రిజర్వాయర్ పనులను 95 శాతం పూర్తి చేశారు. 1.83 టీఎంసీల సామర్ధ్యంతో 3.75 కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 30 మీటర్ల మేర మాత్రమే కట్ట నిర్మాణం మిగిలి ఉంది. 5 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తయింది. దీనికి సొంతంగానే 474 చదరపు కిలోమీటర్ల మేర పరీవాహకం ఉండటంతో ఈ పరీవాహకం నుంచి వచ్చే నీటితో ఇందులో ఒక టీఎంసీకి పైగా నీటిని నింపే అవకాశం ఉంది. దీనికింద నిర్ణయించిన 28 వేల ఎకరాల్లో సగం ఆయకట్టుకు అంటే 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. 355 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 87 ఎకరాలు అవార్డు కాగా, దీనికై రూ.16 కోట్లు అవసరం ఉంది. ఇందులో ఇటీవలే రూ.10.50 కోట్లు సీఎం సూచనల మేరకు విడుదల చేసినా, వీటి చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. ఇక ఆర్అండ్ఆర్ కింద 112 కుటుంబాలను తరలించేందుకు రూ.12 కోట్లు అవసరం ఉంటుంది. ఇందులో రూ.4.50 కోట్లు విడుదల కాగా, వీటి చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ జూన్ నాటికి పూర్తి చేస్తే ఖరీఫ్‌లో కనీసంగా 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇక సింగరాజుపల్లి రిజర్వాయర్‌ను 0.81 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తుండగా, కట్టపొడవు 3 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో ఇంకా 200 మీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తయితే దీనిలోనూ 0.50 టీఎంసీ నీటిని నింపే అవకాశం ఉంటుంది. దీనికింద ఇప్పటికే కుడి, ఎడమ తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, స్థానిక పరీవాహకం నుంచే వచ్చే నీటితో దీనికింద ఉన్న 13 వేల ఎకరాల్లో కనీసంగా 5 నుంచి 6 వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. ఇక్కడ పెండింగ్ బిల్లులు, మరో 71 ఎకరాల భూసేకరణకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం ఆదేశాలతో ఈ ఖరీఫ్‌లోనే దీనికింద ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు మొదలయ్యాయి. -
సీఎం కేసీఆర్‌ను డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలి: మల్లు
సాక్షి, తవక్లాపూర్ (దేవరకొండ) : దళిత, గిరిజనులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ముఖాముఖీ-పొలం బాట, పోరుబాటలో భాగంగా ఆయన బ్రుందం దేవరకొండ నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి రైతులతో ముఖాముఖీ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే సీఎల్పీ బ్రుందం బయలుదేరిందని భట్టి విక్రమార్క తెలిపారు. రాజకీయ సమావేశాల కోసమో, ఎన్నికల కోసమో కాంగ్రెస్ శాసనసభా పక్షం రాలేదని, కేవలం రైతాంగం కోసం, ప్రజల కోసం మాత్రమే రాష్ట్రమంతా తిరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రం వ్యవహరిస్తున్న రైతాంగా విధానలతో రైతులు ఆందోళనలో ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులు దేశానికి వెన్నుముక వంటి వారని... అటువంటి వెన్నుముకను విరగ్గొట్టి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రైతులను కాపాడేందుకు, వారి గొంతును వినిపించేందుకు సీఎల్పీ, కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. కోనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే బతుకులు ఏమవుతాయనే భయాందోళనలో రైతులు ఉన్నారన్నారు. ఐకేపీ సెంటర్లు తీసేస్తే.. పండించిన పంటలను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు లేకపోతే.. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను ముంచేస్తారన్నారు. రైతుల పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉన్నా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని ఆయన పేర్కొన్నారు. కనీస మద్దతు ధర లేక, కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తే.. పోరాటం తప్ప మరో మార్గం లేదన్న భావనలో రైతాంగం ఉందని చెప్పారు. రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం దాగున్నాయని.. ఈ నేపథ్యంలో మరో ఉద్యమానికి రైతులు సిద్ధమవుతున్నారన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే గ్రామంలో వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందని, అలాగే 700 ఫెన్షన్లు కూడా మంజూరు చేసిందని ఈ సందర్భంగా తెలిపారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, కొత్తగా ఒక్క ఫెన్షన్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్.. తరువాత కొత్తగా భూమి ఇవ్వకపోగా నాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చెప్పిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ పంచిన భూములను, నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు దళిత, గిరిజనులకు పంచిన భూములను లాక్కుంటుంటే.. చూస్తూ ఊరుకోమని భట్టి హెచ్చరించారు. ఇక ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకువస్తానని చెప్పిన కేసీఆర్.. 5 ఏళ్లుగా ఒక్క ఎకరాకైనా నీళ్లు పారించారా? అన్నారు. డిండి పేరుమీద వేల కోట్ల రూపాయలు విడుదల చేసి కాలువలు తవ్వించారు కానీ.. అసలు డిండికి నీళ్లు ఎక్కడ నుంచి తసుకువస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. చెరువు ఎక్కడుందో చెప్పకుండా కాలువలు తవ్వితే ఎలా అన్నారు. డిండి ప్రాజెక్టపై ఇప్పటికైనా ఈ ప్రాంత వాసులకు నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీనే ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ఫెన్షన్లు, వంద రోజులు పనిని, ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇచ్చిందని, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ప్రజలు కేసీఆర్ చేతిలో పెడితే.. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఏడేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసింది శూన్యమేమే తప్పా మరేమీ లేదని విమర్శించారు. ఈ విషయాలపై లెక్కలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని భట్టి ప్రజలకు చెప్పారు. కేసీఆర్ పాలనతో ఏడేళ్లుగా పేదలు, దళిత, గిరిజనులు మోసానికి గురవుతున్నారన్నారని, పేదలకు రావాల్సిన ఇళ్లు రావడం లేదని, ఉద్యోగాలు, పెన్షన్లు రావడం లేదని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తానన్న ఈ ముఖ్యమంత్రిని డిండి ప్రాజెక్టులోనో, లేక బంగాళా ఖాతంలోకో ఎత్తేయాలని భట్టి ధ్వజమెత్తారు. కాగా ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ కోదండ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎస్టీ సెల్ ఛైర్మన్ జగన్ లాల్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
డిండి వాగులో చిక్కుకున్న దంపతులు
సాక్షి, నాగర్ కర్నూల్ : భారీ వర్షాలు జిల్లాను ముంచెత్తున్నది. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు నీటిలో చిక్కుకున్నారు. సభావత్, వెంకట్ రాములు,అనే దంపతులు డిండి వాగులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి, సీఎస్‌లతో మాట్లాడి వారిని రక్షించడానికి ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెలికాప్టర్‌ను కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగులోనే చిక్కుకొని ఉండగా.. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నత అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకోనుంది. ('డిండి' దారెటు?) -
డిండి మళ్లీ మొదటికి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే అలైన్మెంట్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. దీంతో నీటిని పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని తాజాగా నిర్ణయించారు. ప్రాజెక్టుల్లో అటవీ సమస్యల కారణంగా కేంద్ర సంస్థల అనుమతులు రావడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఏదుల నుంచి శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీల నీటిని తీసుకునేందుకు తుది ప్రతిపాదన సిద్ధం చేశారు. ఏదుల నుంచే ముందుకు.. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా 4.5 లక్షల ఎకరాలకు పాలమూరులో భాగంగా ఉన్న రిజర్వాయర్ల నుంచి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పాలమూరులో భాగంగా ఉన్న ఏదుల నుంచే తీసు కోవాలని తొలుత భావించినా, దాన్ని నార్లాపూర్‌కు మార్చారు. అయితే నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉండటం, దీనికి పాలమూరు జిల్లా నేతలు అభ్యంతరాలు చెప్పడం తో మళ్లీ సర్వే చేయించారు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రణాళికకు ఓకే చెబుతూనే రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్ మెయిన్ తగ్గించాలని, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని తేల్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరంతో పాటు కాల్వలను, సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను అధికారులు పరిశీలించగా 5వ కిలోమీటర్ నుంచి 20వ కిలోమీటర్ వరకు ఉన్న అలైన్మెంట్, రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని వెల్లడైంది. దీం తో మళ్లీ రీసర్వే చేయించారు. ఇందులో ఏదుల నుంచే నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏదు ల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానల్, 2.5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 16 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీటిని డిండిలో భాగంగా ఉన్న ప్రతిపాదిత ఉల్పర రిజర్వాయర్‌కు చేరేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనకు రూ. 1,200 కోట్ల అంచనా వేశారు. ఏదుల నుంచి డిండి అలైన్మెంట్ ఖరారు కానందున, ఆలోపు దిగువన ఉన్న సింగరాజు పల్లి (0.8 టీఎంసీలు), గొట్టిముక్కల (1.8), చింతపల్లి (0.99), కిష్టరాంపల్లి (5.68), శివన్నగూడం (11.96 టీఎంసీల) రిజర్వాయర్లు.. వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులకు ఇప్పటికే ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ఆరంభించిన విషయం తెలిసిందే. -
పాలమూరు, డిండిలపై తీరు మార్చుకోని కర్ణాటక
సాక్షి, హైదరాబాద్ : పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఎగువ కృష్ణా బేసిన్లో ఉన్న కర్ణాటక తన తీరు మార్చుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి అడ్డుపుల్లలు వేయాలన్న లక్ష్యంతో గట్టిగా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇటీవలే జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో దీనిపై తెలంగాణ కొంత స్పష్టతనిచ్చినా మళ్లీ కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. కృష్ణా బేసిన్లో నదీ జలాల నీటి లభ్యత ప్రాతిపదికన అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా, కృష్ణా జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ కానీ, ఏపీ కానీ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని పునర్విభజన చట్టంలో ఉందని జలశక్తి శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. కొత్త ప్రాజెక్టులు ఏవైనా చేపడితే ప్రాథమికంగా సాంకేతిక అనుమతులను కృష్ణాబోర్డు నుంచి తీసుకోవాలని, అనంతరం అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందాలని పేర్కొంది. దీంతో పాటే కృష్ణా బేసిన్లో మిగులు జలాలపై హక్కులు కేవలం దిగువ రాష్ట్రాలకే ఉంటాయని, ఎగువ రాష్ట్రాలకు ఉండవంది. తెలంగాణ ఎగువ రాష్ట్రం అయినందున మిగులు జలాలపై హక్కులు లేవని తెలిపింది. కర్ణాటక ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ దీనిపై వివరణ తీసుకోవాలంటూ కృష్ణాబోర్డుకు రెండు రోజుల కిందట లేఖ రాసింది. దీంతో ప్రాజెక్టులపై స్పందించాలని బోర్డు గురువారం తెలంగాణకు లేఖ రాసింది. ప్రాజెక్టు డీపీఆర్, ప్రస్తుత ప్రాజెక్టు స్థితిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇటీవలే చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలోనే ఈ ప్రాజెక్టులపై తెలంగాణ స్పష్టతనిచ్చింది. ఈ 2 ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని చెప్పింది. మిగులు జలాల్లో తమకు హక్కు ఉంటుందని వివరించింది. అయినప్పటికీ కర్ణాటక తన వైఖరి మార్చుకోవడంలేదు. -
చేప పిల్లలు మింగేశారు..!
‘‘ చేప పిల్లలను మింగేశారు.. ఇదేంటి.. మృగశిరకార్తె కూడా కాదు.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేపమందు పంపిణీ చేయడం లేదు.. మరి చేప పిల్లలను మింగేయడం ఏంటని అనుకుంటున్నారా..! అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇదీ.. మత్స్యశాఖ అధికారుల మాయాజాలం.’’ వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షల చేప పిల్లలను డిండి మండల పరిధిలోని చెరువుల్లో ఆ శాఖ అధికారులు పోయాల్సి ఉండగా సగానికి సగం మాయం చేసేసి ఆ చెరువుల్లోనే వాటిని వదిలామని చెబుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. సాక్షి, దేవరకొండ: డిండి మండల పరిధిలో నీటి సౌకర్యం ఉన్న చెరువులు, కుంటలు సుమా రు 20 వరకు ఉన్నాయి. చేపల వేటనే జీవనధారంగా చేసుకుని మండలంలో దాదాపు 500 మంది మత్యకారులు బతుకుతున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మండలంలోని తంబాలబండ, ఏనెకుంట, మొద్దులకుంట, బాపన్‌కుంట, కాంట్రోన్‌కుంట తదితర చెరువుల్లో నీటి సౌకర్యం ఉన్నందున 6.60 లక్షల చేప పిల్లలను వదిలేందుకు మత్య్సశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. లెక్కింపు యంత్రం లేకుండానే.. అధికారుల ప్రతిపాదనల మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు డిండి మండలానికి ఈ నెల 19వ తేదీన 6.60 లక్షల చేప పిల్లలను పంపించారు. అదే రోజు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చేప పిల్లల లెక్కింపు యంత్రం లే కుండానే ఆయా చెరువుల్లో వాటిని వదిలేశారు. మిగిలిన 3.20 లక్షల చేప పిల్లలు ఏమైనట్టు..? మండలంలోని ఆయా చెరువుల్లోని మత్స్య సహకార సొసైటీ సభ్యుల లెక్కల ప్రకారం మత్స్యశాఖ అధికారులు ఆయా చెరువుల్లో వదిలింది.. 3.40 లక్షల చేప పిల్లలే. అయితే మిగిలిన చేప పిల్లలు ఏమయ్యాయని అధికారులను కోరితే ఆయా చెరువుల్లోనే సర్దేశామంటూ పొంతలేని సమాధానాలు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి చెరువులో చేప పిల్లలు వదిలిన తర్వాత మళ్లీ పోయాలంటే సొసైటీ సభ్యుల తీర్మానం, ఉన్నతాధికారుల ఉత్తర్వులు ఉండాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుం డా అధికారులు బుకాయిస్తుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత శాఖ క్షేత్ర స్థాయి అధికారులు చేప పిల్లలను పక్కదారి పట్టించి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించుకున్నారని మత్స్యసహకరా సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వర్షపాతం లెక్కలు చూడకుండానే.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చెప పిల్లలు వదిలే కార్యక్రమంలో భాగంగా సంబంధిత మత్స్యశాఖాధికారులు ముందుగానే మండలంలో వర్షపాతం ఎలా ఉంది? చెరువులు, కుంటల్లో ఏ పాటి నీరు ఉందోనని గుర్తించిన తర్వాతే ఆ నీటికి తగినట్లుగా చేప పిల్లలను వదిలే నివిదికను ఉన్నతాకారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మండల మత్స్యశాఖాధికారులు అలాంటి లెక్కలేమి లేకుండా సుమారుగా లెక్కలు వేసి ఇచ్చిన నివేదిక ప్రకారంగా వచ్చిన చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలారు. మండలంలోని చెరువులు, కుంటల్లోకి డిండి ప్రాజెక్టు ద్వారా, లేదా వర్షాధారంతోనే నీరు చేరుతోంది. ప్రస్తుతం డిండి ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. అదే విధంగా ఐదు నెలలుగా మండలంలో కురవాల్సిన దానికంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో నెల రోజుల పాటు వర్షం కురవకపోతే చేప పిల్లలు వదిలిన సదరు కుంటల్లో మూడు మాత్రం పూర్తిగా ఎండిపోయే ప్రమా దం ఉంది. అలాగైతే ఆ చేప పిల్లలు బతికే పరి స్థితి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారుల మాయాజాలం మండలంలోని ఆయా చెరువుల సొసైటీ సభ్యుల నిర్ణయం మేరకు అంతంతమాత్రంగానే ఉన్నా చెరువుల్లో నిర్ణయించిన మేరకు చేప పిల్లలను వదిలే అవకాశం లేదని మత్స్యసహకార సొసైటీ సభ్యులు తేల్చారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని ఏం చక్కా వినియోగించుకున్నారు. లెక్కించే యంత్రం లేకుండానే తంబాలబండ చెరువులో 2,95,800 చేప పిల్లలను వదలాల్సి ఉండగా లక్ష పిల్లలను మాత్రమే వదిలారు. అదే విధంగా ఏనెకుంటలో 97,500కు 50వేలు, మొ ద్దులకుంటలో 70,500కు 20 వేలు, బాపన్‌కుం టలో 1,20,000లకు 1,20,000, కాంట్రోన్‌కుం టలో 76,200కు 50వేల చొప్పున వదిలారు. చేప పిల్లలు పోయలేదు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చెప పిల్లలను మండలలోని చెరువులు, కుంటలకు పంపిన ప్రతిపాదలన ప్రకారంగా వదలలేదు. ఇదేమిటని సంబందితాధికారులను నిలదీయగా ఈ చెరువులో నీరు తక్కువగా ఉందని వేరే చెరువులో వదులుతామని సమాధానం ఇచ్చారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. – నూకం చంద్రయ్య, మత్స్యకారుడు, డిండి నీరులేక అడుగంటి పోతున్నాయి మండలంలో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో డిండి ప్రాజెక్టుతోపాటు చెరువులు, కుంటలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయి. చెరువుల్లో వదిలిన చేప పిల్లలు బతికేందుకు కేఎల్కేవై ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీరందించి తద్వారా మండలంలోని చెరువులు, కుంటలు నింపాలి. – తవిటి సైదులు, మత్స్యకారుడు అమ్ముకున్న మాట అవాస్తవం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత చెప పిల్లలను ఇటీవల మండలంలోని పలు కుంటల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వదిలాం. దీనిపై మండల కేంద్రానికి చెందిన పలువురు మత్స్యకారులు అక్రమంగా చెప ప్లిలలను సంబంధిత అధికారులు అమ్ముకున్నారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మారయ్య, ఎఫ్డీఓ -
‘పాలమూరు’పై కర్ణాటక పేచీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై కర్ణాటక పేచీకి దిగుతోంది. కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు ఇప్పటికే ఫిర్యాదు చేసిన కర్ణాటక, తాజాగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం చెన్నైలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్లో దీనిపై చర్చించాలని డిమాండ్ చేసింది. కర్ణాటక ఫిర్యాదు పై స్పందించిన హోంశాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల కౌన్సిల్ సెక్రటేరియట్ దీనిపై చర్చించేందుకు అనుమతిస్తూనే, దీనిపై వివరణ కోరింది. మిగులును చూపించి చర్చకు.. ‘కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–2 నవంబర్ 29, 2013న ఇచ్చిన తుది ఉత్తర్వుల ప్రకారం మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఇవ్వలేదు. సముద్రంలోకి వృథాగా వెళ్లే మిగులు జలాలను దిగువ రాష్ట్రంగా వాడుకునే హక్కును ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. అదే సమయంలో ఎగువ రాష్ట్రా లైన కర్ణాటక, మహారాష్ట్రకు మిగులు జలాలు వాడుకునే హక్కులు ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం సైతం ఎగువ రాష్ట్రమైనందున దానికి సైతం మిగులు జలాలు వాడుకునే హక్కు లేదు’అని కర్ణాటక తెలిపింది. ఈ దృష్ట్యా మిగులు జలాలపై ఆధారపడి పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టరాదని కేంద్రానికి తెలిపింది. -
ముందుకు పడని.. అడుగులు!
సాక్షి, నల్లగొండ: జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టును మినహాయిస్తే అత్యధిక శాతం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న వారే అధికం. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ విద్యుత్ మోటార్లు ఇక్కడే ఉన్నాయి. సహజంగానే విద్యుత్ వినియోగం కూడా జిల్లాలోనే ఎక్కువ. తాజా బడ్జెట్లో జిల్లా ప్రాజెక్టులకు నామ మాత్రంగా కూడా నిధులు కేటాయించలేదు. ఒక్కో ప్రాజెక్టుకు కోట్ల రూపాయల్లో బకాయిలు ఉండగా, కనీసం సిబ్బంది జీత భత్యాలకు సరిపడినంత కూడా నిధులు కేటాయించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అరకొరగా ఇస్తున్న బడ్జెట్ కేటాయింపులు ఉద్యోగుల జీత భత్యాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులకే సరిపోతుండడంతో ప్రాజెక్టుల పనులు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న విధంగా తయారయ్యాయి. జిల్లాలోని ఏఎమ్మార్పీ/ఎ స్ఎల్బీసీ, డిండి, ఉదయం సముంద్రం– బ్రా హ్మణ వెల్లెంల, మూసీ ప్రాజెక్టుల్లో కేవలం డిండి కి మాత్రమే ఓ మాదిరి కేటాయింపులు జరిపారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం 2005లో సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2,853కోట్లతో చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) 2010 వరకు పూర్తి కావాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం ఇన్లెట్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా మన్నెవారిపల్లి గ్రామపంచాయతీ కేశ్యతండా ఔట్లెట్ వరకు 43కిలోమీటర్ల ఇన్లెట్ సొరంగ మార్గాన్ని, అలాగే నక్కలగండి తండా ఇన్లెట్ నుంచి నేరెడుగొమ్ము ఔట్లెట్ వరకు మరో 7 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు ఉన్నాయి. 2010 నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 60 శాతం కూడా పూర్తి కాకపోవడంతో 2012లో ప్రాజెక్టు నిర్మాణ కాల పరిమితిని 2017 డిసెంబర్ వరకు పెంచారు. ఇప్పుడు కాస్తా 2020 నాటి వరకు అవకాశం కల్పించారు. గత బడ్జెట్లో రూ.700 కోట్లుగా పేర్కొని రూ.500కోట్లకు సవరించారు. కాగా ఈ బడ్జెట్లో కేవలం రూ.3కోట్లు మాత్రమే కేటాయించడంతో ఈప్రాజెక్టుకు ప్రభుత్వం నీళ్లొదిలిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.752.71 పేరుకుపోయాయి. ఏఎమ్మార్పీకి అనుసంధానించేలా రూపొందిం చిన ఎస్ఎల్బీసీలో అంతర్భాగంగా ఉన్న నక్కలగండి బండ్ నిర్మాణం పనులూ వేగం పుంజుకోలేదు. నాగార్జున సాగర్ లో లెవల్ కెనాల్, ఏఎమ్మార్పీలోనే అంతర్భాగంగా ఉన్న ఉదయ సముద్రం–బ్రాహ్మణవెల్లెంలకు అసలు నిధులే ఇవ్వలేదు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం 2009లో నాటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో మొదలైన ఉదయసముద్రం–బ్రాహ్మణ వెల్లెంల పనులు ముందుకు పడడం లేదు. ఆయకట్టేతర ప్రాంతమైన నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, వీటితో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం, నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండలాలకు తాగునీటితో పాటు, సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టుకు దశాబ్ధ కాలంగా అరకొర నిధులే ఇస్తున్నారు. నకిరేకల్, నల్లగొండ, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఎస్ఎల్బీసీలో అంతర్భాగంగా చేపట్టారు. రూ.699కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా పనులు కొనసాగుతున్నాయి. ఈ బడ్జెట్లో పైసా విదిల్చలేదు. భూ సేకరణకు రూ.200 కోట్లు, మిగిలిన పనులన్నీ పూర్తి చేయడానికి మరో రూ.250కోట్లు వెరసి రూ.450 కోట్లు ఇస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు. డిండి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలో 3.4లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీ టిని అందించేందుకు మూడున్నరేళ్ల కిందట మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. రూ.6,190కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఐదు రిజర్వాయర్లను నిర్మించనున్నారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో 7 టీఎంసీల సామర్థ్యం, చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి వద్ద 5.7 టీఎంసీలు, చింతపల్లి మండల కేంద్రంలో 1.9 టీఎంసీలు, గొట్టిముక్కల వద్ద 1.835 టీఎంసీలు, డిండి మండలం సింగరాజుపల్లి వద్ద 7 టీఎంసీల సా మర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయిం చారు. ఇప్పటికే ఈ పనులు ప్రారంభం కాగా ఇంకా 4,350 ఎకరాల భూమిని రైతులనుంచి భూ సేకరణ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం అదేమీ పట్టించుకోవడం లేదు. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.90.87 కోట్లు మా త్రమే కేటాయించారు. ఆరువేల కోట్ల రూపాయల ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరీ ఇంత చిన్న మొత్తంలో నిధులు కేటాయిస్తే పనులు పూ ర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ ప్రాజెక్టులో రూ.345.93కోట్లు పెండింగు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మూసీ మూసీ ప్రాజెక్టు 1963లోనే అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ లక్ష్యం నెరవేరలేదు. నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందివ్వలేకపోతోంది. ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యం 41వేల 800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరివ్వడం. రూ.2.20కోట్ల నిర్మాణ వ్యయంతో పూర్తయిన ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించాలంటే కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. నిర్వహణ నిధులు మినహా మరమ్మతుల కోసం ఇప్పటి దాకా ఇచ్చింది కేవలం రూ.19కోట్లు. వీటితో ఇతరత్రా పనులన్నీ పూర్తయినా, కాల్వల లైనింగ్ సహా ఇతర ఆధునీకరణ పనులు మొదలే కాలేదు. గత బడ్జెట్లో రూ.4.62 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ సారి మరింత తగ్గించి రూ.4.17కోట్లు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో చెల్లించాల్సిన బకాయిలే రూ.12.24 కోట్లు ఉండడం గమనార్హం. మొత్తంగా జిల్లాలోని ప్రాజెక్టులకు అరకొరగా నిధులు ఇస్తుండడంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రాజెక్టులు పూర్తయ్యి, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో, బీడు భూములకు సాగునీటిని ఎప్పటికి అందిస్తాయో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఎస్ఎల్బీసీ సొరంగం 2005లో సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2,853కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. 2010 నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును 2020 వరకు పూర్తిచేయాలని అవకాశం కల్పించారు. ఈ బడ్జెట్లో కేవలం రూ.3కోట్లు మాత్రమే కేటాయించడంతో దీనికి ప్రభుత్వం నీళ్లొదిలిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయ సముద్రం నకిరేకల్, తుంగతుర్తి, నల్లగొండ నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగు,సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టుకు దశాబ్ద కాలంగా అరకొర నిధులే ఇస్తున్నారు. రూ.699కోట్ల అంచనా వ్యయంతో మొదలైన దీనిని రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. ఈ బడ్జెట్లో పైసా విదిల్చలేదు. మొత్తం రూ.450 కోట్లు ఇస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు. డిండి.. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలో 3.4లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతా లకు తాగునీ టిని అందించేందుకు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.6,190కోట్లతో చేపడుతున్న దీని పరిధిలో ఐదు రిజర్వాయర్లను నిర్మించనున్నారు. వీటి పనులు ప్రారంభమైనప్పటికీ ఇంకా 4,350 ఎకరాల భూమిని రైతులనుంచి సేకరించాల్సి ఉంది. మూసీ మూసీ ప్రాజెక్టు నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతోంది. మొత్తానికి నీరు అందాలంటే ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించాలి. ఇందుకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ సారి బడ్జెట్లో రూ.4.17కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో చెల్లించాల్సిన బకాయిలే రూ.12.24 కోట్లు ఉండడం గమనార్హం. -
నీరూ.. నిప్పు!
సాక్షి, నల్లగొండ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం మొదలైంది. నిధులు ఇవ్వడం లేదని, జిల్లా రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రతిగా.. అసలు ప్రాజెక్టులను పట్టించుకోకుండా కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని, తెలంగాణ ఏర్పాటై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎక్కువగా విడుదల అవుతున్నాయని అధికార పార్టీ నాయకులు ప్రతివిమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా ప్రా జెక్టుల వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలు.. ఇలా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. బ్రాహ్మణ వెల్లెంల, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై ప్రభుత్వ విధానాలను తూర్పారా బట్టారు. అదే మాదిరిగా, నల్లగొండ ఎంపీ, టీ.పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిగా, శాసనమండలి సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ ఇరువురు ఎంపీల ప్రకటనలపై మండిపడ్డారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేయడం లేదని, ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. ఈనెల 26వ తేదీన బ్రాహ్మణవెల్లెంల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు పాదయాత్ర ద్వారా హైదరాబాద్ జల సౌధకు చేరుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. దీనికోసం ఆయన పోలీసుల అనుమతి కోరనున్నట్లు ప్రకటించారు. ఒకవేళ పోలీసులు అనుమతిని నిరాకరిస్తే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలతో జిల్లా రాజకీయ రంగం ఒక్కసారిగా వేడెక్కింది. ఇవీ... పెండింగ్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో, రెండోసారి 2018లో ఏర్పాటైన ప్రభుత్వంలో రెండు పర్యాయాలు కూడా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ‘ నీళ్లు–నిధుల–నియామకాలు ’ అన్న నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగిందని, స్వరాష్ట్రం సిద్ధించాక తమ నినాదాన్ని మరిచిపోయి, జిల్లాలో ప్రాజెక్టులను ఏమ్రాతం పట్టించుకోవడం లేదని, బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఎక్కడివక్కడ నిలిచిపోగా.. నిధులూ అంతంత మాత్రంగానే విడుదల చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ సొరంగం పనులు పూర్తయితే.. నేరుగా శ్రీశైలం రిజర్వాయరు నుంచే నీటిని తీసుకోవడం ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు, అక్కడి నుంచి ఎఎమ్మార్పీ కాల్వల ద్వారా ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథానికి నీళ్లు అందుతాయనని చెబుతున్నారు. కానీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఏళ్లుగా కొనసాగుతుండడంపై ఈ ప్రాంత నాయకులు, రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతోపాటు డిండి ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి , బునాదిగాని కాల్వల పనులు పూర్తికావడం లేదు. దీంతో అనుకున్న మేర రైతులకు సాగునీరు అందడం లేదు. ఈ అంశాలన్నింటిపైనా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే నిధులు : గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు రూ.6,500 కోట్లతో డిండి ప్రాజెక్టు పనులు చేపట్టాం. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్ట్ మరో 10.5 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.2,150 కోట్లు ఎస్ఎల్బీసీ టన్నెల్‌కి కేటాయిం చాం. 2021 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ కంపెనీ జయప్రకాష్ అండ్ కంపెనీ ఒప్పం దం చేసుకుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించి రిజర్వాయర్ పూర్తి చేశారు. మరో 11 నెలల్లో సొరంగమార్గం పూర్తి చేసి నీటి విడుదల చేస్తాం. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ప నులకు రూ.260 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ. రూ.300 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరినా ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ హయాంలోనే యాభై శాతం పనులు పూర్తయ్యాయి. ధనిక రాష్ట్రమని చెబు తున్న సీఎం ఎందుకు బునాదిగాని కాల్వ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు. కాంగ్రెస్‌కు మంచిపేరు వస్తదనే భయంతోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. 5వేల మందితో పాదయాత్రగా జలసౌధకు వెళతా. -
పాలమూరు, డిండికి గోదావరి నీళ్లు
సాక్షి, హైదరాబాద్: నీటి కొరతను ఎదుర్కొంటున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గోదావరి నీటిని మళ్లించాలన్న ఆలోచనలకు ప్రభుత్వం పదును పెడుతోంది. గరిష్ట నీటిలభ్యత, సముద్రంలో ఏటా వృథాగా పోతున్న గోదావరిజలాలను మళ్లించి కృష్ణాబేసిన్ లోని పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు తరలించడం ద్వారా నీటికొరతను అధిగమించవ చ్చని భావిస్తోంది. దీనిపై ఇంజనీర్లు ఇదివరకే కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచగా, తాజాగా 100 టీఎంసీల గోదావరినీటిని పాలమూరు, డిండిలకు తరలించే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. దీనితో ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయి నీటి లభ్యత అందుబాటులో ఉంచవచ్చని పేర్కొన్నారు. గోదావరి పరిష్కారం.. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 120 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 90 టీఎంసీ నీటిని పాలమూరు–రంగారెడ్డికి, మరో 30 టీఎంసీ డిండికి మళ్లించాలని నిర్ణయించారు. పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీల నీటితో 12.3 లక్షల ఎకరాలకు, డిండికి 30 టీఎంసీ నీటితో 3.41లక్షల ఎకరా లకు నీరివ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు మించి నీరివ్వడం సాధ్యంకాదు. ఈ నేపథ్యం లో 90 టీఎంసీలతో 12.3 లక్షల ఎకరాలకు నీరివ్వ డం దాదాపు అసాధ్యం. కృష్ణాలో 120 వరద రోజుల ఆధారంగా లెక్కలు కట్టగా, కృష్ణాబేసిన్‌లో వరద 30 రోజులకు మించి ఉండట్లేదు. ఈ వరద రోజుల్లో 60 టీఎంసీలకు మించి నీటిని తీసుకోలేం. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు 100 టీఎంసీల మేర నీటి కొరత ఏర్పడుతోంది. ఈ నీటి కొరతను గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా మళ్లించడం ద్వారానే తీర్చుకోగలమని హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం తేల్చింది. ఇలా మళ్లించొచ్చు.. కాళేశ్వరంలో భాగంగా ఉన్న సంగారెడ్డి కెనాల్ కాల్వ నుంచి పాలమూరు లో భాగంగా ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌కు రోజుకు 0.8 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీటిని తరలించవచ్చని ఇంజనీర్ల సంఘం పేర్కొంది. దీనికోసం 2.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని సూచించింది. దీనిద్వారా కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద నిర్ణయించిన 4.13 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు మొత్తంగా 7 లక్షల ఎకరాలకు నీరి వ్వొచ్చని పేర్కొంది. కాళేశ్వరంలో చివరిదైన బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించొచ్చని సూచించింది. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపింది. ఏదుల నుంచి పాత డిండి వరకు కృష్ణా నీటిని తరలించే పనులకు అయ్యే వ్యయం కన్నా, శివన్నగూడెం ద్వారా డిండి ఎత్తిపోతలకు గోదావరి నీటిని తరలించే వ్యయం తక్కువగా ఉంటుందని తేల్చిచెప్పింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి, చర్చించాక నిర్ణయం చేసే అవకాశం ఉంది. -
డిండి.. ఈసారికి ఇంతేలెండీ!
సాక్షి, ప్రతినిధి,రంగారెడ్డి: కరువు నేలకు ఇప్పట్లో సాగునీటి భాగ్యం లేనట్లే. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన రాచకొండ ఎత్తిపోతల(డిండి) ప్రాజెక్టు డిజైన్ ఖరారుకు గ్రహణం వీడడం లేదు. దీంతో సేద్యపు జలాల కోసం ఇక్కడి రైతాంగం మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లక్ష ఎకరాల సాగు లక్ష్యంగా.. 50 నుంచి 100 చెరువులు, కుంటలను కృష్ణా జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని తరలించి అటు నుంచి రాచకొండ ఎత్తిపోతలతో 0.10 టీఎంసీల నీటిని సాగు అవసరాలకు వినియోగించుకునేలా ఈస్కీ (ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) ప్రతిపాదనలు తయారు చేసింది. రూట్ మ్యాప్ సర్వే, డీపీఆర్ తయారీ కోసం ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.72 కోట్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సర్వే పూర్తి చేసిన ఈస్కీ.. ప్రాజెక్టు రిపోర్టును చీఫ్ ఇంజ నీర్కు అప్పగించింది. ఈ డిజైన్‌ను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్ స్వల్ప మార్పులను సూచించారు. దీంతో మరోసారి ప్రాజెక్టు స్వరూపం మార్చడానికి ఇంజనీర్ల బృందం కసరత్తు చేస్తోంది. ఇప్పట్లో కష్టమే.. రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిజైన్ కొలిక్కి రాకపోవడంతో ఈ పథకం ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలకు నగారా మోగడంతో ప్రాజెక్టుకు మోక్షం లేనట్టే. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే డిండి ప్రాజెక్టుకు అంకురార్పణ చేయాలని ప్రభుత్వం భావించినా ప్రస్తుత పరిస్థితులతో ముందుకు కదల్లేని పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని 4 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, 4.50 కి.మీల సొరంగం ద్వారా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం వావిల్లపల్లి పైభాగాన 2.20 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఒక రిజర్వాయర్, అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఆరుట్ల శివారులో 2.62 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రెండో రిజర్వాయర్, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్ల, యాచారం మండలం గునుగల్ గ్రామాల మధ్య ... ఒక టీఎంసీ కెపాసిటీతో మూడో రిజర్వాయర్‌ను నిర్మించే విధంగా ఈస్కీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ రిపోర్టు, రూట్ మ్యాప్‌ను పరిశీలించిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశం గ్రావిటీ కాల్వల నిర్మాణంపై కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం ఈస్కీ మరోమారు ప్రాజెక్టు స్వరూపాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమైంది. నిధులకు ఢోకాలేదు ఈస్కీ బృందం రూపొందించిన డిజైన్‌లో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ కొన్ని సూచనలు చేశారు. దీనికి అనుగుణంగా మరోసారి రూట్ మ్యాప్‌ను తయారు చేసే పనిలో ఈస్కీ నిమగ్నమైంది. త్వరలో ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. –శ్యాంప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
డిండి, పాలమూరుకు జాతీయ హోదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ జిల్లా తాగు, సాగు అవసరాల కోసం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి.. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లా అవసరాల కోసం చేపట్టిన డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలపై శుక్రవారం జరిగే కేంద్ర హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నదీ జలాలకు సంబంధించిన అంశాల్లో ఈ రెండు ప్రాజెక్టుల జాతీయ హోదా అంశాన్ని ప్రధానంగా చేర్చింది. ఇక కేంద్ర జల సంఘం టీఏసీ అనుమతులన్నీ ఇచ్చిన దృష్ట్యా కాళేశ్వరంనూ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ కోరనుంది. రాష్ట్రం ప్రస్తావించనున్న ఇతర అంశాలు ఇవే.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ మేరకు ఎగువ రాష్ట్రాలకు 80 టీఎంసీల వాటా దక్కుతుంది. ఆ ప్రకారం 2011 జనవరిలో పోలవరానికి జల సంఘం అనుమతివ్వగానే మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీల వాటా వినియోగిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఎగువన మిగతా 45 టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకునే అవకాశం ఉంది. తెలంగాణ కృష్ణా బేసిన్లో 36.45 లక్షల హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నా 5.75 లక్షల హెక్టార్లే (15 శాతం) సాగవుతోంది. ఈ దృష్ట్యా 45 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలి. అలాగే పట్టిసీమ ద్వారా 2017–18 వాటర్ ఇయర్లో 100 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఈ జలాల్లోనూ రాష్ట్రానికి వాటా దక్కాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయగా అందుకు విరుద్ధంగా 50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. జల సంఘం దీనిపై బ్యాక్‌వాటర్ అధ్యయనం చేయలేదు. 50 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తే భద్రాచలం రామాలయంతో పాటు బొగ్గు నిక్షేపాలు, మణుగూరులోని మినరల్ ప్లాంటు, అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన చట్ట సవరణతో రాష్ట్రంలోని 6 మండలాలతో పాటు సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. వీటిని తెలంగాణకు ఇచ్చేయాలి. ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీరు తరలించే కాల్వలు పూడికతో నిండిపోవడంతో 4.56 టీఎంసీలకు మించి అందడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో అడుగు మేర పెంచాలని నిర్ణయించగా ఇందుకు కర్ణాటక కూడా అంగీకరించింది. ఈ పనులకు ఏపీ అడ్డంకులు సృష్టిస్తున్నందున కేంద్ర జోక్యం చేసుకొని పనులు పూర్తయ్యేలా సహకరించాలి. కృష్ణా నదీ జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు తొలి విడతలో 19 టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని గతేడాది ఫిబ్రవరిలో కృష్ణా బోర్డు చెప్పినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. రెండో విడత ఎక్కడో ఇంకా నిర్ణయించలేదు. దీంతో పోతిరెడ్డిపాడు వద్ద ఎక్కువ నీటిని బేసిన్ అవతలకు ఏపీ తరలిస్తోంది. దీన్ని అడ్డుకునేలా టెలిమెట్రీని తక్షణం అమల్లోకి తేవాలి. -
గంధమల్ల, బస్వాపూర్ నిర్వాసితులకు మంచి ప్యాకేజి: హరీశ్
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించ తలపెట్టిన గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇల్లు రూ. 7.50 లక్షల పరిహారంతోపాటు 250 గజాల స్థలం ఇవ్వాలని సాగునీటి మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. డబుల్‌బెడ్ రూం వద్దనే వారికి రూ.12.50 లక్షలతోపాటు 250 గజాల స్థలం ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ రవి, ఇతర రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెయిన్ కెనాల్ తవ్వకానికి అవసరమైన 460 ఎకరాలకుగాను 365 ఎకరాల భూమిని సేకరించామని జేసీ రవి వివరించగా, మిగిలిన ఎకరాల భూసేకణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. గంధమల్ల రిజర్వాయర్ కింద 2,387 ఎకరాల భూమి పోయే అవకాశం ఉందని రవి చెప్పగా నిర్వాసితులకు మంచి ప్యాకేజి ఇవ్వాలని, బస్వాపూర్ రిజర్వాయర్ పరిధిలో నిర్వాసితులయ్యే తిమ్మాపూర్ గ్రామస్తులకు కూడా ఇదే ప్యాకేజిని అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు భూసేకరణను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని, ముందుగా ఏ ప్రాంతంలో నీరందించే అవకాశం ఉందో ఆ ప్రాంతంలో భూసేకరణ చేయాలని సూచించారు. ఆ ప్రాంతంలోని చెరువులను వెంటనే నింపి కొంత ఆయకట్టుకు నీరందించాలని ఆదేశించారు. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ డ్యామ్ అలైన్మెంట్ కింద ఉన్న భూముల సేకరణపై దృష్టి సారించాలని, కాలువలు, తూముల ద్వారా నీరిచ్చే లా భూముల సేకరణ చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని హరీశ్ యాదాద్రి జిల్లా అధికారులను ఆదేశించారు. బిల్లులు ఆన్లైన్లో పొందుపర్చండి మిషన్ కాకతీయ పనులు పూర్తయిన వెంటనే బిల్లుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మిషన్ కాకతీయ పను ల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. డిండి ఫలాలు ఈ ఏడాదే అందాలి డిండి ఎత్తిపోతల పథకం తొలి ఫలాలు ఈ ఏడాదే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన గొట్టిముక్కల రిజర్వాయర్ ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీరందేలా చూడాలని సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని, కాలువల పనులను అక్టోబర్–నవంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లాలోని పలు పథకాలపై హరీశ్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. -
‘డిండి’కి విద్యాసాగర్‌రావు పేరు
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటిరంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొద్దిరోజుల్లోనే విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఘన నివాళి అర్పించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా పరిగణించాలని నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ‘‘సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన వివక్షను విద్యాసాగర్‌రావు ఎలుగెత్తి చాటారు. సంక్లిష్టమైన విషయాలను సులువుగా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పి, జరిగిన అన్యాయంపై ప్రజలను చైతన్య పరిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా సాగునీటి అంశాలపై విస్తృత చర్చకు అవకాశం కల్పించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు తాగునీరు, తెలంగాణలో బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందివ్వాలనేది ఆయన జీవితాశయంగా ఉండేది. ఆయన కలగన్నట్లుగానే సాగునీటి రంగంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాకు నీరందించే డిండి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టుకోవడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాం’’అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విద్యాసాగర్‌రావు అనారోగ్యంతో బాధపడుతూ తన చివరి కోరికగా తన సొంతూరు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి అప్పుడే దేవాలయ పునరుద్ధరణకు కోటి రూపాయలు మంజూరు చేశారు. జేఏసీ సైతం.. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ సైతం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ టి.వెంకటేశం, కన్వీనర్ వెంకటేశ్వర్లు, కోచైర్మన్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు శనివారం ఓ ప్రకటనలో తమ సంతోషం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు హర్షం డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. విద్యాసాగర్‌రావుకు ఇది సరైన నివాళి అని అభిప్రాయపడ్డారు. సముచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీటి పారుదల శాఖ తరఫున, ఇంజనీర్లు, అధికారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, మంచినీరు అందిస్తామని హరీశ్ ప్రకటించారు. -
పోలీస్ పహారాలో ‘శివన్నగూడ’
మర్రిగూడ (మునుగోడు) : డిండి ప్రాజెక్టు పరిధిలోని శివన్నగూడ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశం సోమవారం పోలీస్ పహారాతో నిండిపోయింది. ముంపుబాధితులు, పోలీసులకు జరిగిన ఘర్షణే ఇందుకు కారణం. రిజర్వాయర్ ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా పనులు చేస్తుండడంతో తరచూ అడ్డుకుంటున్నారు. అదేవిధంగా కొద్దిరోజులుగా ధర్నాలు చేస్తున్నారు. శివన్నగూడ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న శశిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు ఆదివారం పనులను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న కాంట్రాక్టర్ సిబ్బంది..వారిద్దరిపై దాడి చేశారు. ఈ విషయం శివన్నగూడ, నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులకు తెలిసింది. ‘‘మాకు పరిహారం ఇవ్వరు. పనులు ఎలా చేస్తారంటూ రెండు గ్రామాల ప్రజలు సోమవారం పనుల అడ్డగింతకు బయలుదేరారు. వందమందికిపైగా కలిసి ఉదయం 10.30 గంటలకు రిజర్వాయర్ పనుల వద్దకు వెళ్లారు. అప్పటికే బందోబస్తు నిమిత్తం చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరిగాయి. పోలీసులు..రిజర్వాయర్ కాంట్రాక్ట్‌కు వత్తాసు పలుకుతూ పనులు చేయిస్తున్నారని ఆగ్రహించిన ముంపుబాధితులు అక్కడి క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో వారిపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. సంఘటనలో కొంతమంది మహిళలకు, రైతులకు దెబ్బలు తగిలాయి. సీఐ బాలగంగిరెడ్డి తమను అసభ్యపదజాలంతో దూషిస్తూ లాఠీలతో చితకబాదాడని పలువురు మహిళలు ఆరోపించారు. ముంపుబాధితులు ఎదురుదిరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ గలాటాలో సీఐ బాలగంగిరెడ్డి తలకు స్వల్పగాయమైంది. ఆయనకు వెంటనే చికిత్స అందించారు. 40శాతం దాటని పరిహారం దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో బీడు భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డిండి ప్రాజెక్టును చేపట్టింది. ఇందులోభాగంగా ఐదు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. వీటిలో 10 టీఎం సీల నీటి సామర్థ్యంతో శివన్నగూడ రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది. ఈ రిజర్వాయర్ కోసం 4,100 ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నట్లు గుర్తించారు. వీటిలో 470 ఎకరాల ప్రభుత్వ భూమి పోను 3,630 ఎకరాలపైగా రైతులనుంచి సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్ నిర్మాణ ద్వారా చెర్లగూడెం, వెంకపల్లి, వెంకపల్లితండా, నర్సిరెడ్డిగూడెం గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఇప్పటివరకు ప్రభుత్వం 1170 ఎకరాలకు 123 జీఓ ప్రకారం ఎకరాకు రూ.4,15,000 చొప్పున పరిహారం అందించింది. అదే విధంగా తాజాగా పెంచిన పరిహారంతో ఎకరాకు రూ.5,15,000 చొప్పున 450 ఎకరాలకు పరిహారం ఇచ్చారు. ఇచ్చే పరిహారం 40శాతం కూడ దాటలేదు. ఈ ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, జూన్12న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి దాదాపుగా రెండేళ్లవుతున్నా పరిహారం మాత్రం రైతులకు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఇంకా 2,500 ఎకరాల పైగా పరిహారం ఇవ్వాల్సి ఉంది. 100 రోజుల దాటిన పోరాటం శివన్నగూడ రిజర్వాయర్ ముంపు భూములకు ప్రతి ఎకరాకు రూ.15లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 21నుంచి బాధితులు నిరవధిక ధర్నా చేస్తున్నారు. వివిధ రూపాల్లో చేస్తున్న వారి నిరసన కార్యక్రమాలు వంద రోజులకుపైగా దాటాయి. -
‘డిండి’పై సభలో దుమారం
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీటిని తరలించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్ అంశంపై గురువారం శాసనసభ కాసేపు అట్టుడికింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో దీన్ని అనుసంధానించకుండా వేరుగా చేపట్టాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గతంలో ఇదే విషయమై సీఎంకు లేఖ రాశారంటూ కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ ప్రాజెక్టుపై 10 నిమిషాలకుపైగా ఆయన ప్రశ్నలు వేయడంతో వంశీ మైక్ కట్ కావడం, ఆయన పోడియంలోకి దూసుకెళ్లడం, మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగడంతో సభ గరంగరంగా సాగింది. శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటామని.. ప్రశ్నోత్తరాల సందర్భంగా వంశీచంద్ మాట్లాడుతూ ‘‘డిండికి శ్రీశైలం నుంచే నీటిని తీసుకుంటామని జీవో ఇచ్చారు. 2015లో శంకుస్థాపన సందర్భంగా ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. అప్పుడు శ్రీశైలం ఫోర్‌షోర్ అని చెప్పి ఇప్పుడు పాలమూరుకు అనుసంధానించారు. మేమే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పాలమూరుతో అనుసంధానిస్తే రాజకీయ అశాంతి నెలకొంటుందని మంత్రులు ఆందోళన వెలిబుచ్చారు’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో వంశీచంద్ మైక్‌ను స్పీకర్ మధుసూదనాచారి కట్ చేసి అధికార పార్టీ సభ్యుడు గువ్వల బాలరాజుకు ఇచ్చారు. దీంతో వంశీచంద్ నిరసన వ్యక్తం చేశారు. అయినా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో వంశీ పోడియంలోకి దూసుకెళ్లగా ఆయనకు స్పీకర్ మైక్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిండికి వేరుగా నీటిని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం వంశీచంద్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి సభలోనే కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి డిండిపై చర్చ జరుగుతుంటే జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతిరెడ్డి సభలో లేరు. కాంగ్రెస్ నేతలు జిల్లాకో మాట మాట్లాడుతున్నారు. ఇది వారి కుటిలనీతి’’అని దుయ్యబట్టారు. డిండి ప్రాజెక్టు ఆలస్యంపై ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించాల్సింది గాంధీభవన్‌లో కానీ సభలో కాదని విమర్శించారు. ‘‘ఆ పార్టీ నేతలు హర్షవర్దన్‌రెడ్డి, పవన్‌కుమార్‌లు గండుపిల్లి కూడా లేని దగ్గర పెద్ద పులులున్నాయని, ఆముదం మొక్క కూడా లేనిచోట మహా వృక్షాలు ఉన్నాయని ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేశారు. నిజంగా నీళ్లు రావాలని కాంగ్రెస్ కోరుకుంటే మొదట కేసులు ఉపసంహరించుకొని ప్రాజెక్టుకు సహకరించాలి’’అని సూచించారు. ప్రజాధనం వృథా కావొద్దనే.. : హరీశ్ శ్రీశైలం నుంచి డిండికి నీటిని వేరుగా తీసుకుంటే అదనంగా పంప్‌హౌస్, సర్జ్‌పూల్ వంటి నిర్మాణాలతో అధిక మొత్తం ఖర్చవుతుందని, దీనికితోడు భూసేకరణ, ఇతర అనుమతులతో ఆలస్యం జరుగుతుందని హరీశ్‌రావు పేర్కొ న్నారు. ఈ దృష్ట్యా పాలమూరులో భాగంగా నిర్మిస్తున్న పంప్‌హౌస్ ద్వారానే 2 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 1.5 టీఎంసీలను పాలమూరు అవసరాలకు, మరో 0.5 టీఎంసీ డిండి అవసరాలకు మళ్లించాలని నిర్ణయించామని, దీని ద్వారా ప్రజాధనం వృథా కాదన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎలాంటి నష్టం ఉండదని, అన్ని జిల్లాలకు సమానంగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. కృష్ణాలో రాష్ట్రానికి కేటాయింపులు పెరగనున్నాయన్నారు. ‘డిండి’కి వ్యతిరేకం కాదు మీడియాతో వంశీచంద్ డిండి ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో అనుసంధానించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నాం తప్ప డిండి ప్రాజెక్టును కాదని వంశీచంద్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ డిండి ప్రాజెక్టును పాలమూరుతో అనుసంధానం చేస్తే మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు శాసనసభలోనే అబద్ధాలు చెప్పారని విమర్శించారు. డిండితో పాలమూరు ప్రాజెక్టును అనుసంధానిస్తే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాజకీయ అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. -
డిండి ప్రాజెక్టు.. ఎటూ తేల్చని ప్రభుత్వం
- శంకుస్థాపన చేసి రెండేళ్లయినా ఖరారుకాని డిజైన్.. తేలని నీటి కేటాయింపులు - నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునే ప్రక్రియపై అనేక అభ్యంతరాలు - కల్వకుర్తి ఆయకట్టు నష్టం, ‘పాలమూరు’కు నీటి కష్టంపై ఆ జిల్లా నేతల గుర్రు - ఎటూ తేల్చని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ పూర్వ మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత మండలాలకు పరిశుద్ధ తాగునీటిని అందించే ప్రధాన లక్ష్యంతో చేపడుతున్న డిండి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ జరిగి రెండేళ్లు కావస్తున్నా ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అంశంపై ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రాజెక్టు శంకుస్థాన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రకటించినా, ప్రాజెక్టుపై నెలకొన్న ప్రాధమిక అవాంతరాలను ఇంతవరకు దాటలేదు. శ్రీశైలం నుంచే నేరుగా నీటిని తీసుకుందామని ఒకమారు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి తీసుకుందామని మరోమారు, నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి తీసుకుందామని ఇంకోమారు మార్పులు చేస్తూ ఏదీ ఖరారు చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఎన్ని మార్పులో... డిండికి నీటిని తీసుకునే అంశంపై అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. శ్రీశైలం వరద నీటిపై ఆధారపడుతూ చేపట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల నీటిని డిండికి తరలించేలా మొట్టమొదటి ప్రక్రియ ఖరారైంది. అయితే అధిక ఖర్చు దృష్ట్యా శ్రీశైలం నుంచే నేరుగా నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం రిజర్వాయర్ నుంచే నీటిని తీసుకునే ప్రక్రియ ఖరారు కావడంతో డిండికి శ్రీశైలం నుంచి కాకుండా పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. ఏదుల రిజర్వాయర్ నుంచి రోజుకి 0.5 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం ఇచ్చింది. అనంతరం హైదరాబాద్ తాగునీటిì అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాలకు లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి వాటిని డిండి ద్వారానే 60 టీఎంసీల మేర తరలించాలని మరలా కొత్త ప్రణాళిక తెరపైకి తెచ్చారు. అయితే ఈ 60 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఏదుల కన్నా నార్లాపూర్ రిజర్వాయర్ నయమంటూ మరలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నార్లాపూర్‌తో మొదలైన వివాదం... అయితే నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే ప్రమాదముందని మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మొదట అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై వారంతా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అనంతరం దీనిపై సర్వే చేసిన అధికారులు మొత్తంగా కల్వకుర్తి పరిధిలోని ప్యాకేజీ 29లో 20,122 ఎకరాలు, ప్యాకేజీ 30లో మరో 7,629 ఎకరాలకు నష్టం ఉంటుందని తేల్చారు. అయితే నష్టం 4వేల ఎకరాలకు మించదని నల్లగొండ జిల్లా ప్రతినిధులు చెప్పుకొచ్చారు. నేతల మధ్య యుద్ధం జరుగుతుండగానే ప్రాజెక్టు ఇంజనీర్ల మధ్య వివాదాలు పొడసూపాయి. డిండి టన్నెల్, ఓపెన్చానల్లకు సూచించిన అలైన్మెంట్ ప్రకారం వ్యయ అంచనా, రూ.9,189 కోట్లు ఉంటుందని పాలమూరు ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేయగా, డిండి అధికారులు వేసిన అంచనా రూ.7,106 కోట్లుగా తేలింది. అంచనాల్లో రూ.2వేల కోట్ల వ్యత్యాసం ఉండటంతో, ప్రభుత్వం దీనిపై వ్యాప్కోస్‌తో సర్వే చేయించింది. వ్యాప్కోస్ సర్వే చేసి ఐదు ప్రత్యామ్నాయాలను చూపినా, చివరికి నార్లపూర్ నుంచి డిండికి నీటిని తీసుకెళ్లే డిజైన్‌ను ఓకే చేసింది. ప్రస్తుతం ఈ డిజైన్‌పైనా వ్యతిరేకత వస్తోంది. నార్లాపూర్ నుంచి నీటిని తీసుకెళితే పాలమూరు పథకానికి 90 టీఎంసీలే మిగులుందని, దీనిద్వారా 12.30 లక్షల ఎకరాలకు నీళ్లెలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తుండగా, కల్వకుర్తి కింద ముంపుపై మరికొందరు ప్రశ్నిస్తున్నారు. డిండిని విడిగా చేపట్టాలి: రమేశ్‌రెడ్డి, డి.గోవర్ధన్‌రెడ్డి, ఎన్.రఘుమారెడ్డి – మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో సంబంధం లేకుండా డిండి ప్రాజెక్టును వేరుగా చేపట్టాలి. శ్రీశైలం నుంచే నేరుగా నీటిని తీసుకోవాలి. పాలమూరు కింది 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు 120 టీఎంసీలు అవసరం. ఇందులో 30 టీఎంసీలు డిండికి తీసుకెళ్తే 90 టీఎంసీలతో పూర్తి ఆయకట్టుకు నీరివ్వడం అసాధ్యం. అందుకే డిండికి నేరుగా శ్రీశైలం నుంచే 0.5 లేక 0.75 టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రణాళిక ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. అలాకాకుండా పాలమూరు మొదటి రిజర్వాయర్ నుంచి నీటిని తోడేస్తే జిల్లా ఆయకట్టుకు నష్టమే. కల్వకుర్తి నుంచి నీటిని తీసుకెళ్తూ ఆ నియోజకవర్గ ఆయకట్టుకు నీరివ్వకపోవడం మంచిది కాదు’. ఫ్లోరైడ్ జిల్లాకు నీళ్ళొద్దా: శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, రాంరెడ్డి, – రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ ‘నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతాల కష్టాలను తీర్చేందుకు సాగునీటి ప్రాజెక్టు అత్యావశ్యకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా సూచన చేసింది. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో బోర్లతో వ్యవసాయం ద్వారా ఫ్లోరోసిస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. దీనికి శాశ్వత పరిష్కారం సాగునీటి పారుదల ద్వారానే సాధ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే డిండిని చేపట్టారు. కల్వకుర్తి ఆయకట్టు దెబ్బతినకుండా నీటిని సరఫరా చేసేలా వ్యాప్కోస్ సర్వే చేసి నివేదిక ఇచ్చింది. ఈ అంశాన్ని మానవీయ కోణంలో చూసి సహకరించాలి’. -
ఓట్లు కాదు.. ఏట్లు పడతాయి: కాంగ్రెస్
హైదరాబాద్‌సిటీ: టీఆర్ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పడు వచ్చినా టీఆర్ఎస్ నేతలకు ఓట్లు కాదు.. ఏట్లే పడతాయని విమర్శించారు. సాగునీటి రంగానికి సంబంధించి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పాలపూర్ రంగారెడ్డికి అనుసంధానం చేయడం సరికాదన్నారు. డిండి ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయాలన్నారు. డిండి పాలమూరు అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ గతంలో సీఎంకు లేఖ రాసిన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. డిండిని పాలమూరు రంగారెడ్డితో అనుసంధానం చేస్తే ఉద్యమం తప్పదన్నారు. అనుసంధానం జరిగితే అది టీఆర్ఎస్ నేతల వైఫల్యమే అవుతుందన్నారు. -
‘డిండి’లో మళ్లీ మార్పులు!
- అలైన్మెంట్ మార్చేలా ప్రతిపాదనలు - కొత్తగా 2.5 టీఎంసీలతో రిజర్వాయర్లు - మరో 20 వేల ఎకరాలకు నీరిచ్చేలా అధికారుల ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్లో మళ్లీ మార్పులు జరుగుతున్నాయి. గతంలో నిర్ణయించిన అలైన్‌మెంట్‌ను పక్కనపెట్టి కొత్తగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో 20 వేల ఎకరాలకు అదనంగా నీరిచ్చేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మార్పుల్లో భాగంగా అదనంగా 2.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు అదనపు రిజర్వాయర్లు రానున్నాయి. దీనిపై మరో 10ృ15 రోజుల్లో స్పష్టతనిచ్చేలా నీటిపారుదలశాఖ కసరత్తు చేస్తోంది. డిండికి ముందే మలుపు.. శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీల నీటిని పాలమూరుృరంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భా గంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి తరలించాలని గతంలో నిర్ణయిం చారు. అయితే నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్ నగర్ జిల్లా నేతలు అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ ప్రాజెక్టు అధికారులు మాత్రం 27,551 ఎకరాల నష్టమే ఉంటుందని తేల్చారు. ఈ నేపథ్యంలో సర్కారు ‘వ్యాప్కోస్’ ద్వారా సర్వే చేయించగా ఆ సంస్థ ఐదు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రణాళికకు ఓకే చెబుతూనే రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్ మెయిన్ తగ్గిం చాలని, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి రూ. 3,384.47 కోట్లు అవుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరంపాటు కాల్వలను, సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను అధికారులు పరిశీలించగా 5వ కిలోమీటర్ నుంచి 20వ కిలోమీటర్ వరకు ఉన్న అలైన్మెంట్, రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని వెల్లడైంది. దీన్ని ఎలా తప్పించాలన్న చర్చలు జరుగుతున్న సమయంలోనే కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం నార్లపూర్ నుంచి వచ్చే నీటిని నేరుగా డిండికి తరలించకుండా దానికి ఎగువనే 10వ కిలోమీటర్ పాయింట్ వద్ద 410 మీటర్ల కాంటూర్‌లో ఉల్పర అనే గ్రామం వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి నేరుగా డిండి దిగువన 10 కిలోమీటర్ల దూరంలోని ప్రధాన కాల్వలోకి నీటిని తరలించి ముందుగా నిర్ణయించిన ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఈ క్రమంలో ఉల్పర దిగువన గోకారం, ఎర్రవల్లి జంట చెరువులను కలిపేసి 0.75 టీఎంసీతో ఒక రిజర్వాయర్, ఇర్విన్ వద్ద 0.75 టీఎంసీతో మరో రిజర్వాయర్ నిర్మించే ప్రతిపాదనలు చేస్తున్నారు. దీని ద్వారా డిండి దిగువన 10వ కిలోమీటర్ వరకు ఉన్న టన్నెల్ నిర్మాణాన్ని పూర్తిగా తప్పించవచ్చు. అదీగాక ఉల్పర నుంచి పూర్తిగా గ్రావిటీ మార్గాన నీటిని తరలించవచ్చు. కొత్తగా 20 వేల ఎకరాలకు ఆయకట్టు వస్తుంది. -
‘డిండి’ మళ్లీ మొదటికి!
- వ్యాప్కోస్ సూచించిన రెండో ప్రతిపాదనలో రిజర్వ్ ఫారెస్ట్ - రీ సర్వే చేయాలని కోరిన నీటి పారుదల శాఖ - నార్లాపూర్–డిండి అలైన్మెంట్ పనుల్లో మరింత జాప్యం సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు సర్వే మళ్లీ మొదటికి వచ్చింది. నార్లాపూర్–డిండి అలైన్‌మెంట్‌కు వ్యాప్కోస్ సూచించిన రెండో ప్రతిపాదనలో రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో రీ సర్వే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో అటవీ సమస్యల కారణంగా కేంద్ర సంస్థల అనుమతులు క్లిష్టంగా మారిన నేపథ్యంలో.. ఇక్కడ అలాంటివి పునరా వృతం కాకుండా ఉండేందుకు నీటి పారుదలశాఖ రీ సర్వేకు ఆదేశించింది. శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీల నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునేందుకు నాలుగు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఇందులో వట్టిపల్లి, ఆలేరు, తెలకపల్లి గ్రామాల మీదుగా నీటిని తీసుకెళ్లి రంగాయపల్లి వద్ద పంప్‌హౌస్, గ్రావిటీ టన్నెల్ నిర్మించే ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనికి రూ.3,384.47 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరం సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వలు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపా దనపై పరిశీలన చేసిన ప్రాజెక్టు అధికా రులు రిజర్వ్ ఫారెస్ట్ అంశాన్ని గుర్తించారు. 5వ కి.మీ. నుంచి 20వ కి.మీ. వరకున్న అలైన్మెంట్ అంతా రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని తేల్చారు. ఇక రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ సైతం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని తేల్చారు. అటవీ ప్రాంతాన్ని తప్పించేందుకు ప్రత్యామ్నాయ అలైన్మెంట్ మార్గాన్ని తెలకపల్లి గ్రామం మీదుగా తరలించే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లుగా తెలిసింది. దీనిపై ప్రస్తుతం వ్యాప్కోస్ సర్వే చేస్తోంది. అది పూర్తయితేనే అలైన్మెంట్ ఖరారు కానుంది. ఏడాదిగా కసరత్తు చేస్తున్నా.. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌పై ఏడాదిగా కసరత్తు చేస్తున్నా ఎటూ తేలడం లేదు. మొదటగా కల్వకుర్తి ఆయకట్టు నష్టంపై అభ్యంతరాలు రాగా.. తర్వాత అలైన్మెంట్ అంచనా వ్యయాల్లో తేడాలొచ్చాయి. దీంతో కల్వకుర్తి ఆయకట్టుకు నష్టం లేకుండా అలైన్మెంట్ ఖరారు అంశాన్ని వ్యాప్కోస్‌కు కట్టబెట్టగా.. ఇదీ ఎటూ తేలడం లేదు. నార్లాపూర్ నుంచి డిండి అలైన్మెంట్ ఖరారు కానుందున.. ఆలోపు సింగరాజు పల్లి(0.8 టీఎంసీలు), గొట్టిముక్కల (1.8), చింతపల్లి(0.99), కిష్టరాంపల్లి (5.68), శివన్నగూడం (11.96 టీఎంసీల) రిజర్వాయర్లు.. వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులకు ప్రభుత్వం టెండ ర్లు పిలిచి పనులు ఆరంభించింది. మొత్తం గా 7 ప్యాకేజీలకుగానూ రూ.3,940 కోట్ల పనులు చేపట్టింది. ఈ పనులు సాగుతు న్నా.. తొలి దశ పనులకు మాత్రం మోక్షం ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
తుదిదశకు ‘డిండి’ అలైన్మెంట్!
సాక్షి, హైదరాబాద్: డిండి ప్రాజెక్టు అలైన్‌మెంట్‌కు వ్యాప్కోస్ సూచించిన రెండో ప్రతిపాదన దాదాపు ఖాయమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంత ర్భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే ఈ ప్రక్రియకు నీటి పారుదల శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, ఈ అలైన్ మెంట్ కారణంగా కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టుకు కలిగే నష్టాన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం చేయనుంది. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్‌నగర్ జిల్లా నేతలు అభ్యంత రాలు లేవనెత్తారు. దీంతో కల్వకుర్తి ఆయకట్టుకు నష్టంలేకుండా నీటిని తీసుకెళ్లే ప్రత్యామ్నాయాలపై నివేదిక ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాప్కోస్ సంస్థకు ఆదేశాలిచ్చారు. వ్యాప్కోస్ 5 ప్రత్యామ్నాయాలను చూపింది. రెండో ప్రతిపాదనలో రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్ మెయిన్ తగ్గించి, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని, దీనికి 3,384.47కోట్లు అవుతుందని తెలిపింది. నార్లాపూర్ నుంచి డిండికి 50 కి.మీ. దూరం కాల్వల ద్వారా 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా దీన్ని ప్రతిపాదించారు. -
డిండి ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల
డిండి : ఎంజీకేఎల్ఐ పథకం ద్వారా డిండి ప్రాజెక్ట్‌లోకి నీటిని ఇటివలే విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటిమట్టం 13 అడుగులకు చేరింది. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు దాని పరిధిలోని కుంటలను నింపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు.. రాష్ట్ర æనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు సోమవారం మండల పరిధిలోని పలు కుంటలకు డిండి ప్రాజెక్ట్ నుంచి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈ రూప్లా నాయక్ మాట్లాతడుతూ బాపన్‌కుంట, ఎనకుంట, కాంట్రోన్ కుంట, నడివి కుంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంపీటీసీ సభ్యులు పర్వతాలు, తిర్పతయ్య, విష్ణువర్దన్‌రెడ్డి, వీరకారి రాంకిరణ్, వెంకట్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు. కొన్ని గంటల్లోపే.. డిండి ప్రాజెక్ట్ నుంచి ఆయకట్లు కింద ఉన్న కుంటలను నింపడానికి నీటిని విడుదల చేసిన కొన్ని గంటల్లోపే నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అడ్డుకున్నారు. 13 అడుగుల నీరు మాత్రమే ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేస్తే.. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయి సమీప మండలాలైన వంగూర, ఉప్పునుంతల మండలాల్లో భూగర్బ జలాలు అడుగంటిపోతాయని ఆయన పేర్కొన్నారు. తాగు నీటి సమస్య జటిలమవుతుందన్న ప్రజల ఒత్తిడి మేరకే నీటి విడుదలను అడ్డుకున్నట్లు వెల్లడించారు. డిండి ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో నింపిన తర్వాతనే మండల పరిధిలోని కుంటలకు నీటిని వదలాలని పేర్కొన్నారు. -
అన్ని గ్రామాలకు మిషన్ తాగునీరు
► ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిండి : మిషన్ భగీరథ పథకంలో భాగంగా 2017 చివరి నాటికి తెలంగాణలోని అన్ని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం తాగు నీరందిస్తుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బాపన్‌కుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వలన డిండి మండలంలో వానలు కురవక కరువు పరిస్థితులు దాపురించాయన్నారు. ఈ నేపథ్యంలో మండల ప్రజల ఆకాంక్ష మేరకు కనీసం తాగు నీటి వసతి కోసం కల్వకుర్తి ఎత్తి పోతల పథకం ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీరందించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. వారు వెంటనే స్పందించి సంబంధిత నీటి పారుదల శాఖా మంత్రిహరీశ్‌రావుతో మాట్లాడి అందించిన నీటిని డిండి మండల పరిధిలోని కుంటలకు విడుదల చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆయా గ్రామాల రైతులను సోమవారం కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో మొదటగా సింగరాజుపల్లి వద్ద ప్రారంభమైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. డిండి ఎత్తిపోతల పథకంలో నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు శాశ్వతంగా తాగు, సాగు నీటి సమస్య లేకుండా పోతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీ వీరకారి నాగమ్మ, ఎంపీపీ ముఖ్య సలహాదారుడు రాంకిరణ్, వైస్‌ఎంపీపీ తుమ్మల నీతు, కోఆప్షన్ అల్లాహుద్దిన్, టీఆర్ఎస్ మండల నాయకులు రాజీనేని వెంకటేశ్వరరావు, యదగిరిరావు, బల్ముల తిర్పతయ్య, శ్రీనువాసులు, కృష్ణయ్య, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తొలి అడుగు
డిండి ప్రాజెక్టు పనులు ప్రారంభం రూ.6500 కోట్ల నిధులు విడుదల దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు, సాగులోకి రానున్న 3.50 లక్షల బీడు భూములు మర్రిగూడ : జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా జిల్లాలో డిండి ఏత్తిపోతల పథకమును చేపట్టింది. ఈ రిజర్వాయర్ ఏర్పాటు కోసం గత ఏడాది జూను 12న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేసిన 18 నెలల తర్వాత ప్రభుతవం పనులు ప్రారంభించింది.దీని కింద జిల్లాలో 5 రిజర్వాయర్ల ఏర్పాటు చేసి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గంలోని బీడు భూములకు సాగు, తాగు నీరు అందించనున్నారు. 3.50 లక్షల ఎకరాల భూమికి సాగునీరు డిండి ఏత్తి పోతల పథకములో భాగంగా జిల్లాలోని 5 రిజర్వాయర్లు రూ.6500 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను తెలంగాణ నీటి పారుదల శాఖ నుంచి నిధులను కేటాయించారు. శ్రీశైలం ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ పద్ధతి ద్వారా రోజు 2 టీఎంసీల నీటిని సేకరిస్తారు. ఆ నీటిని నార్లపూర్ రిజర్వాయర్ నుంచి లీఫ్ట్ పద్ధతిలో 1.5 టీఎంసీలు, రంగారెడ్డి–పాలమూరు ఏత్తి పోతల పథకానికి మిగిలినా 0.5 టీఎంసీల నీరు డిండి ప్రాజెక్టుకు ఇలా 30 రోజుల్లో 15 టీఎంసీలను నిల్వ చేస్తారు. అనంతరం డిండి నుంచి కాల్వల ద్వార 5 రిజర్వాయర్లకు నీటిని పంపించి 3.50 లక్షల ఎకరాల బీడు భూములకు సాగు నీరు అందిస్తారు. ఇప్పటికే డిండి ప్రాజెక్టు ద్వార 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ఈ పథకం ద్వార మరో 18 వేల ఎకరాల భూములకు సాగు నీరు అందుతుంది.ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏడాదిలో ఇక్కడి రైతులు రెండు పంటలను సాగు చేయవచ్చు. రెండు రిజర్వాయర్ల పనులు ప్రారంభం. ఈ పథకంలో భాగంగా చేపట్టిన ఐదు రిజర్వాయర్లలో ఇప్పటికే రెండు రిజ్వరాయర్ పనులను ప్రారంభించారు. ఇప్పటికే డిండి మండలంలోని సింగరాజుపల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం భూమి చదును చేసి సీఓటీ పనులు సాగుతున్నాయి. తాజాగా ఈనెల 18న శివన్నగూడ రిజర్వాయర్ ఏర్పాటు కోసం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర న ర్సయ్యగౌడ్, మునుగో డు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.మిగిలిన మూడు రిజ ర్వాయర్ పనులను ప్రారంభిచేందుకు నీటి పారుదల శాఖ అధికారులు భూ సేకరణ చేస్తున్నారు. ఐదు రిజర్వాయర్లు ఇవే.. డిండి ప్రాజెక్టుకు 7.875 కిలో మీటర్ల దూరంలో సింగరాజుపల్లి రిజర్వాయర్‌ను 702 ఎకరాల భూ విస్తీరణంలో 0.81 టీఎంసీల నీటి నిల్వ సామార్థ్యంతో చేపడుతున్నారు. దీని ద్వారా 13000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. డిండి ప్రాజెక్టుకు 32 కిలో మీటర్ల దూరంలో గోట్టిముక్కల రిజర్వాయర్‌ను చేపట్టనున్నారు. దీనిని 1907 ఎకరాల భూ విస్తీరణంలో 1.84 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపడుతున్నారు. దీని కింద 2800 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టుకు 40 కిలొ మీటర్ల దూరంలో చింతపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టనున్నారు. 1538 ఎకరాల భూమిలో 0.91 టీఎంసీల నీటి నిల్వ సామ్యార్థంతో చేపడుతున్నారు. దీని కట్ట పొడువు 4.600 కిలో మీటర్లు కాగా 15000 వేల ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి. ప్రాజెక్టుకు 51 కిలో మీటర్ల దూరంలో చేపట్టే క్రిష్టరాయినీపల్లి రిజర్వాయర్ ద్వారా 1903 ఎకరాల భూమికి సాగు నీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 5.69 టీఎంసీలు. దీని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. డిండి ప్రాజెక్టుకు 59 కిలొ మీటర్ల దూరంలో శివన్నగూడ రిజర్వాయర్‌ను 11.96 టీఎంసీల నీటి నిల్వ సామార్థ్యంతో నిర్మించనున్నారు. దీని కింద 1.55,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. -
రిజర్వాయర్ల నిర్మాణంపై జేసీ సమీక్ష
డిండి: పాలమూరు-డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్లపై నల్లగొండ జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష జరిపారు. శనివారం ఆయన డిండి ప్రాజెక్టు అతిథిగృహంలో డీఈ, ఈఈలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, శివన్నగూడెం, కిష్టారంపల్లిలలో చేపట్టాల్సిన పనుల పురోగతి, అవరోధాలపై చర్చించారు. పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. -
5 రిజర్వాయర్లు.. రూ.5,200 కోట్లు!
డిండి ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లాలో నిర్మాణం 3.14 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రణాళిక ఆమోదముద్ర వేసిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్‌ను ప్రభుత్వం ఓ కొలిక్కి తెచ్చింది. నీటి వినియోగం, నిర్మించే రిజర్వాయర్లు, వాటి సామర్థ్యాలపై కసరత్తు పూర్తి చేసింది. రూ.5,200 కోట్లతో ఐదు రిజర్వాయర్లను నిర్మించాలనే అభిప్రాయానికి వచ్చింది. కృష్ణాలో వరద ఉండే రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉండే నార్లాపూర్ నుంచి 60 రోజుల్లో రోజుకు అర టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తీసుకునేందుకు నిర్ణయించింది. శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ప్రాజెక్టులో నిర్మించే రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదముద్ర వేశారు. డిండి కింద మొత్తంగా 3.41 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చేలా ప్రణాళిక ఖరారు చేశారు. నార్లపూర్ నుంచి డిండికి అక్కడి నుంచి 3 ఆఫ్‌లైన్, 2 ఆన్లైన్ రిజర్వాయర్ల ద్వారా నీటిని తరలించనున్నారు. 22 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆఫ్‌లైన్‌లో సింగరాజుపల్లి (0.81 టీఎంసీ), గొట్టిముక్కల (1.76 టీఎంసీ), చింతపల్లి (0.9 టీఎంసీ) రిజర్వాయర్లు, ఆన్లైన్లో కిష్టరాంపల్లి (6.78 టీఎంసీ), శివన్నగూడెం (11.96 టీఎంసీ) రిజర్వాయర్లు ఉండనున్నాయి. 59 కిలోమీటర్ల మేర కెనాల్, ఇందులో 2.5 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. వీటికి మొత్తంగా రూ.5,200 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కిష్టరాంపల్లిలో చిన్నపాటి మార్పులు జరిగే అవకాశం ఉందని, అది మినహా మిగతా రిజర్వాయర్లు అన్నీ కొలిక్కి వచ్చినట్లేనని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా వీటికి టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు. -
డిండితో నల్లగొండ కరువు తీరాలి
పనులు త్వరగా పూర్తిచేయండి: అధికారులకు సీఎం ఆదేశం - రెండేళ్లలో మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు రావాలి - అవసరాన్ని బట్టి ఉత్తర, దక్షిణ తెలంగాణలకు నీటి పంపిణీ - నిండిన నీళ్లను నిండినట్టే గొలుసుకట్టు చెరువులకు మళ్లించాలి - నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: డిండి ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాలకు సాగునీటిని అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చింతపల్లి, గొట్టిముక్కల, సింగరాయపల్లి, కృష్ణంపల్లి రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపి నల్లగొండ కరువును తీర్చేలా పనులు సాగాలని జిల్లా ఇంజనీర్లకు సూచిం చారు. అలాగే మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు నీళ్లు తరలించే పనులను రెండేళ్లలోపే పూర్తిచేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో అటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షిణ తెలంగాణకు సాగు అవసరాలను బట్టి నీటిని పంపిణీ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. మల్లన్న సాగర్ నుంచి బస్వాపూర్ వరకు నిర్మించ తలపెట్టిన ప్రధాన రిజర్వాయర్లలో నిండిన నీళ్లను గొలుసుకట్టు చెరువులకు మళ్లించాలని ఆదేశించారు. లిఫ్టులతో జలాశయాలను నింపుతూనే చుట్టుపక్కల గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మళ్లించాలన్నారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణాలపై నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఆ జిల్లా మంత్రి జి.జగదీశ్ రెడ్డి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. గోదావరి, కృష్ణా నదులపై నిర్మించతలపెట్టిన రిజర్వాయర్ల డిజైన్లు, పనుల పురోగతిని సమీక్షించారు. గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సమాంతరంగా లిఫ్టు ద్వారా నీటిని ఎల్లంపల్లి నుంచి దిగువ రిజర్వాయర్లకు మళ్లించే కార్యాచరణను రూపొం దించాలని ఈ సందర్భంగా సీఎం నీటిపారుదల శాఖను ఆదేశించారు. రిజర్వాయర్లలో ఎప్పుడూ నీళ్లుండాలి డిండి ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్ వరకు సాగునీటిని తరలించే కాలువల నిర్మాణం, డిజైన్ల పురోగతిని సీఎం పరిశీలించారు. డిండి నుంచి శివన్నగూడెం వరకు కాలువ నిర్మాణంపై చర్చించారు. నర్లాపూరు నుంచి డిండి ప్రధాన కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ నాలుగు రిజర్వాయర్ల నిర్మాణాల పరిధిలో ముంపు అతి తక్కువగా ఉండేలా, దూరం పెరగకుండా ఇంజనీరింగ్ నైపుణ్యంతో కాల్వల నిర్మాణం చేపట్టాలన్నారు. రిజర్వాయర్లలో నిరంతరం నీటి నిల్వ ఉండేలా చూడాలన్నారు. ‘‘ఈ నీళ్లతో చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జల నీటి మట్టం పెరుగుతుంది. వర్షాలు కురవడానికి సైతం రిజర్వాయర్లు దోహదపడతాయి. అటు కాళేశ్వరం నుంచి బస్వాపూర్ వరకు ఇటు డిండి నుంచి చివరి రిజర్వాయర్ వరకు త్వరగా పనులు పూర్తయ్యేలా నల్లగొండ జిల్లా ఇంజనీర్లు కృషి చేయాలి. ఖమ్మం జిల్లా మణుగూరు ప్రాంతానికి లిఫ్టు ద్వారా సాగునీటిని అందించాలి’’ అని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలు, మండలాల పునర్విభజనపై ప్రజల ఆకాంక్షలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్ర నాయక్, నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, నీటిపారుదల ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
డిండికి అర టీఎంసీనే!
- నార్లాపూర్ నుంచి లేకుంటే శ్రీశైలం ఫోర్‌షోర్ నుంచి తీసుకునేలా ప్రణాళిక - రెండు ప్రతిపాదనలపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని వ్యాప్కోస్‌కు ప్రభుత్వ సూచన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుకు అర టీఎంసీని మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి తీసుకోవడ మా లేక శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి తీసుకోవడమా అన్న అంశంపై పూర్తి స్థాయి సర్వే చేశాకే తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు ప్రతిపాదనలపై 15 రోజుల్లో సర్వే చేసి నివేదిక సమర్పించాలని వ్యాప్కోస్ను ప్రభుత్వం ఆదేశించింది. శ్రీశైలంలో వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ నీటిని తరలించడం ద్వారా 30 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి తరలించాలని ప్రభుత్వం తొలుత ప్రణాళిక వేసింది. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాలకు లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి.. వాటిని డిండి ద్వారానే 60 టీఎంసీలు తరలించాలని మరలా కొత్త ప్రణాళిక తెరపైకి తెచ్చింది. దీంతో మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ కాకుండా ఒక టీఎంసీ నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే డిండికి తరలించాలని ప్రతిపాదనలు తయారయ్యాయి. అయితే డిండికి అదనంగా 0.5 టీఎంసీ పెంచడంతో పాలమూరు ప్రాజెక్టుకు ఒక్క టీఎంసీ నీటి లభ్యతే ఉంటోంది. 60 రోజుల పాటు ఈ నీటిని తరలించి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కాదని పాలమూరు ప్రాజెక్టు అధికారులతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు అభ్యంతరం లేవనెత్తుతున్నారు. దీనిపై ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు సీఎంకు లేఖ రాశారు. దీనికి తోడు డిండి అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వే ల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని అభ్యంతరాలు లేవనెత్తారు.దీనిపై సర్వే చేసిన అధికారులు మొత్తంగా 27,551 ఎకరాలకు నష్టం ఉంటుం దని తేల్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం దీనిపై వ్యాప్కోస్ ప్రతినిధులతో సమీక్షించిన ప్రభుత్వం డిండికి అర టీఎంసీనే తీసుకోవాలని, ఆ దిశగానే సర్వే చేయాలని సూచించింది. నల్లగొండ రిజర్వాయర్లకు వారంలో టెండర్లు.. మహబూబ్‌నగర్ జిల్లా వరకు ప్రాజెక్టు అలైన్మెంట్ విషయమై స్పష్టత వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. వాటిని ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఇప్పటికే అంచనాలు పూర్తయిన నల్లగొండ జల్లాలోని రిజర్వాయర్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సిద్ధమైన అంచనాల మేరకు సింగరాజుపల్లి(0.8 టీఎంసీ)కి రూ.100 కోట్లు, గొట్టిముక్కల(1.8 టీఎంసీ)కి రూ.125 కోట్లు, చింతపల్లి(1.1 టీఎంసీ)కి రూ.150 కోట్లు, కిష్టరాంపల్లి(10 టీఎంసీ)కి రూ.1,500 కోట్లు ఖర్చవుతాయని లెక్కలేశారు. ఇక మరో రిజర్వాయర్ శివన్నగూడెం(12 టీఎంసీ) అంచనాలను ఒకట్రెండు రోజుల్లో అధికారులు పూర్తి చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రాజెక్టులపై సమీక్ష జరిపిన మంత్రి హరీశ్‌రావు మొత్తంగా నల్లగొండ జిల్లాలో రూ.3,375 కోట్ల పనులకు వారంలో టెండర్లు పిలవాలని ఆదేశాలిచ్చినట్లుగా తెలిసింది. -
నార్లాపూర్ నుంచే ‘డిండి’కి నీరు?
♦ అక్కడ్నుంచి అయితేనే కల్వకుర్తి ఆయకట్టు నష్టం తగ్గింపు ♦ ప్రభుత్వానికి నీటిపారుదల నిపుణుల సూచన ♦ ఈ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్న ముఖ్యమంత్రి ♦ త్వరలోనే తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోనే ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని మళ్లించే ప్రణాళికను దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యాపక్కనపెట్టాలని యోచిస్తోంది. నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునే సామర్థ్యాన్ని (ఇన్‌టేక్ కెపాసిటీ) 2 నుంచి 3 టీఎంసీలకు పెంచి అందులో 2 టీఎంసీలు పాలమూరు ప్రాజెక్టుకు, మరో టీఎంసీ డిండికి తరలించడం ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రయోజనాలను కాపాడవచ్చంటున్న నీటిపారుదల రంగ నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి త్వరలోనే అధికారులు, రెండు జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. మారిన ప్రతిపాదనలు... డిండి మొదటి ప్రతిపాదన ప్రకారం శ్రీశైలంలో వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 30 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి తరలించాలని అధికారులు ప్రణాళిక తయారు చేశారు. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాలకు లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి వాటిని డిండి ద్వారానే తరలించేలా కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీలు కాకుండా ఒక టీఎంసీ నీటిని డిండికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తరలించాలని ప్రతిపాదనలు కూడా తయారయ్యాయి. కానీ ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లుకాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుందని... అక్కడి వరకు నీటిని తరలించే బదులు ఏదుల రిజర్వాయర్‌ను 430 మీటర్ల ఎత్తు వద్దే నిర్మించి అక్కడి నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని అధికారులు కొత్తగా ప్రతిపాదించారు. 430 మీటర్ల ఎత్తు వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి ఇర్విన్, జేపల్లి వద్ద కొత్త రిజర్వాయర్ల ఏర్పాటుతోపాటు కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. కొలిక్కి తెచ్చే యత్నాల్లో ప్రభుత్వం... డిండి అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వే ల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్న గర్ జిల్లా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇటీవలే సర్వే చేసిన అధికారులు..ఆయకట్టు నష్టం 27,551 ఎకరాల మేరకే ఉంటుందని తేల్చారు. ఇందులో కల్వకుర్తి ప్యాకేజీ 29లో 20,122 ఎకరాలు, ప్యాకేజీ 30లో మరో 7,629 ఎకరాలకు నష్టం ఉంటుందని లెక్కించారు. ఈ లెక్కలతో నల్లగొండ జిల్లా ప్రతినిధులు విభేదిస్తున్నారు. పాల మూరులోని ఇతర రిజర్వాయర్ల కింద నష్టపోయే ఆయకట్టును డిండి నష్టం కింద లెక్కగడుతున్నారని..దీంతోపాటే భూసేకరణనూ ఇందులో కలిపారని వాదిస్తున్నారు. ఈ సమస్యను కొలిక్కి తెచ్చే యోచనలో సీఎం ఉన్నారు. -
‘డిండి’ని పరిష్కరిద్దాం!
- అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: పాలమూరు, నల్లగొండ జిల్లాల మధ్య వివాదానికి కారణమైన ‘డిండి’ ప్రాజెక్టు అంశాన్ని త్వరగా తేల్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రాజెక్టు డిజైన్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు త్వరగా పరి ష్కారం చూపాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించిన సీఎం డిండి ప్రాజెక్టు అంశాన్ని సైతం ఇంజనీర్ల వద్ద ప్రస్తావించినట్లుగా తెలిసింది. శ్రీశైలంలో వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీకి బదులు ఒక టీఎం సీ నీటిని తీసుకోవాలని నిర్ణయించడంతో పాలమూరు-రంగారెడ్డి పథకానికి నీటి కొ రత ఏర్పడుతుంది. ఇదే సమయంలో డిండి అలైన్మెంట్ ద్వారా మహబూబ్‌నగర్ జి ల్లాలోని కల్వకుర్తి ఆయకట్టుకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ముం దుకు కదలడం లేదు. బడ్జెట్లో మాత్రం డిండికి రూ. 700 కోట్ల వరకు కేటాయిం చారు. ఈ నేపథ్యంలోనే సమీక్షించిన సీఎం కల్వకుర్తి ఆయకట్టుకు నష్టం లేకుండా, పా లమూరు ప్రాజెక్టుకు అవసరమయ్యే నీటిలో కొరత రాకుండా ప్రత్యామ్నాయాలను అ న్వేషించాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయాలను సిద్ధం చే సి రెండుమూడు రోజుల్లో తనకు నివేదిక అందించాలని కోరినట్లు సమాచారం. ఈ ని వేదికను ఆధారం చేసుకొని ఈ వివాదానికి పరిష్కారం చూపే అవకాశం ఉంది. -
‘డిండి’పై కొత్త వివాదం!
♦ కల్వకుర్తి ఆయకట్టుపై పాలమూరు, డిండి ఇంజనీర్ల మధ్య విభేదాలు ♦ 90వేల ఎకరాలకల్వకుర్తి ఆయకట్టుకు నష్టం: పాలమూరు ఇంజనీర్లు ♦ నష్టం తక్కువేనంటున్న డిండి ఇంజనీర్లు.. విభేదాలతో ఆగిన టెండర్లు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేర్పులపై వివాదం రగులుకుంది. డిండి ప్రాజెక్టు కొత్త అలైన్మెంట్తో తమ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆయకట్టుకు భారీగా నష్టం జరుగుతుందని మహబూబ్‌నగర్ ఇంజనీర్లు... ఎవరి నుంచి ఏరకమైన ఫిర్యాదులు లేకపోయినా ‘పాలమూరు’ ఇంజనీర్లు కావాలని వివాదం చేస్తున్నారని నల్లగొండ ఇంజనీర్లు వాదనకు దిగుతున్నారు. తొలి ప్రతిపాదనల ప్రకారం శ్రీశైలంలో వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ నీటిని తరలించడం ద్వారా 30 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి తరలించేలా ప్రణాళిక తయారు చేశారు. అయితే హైదరాబాద్ అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి.. ఈ నీటిని కూడా డిండి ద్వారా తరలించేలా కొత్తగా ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం శ్రీశైలం నుంచి రోజుకు 0.5 టీఎంసీలకు బదులు ఒక టీఎంసీ చొప్పున తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లుకాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుంది. దీంతో అంతదూరం నుంచి నీటిని తరలించే బదులు 430 మీటర్ల ఎత్తు వద్దే రిజర్వాయర్ నిర్మించి... కాల్వల ద్వారా నీటిని తరలించాలని కొత్తగా ప్రతిపాదించారు. వివాదమంతా ఇక్కడే.. డిండికి రోజుకు అదనంగా 0.5 టీఎంసీ సరఫరా పెంచాలని నిర్ణయించడంతో... పాలమూరు ప్రాజెక్టుకు కేవలం రోజుకు ఒక టీఎంసీ నీటి లభ్యతే ఉంటోంది. ఈ నేపథ్యంలో 60 రోజుల పాటు ఈ నీటిని తరలించి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కాదని పాలమూరు ప్రాజెక్టు అధికారులతో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులు అభ్యంతరం లేవనెత్తుతున్నారు. మారిన డిండి అలైన్మెంట్ కారణంగా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక 430 మీటర్ల వద్ద కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తే... ఇర్విన్ దగ్గర 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్లను చేపట్టాల్సి వస్తుందని డిండి అధికారులు తేల్చారు. దీనిపైనా పాలమూరు అధికారులు అభ్యంతరం లేవ నెత్తారు. వాటితో కల్వకుర్తి ఆయకట్టు మరికొంత దెబ్బతింటుందని చెబుతున్నారు. మరోవైపు డిండి ఇంజనీర్లు మాత్రం.. కొత్త డిజైన్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో అదనంగా 50వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని లెక్కలేశారు. అదే సమయంలో కల్వకుర్తి కింద 3 వేల ఎకరాలకు మించి నష్టముండదని అంటున్నారు. నార్లాపూర్ ఇన్‌టేక్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచి... డిండికి ఒక టీఎంసీ నీటిని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2 టీఎంసీల నీటిని తరలించాలని సూచిస్తున్నారు. తద్వారా రెండు ప్రాజెక్టులకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. టెండర్లు ఆలస్యం డిండి ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో చేపట్టే రిజర్వాయర్ల టెండర్లను గత మంగళవారమే పిలవాల్సి ఉంది. కానీ కల్వకుర్తి ఆయకట్టు నష్టంపై తేలేవరకు టెండర్లు పిలవరాదని పాలమూరు ప్రాజెక్టు అధికారులు సూచించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఇప్పటివరకు కల్వకుర్తి ఆయకట్టు చిత్రాలు అధికారుల వద్ద లేవు. పూర్తిస్థాయి సర్వే పూర్తయితేగానీ నష్టపోయే ఆయకట్టు ఎంతన్నది తేలే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు ప్రాంతాలు, ప్రస్తుత డిండి ప్రాజెక్టుతో నష్టపోయే ఆయకట్టు వివరాలను తెలపాలని డిండి సీఈ శుక్రవారం కల్వకుర్తి ఎస్ఈకి లేఖ రాశారు. ఈ వివాదంపై శనివారం మంత్రి హరీశ్‌రావు సైతం సమీక్షించే అవకాశం ఉంది. -
త్వరలో డిండికి టెండర్లు
ఇప్పటికే 4 రిజర్వాయర్లకు రూ.1,875 కోట్లతో అంచనాలు సిద్ధం సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలిచేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు పరిధిలో నల్లగొండ జిల్లాలో నిర్మించదలిచిన రిజర్వాయర్ల అంచనాలు ఓ కొలిక్కి వచ్చినందున వాటికి వెంటనే టెండర్లు పిలవాలని భావిస్తోం ది. శివన్నగూడెం రిజర్వాయర్ వ్యయ అంచనాలను పూర్తిచేసి త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయించింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీలు కాకుండా 1 టీఎంసీ నీటిని డిండికి తరలించడం ద్వారా మునుగోడు, నకిరేకల్‌తోపాటు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీరు తరలించేలా ప్రతిపాదనలు త యారయ్యాయి. అయితే ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లు కాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుందని, అక్కడివరకు నీటిని తరలించే బదులు 430 మీటర్ల ఎత్తు వద్దే మేడిపూర్ వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని కొత్తగా ప్రతిపాదించారు. 430మీటర్ల ఎత్తువద్ద రిజర్వాయర్ చేపడితే కొత్తగా ఇర్విన్ దగ్గర 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంటుంది. అయితే ఈ అలైన్మెంట్ విషయమై కొంత సందిగ్ధత ఉండటం, రిజర్వాయర్ల అంచనాలు ఇంకా పూర్తికాని దృష్ట్యా, వాటిని ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఇప్పటికే అంచనాలు పూర్తయిన నల్లగొండ జిల్లాలోని రిజర్వాయర్ల నిర్మాణ పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సిద్ధమైన అంచనాల మేరకు సింగరాజుపల్లి (0.8 టీఎంసీ)కి రూ.100 కోట్లు, గొట్టిముక్కల(1.8 టీఎంసీ)కు 125 కోట్లు, చింతపల్లి (1.1టీఎంసీ)కి 150 కోట్లు, కిష్టరాంపల్లి (10టీఎంసీ)కి 1,500 కోట్లు ఖర్చవుతాయని లెక్కలేశారు. ఇక మరో రిజర్వాయర్ శివన్నగూడెం (12 టీఎంసీలు) అంచనాలను ఒకట్రెండు రోజుల్లో అధికారులు పూర్తి చేయనున్నారు. దీనికి రూ.1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా నల్లగొండ జిల్లాలో రూ.3,375 కోట్ల పనులకు నాలుగు రోజుల్లో టెండర్లు పిలవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. తేలని ‘నార్లాపూర్’ డిండికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడం, ఇంటెక్ కెపాసిటీని పెంచే విషయమై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం డిండికి 0.5 టీఎంసీల నీటిని పెంచడంతో మహబూబ్‌నగర్ జిల్లా అవసరాలకు కొరత ఏర్పడుతుందంటూ ఆ జిల్లా నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నార్లాపూర్ ఇంటెక్ కెపాసిటీని 2 నుంచి 3 టీఎంసీలకు పెంచి డిండికి ఒక టీఎంసీని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2 టీఎంసీలను తరలించాలని సూచిస్తున్నా, దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. -
‘పాలమూరు’కు టెండర్లు పిలవండి
* అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం * రెండు వారాల్లో పనులు మొదలుపెట్టాలి * మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన * పాలమూరు, పెన్‌గంగ, డిండి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకొని పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పాల మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు వెంటనే టెండర్లు పిలవాలని, రెండు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో వేగం పెంచడానికి , త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి అధికారులకు కూడా అధికారాలు బదలాయించాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, సీఈ హరిరామ్, రిటైర్డ్ ఇంజనీర్లు రంగారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు. వచ్చే ఏడాదిలో కాళేశ్వరానికి నీరు చేరాలి వచ్చే బడ్జెట్లో నీటి పారుదల శాఖకు కేటాయించే రూ.25 వేల కోట్ల నిధుల్లో ప్రతినెలా రూ.2,083 కోట్లు విడుదల చేస్తామని, అందు కు అనుగుణంగా పనులు జరగాలని సీఎం ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన రీడిజైన్లు పూర్తయినందున అన్ని ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావాలన్నారు. పాలమూరు పరిధిలోని ఏదుల, కరివెన డిస్ట్రిబ్యూటరీ పనులకు సత్వరమే టెం డర్లు పిలవాలన్నారు. ఉద్దండాపూర్‌కు పనుల డిజైన్లు ఖరారు చేయాలన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన చేయాలని, వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి నీరు చేరేలా పనులు జరగాలన్నారు. పెన్‌గంగ ప్రాజెక్టు టెండర్లను సైతం రెండు వారాల్లో పూర్తి చేయాలని, డిండి ప్రాజెక్టుకు కూడా త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. రూ.27వేల కోట్ల పనులు..18 ప్యాకేజీలు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 62 మండలాల్లో 1,131 గ్రామాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు... నార్లాపూర్-8.1 టీఎంసీ, ఏదుల 6.5, వట్టెం 16.6, కరివెన 19.15, ఉద్ధండాపూర్ 92 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించారు. వీటి కోసం మొత్తంగా రూ.9,644 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. ఇందులో వట్టెం రిజర్వాయర్‌కు గరిష్టంగా 3,780 కోట్లు కానుండగా, కరివెనకు రూ.2,490 కోట్లు, ఉద్ధండాపూర్కు రూ.2,115 కోట్లు, నార్లాపూర్‌కు రూ.801 కోట్లు, ఏదులకు రూ.458 కోట్లు అంచనా వ్యయంగా లెక్కించారు. వీటితో పాటు నార్లపూర్ నుంచి ఉద్ధండాపూర్ వరకు కాలువలు, టన్నెల్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం పనులను రూ.20,654.54 కోట్లుగా లెక్కగట్టగా... ఎలక్ట్రో మెకానికల్ పనులకు అదనంగా మరో రూ.6,258.72 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు సిద్ధం చేశారు. మొత్తంగా రూ.26,913.26 కోట్ల పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో గరిష్టంగా ప్యాకేజీ-18లో రూ.2,169.94 కోట్ల పనులు ఉండగా, కనిష్టంగా ప్యాకేజీ-3లో రూ.427 కోట్ల పనులున్నాయి. అయితే ఈ ప్యాకేజీల విషయంలో నెలకొన్న సందిగ్ధత కారణంగా టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. రూ.500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల మధ్య టెండర్లు పిలవాలని అధికారుల స్థాయిలో నిర్ణయం జరగ్గా... మొబిలైజేషన్ అడ్వాన్సులు లేనందున ప్యాకేజీలను రూ.వెయ్యి కోట్లకు పైనే నిర్ణయించి పెద్ద కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచనలు చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు రాగా సీఎం... నిర్ణయాధికారాన్ని అధికారులకే కట్టబెట్టారు. ఇప్పటికే విభజించిన ప్యాకేజీలకు అనుగుణంగా టెండర్లు పిలవాలని సూచించారు. ఇక సివిల్, ఎలక్ట్రోమెకానికల్ పనులను విభజించాలన్న సూచనను పక్కనపెట్టి.. అన్ని పనులకు ఒకే టెండర్ పిలవాలని నిర్ణయించారు. డిండికి లైన్‌క్లియర్... మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్‌కు సమావేశంలో ఓకే చేశారు. ఎలాంటి టన్నెల్ల నిర్మాణం లేకుండా కాలువల ద్వారా నీటిని అందించే ప్రణాళికకు ఆమోదం లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ అప్పర్ డిండికి నీటిని తరలించే బదులు 430 మీటర్ల ఎత్తు వద్దే రిజర్వాయర్ నిర్మించి అక్కడ్నుంచి నీటిని తరలించేలా డిజైన్‌ను ఖరారు చేశారు. ఇలా అయితే టన్నెల్ అవసరం ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. 430 మీటర్ల ఎత్తు వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపడితే కొత్తగా ఇర్విన్ వద్ద 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యం రిజర్వాయర్ నిర్మించా ల్సి ఉంటుంది. అలాగే కిష్టరాంపల్లి సామర్థ్యం 5.7 నుంచి 9 టీఎంసీలు, శివన్నగూడెం సామర్థ్యాన్ని 7 నుంచి 10 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది. -
డిండి ప్రాజెక్టు డిజైన్లు సిద్ధం
♦ కాలువల ద్వారానే నీటిని తరలించేలా రూపకల్పన ♦ డిజైన్లపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎలాంటి టన్నెల్లు నిర్మించాల్సిన అవసరం లేకుండా... కాలువల ద్వారానే నీటిని తరలించగలిగేలా డిండి ప్రాజెక్టుకు అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. దీనిపై సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగే సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అధికారులు అంచనాలను సిద్ధం చేయనున్నారు. దీంతోపాటు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్యాకేజీలపైనా ఈ సమీక్షలో తుది నిర్ణయం తీసుకుంటారు. టన్నెళ్లు అవసరం లేకుండా.. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు డిండి ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తరలించాలని తొలుత ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ఈ డిజైన్‌లో టన్నెళ్లు నిర్మించాల్సిన అవసరం నెలకొంది. ప్రతిపాదిత ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లు కాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుంది. దీంతో 430 మీటర్ల ఎత్తు వద్దే రిజర్వాయర్ నిర్మించి కాలువల ద్వారా నీటిని తరలించాలని కొత్తగా ప్రతిపాదించారు. ఇలా అయితే టన్నెళ్ల అవసరం ఉండదని, కాలువల ద్వారా ఖర్చు రూ. 50 కోట్ల వరకు తగ్గుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. కొత్త డిజైన్ ప్రకారం ఏదుల నుంచి కాలువ ద్వారా అప్పర్డిండికి ఎగువన మేడిపూర్ దగ్గర 430 కాంటూర్ పరిధిలో రిజర్వాయర్ నిర్మించవచ్చు. అక్కడి నుంచి ప్రధాన కాలువ ద్వారా పలు రిజర్వాయర్లకు తరలించి ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. అయితే అప్పర్ డిండికి ఎగువన రిజర్వాయర్ల కాంటూర్ నిర్మాణం ఎక్కడ మొదలుపెట్టాలనేది తేలాలి. ఒకవేళ 415 కాంటూర్‌లో అయితే పాత డిజైన్‌లోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, అర్కపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల సామర్థ్యంలో మార్పు ఉండదు. 430 కాంటూర్తో రిజర్వాయర్ నిర్మిస్తే కొత్తగా ఇర్విన్ దగ్గర 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించాలి. దీంతో పాటు కిష్టరాంపల్లి సామర్థ్యాన్ని 5.7 నుంచి 9 టీఎంసీలకు, శివన్నగూడెం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 7 నుంచి 10 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది. దీనిపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలో నిర్ణయం తీసుకుంటారు. పాలమూరు ప్యాకేజీలపైనా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ. 35,200 కోట్ల అంచనాతో చేపట్టిన విషయం తెలిసిందే. దీని డిజైన్‌లో మార్పులు, డిండి ఎత్తిపోతలను కలపడంతో ప్రాజెక్టు వ్యయం రూ.40 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. పూర్తిస్థాయి సర్వే, అంచనాలు పూర్తయ్యాక స్పష్టత రానుంది. ప్రాజెక్టులోని ఆరు రిజర్వాయర్లకుగాను ఐదింటికి అంచనాలు సిద్ధమయ్యాయి. పంప్‌హౌజ్‌లు, ఓపెన్ చానల్ల సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పనుల అంచనాలూ వచ్చేశాయి. అయితే టెండర్లు పిలిచేముందు ఈ పనులను ఎన్ని ప్యాకేజీలుగా విభజించాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఒక్కో పనిని రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లుగా విభజించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని అధికారులు చెబుతుండగా... రూ.వెయ్యి కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల మధ్యలో ప్యాకేజీలను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైనా సీఎం సమీక్షలో నిర్ణయం తీసుకుంటారు. -
'డిండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తాం'
హైదరాబాద్: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ శనివారం సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు రక్షిత మంచి నీరు అందిస్తామని తెలిపారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ కోసం మరో 100 కోట్లు రూపాయలు కేటాయించనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. -
సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
డిండి ప్రాజెక్టుకు సంబంధించి భూములను బుధవారం సర్వే చేయడానికి వచ్చిన అధికారులను చింతపల్లి మండలం కృష్ణరాయపల్లికి చెందిన గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు ఎకరానికి రూ.10 లక్షలు చెల్లించి, ఇంటికో ఉద్యోగం ఇచ్చిన తర్వాతే సర్వే ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు!
చంద్రబాబుపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు సాక్షి, హైదరాబాద్ : ‘ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా, అక్కడ పాలమూరు కూలీలు ఉంటారు. కానీ పాలమూరుకు మాత్రం ప్రాజెక్టు లేదు. వారికోసం ఒక ప్రాజెక్టు కడదాం అనుకుంటే అడ్డు పడుతున్నారు. మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టును కూడా అడ్డుకుంటున్న ఒకే ఒక్క నేత చంద్రబాబు, ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం’.. అని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్‌రావు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇంకా ఆధిపత్య ధోరణి కొనసాగిస్తున్నారని విమర్శించారు. ‘శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే అడ్డుకున్నారు. ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు తాగునీరు ఇస్తామంటే అడ్డుపడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనే డిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారని వివరించారు. 2007లోనే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే పాలమూరు ఎత్తిపోతలకు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఏపీ వ్యవహారంపై చంద్రబాబును నిలదీయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టును కట్టాలంటారా? వద్దంటారో తెలంగాణ టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులు నిర్మించడానికి అన్ని హక్కులు ఉన్నాయని, పనులు మొదలు పెట్టాక అన్ని అనుమతులూ తెచ్చుకుంటామన్నారు. -
రెండేళ్లలో ‘డిండి’ పూర్తి
ప్రాజెక్టులకు ఆంధ్రా సన్నాసులు అడ్డుపడుతున్నరు.. అయినా ‘పాలమూరు’కన్నా ముందే పూర్తిచేస్తాం: కేసీఆర్ ♦ సమైక్య పాలనలో నాలుక తుడుచుకునే జీవోలే తప్ప నీళ్లు రాలేదు ♦ ఇప్పుడు మనం నీళ్లు తెచ్చుకుంటుంటే ఆంధ్రా నేతలు లఫంగితనం చేస్తున్నరు ♦ నిర్వాసితులను ఆదుకుంటం.. అవసరమైతే వెయ్యి ఉద్యోగాలు సృష్టిస్తం ♦ డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, నల్లగొండ: డిండి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఆంధ్రా సన్నాసులు అడ్డుపడుతున్నారని.. అయినా ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి తీరుతామన్నారు. పాలమూరు కన్నా ముందే ‘డిండి’ని పూర్తిచేస్తామన్నారు. ఈ రెండు పథకాలకు ‘సమైక్య’ పాలనలోనే అనుమతులు వచ్చాయని.. కానీ అప్పుడు నాలుక తుడుచుకునేందుకు జీవోలొచ్చాయే తప్ప నీళ్లు రాలేదని చెప్పారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం శివారులోని చర్లగూడెం చెరువు వద్ద పైలాన్‌ను ఆవిష్కరించి డిండి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. భయంకరమైన ఫ్లోరైడ్ విషయంలో సమైక్య రాష్ట్రంలో ఏమీ చేయలేకపోయామని ఆయన పేర్కొన్నారు. ‘‘ఫ్లోరైడ్ ప్రభావానికి గురై లక్షలాది మంది నల్లగొండ బిడ్డల నడుము వంగి, బొక్కలు కుంగి, జీవితాలు నాశనమైనా ఎవరూ పట్టించుకోలేదు. ఎంత మొరపెట్టుకున్నా, ప్రధాని టేబుల్‌పై ఫ్లోరైడ్ బాధితులను తీసుకెళ్లి పడుకోబెట్టి చూపించినా ఎవరూ ఏమీ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. మీరు ఆశీర్వదించిన బిడ్డలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నరు. ఇప్పుడు నీళ్లు వచ్చి తీరుతాయి..’’ అని కేసీఆర్ చెప్పారు. బతకనీయడం లేదు.. పాలమూరు, డిండి పథకాలకు కృష్ణా జలాలు వినియోగించుకునే హక్కు తెలంగాణకు ఎక్కడిదంటున్న ఆంధ్రప్రదేశ్ నేతలపై సీఎం మండిపడ్డారు. తెలంగాణకు నీళ్లు తెచ్చుకుంటుంటే ఆంధ్రా నేతలు లఫంగితనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘అసలు ఈ ప్రాజెక్టులు కొత్తవేం కాదు. సమైక్య రాష్ట్రంలో రూపొందించిన పాత ప్రాజెక్టులే. డిండి పథకానికి 2007లో సర్వే పూర్తి చేసి, 2008లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇచ్చారు. 2010లో కిరణ్ ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు కూడా విడుదల అయ్యాయి. ఇదంతా జీవోలో ఉన్నదే.. హరికథలు చెప్పేది కాదు. అయినా తెలంగాణకు ఆ జలాలపై హక్కు ఎక్కడుందని ఓ ఆంధ్రా సన్నాసి (మంత్రి ఉమా) ప్రశ్నిస్తున్నాడు. అసలు ఆయనకు తెలివి ఉందా, మెదడు పనిచేస్తుందా?’’ అని విరుచుకుపడ్డారు. ఆ ఏపీ మంత్రి పేరేమిటంటూ కేసీఆర్ పక్కనే ఉన్న మంత్రులను అడగగా.. వారు ‘ఉమ’ అని బదులిచ్చారు. దీంతో కేసీఆర్ మళ్లీ ప్రసంగిస్తూ... ‘‘ఉమనా? అంటే ఆడా, మగా? పేరు ఎటూకాకుంట ఉంది. ఆయనొక్కడే మనిషయి పుట్టిండట. మనం మనుషులం కాదట. మనకు రైతులు లేరట.. ఈ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రా లఫంగిగాళ్లు పంచాయితీకి వస్తున్నరు. ఏదిఏమైనా వందకి వందశాతం ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతం..’’ అని స్పష్టం చేశారు. పాలమూరు కన్నా ముందే, రెండేళ్లలో డిండి పథకాన్ని పూర్తిచేసి నీళ్లు ఇస్తామని, తాను అన్న మాట జరిగి తీరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధర్మంగా, న్యాయంగా ఉంది కనుకనే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పునాది వేస్తున్నప్పుడే వర్షం రూపంలో అక్షింతలు పడ్డాయని, ఇది శుభసూచకమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. భారీ వర్షంతో అంతరాయం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకే కేసీఆర్ పైలాన్‌ను ఆవిష్కరించాల్సి ఉన్నా.. భారీ వర్షం కారణంగా సాయంత్రం 4:47కు ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరాల్సిన సమయంలోనే వాతావరణం మేఘావృతమై హెలికాప్టర్ ప్రయాణానికి వీలుకాలేదు. దీంతో సీఎం యాచారం మీదుగా రోడ్డుమార్గంలో బయలుదేరారు. మరోవైపు పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ జరగాల్సిన శివన్నగూడెంలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో సభా వేదికతో పాటు ప్రాంగణంలోని టెంట్లు పడిపోయాయి. సభకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రజలు కూడా తిరుగుముఖం పట్టారు. నాలుగున్నరకు అక్కడికి చేరుకున్న సీఎం కేసీఆర్.. పైలాన్‌ను ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి 20 నిమిషాలు ప్రసంగించి వెళ్లిపోయారు. ఉద్యోగాలు సృష్టిస్తాం.. డిండి ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేస్తామని, వారి కడుపు నింపాకే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘‘ఇది మన రాష్ట్రం. మన బతుకులు బాగుపడాలె. నీళ్లు వచ్చి 30, 40 ఊళ్లు బాగుపడతాయంటే... రెండు మూడు ఊళ్లు పోతాయి. వారిని కడుపులో పెట్టుకుని చూసుకోవాలె..’’ అని పేర్కొన్నారు. భూమి కోల్పోయిన వారికి ఐదింతలు పరిహారం చెల్లిస్తామన్నారు. కావాలంటే ఆయకట్టు కింద భూములు కొనిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, అర్హులు ఇద్దరుంటే వారిద్దరికీ ఉద్యోగం ఇస్తామని... అవసరమనుకుంటే వెయ్యి, రెండు వేల ఉద్యోగాలు సృష్టించి నిర్వాసితులకు న్యా యం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ చేపడతామని చెప్పారు. -
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవేం కావు: కేసీఆర్
నల్లగొండ: పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్తవి కావని, సమైక్య రాష్ట్రంలోనే రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆదేశాలు వచ్చాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో శుక్రవారం సాయంత్రం ఆయన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడుతూ.. మన నీళ్లు తెచ్చుకుంటామంటే ఆంధ్రా నాయకులు నానాయాగీ చేస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. కాగా, భారీ జనంతో జరగాల్సిన బహిరంగసభ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో రద్దు అయింది. -
మూడు కుటుంబాల్లో తీరని శోకం
దేవరకొండ/: వారంతా యువత...అందరూ బంధువులే. భవి ష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకరు ఉద్యోగం చేస్తుండగా మరొకరు ఉద్యోగ వేటలో ఉన్నారు. ఇంకొకరు ఇంజినీరింగ్ చదువుతుండగా మరొకరు.. ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్నారు..మరో విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన వీరిని చూసి..విధి వక్రించింది. తాత చినకర్మకు హాజరైన వీరు డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో సరదాగా స్నానానికి వెళ్లారు. లోతు తెలియక లోనికి వెళ్లారు. గుం తలో కూరుకుపోయి మృత్యువాతపడ్డారు. చేతికి ఎదిగిన పిల్లలు ఒక్కసారిగా శవాలై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల రోదన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిండికి చెందిన దోవతి మల్లారెడ్డి (85) పది రోజుల క్రితం మరణించగా ఆదివారం ఆయన దశదిన కర్మ జరిగింది. సోమవారం మల్లారెడ్డి పెద్దకుమారుడు దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి(30),ప్రణీత్‌రెడ్డి(20), రెండవ కుమారుడు కర్ణాకర్‌రెడ్డి కుమార్తెలు జ్యోత్స్న (20), దేవమణి(17), మల్లారెడ్డి బావమరిది వరంగల్ జిల్లా వనపర్తికి చెందిన నర్సిరెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి(20), మూడవ కుమారుడు సుధాకర్‌రెడ్డి కుమారుడు అరవింద్‌రెడ్డి, మరో బంధువుల అమ్మాయి కలిసి డిండి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో స్నానం కోసం వెళ్లారు. హర్షవర్దన్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, జ్యోత్స్న, దేవమణి నీటిలో మునిగి చనిపోగా, వారిని కాపాడబోయిన అవినాష్‌రెడ్డి కూడా మునిగి మృత్యువాత పడ్డాడు. గోతుల వల్లే..ప్రమాదం డిండి ప్రాజెక్టు శిఖం భూమిలో గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డు పనుల నిమిత్తం జేసీబీ సాయంతో మట్టి తోడి రోడ్డు పనులకు ఉపయోగించారు. ఒడ్డు వెంబడే కదా అని సరదాగా గడుపుదామని వెళ్తే మృత్యుగుంతలుగా మారి ఐదుగురి ప్రాణాలను బలిగొన్నాయని గ్రామస్తులు తెలిపారు. వంశాంకురం లేకుండా.. దత్తారెడ్డికి ఇద్దరు కుమారులు.. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్చిల్ మండలంలోని ఏపీజీవీబీలో క్యాషియర్. పెద్దకుమారుడు హర్షవర్దన్‌రెడ్డి ప్రైవేటు జాబ్ చేస్తుండగా, తమ్ముడు ప్రణీత్‌రెడ్డి ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరు కుమారులతో ఆ..కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. తాత చినకర్మలో పాల్గొన్న ఇద్దరూ తలనీలాలు తీయించుకున్నారు. ఈత.. సరదా వారి ప్రాణాలు తీసింది. ఇద్దరు కుమారులు చనిపోవడంతో దత్తారెడ్డికి వంశాంకురం లేకుండాపోయింది. కరుణాకర్‌రెడ్డి.. డిండిలోనే టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరిని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన కోరిక. అందుకే పెద్దకుమార్తె జ్యోత్స్నను హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిస్తున్నాడు. జ్యోత్స్న ప్రస్తుతం ఫైనలియర్ చదువుతోంది. చిన్నకూతురు దేవమణి డిండిలోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. కొడుకులైనా..కూతుళ్లయినా ఒక్కటేనని.. కరుణాకర్‌రెడ్డి పిల్లలకు ఏదీ తక్కువ చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ఆ.. ఇద్దరు కూతుళ్లు తండ్రిని విడిచి కానరాని లోకాలకు వెళ్లడంతో అతని రోదన వర్ణనాతీతం. మల్లారెడ్డి బావ వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలంలోని వనపర్తికి చెందిన నర్సిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు అవినాష్‌రెడ్డిది బీటెక్ పూర్తయ్యింది. ఉద్యోగ వేటలో ఉన్నాడు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కూడా వచ్చింది. రేపోమాపో విదేశాలకు వెళ్తావనుకుంటే.. ఎవరికీ కానరాని లోకాలకు వెళ్లావా అంటూ అతని తల్లిదండ్రులు, బంధువుల రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. -
డిండీ ప్రాజెక్టులో పడి 5గురు విద్యార్థుల మృతి
-
డిండీ ప్రాజెక్టులో పడి.. ఐదుగురు విద్యార్థుల మృతి
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనను ఇంకా మరువకముందే.. నల్లగొండ జిల్లాలో అలాంటి విషాదమే మరొకటి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో చదువుతున్న ఐదుగురు యువతీ యువకులు డిండి ప్రాజెక్టు నీళ్లలో పడి మరణించారు. హైదరాబాద్‌కు చెందిన వీళ్లంతా సమీపం బంధువులే. వారిలో నలుగురు అన్నదమ్ముల బిడ్డలు కాగా, మరొకరు సమీప బంధువు. తమ తాతయ్య దశదిన కర్మల కార్యక్రమానికి వచ్చి, ఆ తర్వాత ఆరుగురు కలిసి దిండి ప్రాజెక్టులో ఈతకు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు. ఒక్కరు మాత్రం ముందుగానే గమనించి ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను హర్షవర్ధన్, ప్రణీత్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, దేవయాని, జ్యోత్స్నగా గుర్తించారు. నీటిమట్టం మరీ ఎక్కువగా లేకపోవడంతో అందరి మృతదేహాలు బయటపడ్డాయి. చేతికి అందివస్తున్న పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోయి నిర్జీవులుగా కనిపించడంతో బంధువులంతా కన్నీరు మున్నీరయ్యారు.