బుచ్చిరెడ్డిపాళెం/కోవూరు: పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకులు చేస్తున్న దందాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. నీరు-చెట్టు పథకాన్ని అడ్డు పెట్టుకుని కోవూరు చెరువు మట్టిని కొల్లగొట్టి లక్షలు గడిస్తున్న వైనమిది. కోవూరు చెరువులో నీరు-చెట్టు పథకం కింద పూడికతీయాలని ఇటీవల ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలొచ్చాయి. 600 ఎకరాల విస్తీర్ణం ఉన్న కోవూరు చెరువులో ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తూ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులు కొందరు మట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు.
వాస్తవానికి చెరువులోని పూడికతీతను తొలగించి జలవనరులను సంరక్షించుకోవడం, ఈ క్రమంలోనే చిన్న, సన్నకారు రైతులకు పొలాల్లో మట్టిని చదును చేసుకునేందుకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. జనవనరుల సంరక్షణ మరువడంతో పాటు మట్టిని ఎమ్మెల్యే అనుచరులు వ్యాపార వనరుగా మార్చుకున్నారు.
చెరువులోని మట్టిని తవ్వేందుకు ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరుచేసింది. అయితే రైతులు మట్టిని తరలించేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. ఈ అంశం తెలుగు తమ్ముళ్లకు బాగా కలిసొచ్చింది. ప్రభుత్వ ఇచ్చే నిధుల్లోనే చేతివాటం ప్రదర్శిస్తున్న తమ్ముళ్లు మట్టిని ట్రాక్టర్లలో నింపినందుకు అదనంగా రూ.50 నుంచి రూ.100 లోపు వసూలు చేయడంతో పాటు మట్టిని ఓ చోట డంప్‌చేసి వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పరిమితికి మించి తవ్వకాలు జరిపి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు.
పది జేసీబీలు, 500 ట్రాక్టర్లతో..
కోవూరు చెరువులో ప్రతిరోజు పది జేసీబీలు, 500 ట్రాక్టర్లతో మట్టిని రవాణా చేస్తూ తెలుగుతమ్ముళ్లు సొమ్మ చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసులు, ఇరిగేషన్ అధికారుల సాక్షిగా ఇదంతా జరుగుతోంది. తొలుత అధికారులు పది ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే కోవూరు ఎమ్మెల్యే చూసీచూడనట్లు వ్యవహరించాలని చెప్పడంతో మిన్నకున్నట్లు సమాచారం. అధికారులు బదిలీల భయంతో తమకెందుకులే అని మౌనం వహిస్తున్నారు.
ఎమ్మెల్యే పొలంలోకి మట్టి..
ఎమ్మెల్యే పోలంరెడ్డి పొలంలోకి కోవూరు చెరువు మట్టి తరలుతోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం కల్పించిన అవకాశాన్ని ఎమ్మెల్యే సైతం వదలడం లేదు. ఇప్పటికే గ్రావెల్‌ను తన కల్యాణ మండపంలోకి తరలించుకున్న ఎమ్మెల్యే మట్టిని కూడా వదలడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అధికారం..ఇష్టారాజ్యం
Published Thu, Jul 9 2015 3:26 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement