‘డిండి’లో మళ్లీ మార్పులు!
- అలైన్‌మెంట్ మార్చేలా ప్రతిపాదనలు
- కొత్తగా 2.5 టీఎంసీలతో రిజర్వాయర్లు
- మరో 20 వేల ఎకరాలకు నీరిచ్చేలా అధికారుల ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో మళ్లీ మార్పులు జరుగుతున్నాయి. గతంలో నిర్ణయించిన అలైన్‌మెంట్‌ను పక్కనపెట్టి కొత్తగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో 20 వేల ఎకరాలకు అదనంగా నీరిచ్చేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మార్పుల్లో భాగంగా అదనంగా 2.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు అదనపు రిజర్వాయర్లు రానున్నాయి. దీనిపై మరో 10ృ15 రోజుల్లో స్పష్టతనిచ్చేలా నీటిపారుదలశాఖ కసరత్తు చేస్తోంది.
డిండికి ముందే మలుపు..
శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీల నీటిని పాలమూరుృరంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భా గంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి తరలించాలని గతంలో నిర్ణయిం చారు. అయితే నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్‌మెంట్‌తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్ నగర్ జిల్లా నేతలు అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ ప్రాజెక్టు అధికారులు మాత్రం 27,551 ఎకరాల నష్టమే ఉంటుందని తేల్చారు. ఈ నేపథ్యంలో సర్కారు ‘వ్యాప్కోస్’ ద్వారా సర్వే చేయించగా ఆ సంస్థ ఐదు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రణాళికకు ఓకే చెబుతూనే రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్ మెయిన్ తగ్గిం చాలని, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి రూ. 3,384.47 కోట్లు అవుతుందని తెలిపింది.
ఈ ప్రతిపాదన ప్రకారం నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరంపాటు కాల్వలను, సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను అధికారులు పరిశీలించగా 5వ కిలోమీటర్ నుంచి 20వ కిలోమీటర్ వరకు ఉన్న అలైన్‌మెంట్, రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని వెల్లడైంది. దీన్ని ఎలా తప్పించాలన్న చర్చలు జరుగుతున్న సమయంలోనే కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం నార్లపూర్ నుంచి వచ్చే నీటిని నేరుగా డిండికి తరలించకుండా దానికి ఎగువనే 10వ కిలోమీటర్ పాయింట్ వద్ద 410 మీటర్ల కాంటూర్‌లో ఉల్పర అనే గ్రామం వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తారు.
అక్కడి నుంచి నేరుగా డిండి దిగువన 10 కిలోమీటర్ల దూరంలోని ప్రధాన కాల్వలోకి నీటిని తరలించి ముందుగా నిర్ణయించిన ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఈ క్రమంలో ఉల్పర దిగువన గోకారం, ఎర్రవల్లి జంట చెరువులను కలిపేసి 0.75 టీఎంసీతో ఒక రిజర్వాయర్, ఇర్విన్ వద్ద 0.75 టీఎంసీతో మరో రిజర్వాయర్ నిర్మించే ప్రతిపాదనలు చేస్తున్నారు. దీని ద్వారా డిండి దిగువన 10వ కిలోమీటర్ వరకు ఉన్న టన్నెల్ నిర్మాణాన్ని పూర్తిగా తప్పించవచ్చు. అదీగాక ఉల్పర నుంచి పూర్తిగా గ్రావిటీ మార్గాన నీటిని తరలించవచ్చు. కొత్తగా 20 వేల ఎకరాలకు ఆయకట్టు వస్తుంది.