డిండికి అర టీఎంసీనే!
- నార్లాపూర్ నుంచి లేకుంటే శ్రీశైలం ఫోర్‌షోర్ నుంచి తీసుకునేలా ప్రణాళిక
- రెండు ప్రతిపాదనలపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని వ్యాప్కోస్‌కు ప్రభుత్వ సూచన
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుకు అర టీఎంసీని మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి తీసుకోవడ మా లేక శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి తీసుకోవడమా అన్న అంశంపై పూర్తి స్థాయి సర్వే చేశాకే తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు ప్రతిపాదనలపై 15 రోజుల్లో సర్వే చేసి నివేదిక సమర్పించాలని వ్యాప్కోస్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
శ్రీశైలంలో వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ నీటిని తరలించడం ద్వారా 30 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి తరలించాలని ప్రభుత్వం తొలుత ప్రణాళిక వేసింది. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాలకు లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి.. వాటిని డిండి ద్వారానే 60 టీఎంసీలు తరలించాలని మరలా కొత్త ప్రణాళిక తెరపైకి తెచ్చింది. దీంతో మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ కాకుండా ఒక టీఎంసీ నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే డిండికి తరలించాలని ప్రతిపాదనలు తయారయ్యాయి.
అయితే డిండికి అదనంగా 0.5 టీఎంసీ పెంచడంతో పాలమూరు ప్రాజెక్టుకు ఒక్క టీఎంసీ నీటి లభ్యతే ఉంటోంది. 60 రోజుల పాటు ఈ నీటిని తరలించి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కాదని పాలమూరు ప్రాజెక్టు అధికారులతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు అభ్యంతరం లేవనెత్తుతున్నారు. దీనిపై ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు సీఎంకు లేఖ రాశారు. దీనికి తోడు డిండి అలైన్‌మెంట్‌తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వే ల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని అభ్యంతరాలు లేవనెత్తారు.దీనిపై సర్వే చేసిన అధికారులు మొత్తంగా 27,551 ఎకరాలకు నష్టం ఉంటుం దని తేల్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం దీనిపై వ్యాప్కోస్ ప్రతినిధులతో సమీక్షించిన ప్రభుత్వం డిండికి అర టీఎంసీనే తీసుకోవాలని, ఆ దిశగానే సర్వే చేయాలని సూచించింది.
నల్లగొండ రిజర్వాయర్లకు వారంలో టెండర్లు..
మహబూబ్‌నగర్ జిల్లా వరకు ప్రాజెక్టు అలైన్‌మెంట్ విషయమై స్పష్టత వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. వాటిని ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఇప్పటికే అంచనాలు పూర్తయిన నల్లగొండ జల్లాలోని రిజర్వాయర్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సిద్ధమైన అంచనాల మేరకు సింగరాజుపల్లి(0.8 టీఎంసీ)కి రూ.100 కోట్లు, గొట్టిముక్కల(1.8 టీఎంసీ)కి రూ.125 కోట్లు, చింతపల్లి(1.1 టీఎంసీ)కి రూ.150 కోట్లు, కిష్టరాంపల్లి(10 టీఎంసీ)కి రూ.1,500 కోట్లు ఖర్చవుతాయని లెక్కలేశారు. ఇక మరో రిజర్వాయర్ శివన్నగూడెం(12 టీఎంసీ) అంచనాలను ఒకట్రెండు రోజుల్లో అధికారులు పూర్తి చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రాజెక్టులపై సమీక్ష జరిపిన మంత్రి హరీశ్‌రావు మొత్తంగా నల్లగొండ జిల్లాలో రూ.3,375 కోట్ల పనులకు వారంలో టెండర్లు పిలవాలని ఆదేశాలిచ్చినట్లుగా తెలిసింది.